వ్యూహం
- Parupalli Ajay Kumar
- Jul 25, 2023
- 8 min read

'Vyuham' - New Telugu Story Written By Parupalli Ajay Kumar
'వ్యూహం' తెలుగు కథ
రచన: పారుపల్లి అజయ్ కుమార్
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
సరిగ్గా పదింటికి ఆఫీసుకు చేరుకొని సీట్లో కూర్చున్నానో లేదో
"ఈ రోజు పేపర్ చూసావా?" అంటూ వచ్చారు చలపతిగారు.
చలపతిగారు మా ఆఫీసులో సీనియర్ మోస్ట్ ఉద్యోగి అయినా అతని మీద ఉన్న అభియోగాల వల్ల ప్రమోషన్ పొందలేక పోతున్నాడు.
అయిదు సంవత్సరాల క్రితం చలపతిగారు ఒక ఫైలుమీద సంతకం విషయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఉద్యోగ విధులనుండి సస్పెండ్ చేశారు.
ఎవరిని ఎలా మానేజ్ చేసారో తెలియదు గానీ ఆరు నెలలకల్లా ఏసీబీ కేసు ఏమీ తేలకుండానే తిరిగి ఉద్యోగ విధుల్లో చేరిపోయారు.
"పేపర్ చదివా గానీ, దేని గురించి మీరు అడిగేది?" అడిగాను.
"ఇదిగో ఈ వార్త చదివావా?" అంటూ తను తెచ్చిన పేపర్ మడిచి ఒక వార్తను చూపించారు.
భారీ అవినీతి చేప పట్టివేత :
'అసిస్టెంట్ ఇంజనీర్ (కాంట్రాక్ట్)గా పనిచేస్తున్న అతని నెలవారీ జీతం కేవలం ₹ 30, 000 మాత్రమే అయినప్పటికీ, తన ఆదాయానికి మించి 330 శాతం విలువైన ఆస్తులను సంపాదించాడని ఏసీబీ బృందం తెలిపింది.
ఫామ్‌హౌస్‌తో సహా.. అతనికి సంబంధం ఉన్న మూడు ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించారు.
20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఫామ్ హౌస్ లో సుమారు ₹ 7 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు.
సబ్ ఇంజనీర్ ఇంట్లో ₹ 30 లక్షల విలువైన టెలివిజన్ వుంది. బంగ్లా వద్ద లగ్జరీ కార్లతో సహా 20 కార్లు పార్క్ చేయబడి వున్నాయి. ఫామ్‌హౌస్‌లో ఎనభై మేలుజాతి ఆవులు ఉన్నాయని కనుగొన్నారు. ఆస్తులకు సంబంధించిన పత్రాలతో పాటు.. రూ. 10 లక్షల 77 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
అవినీతి నిరోధక చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు. షోకాజ్ నోటీసు ఇచ్చారు. రిమాండ్ కోసం స్థానిక కోర్టులో హాజరుపరిచారు.
రాష్ట్రంలో ఆ ఇంజనీర్ ఆస్తుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంట్రాక్ట్ ఉద్యోగే ఈ స్థాయిలో సంపాదిస్తే.. ఇక ఇతర ఉద్యోగులు, నేతల అవినీతి ప్రతిభ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ప్రజలు గుసగుసలాడుతున్నారు. '
సుదీర్ఘమైన ఆ వార్తను చదివి చలపతిగారి ముఖంలోకి చూసాను.
"అవినీతికి పాల్పడితే ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోక తప్పదు. మనం నిజాయితీగా సంపాదించిన దానితో తృప్తి పడటం అలవాటు చేసుకోవాలి. " అన్నాను నర్మగర్బంగా.
"దొరికిందే అంతుంటే ఇంకా దొరక్కుండా ఎంత సొమ్ము దాచాడో. ఈ దేశంలో అవినీతి కేసుల్లో చిక్కినా బయటకు రావడం చాలా సులభం అయ్యిందిలే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఆరు నెలల్లో ఏసీబీ నివేదికపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో సంవత్సరాల తరబడి విచారణ సాగుతూనే ఉంటుంది.
