top of page
Writer's picturePandranki Subramani

ఊరు గాలి



'Vuru Gali' - New Telugu Story Written By Pandranki Subramani

Published In manatelugukathalu.com On 10/06/2024

'ఊరు గాలి' తెలుగు కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



గ్రాడ్వేషన్ పూర్తి చేసుకుని ఎట్టకేలకు నాకిష్టమైన, క్లిష్టమైన ఉద్యోగ పర్వంలోకి ప్రవేశించగలిగాను. పత్రికా విలేఖరిగా కదన కుతూహలం వార పత్రికలో చోటు సంపాదించాను; తెలుగు సాహిత్యం పట్ల నాకున్న మక్కువను నిరూపించగలిగి, దేశ విదేశాల వ్యవహారాలలో నాకున్న ఆసక్తిని బహిర్గతం చేసి సంపాదక వర్గాన్ని మొదటి షాట్ లోనే మెప్పించగలిగాను. తద్దార్వా  నియామక పత్రాన్ని జేబులో వేసుకోగలిగాను- పసందుగా హుందాగా-- గురుతుల్యులు సీనియర్ పాత్రియులు కామరాజు గారి పంచన మూడ నెలల క్షేత్ర స్థాయి శిక్షణను పూర్తి చేసుకుని రెగుల్యర్ ఉద్యోగ పరిధిలోకి ప్రవేశించాను. 


కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు ఎడా పెడా నాకప్పగించిన అసైన్మెంట్లు పూర్తి చేసి ఎడిటర్-ఇన్-చీఫ్ మన్ననా మెప్పూ పొందగలిగాను, ”కష్టే ఫలీ!“అని ఊరకేనా అన్నారు పెద్దలు విజ్ఞులూ—నేను తరచుగా సమర్పించే అంశాలు గమనించి గావాలి—ముఖ్యంగా నేను మునుపు ఇచ్చిన బయేడెటాలో సూచించిన ప్రాధాన్యతలు చూసి గావాలి ఎడిటర్ గారు—తంతే బూరెల గంపలో పడ్డట్టు నన్ను తెలుగు తమిళ సినీరంగాలకు అదనపు బత్తెముతో న్యూస్ రిపోర్టర్ గా నియమించారు. నాకిష్టమైన కళారంగం కావటాన మనసా వాచా కర్మణ: రాగ తాళ మేళాలతో విజృంభించాను, కళాకారులు కళాకారిణుల గురించిన ఆసక్తి కరమైన అంశాలే గాక. సినీరంగంతో అవినా భావ సంబంధం గల నాట్యాచారిణులు, నాట్యా చార్యుల గురించి కూడా విషయ సేకరణ చేసి దానికి సంబంధించిన శీర్షికలను కదన కుతూహల సీనియర్ ఉప సంపాదకులకు రెగ్యులర్ గా పంపించ నారంభించాను. పదోన్నతికి తగురీతిన పై మెట్లు వేసుకోనారంభించాను. మాటిస్తే మడమ తిప్పడమనేది ఉండకూడదు కదా!


సరిగ్గా అప్పుడు నేననుకోని విధంగా నా దృష్టి ఉభయ దృష్య మాధ్యమాలలో సర్వకళా వల్లభుడని-ఇరవైనాలుగు ఫ్రేమ్సులో సుశోభితుడని పేరు తెచ్చుకుంటూన్న వామన రావు పైన పడింది. మెల్ల మెల్లగా అతడికి చేరువవసాగాను. అవసరం నాదైనప్పుడు అతడి దగ్గరితనం కోసం తాపత్రయ పడటం లో తప్పులేదు కదా! అలా జీవన ప్రవాహం సాగుతున్నప్పుడు అతగాడి అసలైన జీవన నేపథ్యం గురించి తెలుసుకుని నివ్వెర పోయినంత పనయింది. 


