top of page

ఊర్వశివో రాక్షసివో

#VurvasivoRakshasivo, #ఊర్వశివోరాక్షసివో, #NDhanalakshmi, #Nధనలక్ష్మి, #TeluguKathalu, #తెలుగుకథలు


Vurvasivo Rakshasivo - New Telugu Story Written By N. Dhanalakshmi

Published In manatelugukathalu.com On 08/03/2025

ఊర్వశివో రాక్షసివో - తెలుగు కథ

రచన: N. ధనలక్ష్మి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



“అరే సూర్య! సరైన సౌకర్యం లేని ఆ మారుమూల గ్రామానికి వెళ్ళి పని చేయడం అవసరమా చెప్పు!?”


“అమ్మా! నేను చేసే పనే అదే కదా.. ఇలా అన్ని ప్రదేశాలు తిరిగి అక్కడ ఉన్న శిథిలమైన కట్టడాల గురించి, అక్కడన్న ప్రజల సంప్రదాయాలు, సంస్కృతి గురించి తెలుసుకొని డాక్యుమెంట్ తీసి గవర్నమెంట్ కి తెలియచేయాలి కదా. నాకు పరిచయం ఉన్న ఊరే అది. ఇది వరకు కిరణ్ కూడ ఆ ఊరిలోనే ఉండేవాడు. తన చెల్లి లక్ష్మీ పెళ్ళివ్వగానే అక్కడ నుండి వెళ్ళిపోయి ముంబై లో సెటిల్ అయ్యాడు.. ఆ ఊరికే కదా నేను వెళ్తున్నది.. నువ్వు కంగారుపడకు..” 


 “సర్లే జాగ్రత్త మరి! టైమ్ కి తిన్ని నిద్ర పో..”

 

 “ఒకే అమ్మా, బాయ్..”

*** 

ఆరు గంటల ప్రయాణం తరువాత మొత్తానికి భైరవకోన అనే ఊరికి చేరుకున్నాడు సూర్య. సరైన రోడ్ మార్గం లేదు. 


 తన కోసం గవర్నమెంట్ అలాట్ చేసిన ప్లేస్ కి వెళ్ళాడు. అప్పటికే సూర్య కోసం ఎదురు చూస్తున్నాడు మూర్తి. తనని తాను పరిచయం చేసుకొని లోపలకి లగేజ్ తీసుకొని వెళ్ళాడు. 

సూర్య రూం కి చేరుకొని ఫ్రెష్ అప్ అయి తన వస్తువులను నీట్ గా సర్దుకున్నాడు. చాలా ఆకలిగా అనిపించి ఏమైనా వండుకొని తిందామని కిందికి వెళ్ళాడు. 


“వచ్చారా సర్ రండి! నేనే వచ్చి మిమ్మల్ని భోజనానికి పిలవాలి అనుకున్నా. ఇంతలో మీరే వచ్చారు!? మా అమ్మాయి వచ్చి వంట చేసింది, తినండి” అంటూ సూర్యకి వడ్డించాడు మూర్తి. 

భోజనం తిన్న సూర్య కి చాలా నచ్చింది.. 


“చూడు మూర్తి.. మీ అమ్మాయి చాలా బాగా వంట చేసింది. మీ అమ్మాయినే వంట మనిషీ గ ఉండమని చెప్పు.. ఇంకా కొంచం జీతం ఇస్తాను.”

 

“అలాగే సర్..”

 

ఒక పది రోజులు ఇలా గడిచిపోయాయి.. ఓ రోజు సూర్య ఉదయాన్నే లేచి అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ గార్డెన్ వైపు చూస్తే ఒక అమ్మాయి పూలను కోస్తోంది.. ఆ అమ్మాయి వైపు కన్నురెప్పవేయడం మరిచి చూస్తూనే ఉండిపోయాడు. బహుశా దేవుడు ఈమెను చాలా ఇష్టం తో చెక్కినట్లు ఉన్నాడు.. అందుకే ఇంత అందంగా ఉంది. ఇంతకీ తను ఎవరబ్బా అంటూ తనలో తానే ప్రశ్నించుకున్నాడు.. 


పూలను కోస్తున్న ఆ అమ్మాయి సూర్య వైపు చూసి.. ‘నమేస్తే సర్’ అంటూ పలకరింపుగా నవ్వింది.. 

సూర్య ఆ అమ్మాయీ వైపు అలాగే చూస్తూ ఉండి పోయాడు.. ఎందుకో ఆ అమ్మాయి నవ్వు తనకి తెగ నచ్చేసింది. 