కోర్టుల్లో విచారణ సంగతి ఇక చెప్పక్కర్లేదు. ఈలోపు సర్వీసు నిబంధనల వంకతో ఏసీబీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరుతున్నారు. ఈకేసు విషయం లోనూ అంతే జరుగుతుంది. " అన్నాడు చలపతిగారు.
ఈ విషయాలలో చలపతిగారు చాలా రీసెర్చ్ చేసాడు. అతను కూడా ఈ అవినీతి యంత్రాంగంలో ఒక చిన్న బోల్టు వంటివాడు మరి. నేను ఏమీ మాట్లాడక ఫైల్ లోకి తలదూర్చాను.
ఒక నిమిషం చూసి నేను తలెత్తక పోవడంతో చలపతిగారు నా దగ్గరనుండి వెళ్ళిపోయాడు.
ఏమాటకామాటే చెప్పుకోవాలి. చలపతి గారి నుండి నేను అవినీతికి సంబంధించిన అనేక విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాను.
ఏసీబీ కేసులు రెండు రకాలుగా వుంటాయి.
ఒకటి లంచం తీసుకుంటుండగా అక్కడికక్కడే పట్టుకోవడం.
లంచం ఇచ్చే వ్యక్తి డబ్బు ఇస్తున్నప్పుడు, తీసుకున్న వ్యక్తి చేతిలో డబ్బు ఉండగానే ఏసీబీ అధికారులు సడెన్ గా ఎంట్రీ ఇచ్చి పట్టుకుంటారు. అది లంచం డబ్బే అని గుర్తించడానికి వీలుగా, ముందుగానే ఆ కరెన్సీపై ఒక రసాయనం చల్లుతారు. ఆ రసాయనం చల్లిన డబ్బును పట్టుకున్న వ్యక్తి చేతుల రంగు మారుతుంది.
ఇలా పట్టుకునే వాటిని ట్రాప్ కేసులు అంటారు. అధికారుల అవినీతితో విసిగిపోయిన వ్యక్తులు ఫిర్యాదు చేసినప్పుడు, వారి ద్వారా ఆ అధికారిని ట్రాప్ చేసి పట్టుకుంటారు కాబట్టి దీనికాపేరు.
ఇక రెండో రకం ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.
అంటే అప్పటికప్పుడు లంచం తీసుకుంటూ దొరకకపోయినా, బాగా అవినీతి చేసి ఆస్తులు కూడబెట్టిన వారి కూపీ లాగుతారు ఏసీబీ అధికారులు.
వాళ్ల గురించి ఆరాతీసి, అధ్యయనం చేసి, వారి ఇంటిపై, ఇంకా బంధువులు, స్నేహితులు, బినామీల ఇంటిపై ఒకేసారి తనిఖీలకు వెళ్తారు. వాళ్ల ఇళ్లల్లో దొరికిన పత్రాలు, బంగారం, డబ్బు అన్నీ స్వాధీనం చేసుకుంటారు. తరువాత వారి జీతం, ఇతర అధికారిక ఆదాయాలూ అన్నీ లెక్కవేసి, అంతకంటే ఎక్కువ ఉంటే అది ఎలా వచ్చిందో ఆరాతీసి, దానికి సరైన కారణం దొరక్కపోతే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో కేసు పెడతారు.
చలపతి చెప్పినట్లు చాలాకేసులు సరిఅయిన సాక్ష్యాలు లేక వీగిపోతుంటాయి.
ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా, ఇంటిపై తనిఖీలు చేసి గుట్టల కొద్దీ పత్రాలు, కట్టల కొద్దీ నోట్లు స్వాధీనం చేసుకున్నా, చివరకు కోర్టుల్లో వారు నేరం నిరూపించగలిగేది కొన్ని కేసులు మాత్రమే.
విచారణ ఆలస్యం అయ్యే కొద్దీ కేసు ఓడిపోయే అవకాశం పెరుగుతుంది. ఆర్నెళ్లలోనో, ఏడాదిలోనే తేలితే సరి. లేకపోతే నీరుగారిపోతుంది.
