Vyuham - New Telugu Story Written By Gannavarapu Narasimha Murthy
Published In manatelugukathalu.com On 19/01/2025
వ్యూహం - తెలుగు కథ
రచన: గన్నవరపు నరసింహ మూర్తి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
దండ కారణ్యం!
గ్రీష్మం కావడంతో ఎండ మెండుగా ఉంది. ఆ సమయంలో ఒక పోలీసు వేన్ అడవిలోకి ప్రవేశించింది. అందులో సాయుధులైన 50 మంది స్పెషల్ బెటాలియన్ పోలీసులు ఉన్నారు. వాళ్ళకి డీయస్పీ శ్రీనాథ్ నాయకత్వం వహిస్తున్నాడు.
అంతకు రెండు రోజుల ముందు వాళ్ళకి నిఘ వర్గాల ద్వారా నల్లకొండ దళం నక్సలైట్లు దండకారణ్యంలోని ఎర్రవాగు దగ్గర ప్లీనరీ జరుపుకుంటున్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులు ఎలర్టైయ్యారు. ఎస్పీ దినకర్ మిశ్రా డీయస్పీ శ్రీనాథ్‌ని పిలిచి నల్లకొండ దళాన్ని ముట్టడించమని చెప్పాడు.
వెంటనే శ్రీనాథ్ రంగంలోకి దిగాడు. నల్లకొండ దళం వల్ల జిల్లాలో ఇప్పటికే ఏభై మంది వరకూ పోలీసులు చనిపోయారు. క్రితం సంవత్సరం కూంబింగ్ జరుపుతున్న పోలీసుల వేనుని నల్లకొండ దళం ఐఈడీ బ్లాస్టు ద్వారా పేల్చి వేసినప్పుడు పాతిక మంది గ్రే హౌండ్ కమాండోలు చనిపోయారు. ఆరు నెలల క్రితం కూంబింగ్ జరుపుతున్నపుడు కూడా అదే దళం క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ ద్వారా పోలీసుల బస్సుని పేల్చి వేసింది. అప్పుడు ముప్పై మంది పోలీసులు మృత్యువాత పడ్డారు.
ఈ పేలుళ్ళకు నల్లకొండ దళం లోని గణపతి ఎలియాస్ ఎర్రన్న మరియు శంకర్ ఎలియాస్ చిన్నడు అనే ప్రముఖ నక్సలైటు నాయకులు కారణం అని ఇంటిలిజెన్స్ రిపోర్టులో పేర్కొనబడింది.
గణపతిని దళంలో టెక్ గణపతి అంటారు. ఇతను ఐఈడీ బ్లాస్టుంగ్ నిపుణుడు. అతని సహాయకుడు శంకర్; ఈ ఇద్దరి కోసం పోలీసులు నాలుగు సంవత్సరాల నుంచీ వేటాడుతున్నా వాళ్ళు దొరకటం లేదు. పోలీసులు వాళ్ళ ఆచూకీ చెబితే లక్ష రూపాయలిస్తామని రివార్డు కూడా ప్రకటించినా అది పెద్దగా ఫలితాన్నివ్వలేదు.
ఏభై మంది తమ పోలీసులు చనిపోవడానికి కారణమైన నల్లకొండ దళం మీద జిల్లా పోలీసు శాఖ కక్ష గట్టి ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నది.
ఆ సమయంలో ఆ దళం నల్లకొండ సమీపంలోని ఎర్రవాగు దగ్గర సమావేశం అవుతున్నట్లు వార్త రావడంతో పోలీసు శాఖ ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఇటువంటి కూంబింగ్ ఆపరేషన్స్‌కి సంత్సరం క్రితం డీయస్పీ శ్రీనాథ్‌ని నియమించారు జిల్లా ఎస్సీ.
ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆ ఎర్రవాగు దగ్గర సమావేశం అయిన నల్లకొండ దళాన్ని చుట్టుముట్టారు సాయుధులైన పోలీసులు.
దాన్ని ఊహించని నక్సల్స్ దళం ఆత్మ రక్షణలో పడింది. వెంటనే పోలీసుల మీద కాల్పులు మొదలు పెట్టింది.
ఈ ఎన్‌కౌంటర్‌కి పకడ్బందీగా వ్యూహాన్ని పన్నాడు డీఎస్పీ శ్రీనాథ్. అతను ఇటువంటి వాటిలో సిద్ధహస్తుడు. కొండ చుట్టూ పోలీసులు అష్టదిగ్బంధం చేయడంతో ఆ దళ సభ్యులకు పారిపోవడానికి వీలు చిక్కలేదు. దాంతో కాల్పులు ప్రారంభించారు.