ఎందుకంటే- బుల్లి తెర వెనుకా వెండి తెర వెనుకా ది మోస్ట్ స్టయిలిస్ట్ యాక్టర్ గా పేరు ప్రఖ్యాతులు ప్రోది చేసుకున్న వామనరావు మక్కికి మక్కీగా పదహారణాల గ్రామవాసి. అప్పటి విజయనగరం తాలూకాలో భాగమైన కొండల ప్రాంతమైన అంబటి వలసలో పుట్టాడు. అక్కడే చుట్టుప్రక్కల కటాబొటిగా చదువు ముగించి, గురజాడ వారిని ఆరాధ్య గురువు గా స్వీకరించి తెలుగు సాహితీ ప్రాంగణంలో కళామతల్లి ఉపాసకుడుగా మారి పెక్కు కవితలూ పెక్కు కథలూ అల్లి ఉత్తరాంధ్రను దాటి సినీ రంగానికి నిలయంగా మారిన భాగ్యనగరం పైన దాడి చేసాడు. క్రమక్రమంగా దూకుడు చూపించి. సినీ టీవీ నిర్మాతల నమ్మకం పొంది క్యారక్టర్ నటుడిగా సహాయక దర్శకుడుగా జేజేలు పలక నారంభించాడు. నేను సేకరించిన ఇన్ అండ్ ఔటి సమాచారం ప్రకారం అతడికున్న గార్ల్ ఫ్రెండ్సు ఒకరు కాదు- ఇద్దరు కాదు-మొత్తం ముగ్గురు ప్రియురాండ్రుతో అలరారుతు న్నాడు వామనరావు.


 ”అది నిజమేనా!మీది ముగ్గురుతో వ్యవహురమా!“అని అడగాలనుకుంటూనే వెనక్కి తగ్గిపోతుండేవాణ్ణి. కారణం- అటువంటి అల్పమైన విషయాల పట్ల ఆసక్తి కనబరచి, అతడికి కోపం తెప్పించి బంగారు బాతు వంటి అతడి సాహచర్యం కోల్పోవడం సముచితం కాదు కదా! దేనికైనా ఏ విషయంలోనైనా లిమిట్ అనేది ఉంటుంది కదా!ఇక విషయానికి వస్తే— నేనెప్పుడూ ఆ ముగ్గురు గార్ల్ ఫ్రెండ్సెవరో యోలా ఉంటారో ఎప్పుడూ చూడలేదు. నాది వెర్రి మొర్రి ఊహ గాని— అటువంటి సంబంధాలు తెరమరుగున చాప క్రింద నీరులా గప్ చిప్పున సాగుతుంటాయి గాని;పట్ట పగలు షూటింగ్ సమయాలలో పవర్ ఫుల్ లైట్నింగుల క్రింద కనిపించే రంగుల దృశ్యాలలా పరులకు కనిపించనీయరు కదా!


అప్పుడే కాదు, ఇప్పుడు కూడా నన్నొక విషయం అమితంగా ఆశ్చర్యపరిచేది, అదేమంటే— ఆ ముగ్గురు గార్ల్ ఫ్రెండ్సులో ఒక్కరు కూడా వామనరావుని వివాహబంధానికై ఒప్పించలేక పోయారనదే-- ఇక విషయంలోకి వెళితే— వామనరావు గాని చేయి చాచి అడిగితే ఎవ్వరూ వివాహ బంధం వద్దనరుగా— అతడికి భాగస్వామినిగా చేరడానికి తిరస్కరించరుగా— మొత్తానికి నాకు తేలిందేమంటే తళుకులీనే ఆ కళారంగాల వైభవ ప్రపంచం గురించి తెలుసుకోవలసినది తరచి చూడాల్సింది చాలానే ఉందేమో--