కాలంతో పాటూ సాక్ష్యాలూ చచ్చిపోతాయి. సాక్షులు ఎటో పోతారు. ట్రాప్ కేసుల విషయంలో మొదట్లో ఉన్నంత ఉత్సాహం తరువాత ఉండదు.
క్రమంగా ఆసక్తి తగ్గుతుంది. కేసును బలహీనం చేస్తారు.
కొన్ని సందర్భాల్లో పట్టుకున్న వ్యక్తి, దొరికిన వ్యక్తి మధ్య ఒప్పందం కుదురుతుంది. కొన్ని సందర్భాల్లో పట్టుకున్న అధికారి రిటైర్ అయిపోతారు. ఆ స్థానం లో వచ్చిన వారికి ఆ కేసు విషయంలో ఆసక్తి వుండదు.
ఇంకొన్ని సందర్భాల్లో ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి విచారణకు కావల్సిన సమాచారం కోర్టుకు అందకుండా చేస్తాడు. ఇలా రకరకాల కారణాలతో కేసులు నీరుగారి పోతుంటాయి.
చలపతి ఎన్నో అవినీతి కేసులను వాటి పూర్వాపరాలను కూలంకుషంగా నాతో చర్చించే వాడు.
అతను చెప్పిన విషయాలతో నేను నా డ్యూటీ పట్ల మరింత జాగురూకతతో ఉండేవాడిని.
ఎందుకంటే నేను రోడ్లు భవనాలశాఖ కార్యాలయంలో పనిచేస్తున్నాను. నా సీటు చాలా కీలకమైనది. నా మీద ఆఫీసులో కొందరికి కోపం.
నా సీటులో ఉండాలని కొందరు కొన్ని తెరవెనుక ప్రయత్నాలు చేసారు. కానీ ఎవరూ సఫలం కాలేదు.
హెడ్ ఆఫీసు వారు నామీద పూర్తి నమ్మకంతో నన్నీ సీటులో కూర్చోబెట్టారు. వారి నమ్మకాన్ని నేను ఎన్నడూ వమ్ము చేయలేదు.
నామీద ఎన్ని వత్తిళ్ళు వచ్చినా నేను లొంగలేదు. అందరికీ ఒక కొరకరానికొయ్యనయ్యాను.
ఆ ఆఫీసులో నాకు బాగా చేరువైన మిత్రుడు సాత్యకి.
అతను, నేను సమవయస్కులు కావటం, ఇద్దరి ఆలోచనా విధానాలు ఒకే రకంగా ఉండటమే మా ఇద్దరి సాన్నిహిత్యానికి కారణం అయ్యాయి.
కొద్దికాలంలోనే మా ఇద్దరి కుటుంబాల మధ్య కూడా స్నేహసంబంధాలు వెళ్ళి విరిసాయి. సాత్యకి మృదు స్వభావి, స్నేహశీలి, ఎవరినీ నొప్పించే మాటలు పొరపాటున కూడా అనడు.
నాలుగు నెలల క్రితం సాత్యకి వాళ్ళ అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ లో చేరారు.
బైపాస్ సర్జరీ చేయాలన్నారు. సమయానికి డబ్బుదొరక్క ఇబ్బంది పడుతుంటే నేనే అయిదు లక్షల రూపాయలు సర్దుబాటు చేసాను.
ఈ విషయం పై వారాని కొక్కసారన్నా నాకు కృతజ్ఞతలు చెపుతూనే ఉన్నాడు. అలా చెప్పొద్దని అన్నా వినడు.
మా ఇద్దరి స్నేహితం ఆఫీసులో చాలా మందికి నచ్చలేదు.
ఒకరిమీద మరొకరికి ఏవో పుల్లవిరుపు మాటలు చెప్పేవారు.
మేము వాటిని ఎప్పుడూ ఖాతరు చేయలేదు.
"సార్ మా ఫైల్ సంగతి ఏం చేసారు?" అన్న మాటలు వినపడి ఆలోచనల నుండి బయటపడి తలెత్తి చూసాను.
‘భూమి కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ ఇంజనీరు అతను. ఆ కంపెనీ ఈ మధ్య ఆ భారీ వెంచర్ చేపట్టి పూర్తి చేసింది.