పోలీసుల చేతుల్లో అత్యంత ఆధునాతనమైన ఏకె 47 తుపాకులున్నాయి. దాంతో వాళ్ళు ఆ దళం నక్సల్స్ మీద విరుచుకు పడ్డారు. అలా ఆ కాల్పులు రెండు గంటల పాటు కొనసాగాయి. ఆ కాల్పులో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఐదుగురు నక్సల్స్ చనిపోయారు. నలుగురు చేతులెత్తి పోలీసులకు లొంగిపోగా మిగతా వారు రహస్య మార్గం గుండా తప్పించుకున్నారు. ఆ దొరికిన నలుగురిలో ప్రముఖ నక్సల్ శంకర్ ఉన్నాడు.
అతనితో పాటు మిగతా ముగ్గురిని పట్టుకొని పోలీసు స్టేషన్‌కి చేరుకున్నారు పోలీసులు. ఎన్‌కౌంటర్లో చనిపోయిన నక్సల్స్‌కి పంచనామా చేసి అంతక్రియలు జరిపించారు పోలీసులు.
ఆ మర్నాడు ఉదయాన్నే శంకర్‌ని ప్రశ్నించడానికి వాళ్ళని బంధించిన పోలీస్టేషన్‌కి వచ్చాడు డీఎస్పీ శ్రీనాథ్. వాళ్ళ ద్వారా మిగతా దళ సభ్యుల ఆచూకీ తెలుసుకోవాలని అతని ఆలోచన.
పది గంటల సమయంలో అతను శంకర్‌ని బంధించిన సెల్ లోకి వెళ్ళాడు. అందులో శంకర్ తో పాటు అతని అనుచరుడు సుబాహు కూడా ఉన్నాడు. శ్రీనాథ్ తో పాటు మరో ఇద్దరు ఎస్సైలు కూడా అతనితో వెళ్ళారు.
ముందుగా శ్రీనాథ్ పోలీసులతో సుబాహుని బయటకు తీసికెళ్ళమని చెప్పడంలో అతన్ని పక్క సెల్ లోకి మార్చారు.
ఆ తరువాత శ్రీనాథ్ శంకర్‌ని ప్రశ్నించడం మొదలు పెట్టాడు.
"శంకర్! నిజం చెప్పు? గణపతి ఎక్కడ?" అని అడిగాడు.
ఆ మాటలకు శంకర్ ఆశ్చర్య పోయాడు.
"ఇంకెక్కడి గణపతి సార్! ఆణ్ణి మీ పోలీసులు ఎప్పుడో ఎన్ కౌంటర్ చేసి చంపేసారు కదా?! అది ఓ దొంగ ఎన్‌కౌంటర్; అతడి శవాన్ని కూడా మీరు తీసికెళ్ళి దహనం చేసారు కదా?`" అన్నాడు శంకర్.
అతని మాటలు శ్రీనాథ్ కి కోపం తెప్పించాయి.
"శంకర్! తెలివిగా మాట్లాడకు. మా ఎన్‌కౌంటర్లో చనిపోయింది గణపతి కాదు. అలా మీ దళమే ప్రచారం చేసింది. ఆ శవాన్ని అతని కుటుంబ సభ్యులకు చూపిస్తే అతను కాదన్నారు. ఆ తరువాత పుట్టుమచ్చల్ని కూడా టాలీ చేస్తే తప్పని తేలింది; కాబట్టి నాటకాలు కట్టిపెట్టి వాడెక్కడో చెప్పు?" అని గట్టిగా అడిగాడు శ్రీనాథ్.
"లేదు డియస్పీ గారు; అదే నిజమైతే నిన్న జరిగిన ప్లీనరీలో అతను కూడా పాల్గొనేవాడు కదా? అతను ఎన్‌కౌంటర్లో చనిపోగానే మేము అతనికి గార కొండ మీద పెద్ద సభ పెట్టి నివాళి కూడా అర్పించాము" అన్నాడు శంకర్.
"శంకర్! నాటకాలాడకు. నిన్న ప్లీనరీలో అతను కూడా పాల్గొన్నాడు. ఒకప్పుడు మీ దళ సభ్యుడు, ఇప్పుడు మా ఇన్‌ఫార్మర్ అయిన రామన్న దొర స్వయంగా ఆ విషయం మాకు చెప్పాడు. నెల క్రితం మీరిద్దరూ మళ్ళీ పెద్ద ఎత్తున మా పోలీసులను చంపడానికి ప్లాన్ వేస్తున్నట్లు మాకు ఇంటిలిజెన్స్ నివేదిక వచ్చింది. మీరిద్దరూ లేండ్ మైన్స్ పేల్చడంలో సిద్ధ హస్తులన్న సంగతి అందరికీ తెలుసు. నిన్న మా పోలీసులు నల్లకొండకు చేరుకోగానే అతను దొంగ దారిలో పారిపోయాడు.