ఆ రీతిన వామనరావు వ్యక్తిగత వ్యవహారాలలో మరీ లోతుగా వెళ్ళి బుర్ర పాడుచేసుకోకుండా నా పనులు నేను చూసుకోనారంభించాను. అతడీ మధ్య అంతర్జాతీయ పిలిమ్ ఫేస్టివల్ కోసం వెళ్ళిన జెనీవా పర్యటన గురించి విరివిగా వ్రాసి సినీ ప్రేమికల అభిమానంతో బాటు, ఎడిటర్ గారి మెచ్చుకోలుతో బాటు వామన రావు థేంక్స్ కూడా పొందగలిగాను. ఆ సందర్భాన అతడిచ్చిన భారీ డిన్నర్ పార్టీలో పాలు పంచుకోగలిగాను. అది నాకు లభించిన అరుదైన సత్కారమే సుమా! ఆ తరవాత ఒకటి తరవాత ఒకటిగా వామనరావు ప్రతిష్టాత్మకమైన ఫిల్మిఫేర్ అవార్డుల ఫంక్షన్ లో ముఖ్య అతిథిగా హాజరయాడు. ప్రముఖుల చేతుల మీదుగా జ్ఞాపికలు పొందాడు. ఆ విషయాన్ని పొందికైన పద జాలంతో వ్యాసరచన చేసి కుతూహలం పత్రికలో ప్రచురించా ను. అది చదివి సంతోషించిన వామనరావు ఆ వ్యాసరచన పైన ప్రత్యేకంగా ఓ ఉత్తరం వ్రాసి మా పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్ గారికి పంపించాడు. దాని నకలులని కూడా నాకు పంపించాడు. ఆ రీతిన నాకు సబ్ ఎడిటర్ గా పదోన్నతి వచ్చేలా తోడ్ప డ్డాడు. 


ఇచ్చి పుచ్చుకోవడాలంటే అదే కదా! నేటి సామాజిక వాతావరణంలో ఇది సహజ ప్రక్రియే కదా !

--------------------------------------------------------------------------------------

 జీవితం చిత్రాతి చిత్రమైన భ్రమణం. ఎదురు చూడనివి, ఎదురు చూసినవి లేశ మాత్రమూ ఎదురు చూడని విధంగా మధ్య ప్రాచ్య దేశాలలో తరచుగా సంభవించే కార్పెట్ బాంబింగులా బుర్ర బ్లాక్ అయినట్లు జరిగిపోతుంటాయి. నా చిరకాల దోస్త్ వామనరావు విషయంలో అదే జరగింది. ఎక్కడేమి జరిగిందో ఎప్పుడు యెలా జరిగిందో తెలియదు;వామనరావు ఉన్నట్లుండి నల్ల పూసగా మారి నగరంలో కనిపించడం మానుకున్నాడు.. ఇక్కడా అక్కడా అని కాదు, ఎక్కడా కనిపించడం లేదు. స్నేహధ ర్మాన్ని పాటిస్తూ బుల్లి తెరల కళా ప్రాంగణంలో వెండి తెరల షూటింగ్ స్పాట్సులో అతడి కోసం వెతుకుతున్నానని తెలియ చేయకుండానే వెతికాను. ఆ తరవాత తెలుగు తమిళ సీనీ ఆర్టిస్టుల సమాఖ్య ప్రాంగణంలో కూడా వెతికాను. కనిపించలేదు. వెళ్లి చూస్తే అతడుంటూన్న యింటికి తాళం వేసి ఉంది. 


సహజంగా అతడి చుట్టూ ఈగల్లా వాలే సహచర శిష్య గణం కూడా కంటికి ఆనలేదు. విషయాన్ని పొక్కనీయకుండా జాగ్రత్త పడుతూ చుట్టుప్రక్కల వాకటు చేస్తే పలు విధాల పుకార్లు పలు రంగులతో సోకాయి. కొందరేమో వామనరావు ముంబాయిలోని ఒక ప్రసిధ్ధ ఉత్తర భారత కోరియో గ్రాఫర్ ని ఇష్టపడి పెండ్లి చేసుకున్నాడని. చడీ చప్పుడు లేకుండా ఆమెతో దాంపత్య జీవితం కొనసాగించడానికి అక్కడే స్థిరపడాలని నిశ్చయించుకున్నాడని- ఆ కారణాన విషయం తెలుసుకున్న అతగాడి మాజీ గార్ల్ ఫ్రెండ్స్ అక్కడకు వచ్చి చెప్పలేనంత హంగామా సృశ్టించారని చెప్పారు. 