కానీ నిర్మాణంలో కొన్ని అవకతవకలు జరిగాయని నా దృష్టికి వచ్చింది. దాని మీద ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి రిటెన్ కంప్లయింట్ చేసాడు. అవి తేలిన తరువాతే పేమెంట్ జరగాలని నా ఆలోచన.
ఆ నిర్మాణంపై సమగ్ర దర్యాప్తు చేయాలని నేను ఫైల్ పుటప్ చేసాను. నేడో రేపో దానిని పై అధికారులకు పంపాల్సి వుంది.
ఈ సంగతి ఆఫీసులో ఎవరి ద్వారానో ఆ కంపెనీ వారికి చేరివుంటుంది. దాని పర్యవసానమే ఇంజనీరు రాక అని అర్ధమైపోయింది. అతన్ని యెదురుగా వున్న కుర్చీలో కూర్చోమన్నాను.
ఇక నేను దాచిపెట్టేది ఏదీ లేదని "చూడండి. మీ నిర్మాణంలో కొన్ని అవకతవకలు జరిగాయని మాకు ఒక రిటెన్ కంప్లయింట్ వచ్చింది. దాని మీద దర్యాప్తు జరగాలి.
నేను పై అదికారులకు ఈ విషయాన్ని రాస్తున్నాను. వారే చూసుకుంటారు దీన్ని. నాచేతిలో ఏమీ లేదు. పైనుండి క్లియరెన్స్ సర్టిఫికెట్ రాగానే నేను మీ బిల్లు పాస్ చేస్తా"
అన్నాను అతని ముఖం లోకి చూస్తూ.
అతను కొద్దిగా టేబుల్ మీదకు వంగి "మా సేటుగారు మిమ్ములను ఒకసారి కలుస్తామన్నారు. ఈ రోజు సాయంత్రం వీలుంటుందో లేదో కనుక్కోమన్నారు. " అన్నాడు చిన్నగా.
ఇటువంటి మాటలకు ఉద్యోగంలో చేరిన క్రొత్తలో చాలా కోపం వచ్చేది. క్రమక్రమేణా వాటికి అలవాటు పడిపోయాను.
చిన్నగా నవ్వుతూ "మీ మాటలు వేరే ఎవరికైనా చెప్పుకోండి.
నా సంగతి మీకు తెలుసు. ఇంతకు ముందు కూడా రెండుమూడు సార్లు ఇలా అన్నారు. నా దగ్గర మీ ఆటలు సాగవని తెలిసీ ఎందుకు పదేపదే వ్యర్థపు మాటలు మాట్లాడుతారు?" అన్నాను.
అతను ముఖం చిన్నబుచ్చుకుంటూ "మా సేటుగారు చెప్పమన్నది చెప్పాను. ఒకవేళ మనసు మార్చుకుంటే.. . " అంటూ వారి కంపెని విజిటింగ్ కార్డు టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయాడు.
నేనా కార్డును తీసుకొని ముక్కలు చేసి డస్ట్ బిన్ లో పడేసాను.
***********************************
మరునాడు ఆఫీసు మెట్లెక్కుతుంటేనే చలపతిగారు హడావుడిగా వచ్చి నీకో విషయం చెప్పాలి అని కాంటిన్ కు లాక్కుపోయాడు.
కాఫీ తాగుతు అడిగారు "భూమి వాళ్ళ ఫైల్ క్లియర్ చేసావా?" అని.
నేను అతన్ని అనుమానంగా చూస్తూ "లేదు" అన్నాను.
"నిన్న ఆ కంపెనీ ఇంజనీరు నిన్ను కలసి వెళ్ళాడుగా! అప్పుడు చూసా అతన్ని. నిన్న రాత్రి నా ఫ్రెండ్స్ తో కలసి తాజ్ హోటల్ కు వెళ్ళాను.
అక్కడ అతను నీ ఫ్రెండ్ సాత్యకితో కలసి కనిపించాడు.
వాళ్ళు నన్ను గమనించలేదు. నేను వారిని గమనించాను. సుమారు ఒక గంట టైమ్ వాళ్ళు అక్కడ స్పెండ్ చేసారు.