 తను మూర్తి కూతురా!??. తనని తాను ఎప్పుడు చూడలేదు కదా.. బహుశా తను పనికి వచ్చినప్పుడు నేను ఉండను కదా.. ఒక వేళ ఉన్న లోపల ఉంటా కదా.. ఒక సారి పని మీద ఉంటే నా చుట్టూ ఏమీ జరిగిన పట్టించుకోను కదా ఇలా ఎన్నో ప్రశ్నలు మనసులో అనుకుంటూ ఉండగా ఆ అమ్మాయి, ‘సర్, కాఫీ’ అంటూ చేతికిచ్చి.. తన పేరు ఊర్వశి, పది వరకు చదవానని, తరువాత మూర్తి ఆడపిల్లకి చదువు ఎందుకని ఆపివేశారని ఇలా ఎన్నెన్నో సూర్య అడగకపోయినా అన్నీ విషయాలను చెప్పుకుంటూ వెళ్తుంది.. 


సూర్య ఏమి వినే స్థితిలో లేడు. తన కళ్ళను చూస్తూ, ఈ లోకాన్ని మర్చిపోయాడు.. సూర్య తన వైపు చూడటం గమనించిన ఊర్వశి సిగ్గుల మొగ్గ అయింది.. 


సూర్య కంగారుగా "అవును.. మూర్తి ఎక్కడ. కనపడడం లేదు!? ఎక్కడకైన వెళ్ళాడా ఏంటి!?”


“సర్! నాన్న పని మీద వేరే ఊరు వెళ్ళాడు.. ఇంకా కొద్దీ రోజులు రారు.. మా ఇద్దరికీ ఇది అలవాటులే సర్. ఇది గ్రామము కదా. ఒంటరిగా ఉండటానికి భయం ఏమి లేదు.”

 

“చూడు ఊర్వశి! నువ్వు చదవాలంటే చెప్పు. నేను హెల్ప్ చేస్తాను. మీ నాన్నతో నేను మాట్లాడి ఒప్పిస్తాను..”

 

“నిజమాసర్! నన్ను మీరు నిజంగానే చదివిస్తారా!??”


“అవును”


“థాంక్స్ సర్” అంటూ హగ్ చేసుకొని నవ్వుకుంటూ కిందికి వెళ్లిపోయింది ఊర్వశి.. 


ఊర్వశి సడెన్ గా హగ్ చేసుకోగానే ‘క్రేజీ గర్ల్’ అంటు నవ్వుకొని బ్లష్ అయ్యాడు సూర్య. 


ఆ రోజు మొదలు రోజు ఊర్వశి సూర్య పనులలో తనకి హెల్ప్ చేసేది. మూర్తి రావడం ఆలస్యం అవుతుందని ఫోన్ చేసి చెప్పాడని సూర్యకి చెప్పి బాధ పడింది ఊర్వశి. సూర్య ఒదార్చాడు.. 


ఊర్వశిని ఒక రోజు చూడకపోయినా ఎదోలా ఉండేది సూర్యకి.. తన పట్ల ప్రేమను రోజురోజుకీ పెంచుకోసాగాడు.. 


మూర్తి వచ్చాక తనతో మాట్లాడి ఊర్వశినిపెళ్లి చేసుకోవాలి.. తనకి కూడా నేను అంటే ఇష్టం.. నోరు తెరిచి చెప్పక పోయిన తను నా కోసం చేసే ప్రతి పనిలో కనపడుతుందని మనసులో అనుకున్నాడు సూర్య.. మంచి రోజు చూసి వాళ్ళమ్మకి ఊర్వశిని పరిచయం చేయాలని భావించాడు.. 


ఒక రోజు ఎడి తెరపక వాన పడుతూనే ఉంది. సూర్య పూర్తిగా తడిచి పోయి వచ్చాడు.. ఊర్వశి కూడా వర్షం వల్ల బంగ్లా లోనే ఉంది.. 


“వర్షం తగ్గేలా లేదు ఎక్కడికి వెళ్ళకు. ఇక్కడే ఉండిపో. ఉదయం వెళ్ళవచ్చు లే” అని సూర్య చెప్పుతుండగా ఇంతలో ఎక్కడో పిడుగుపాటు దెబ్బకి ఊర్వశి వచ్చి సూర్యను గట్టిగా హత్తుకుంది.. 


ఎవరు లేని ఏకాంతం, పైగా మనసు మెచ్చిన నెచ్చలి, వాతావరణము కూడా అనుకూలంగా ఉండడం.. మనసు వద్దు అని హెచ్చరిస్తున్నా సరే, సూర్య ముందుకి తిరిగి భయంగా వణుకుతున్న ఊర్వశిను బిగి కౌగిలిలో బంధించి, అదురుతున్నపెదాలను చూస్తూ తమకంతో అందుకున్నాడు.. 