వాణ్ణి మీ దళ సభ్యులే అక్కడి నుంచి పంపించి వేసారు; అతను చనిపోతే మీకు పెద్ద ఎదురు దెబ్బ అవుతుందని మీరు అతన్ని కంటికి రెప్పలా కాస్తున్నారు. అందుకే వాడు ఎన్‌కౌంటర్లో చనిపోయాడని తెగ ప్రచారం చేసారు. మా పోలీసులు మీరు అనుకున్నంత వెర్రివాళ్ళు కాదు. మీ కంటే నాలుగాకులు ఎక్కువే చదివాము. మర్యాదగా అతను ఎక్కడ ఉన్నాడో చెప్పు? మీరిద్దరూ ఒకే దగ్గర కేంపు చేస్తుంటారని మాకు తెలుసు. గణపతి జాడ చెప్పకపోతే నిన్ను ఇప్పుడే చంపేసి నిన్నటి ఎన్‌కౌంటర్ లో చనిపోయావని రాసేస్తాము.
కాబట్టి జాగ్రత్రగా ఆలోచించుకొని నిజం చెప్పు? నేను ఎన్‌కౌంటర్ స్పెషలిస్టునని మీ అందరికీ తెలుసు. వాడి గురించి చెబితే నిన్ను క్షమాభిక్ష కింద విడుదల చేసి జీవితాంతం నీ కుటుంబంతో హాయిగా బతికేటట్లు చూస్తాము. కాబట్టి చావో, బతుకో తేల్చుకో" అన్నాడు శ్రీనాథ్ కోపంగా.
"సార్! నేను నిజం చెపుతున్నా మీరు నమ్మటం లేదు. నా మాట నమ్మండి. నేను ఏదో ప్రాంతం పేరు చెప్పి మిమ్మల్ని మోసం చెయ్యొచ్చు. కానీ తరవాతైనా అది అబద్ధం అని తేలుతుంది. దయచేసి నా చేత అబద్ధం చెప్పించొద్దు" అన్నాడు శంకర్.
"శంకర్; నాటకాలాడకు. మీ దళం సభ్యులు ఎక్కడెక్కడ ఉంటారో నీకు బాగా తెలుసు. నిన్ను బతిమాలవలసిన అవసరం నాకు లేదు. నిన్ను లేపెయ్యడానికి ఒక్క బుల్లెట్ చాలు. కానీ ఆ బుల్లెట్‌ని వేస్ట్ చెయ్యడం నా కిష్టం లేదు. నాక్కావలసింది గణపతి. వాడి వల్లే వందమంది మా పోలీసులు లేండ్ మైన్స్ పేలుళ్ళకి బలైపోయారు. వాడిని పట్టుకొని ఎన్‌కౌంటర్ చేస్తే కానీ మా చనిపోయిన పోలీసుల ఆత్మలు శాంతించవు. నీకు ఒక రోజు టైమ్ ఇస్తున్నాను. ఈ రాత్రంతా ఆలోచించుకొని రేపు నిజం చెప్పు; బతికిపోతావు. లేకపోతే ఎన్‌కౌంటర్ లో చనిపోయిన వాళ్ళ లిస్టులో నీ పేరు చేరిపోతుంది" అని హెచ్చరించి వెళ్ళిపోయాడు శ్రీనాథ్.
అర్థరాత్రి అయింది. ఆ గదిలో శంకర్, సుబాహు ఉన్నారు. డీయస్పీ శ్రీనాథ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన తరువాత శంకర్ కి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఆ రాత్రి పోలీసులు వాళ్ళకి భోజనం పెట్టినా అతనికి తినబుద్ధి కాలేదు.
వాళ్ళున్న ఆ గదిలో వాళ్ళిద్దరూ తప్ప ఎవ్వరూ లేరు. వాళ్ళకి దూరంగా పోలీసులు గేటు దగ్గర టెంటులో కాపలా ఉన్నారు.
"సుబాహూ ! గణపతి చనిపోలేదని పోలీసులకెలా తెలిసింది రా? ఇన్నాళ్లూ పోలీసులు వాడు చనిపోయానట్లు నమ్మేరనీ అనుకున్నారు మన వాళ్ళంత. కానీ అది అబద్ధం అని ఇవాళ తెలిసిపోయింది. డీయస్పీ శ్రీనాథ్ గారు వాడు చనిపోలేదని బల్లగుద్ది మరీ చెబుతునాడు. నిన్న జరిగిన ఎన్‌కౌంటర్లో వాడు తప్పించుకున్న విషయం కూడా పోలీసులకు తెలిసిపోయింది. వాడు కెంగువ తండాలో ఉన్నాడని నా కొక్కడికే తెలుసు. ఆ విషయం గానీ డీయస్పీకి చెబితే వాణ్ణి అతి క్రూరంగా చంపేస్తారు. వాడి పేరు చెబితే పోలీసులు రగిలిపోతునారు. అయినా మనలో ఎవరు పోలీసులకు దొరికినా వాళ్ళు మిగతా వాళ్ళ ఆచూకి చెప్పకూడదని మన దళ సభ్యులు పెట్టుకున్న నియమం. అందుకే ప్రాణం పోయినా నేను గణపతి ఆచూకీ చెప్పను. గణపతి చనిపోతే మన దళానికి పెద్ద ఎదురు దెబ్బవుతుంది. నువ్వు కూడా ఎవ్వరికీ వాడి ఆచూకి చెప్పకు" అన్నాడు శంకర్.