నేను చెప్పేది నువ్వు నమ్ముతావో లేదో నీ ఇష్టం. నేను చూసింది చెప్పాను. సాత్యకితో కొద్దిగా జాగ్రత్తగా వుండు. " అన్నారు.
"సాత్యకి గురించి ఎవరేం చెప్పినా నేను నమ్మనని మీకూ తెలుసు. సాత్యకి నా మిత్రుడు.
వాళ్ళిద్దరూ అక్కడ కలసి ఉండవచ్చు. ఎందుకోసం కలిసారో, ఏం మాట్లాడుకున్నారో నాకు అనవసరం. మీ మాటలు నమ్మి నేను నా స్నేహితుడిని అనుమానించలేను. "
అన్నాను కొంచెం అసహనంగా.
చలపతిగారు కొద్దిగా ముఖం చిన్నబుచ్చుకున్నారు నా మాటలకు.
వెంటనే తేరుకొని "నేను అవినీతిపరుణ్ణే. కాదని నేను చెప్పుకోవటం లేదు. ఎవరూ పుట్టుకతో అవినీతి పరులు కాదు. అవినీతి చేయని వాడిని లోకంలో చాలా మంది చేతకాని వాడిగా చూస్తున్నారు. తోటి వారు అవినీతి చేసి సంపాదించడం చూసి మంచి వ్యక్తి కూడా మారిపోతున్నాడు. నిజాయితీగా ఉండే వాడిని ఎగతాళి చేస్తున్నారు. ఆఖరికి ఒక్కోసారి కుటుంబం నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది.
అవినీతి ఒక పద్మవ్యూహం లాంటింది. పొరపాటున ఒక్కసారి దానిలోనికి వెళ్ళామా? ఇక అంతేసంగతులు. తిరిగి బయటపడటం దాదాపు అసాధ్యమే. నేనూ ఒకప్పుడు నీలా వుండాలనుకొనేవాడిని. పరిస్థితులు నన్ను దిగజార్చాయి.
నిన్ను చూస్తుంటే ఒకప్పటి నన్ను నేనే చూసుకున్నట్లు ఉంటుంది. అందుకే నువ్వంటే నాకు ఆపేక్ష. నీ మంచికోసమే నిన్ను జాగ్రత్తగా ఉండమని చెపుతున్నా. సాత్యకి మంచి వ్యక్తి కావచ్చు. మనిషి పరిస్థితులకు బానిస.
అతను మారడని ఎట్లా చెప్పగలం? వారిద్దరూ కలిసారు, మాట్లాడుకున్నారు. అది మాత్రం నిజం. ఆ విషయమే చెప్పి నిన్ను హెచ్చరించాను. నిన్ను ఆ సీటులో నుండి కదల్చాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా కొద్దిరోజులపాటు ఏ పని చేసినా అలోచించి అడుగువేయి. " అని చలపతి కాంటిన్ నుండి బయటకు వెళ్లిపోయారు.
నేను కూడా లేచి ఆఫీసులోకి నడిచాను. సాత్యకిని కలసి విషయమేమిటో అడగాలా వద్దా అని తేల్చుకోక ముందే పై అధికారులతో ఒక మీటింగ్ కు హాజరు కావాల్సి వచ్చింది.
మీటింగ్ లోనే లంచ్ కూడా సర్వ్ చేసారు. మీటింగ్ ముగిసి నా సీటు దగ్గరికొచ్చేసరికి మూడుగంటల సమయం అయింది.
అప్పుడే సాత్యకి హడావుడిగా వచ్చి "హరీ, మా వాడికి బైక్ మీదనుండి క్రిందపడి దెబ్బలు తగిలాయట. వాడి ఫ్రెండ్స్ ఫోన్ చేసారు. నేను వెళుతున్నా. " అంటూ రెండడుగులు వేసి మరలా వెనక్కు వచ్చి
"మా ఊరి నుండి ఒకతను వస్తుంటే మాపొలం కౌలు చేసే రైతు కౌలు డబ్బులు పంపిస్తున్నానన్నాడు. అతనికి నేను ఉండటం లేదని నీకివ్వమని చెప్పాను. అతను వస్తే ఆ డబ్బులు తీసుకుని నీ దగ్గరవుంచు. రేపు తీసుకుంటా నీ దగ్గరనుండి" అని నేను ఏదో అడిగేలోపే హడావిడిగా వెళ్లిపోయాడు.