మరికొందరేమో వామనరావు ఏదో భారీ బాలివుడ్ ఫిల్మ్ సంస్థతో పార్టనర్ షిప్ తీసుకున్నాడని— ఆ పార్టనర్ షిప్ డీల్ క్లించ్ అయేంత వరకూ గోప్యంగా ఉంటూ గోప్యపు చీకటి గుహనుండి బయటకు వచ్చే ప్రసక్తే ఉండదని తేల్చారు. కాదూ కూడదని చెప్పకుండానే ఒకటి తేల్చుకున్నాను; వీళ్ళు చెప్పేవన్నీ పొద్దు పుచ్చడానికి విడిచే గప్పా రీల్సని- వడి గడితే ఏదీ మిగలదని. ఏది యేమైతేనేమి— ఒక మంచి కళాకారుడి సాహచర్యాన్ని ఒక సహృదయుడి స్నేహాన్ని కోల్పోయానన్న బాధ మిగిలిపో యింది. గతంతో సంబంధం లేకుండా ఇక ముందు కూడా నాకు పెక్కుమంది కళాకారుల పరిచ య భాగ్యం లభించవచ్చు. 


కాని— ఎంత మంది నిరాడంబరుడు నిష్కల్మష హృదయుడైన వామనరావుకి సమానులవుతారు? అతడి గురించి తలపోస్తున్నప్పుడల్లానాకు ఇప్పటికీ ఒక యువ సైనికుడి కవితా పంక్తి- గుండెలోతుల్ని తాకుతుంటుంది- “ఏండ్లు దాటాయి నే బయల్దేరి చేరలేదింకా నీ దరి--”


  కాలం ఆగదు. నిరంతర గంగా ప్రవాహంలా సాగిపోతూనే ఉంటుంది. కాలపరివాదిని గత కాల సుస్వర స్మృతుల్ని మీటు తూనే ఉంటుంది. ఒక రోజు అనుకోకుండా ఒక ప్రసిధ్ధ కళా సమితివారి వార్షిక సమావేశ కార్యకలాపాలను తగు రీతిన రికార్డ్ చేయడానిని కదన కుతూహలం ఎడిటర్ గారు నన్ను శ్రీకాకుళం పంపించారు. సమావేశ కార్యకలాపాలన్నీ సవ్యంగా సాయంత్రం లోపల పూర్తయాయి. అంటే— నేను వేనుకున్న టూరు ప్రోగ్రాము ప్రకారం ఒక రోజు మిగిలి ఉంది. మరునాడంతా ఫ్రీగానే ఉంటాను కాబట్టి ఎక్కడికెళ్ళాలి ఎలా గడపాలి అన్ని మీమాంసలో తికమకపడ్తున్నప్పుడు నాక చప్పున మిరిమిట్లు గొలిపేలా ఒక ఆలోచన తాకింది.


మరీ దూరాన కాకుండా అంబటి వలస విజయనగరానికి సమీపంగానే ఉంటుంది కాబట్టి అక్కడకి ఒక రౌండ్ కొట్టి వస్తే— నగరంలో కనిపించకుండాపోయిన వామనరావు పూర్వపరాల గురించి తెలుసుకుని మా కుతూహులం పత్రికలో ఒక వివరణాత్మక వ్యాసం రాస్తే— తెలుగు తమిళ సినీరంగాలను ఓ కదుపు కుదుపేయదూ! కదన కుతూహల పత్రిక సర్క్యలేషన్ ని పెంచేయదూ! 