ఊర్వశి అడ్డు చెప్పలేదు సరికదా ఇంక సూర్యని గాఢంగా తనకి అదుముకొని ముద్దుకి జత కలిపింది. అలా వానలో ఇద్దరు ఒకటి అయ్యారు.. 


ఉదయానే.. 

“సారీ ఊర్వశి! రాత్రితో మన బంధం మరింత గట్టిగా బల పడింది. మీ నాన్న గారు రాగానే, ఆయన అంగీకారం తీసుకొని నిన్ను పెళ్లి చేసుకుంటా” అంటు తన చేతికున్న ఉంగరాన్ని ఊర్వశికి తొడిగాడు.. 


ఊర్వశి సూర్యను ప్రేమగా హత్తుకుంది.. ఆ రోజు మొదలు ప్రతి రోజూ వారిద్దరూ ఎన్నో మధురమైన రాత్రులను గడిపారు.. 


ఊర్వశిని తీసుకొని దగ్గర్లోన్న పట్నానికి వెళ్లి సరదాగా తిరిగి వచ్చేవాళ్ళు. సూర్య దగ్గర ఉన్న కెమెరా తో ఇద్దరు ఫొటోస్ తీసుకున్నాడు. మొబైల్లో ఎన్నో సెల్ఫీలను తీసుకోని మై లవ్ అనే ఫోల్డర్ లో సేవ్ చేసుకున్నాడు. ఇలా ఒక నాలుగు నెలలు గడిచాయి.. మూర్తి జాడ లేకుండా పోయింది.. తనకి ఫోన్ చేసిన కనెక్ట్ అయ్యేది కాదు. 


ఊర్వశి గర్భవతి అని తెలిసింది.. ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదమని తెలిసి తననీ బంగ్లా లోనే వివాహం చేసుకున్నాడు.. 


ఊరి కి వెళ్లి మా అమ్మకి మన విషయం చెప్పి తీసుకోని వస్తానని. ఊర్వశి ను వదిలి వెళ్ళలేక తన ఊరికి వెళ్ళాడు సూర్య.. 


తన ఊరుకు వెళ్ళి వాళ్ళమ్మకి విషయం చెప్పి తనని పిలుచుకొని వచ్చాడు సూర్య.. ఆ గ్రామానికి రాగానే బంగ్లా లో ఊర్వశి కోసం వెతికాడు. తానెక్కడ కనపడలేదు.. తనకి ఏమైనా అయ్యిందేమోనని భయపడ్డాడు. అనవసరంగా ఒంటరిగా వదిలి పెట్టి వెళ్ళి తప్పు చేశానని బాధ పడ్డాడు.. 


“ఏమై పోయారు సర్! ఎలా ఉన్నారు సర్” అంటూ మూర్తి వచ్చాడు.. 


“మూర్తి.. మీ అమ్మాయీ ఊర్వశి ఎక్కడ? తనని కాస్త పిలువు!?”


“ఎవరు సర్ ఊర్వశి!? నా కూతురి పేరు రాజ్యం. మీరు చెప్పే ఊర్వశి ఎవరు!? మీరు మా అమ్మాయిని పనిలో పెట్టుకుంటాను అన్నారు. ఇంతలో మా అమ్మాయికి అనుకోకుండా మంచి పెళ్ళి సంబంధం కుదిరింది. 


మీకు చెప్పి వెళ్దాం అంటే మీరు పని మీద బయటకి వెళ్ళారు. ఫోన్ చేసి చెప్పచ్చు లే అనుకొని రాజ్యంతో పట్నం వెళ్లి అక్కడే ఉండి పెళ్లి జరిపించాను. 


ఆ సంతోషం లో మీకు చెప్పడం నేను మర్చిపోయాను.. మీరు ఎవరినో ఒకరిని పని కోసం పెట్టుకొని ఉంటారు లే అనుకున్నాను.. పెళ్ళిలో నా ఫోన్ పోయింది బాబు. మా అమ్మాయి కొత్త కాపురానికి కావలసినవి అన్నిటినీ సమకూర్చి పనులన్నీ చక్కపెట్టి రావడానికి టైం పట్టింది సర్”


సూర్యకి ఏమి అర్ధం కావడం లేదు. మరి ఊర్వశిఎవరు!? ఎందుకని మూర్తి కూతురిగా పరిచయం చేసుకుంది! ఎన్నో ప్రశ్నలు సమాధానం కోసం ఊరిలోన్న అందరినీ కలిసి ఊర్వశి.. గురించి అడిగారు. ఎవరు ఆ పేరు గల వారు ఎవరు ఆ ఊరిలో లేరని!? అన్నారు.