డబ్బుల విషయం సాత్యకి మాట్లాడేసరికి నాకు ప్రొద్దున కాంటీన్లో చలపతిగారు చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి.
సాత్యకిని నేను అనుమానించటమా అని అనుకుంటూనే ఎందుకైనా మంచిదని టూ టౌన్ పోలీస్ స్టేషను లో SI గా పనిచేస్తున్న మిత్రుడు రఘువీర్ కు ఫోన్ చేసి ఉన్నపళంగా మా ఆఫీసుకి సివిల్ డ్రస్ లో రమ్మని చెప్పాను.
నా పై అధికారికి కూడా నా అనుమానం చెప్పాను.
ఇది కేవలం నా అనుమానం మాత్రమేనని, నిజంగానే అవి పొలం కౌలు డబ్బులు అయితే ఆ విషయం అంతటితో మరచిపోవాలని కూడా రిక్వెస్ట్ చేసాను.
నా మీద గుడ్ విల్ ఉన్న ఆఫీసరు గారు సరేనన్నారు.
SI రఘువీర్ రాగానే విషయం మొత్తం చెప్పాను.
"వచ్చిన వ్యక్తి డబ్బులు ఇచ్చేటప్పుడు నువ్వు ప్రక్కన వుంటే మంచిదని పిలిచాను" అన్నాను.
రఘువీర్ నవ్వుతూ యెదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. నాలుగున్నరకు ఒక పల్లెటూరి మనిషి నా దగ్గరకొచ్చాడు.
"హరికృష్ణ గారు మీరేనా?" అంటూ.
ఔనని తలూపాను.
"సాత్యకి గారి పొలం డబ్బులు ఇవి. మీకివ్వమని ఫోన్ చేసి చెప్పారు. " అంటూ రెండువేల రూపాయల కట్టలు రెండు చేతి సంచీలోనుండి తీసి నా చేతికి ఇవ్వబోయాడు.
నేను నా జాగ్రత్తలో నేనున్నాను. వాటిని అందుకోకుండా నా చేతులను వెనక్కు లాక్కున్నాను.
అదే సమయంలో సినిమాల్లో చూపించినట్లుగానే ఇద్దరు వ్యక్తులు మాదగ్గరికొచ్చారు.
వాళ్ళను చూస్తూనే రఘువీర్ అందులో ఒకతనిని చూస్తూ
"హలో సతీష్ రండి. మీకోసమే చూస్తున్నాం. "అన్నాడు.
వచ్చిన వాళ్ళు తెల్లబోయి నిలుచున్నారు. రఘువీర్ ఆ పల్లెటూరి వ్యక్తిని గట్టిగా పట్టుకొని ఏసీబీ నుండి వచ్చిన వారికి విషయమంతా చెప్పాడు.
"హరికృష్ణ ను ట్రాప్ చేయాలని పన్నిన వ్యూహం ఇది. హరికృష్ణ తెలివిగా వ్యవహరించి నన్ను పిలిపించాడు. ఇతన్ని పట్టుకొని నాలుగు ఉతికితే దీనివెనుక ఎవరెవరు ఉన్నారనేది తెలుస్తుంది. ఆ పని మీరు చేస్తారా? నన్ను చేయమంటారా?" అన్నాడు సీరియస్ గా.
ఏసీబీ ఆఫీసర్లు నాది, SI రఘువీర్ ది, నా ఆఫీసరు గారి స్టేట్ మెంట్లు రికార్డ్ చేసుకొని డబ్బులు తీసుకొచ్చిన వ్యక్తిని తీసుకుని వెళ్ళిపోయారు.
రఘువీర్ తనుకూడా ఆ కేసును ఫాలో చేస్తుంటానని చెప్పి వెళ్లిపోయాడు.
నేను అవినీతి కేసులో ఇరుక్కోకుండా తెలివిగా బయటపడ్డానని ఆఫీసులో అందరూ అభినందించారు. నేనంటే ఇష్టం లేని వ్యక్తులు కూడా నాకు కంగ్రాట్స్ చెప్పారు. వారందరి అభినందలకు నేను పొంగిపోయే స్థితిలో లేను.