అంతే— అల్లిబిల్లి సోమరితనపు ఆలోచనల్ని అటకెక్కించి ఒక వాటర్ బాటిల్ని సంచీలోకి కుక్కించుకుని నలుగురులో నారాయణలా గుంపులో గోవిందలా ఉండేలా పంచెకట్టుకుని జుబ్బాతొడుక్కుని అంబటివలస వేపు సాగే బస్సు యెక్కేసాను- “జయ జయ శంకర!హరహర శంకరా!” అంటూ— అంబటివలస రోడ్డుకి దిగువన దిగాలుగా ముఖం పెట్టుకున్న బడి కుర్రాడిలా ఉంది. బారుగా వరసగా చింత చెట్లు నా వేపు వింతగా తలెత్తి చూస్తున్నట్లున్నాయి. 


నాకు యెదురు వచ్చిన పెద్దమనిషిని అడిగాను నన్ను నేను పరిచయం చేసుకుంటూ— “నాపేరు దామోదరం. భాగ్యనగరంలో వెలువడుతూన్న కదన కుతూహలం వార పత్రికలో పని చేస్తున్నాను. చాలా రోజులుగా యిటు వేపు రావాలనుకుంటూనే ఉన్నాను. కాని, వీలుపడలేదు. ఎట్టకేలకు పైడితల్లి అమ్మవారి దయ వలన ఈ రోజు వీలు పడింది. అదీను యెలాగంటే—”


అని చెప్పి ముగించేలోపల అతను కట్ చేసాడు- “చూడబ్బాయి— 

నిన్ను చూస్తుంటే భాషలోని యాస చూస్తుంటే నువ్వు మా ఊరి మనిషిలా లేవు. పొలం గట్టు వేపు వెళ్తున్నవాడిని ఆపావు. నీగురించి నువ్వు చాలానే చెప్పుకున్నావు. ఐనా పర్వాలేదు. నిదా నంగా విన్నాను. ఇప్పుడు అసలు విషయానికి వస్తే నేను పొలం పనులు చూసుకోవడానికి సాగిపోతాను. ఉఁ చెప్పు. ఏమి కావాలి? ఎక్కడకి వెళ్లాలి?” 


నేను కన్నార్పకుండా క్షణం పాటు చూసి అనుకున్నాను- టైమ్ ఈజ్ మనీ అన్నది వీళ్ళవద్దే నేర్చుకోవాలి కాబోలు— ఆ తరవాత నిదానంగా సర్దుకుంటూ విషయానికి వచ్చాను- “ప్రముఖ సినీ ఆర్టిస్టు మిస్టర్ వామనరావు గురించి మీరు వినే ఉంటారు. ఆయన తాత పాపయ్యగారు ఈ చుట్టుప్రక్కల కరణీకం చేసేవారట. తండ్రి నరసియ్యగారేమో వ్యవసాయం చేసుకునేవారట. వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబ స్త్రీల గురించి మీరేమైనా చెప్పగలరా?” 

అది విని ఆయన మళ్ళీ అదే రీతిన సర్రున సాగే రైలు బండిలా బదులిచ్చాడు- “ఆళ్ళ గురించి నన్ను అడగటం దేనికి? ఆ వామన రావునే అడగవచ్చుగా--”


నేను ఊరుకోలేదు. కస్సున స్పందించాను-“ఆయన లేకపోబట్టేగా ఇంత దూరం వచ్చాను— ఏదో ముఖ్యమైన ఫిల్మీ అసేన్మెంటుపైన ముంబాయో అమెరికావో వెళ్ళినట్టున్నారు. నాలుగైదు సంపత్సరాలుగా కనిపించడం లేదు. అసలతను ఇండియాలో ఉన్నాడా లేదా అన్నది కూడా తెలియడం లేదు. ” 