కొందరయితే సూర్యని వింతగా చూస్తూ మీరెప్పుడు బైక్ పైన వెళ్ళిన మీకు మీరే నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవారని చెప్పారు. 


సూర్య కి మైండ్ బ్లాక్ అయింది.. 


తనతో వెళ్ళిన ప్రతి చోట ఎవరిని అడిగినా ఇదే సమాధానం ఎదురైంది!?

ఇద్దరు కలిసి దిగిన ఫోటోను కడిగి చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే ప్రతి ఫోటోలో సూర్య మాత్రమే ఉన్నాడు.. అలాగే తన మొబైల్లో మై లవ్ అనే ఫోల్డర్ అనేది కనపడలేదు. ఒక్కింతా షాక్ తో బాధగా ఏడుస్తూ కళ్ళు తిరిగిపడిపోయాడు. 


సూర్య అన్న పిలుపుకు కళ్ళు తెరిచాడు.. ఎదురుగా ఊర్వశి.. ఊర్వశి అంటు ప్రేమగా తనని తాకాలని చూస్తే టచ్ చేయలేకపోయాడు.. షాకింగ్ గా తన వైపు చూశాడు. 


"ఏంటి సూర్య.. నువ్వు విన్నది, చూసినది నమ్మలేక పోతున్నావా!?? కానీ అదే నిజం సూర్య.. 


నా పేరు సోహా. మూడు ఏళ్ల క్రితం.. 


నీ ఫ్రెండ్ కిరణ్ తో కలిసి ఈ ఊరిలో జరిగే జాతరను చూడటం కోసం వచ్చావు. ఆ జాతరలోనే నిన్ను మొదటిసారి చూశాను. కిరణ్ గారి చెల్లి లక్ష్మి నా స్నేహితురాలు. కష్టాల్లో ఉన్న కిరణ్ కుటుంబానికి అండగా నిలబడ్డావని తన మాటల ద్వారా తెలుసుకున్న. తన ద్వారా నీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్న తరువాత నీ వ్యక్తిత్వం నచ్చింది. నిన్ను ప్రేమించేశాను. ఎప్పుడూ ముసుగులో ఉండే నన్ను నువ్వు ఎన్నడూ చూడలేదు.. 


నువ్వు మీ ఊరుకి తిరిగి వెళ్ళిపోతున్నావని తెలిసి నా ప్రేమను నీకు చెప్పాలని అశ పడుతూ నీ కోసం వచ్చాను.. అప్పటికే కార్ ఊరు దాటుతుంటే నీ వెనకే పరుగుపెడుతు వస్తూ నా వెనకున్న లారీను చూడలేదు. అది నన్ను గుద్దేసింది. నేను చనిపోయాను కానీ నీ మీదున్న నా ప్రేమ చావలేదు. అందుకే ఆత్మలా మారిపోయాను. 


నీ కోసం అప్పటినుంచి ఎదురు చూస్తున్నాను.. నా కల నెరవేరింది.. నువ్వు వచ్చావు. నా ప్రేమకి ఉన్న శక్తి వల్లనేమో నేను నీ కంటికి మాత్రమే కనపడ్డాను. నీ ప్రేమను అందుకొని నీ సొంతం అయ్యాను. బ్రతికి ఉన్నప్పుడు నీ ప్రేమను అందుకోలేకపోయినా ఆత్మలా మారి నీ ప్రేమను అందుకున్న.. నీ కోసమే ప్రేమ పిపాసి లా మారి ఇక్కడే ఉన్నాను ఇంక పై ఇక్కడ ఉండే అవసరం లేదంటూ సూర్య వద్దకు చేరుకొని ప్రేమగా తనని హత్తుకొని ముద్దు పెట్టుకొని మాయం అయింది సోహా.. 


కళ్ళు తెరిచిన సూర్యకి ఇదంతా ఓ మాయలాగా తోచింది. ఊరిలో సోహా పేరు చెప్పి తన సమాధి వద్దకు చేరుకొని బాధగా నేలపై చతికిలపడి ఏడుస్తూ‘ఇకపై నీ ప్రేమని ఎప్పటికీ అనుభూతి చెందలేనని, నువ్వు లేని ఊరిలో నేనుండలేను. అందుకే ఇక్కడ ఉండలేను.. నువ్వు ఎప్పటికీ నా అందాల రాక్షసివే.. ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నా’ అంటూ ఓ పుష్పగుచ్చం అక్కడ పెట్టి కన్నీటితో ఆ ఊరిని వదిలి పెట్టి వెళ్ళిపోయాడు సూర్య.. 


*****

N. ధనలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.  


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ యువ రచయిత్రి బిరుదు పొందారు.









Comments


bottom of page