"అన్నా! ఆడి గురించి సెప్పకపోతే మనల్ని పోలీసులు సంపెత్తారు. అయినా మనం ఇయాల సెప్పకపోయినా ఆడు ఎప్పుడో అప్పుడు పోలీసులకు దొరికిపోతాడు. అప్పుడు వాడు సనిపోవడం ఖాయం. మనం గానీ సెప్పకపోతే మనల్ని పోలీసులు బతకనివ్వరు? ఆళ్ళు పెటే బాధలు మనం తట్టుకోలేం అన్నా" అన్నాడు సుబాహు.
ఆ తరువాత ఇద్దరూ మౌనం దాల్చేరు. ఏదైనా గణపతి ఆచూకీ ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదని శంకర్ నిర్ణయించుకున్నాడు.
అలా ఆలోచిస్తునే నిద్రలోకి జారుకున్నాడు. అలా ఎంత సేపు నిద్రపోయాడో తెలియదు కానీ తలుపు చప్పుడవడంతో ఒక్క సారిగా నిద్రలేచాడు శంకర్. ఎవరో తలుపులను గట్టిగా కొడుతునారు.
వెంటనే ఉలిక్కిపడి లేచి తలుపు తీసాడు. ఎదురుగా డీయస్పీ శ్రీనాథ్.
"ఏరా! రాత్రి నిద్రపోలేదా? ఇప్పుడు టైమెంతైందో తెలుసా? తొమ్మిది గంటలైంది. ఇంతకీ ఏం నిర్ణయించుకున్నావు? గణపతి ఆచూకీ చెబుతావా? లేక ఎన్‌కౌంటరై పోతావా?" అని అడిగాడు శ్రీనాథ్.
అప్పటికీ బయట ఎండ బాగా కాస్తోంది.
"నాకు తెలీదు సార్ ? అయినా వాడు చనిపోయాడు. ఇంకెక్కడుంటాడు చెప్పండి? నేనెంత చెబుతున్నా మీరు నమ్మటం లేదు" అన్నాడు శంకర్.
"శంకర్! నాకైతే నువ్వు నిజం చెప్పలేదు కానీ రాత్రి మీ సుబాహు గాడితో గణపతి గాడు కెంగువ తండాలో ఉన్నాడని చెప్పేవు. ఆ విషయం మీ గదిలో రహస్యంగా మేము పెట్టిన ఆ రహస్య కెమేరా, మైకు ల ద్వారా మాకు తెలిసిపోయింది" అంటూ బాత్‌రూమ్ తలుపు దగ్గర పెట్టిన ఒక చిన్న కెమేరా, మైకులను చూపిస్తూ అన్నాడు శ్రీనాథ్.
ఇంతలో అతని వాకీటాకీలో "సార్! ఎస్సై వర్మ స్పీకింగ్, కెంగువ ఆపరేషన్ సక్సెస్! ఓవర్" అన్న మాటలు వినిపించాయి.
"శంకర్! నువ్వు గణపతి చనిపోయాడని ఈ రోజు వరకూ అబద్ధం చెప్పేవు. కానీ ఇప్పుడది నిజం అయింది. ఇప్పుడే మా వాళ్ళు కెంగువ తండా కి వెళ్ళి వాణ్ణి ఎన్‌కౌంటర్ చేసేసారు. నా మాట విని నువ్వు వాడి గురించి చెబితే నీకు రివార్డ్ అయినా వచ్చేది. ఇంక నువ్వు కూడా ఎన్‌కౌంటర్‌కి రెడిగా ఉండు" అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీనాథ్.
అప్పటికే శంకర్ స్పృహ తప్పి కింద పడిపోయాడు.
(సమాప్తం )
గన్నవరపు నరసింహ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
గన్నవరపు నరసింహ మూర్తి గారు ఎం టెక్ చదివారు.ప్రస్తుతం విశాఖ పట్నంలో రైల్వే శాఖలో జాయింట్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నారు. వీరు ఇప్పటిదాకా 300 కథలు ,10 నవలలు రచించారు. ఏడు కథా సంపుటాలు ప్రచురించారు. స్వస్థలం విజయనగరం జిల్లా బొబ్బిలి దగ్గర ఒక గ్రామం.
Comments