'vyasanam kulchina kalala soudham' written by Ramya Namuduri
రచన : రమ్య నముడూరి
బంగారు తల్లివి కదా! ఈ ఒక్క ముద్దా తినేయమ్మా!" అంటూ తన నాలుగేళ్ల కూతురికి, గంజన్నం తినిపించడానికి ప్రయత్నం చేస్తోంది సీత.
"ఊహు! నాకు ఈ గంజిబువ్వ వద్దు! ఇదివరకు పప్పాము పెట్టేదానివి కదా! అదే కావాలి! " అంటూ మారాం చేస్తోంది రవళి.
"రేపు కూలి డబ్బులు రాగానే నీకు పప్పుబువ్వ చేసి పెడతా. నా తల్లి కదూ! ఈ ఒక్క ముద్దా తినేసేయమ్మా!" అంటూ ఎలాగో రెండు ముద్దలు తినిపించి, రవళిని పడుకో పెడుతోంది సీత.
"అమ్మా! నాన్న ఎందుకు మనల్ని వదిలేసి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు?" అంటూ రోజూలాగే ఇవాళ కూడా ప్రశ్నలు మొదలుపెట్టింది రవళి.
" మంచివాళ్ళు అంటే దేవుడికి చాలా ఇష్టం కదా! అందుకే మీ నాన్నని తొందరగా తీసుకెళ్ళిపోయాడు" అంటూ కంటి నుండి ధారగా కారుతున్న కన్నీటిని బలవంతంగా అదుపు చేసుకుంటూ “తొందరగా పడుకో.. బంగారు తల్లివిగా! " అంటూ జో కొడుతూ, రవళిని పడుకోబెట్టి, తను కూడా నడుము వాల్చింది.
ఈ లోకంలో లేని తన భర్తని తలుచుకుని, చాలా సేపు ఏడ్చింది! అలా ఏడుస్తూనే, నిద్రాదేవి ఒడిలో, గాఢ నిద్రలోకి జారుకుంది!
***
"సీతా..
నేను కావాలని తాగలేదు. మా ఫ్రెండ్స్ నన్ను బలవంతంగా తాగించారు! అక్కడికీ, నేను వద్దు అన్నావినలేదు. బలవంతంగా తాగించారు.
తాగిన వాడిని డ్రైవింగ్ చేసి ఉండకూడదు. కానీ అప్పటికే లేట్ అయింది కదా! నువ్వు కంగారు పడతూ ఉంటావని, నేను స్లోగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాను. కానీ ఇలా జరుగుతుంది, అని నేను ఊహించలేదు! నన్ను క్షమించు సీతా! నిన్నూ, పిల్లని ఇలా వదిలేసి వెళ్ళిపోతాను అని నేను కలలో కూడా ఊహించలేదు! నువ్వు ఇలా కూలి పని చేసుకుంటూ, ఇల్లు నడపాల్సిన రోజులు రావడానికి కారణం నేనే. తాగడమే తప్పు! పైగా తాగి బండి నడిపాను.
నేను మీకు అన్యాయం చేసాను!నేను చచ్చి మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేసాను!
రోజూ పప్పన్నం తినే మన బిడ్డకీ గంజన్నం పెట్టి, నువ్వు పస్తులు ఉంటున్నావ్!చాలీచాలని కూలి డబ్బులతో, ఇంటిని నడిపించుకుంటున్నావ్!
ఇందుకు నేనే కారణం! " అంటూ బోరుమని ఏడుస్తున్నాడు సీత భర్త చంద్రం! ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది సీత. ఇప్పటివరకు తను కల కన్నది అని అర్ధం అయింది సీతకి!
దుఃఖం కట్టలు తెంచుకుంది. ముఖం అరచేతుల్లోకి తీసుకుని, వెక్కి వెక్కి ఏడుస్తోంది సీత.
రెక్కాడితే కానీ డొక్కాడని, మధ్యతరగతి బతుకులే అయినా, ఉన్నంతలో సంతోషం గా బ్రతికిన వారి జీవితాల్లో ఊహించని దుర్ఘటన, విషాదాన్ని నింపేసింది.!
తాగి బండి నడుపుతున్న చంద్రం ఆక్సిడెంట్ లో చనిపోయాడు. భర్తను దూరం చేసుకుని సీత, తండ్రిని దూరం చేసుకుని రవళి బాధపడుతుంటే, ఒక్క పొరపాటు వల్ల ప్రాణాలు కోల్పోయి, కుటుంబాన్ని కష్టాల్లో వదిలేసిన చంద్రం ఆత్మ ఘోషిస్తోంది, చెదిరిపోయిన వారి కలల సౌధాన్ని తలుచుకుంటూ.
తాగి బండి నడపవద్దు. మీ కుటుంబాన్ని కష్టాల్లో పడేయొద్దు!
***సమాప్తం***
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
> పుకారు
రచయిత్రి పరిచయం :
నా పేరు రమ్య
నేనొక గృహిణిని
మాది తూర్పు గోదావరి జిల్లా, ముక్కామల గ్రామం. నేను తెలుగు భాషని ఎంతగానో ఇష్టపడతాను. నేనొక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. కధలు, కవితలు, నవలలు రాస్తూ ఉంటాను. ధన్యవాదములు
Comments