నా మనసంతా స్తబ్దుగా మారిపోయింది. నేను అంతగా ఇష్టపడని చలపతి నా మేలు కోరాడు. నన్ను హెచ్చరించాడు. అతను నాకీ విషయాలు చెప్పి ఉండకపోతే ఈ పాటికి నేను ఒక లంచగొండిగా కటకటాల వెనుక ఉండాల్సి వచ్చేది. ఆ విషయాన్ని ఊహిచుకుంటుంటేనే కళ్ళు తిరిగిపోతున్నాయి.
నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి అనుకున్న సాత్యకి ఇలా చేసాడా? నమ్మలేక పోతున్నాను. అతని కారణాలు అతనికి ఉండొచ్చు. బెదిరించో, భయపెట్టో, ప్రలోభపెట్టో అతనిచేత ఈపని చేయించివుండవచ్చు.
కానీ, కానీ.. .. నన్ను.. . నన్ను.. .. నమ్మిన మిత్రున్ని.. . ఇలా..
ఎప్పుడో చిన్నపుడు చదివిన జూలియస్ సీజర్ కథ ఙ్ఞాపకం వచ్చింది. జూలియస్ సీజర్ చివరి మాటలు
'యూ టూ బ్రూటస్..' గుర్తొచ్చాయి.
ఆలోచించలేక కళ్ళు తిరిగి స్పృహ తప్పినట్లయి పడిపోతుంటే చలపతిగారు వచ్చి పట్టుకున్నారు. నాచేత మంచినీళ్లు త్రాగించి నా భుజాలమీద చేతులు వేసి తట్టాడు ఏమీ కాలేదు ఊరుకో అన్నట్లుగా.
********************************
ఆ రాత్రి రఘువీర్ ఫోన్ చేసాడు.
డబ్బులు తీసుకొచ్చిన వ్యక్తి బయటపెట్టిన సాక్షాల ఆధారంగా కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారట. అందులో సాత్యకి కూడా వున్నాడు.
"అతని మీద కేసు బలంగా వుండదు. అతను నేరుగా లంచం ఇవ్వలేదు, తీసుకోలేదు. భూమి కన్స్ట్రక్షన్ వారు నీ మీద పన్నిన వ్యూహంలో అతను పావులా మారిపోయాడు. అతను చెపితే నువ్వు వింటావని ఆ డబ్బు తీసుకుంటానని అతని ద్వారా అలా చెప్పించారు. దేనికోసం అతను వారికి లొంగి పోయాడో తెలియదు. భయపెట్టారో ప్రలోభపెట్టారో తేలవలసి వుంది. వారు అతనికి ఎంత ముట్టచెప్పారో తెలియదు." అని చెప్పాడు.
‘ఏసీబీ వలలో పెద్ద పెద్ద తిమింగలాలు తప్పించుకుంటాయి. చిన్న చిన్న చేపలే చిక్కుతాయి ఎక్కువుగా’ అని చలపతి గారి మాటలు జ్ఞాపకం వచ్చాయి.
‘ఎందుకిలా చేసావు మిత్రమా?’ అని అడగాలని వుంది.
ఇంత జరిగాక అతని ముఖాన్ని నేను, నా ముఖాన్ని అతను చూసి తట్టుకోగలమా అనిపించింది.
అవినీతి వలలో చిక్కుకున్న అతన్ని ఎలా బయటకు తీసుకు రావాలో రేపు చలపతి గారిని కనుక్కోవాలి అనుకున్నాను.
మనసు నిండా ఆవేదన, దుఃఖం..
నిదురరాని ఆ నిశిరాత్రి నిట్టూర్పులతోనే తెల్లవారింది.
—---------------------------------------
పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...
పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...
ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...
సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,
నవలలు చదవటం మరీ ఇష్టం ...
పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో
"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..
షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .
నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..
రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...
ఉచిత లైబ్రరీ ....
మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...
ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న
మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.
Nice story.
కథ బాగుంది అభినందనలు.