“భలేవాడివేనయ్యా దామోదరా! ఇక్కడున్నవాడిని ఇక్కడికొచ్చి వెతకాలి గాని— ముంబాయిలోనో అమెరికాలోనో వెతికితే యెలా కనిపిస్తాడు? అదిగో— అటు చూడు కొత్తగా కట్తూన్న ధర్మసత్రాన్ని-- ఎంత పకడ్బీందీగా కట్టున్నారో గమనించావా— దానిని వామనరావే కట్తున్నాడు. ఎందుకో తెలుసా—పైడి తల్లి వారి సిరిమానోత్సవానికి భక్తులు ఇటునుండే కాలినడకన విజయనగరం వేపు మొక్కుబడి చెల్లించుకోవడానికి వెళతారు. అలా నడుస్తూ అలసిసొలసిన భక్తులు బైరాగులు సేదతీర్చుకోవడానికి అనువుగా వామనరావే తన ఖర్చుతో కట్తున్నాడు. ఇంకా చెప్పాలా!” 


నేను నోట మాట పెగలక ఆమాంబతు ఆశ్చర్యంతో కళ్ళు మిటకరిస్తూ నెత్తిపైన చేయి పట్టుకుంటూ అడిగాను-

“వామనరావుగారు ఇప్పుడిక్కడున్నారా!” 


“ఔను మహానుభావా ఔను!” 


 “అతనిక్కడేమి చేస్తున్నారు? “


 “నన్నడిగితే? అదిగో— అతనే వస్తున్నట్టున్నాడు. వెళ్ళి అతణ్ణే అడుగు.. ” అంటూ అటు మలుపు తిరిగి సాగిపోయాడతను. 


నేను వెర్రి ముఖం పెట్టుకుని చూసాను. వామనరావు చెరొక చంకనా కూతుర్నీ కొడుకునీ ఎత్తుకుని వస్తున్నాడు. నన్ను చూస్తూనే పిల్లలిద్దర్నీ క్రింద విడిచి నన్ను కొగలించుకున్నాడు- కౌగలించుకుంటూనే గుసగుసలుపోయినట్లు నాకు మాత్రమే వినిపించేటట్లు అన్నాడు- “నాకు తెలుసు నువ్వెందుకు అలా హతాశుడవై చూస్తున్నావో— అంతటి విలాసవంతమైన జీవితానికి వీడ్కోలు పలికి తెలుగు గడ్డకు మూలనున్న అంబటివలస వంటి గ్రామానికి యెందుకు వచ్చాననేగా? ఎక్కువ చెప్పి— ఎక్కువ గా మాట్లాడి నిన్ను తికమక పెట్టడం నాకిష్టం లేదు. ఒక మాట— ఒక ముక్క— ఇది మా ఊరు. నేను పీలుస్తున్నది మా ఊరి గాలి. నేనిప్పుడు జీవిస్తున్నది నన్ను పెంచి పెద్ద చేసిన ఊరు జనం మధ్య- కపటపు నవ్వులెరగని వ్యాపార దక్షతలెరగని మా ఊరి జనం మధ్యన- 

రా! మాయింటికి వచ్చి భోజనం చేసి మా ఊరి శివాలయంలో అర్చన చేసి రేపు వెళుదువుగాని-”


నేను నోరు తెరవలేదు. మాటలేని మౌనంగా మిగిలిపోయాను. తెలుగు వారికి పుట్టిన ఊరంటే ఇంతటి మమతానురాగాలా! ఏడు గజా ల గద్వాల జరీచీరతో అణాకాసంత కుంకుమ బొట్టుతో అమ్మోరిలా కనిపిస్తూ మీగడ పెరుగుతో కలిపి ముద్దలు పెట్టే అవ్వ గుర్తుకి వచ్చింది. దిష్టి తగలకుండా నుదుటపైనా కుడి చెంపపైనా చేర్చుక్కల బొట్లు పెట్టే అమ్మ కళ్ళ ముందు మెదిలింది. చిన్ననాటి జ్ఞాపకాల అమృత ధారలతో గుండె చెరువైంది. 

***

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.




40 views0 comments

Comments


bottom of page