'Whatsapp Valapu' - New Telugu Story Written By Ch. C. S. Sarma
'వాట్సప్ వలపు' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
యవ్వనదశలో... యువతీ యువకుల మధ్యన ఆకర్షణ సహజం... నేడు ఆ తత్వానికి వారు పెట్టుకొన్న ముద్దు పేరు ‘లవ్'...
ప్రేమ అనేది చాలా గొప్పపదం... యీ యావత్సృష్టికి మూలం... ఆ పేరును కేవలం పెదాలతో ఉచ్ఛరించి... దాహం తీర్చుకోవాలనుకోవటం... కసాయితనం అవుతుంది. అందులో చిక్కుకున్న యువతి... మోసపోయినది అవుతుంది... తస్మాత్ జాగ్రర్త.
పేరు బాబూరావు... వయస్సు ఇరవై నాలుగు....
తండ్రి రంగారావు... యాభై సంవత్సరాలు...
తల్లి మాళవిక... నలభై రెండు సంవత్సరాలు…
వుమ్మ కాపులా... వారికి ఒకే సంతతి. వారే బాబురావు... తండ్రి... ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్... తల్లి సెకండరీ స్కూలు టీచర్.
ఐదారుగురు ఆర్కిటెక్ట్ లతో... రంగారావుకు మంచి పరిచయం. వారు నిర్మించే గృహాలకు ఇతర భవనాలకు వారి మూలంగా రంగారావు ఎలక్ట్రిక్ వర్స్ చేస్తుంటాడు... బ్రతుకు తెరువు కోసం వుదయం ఎనిమిది గంటలకు ఇల్లు విడిచి బయలుదేరిన రంగారావు... రాత్రి తొమ్మిదిన్నర... పదికి ఇంటికి చేరేవాడు.
చదువు అబ్బని కారణం... మేనమామ మారుతీరావు షాపులో చేరి ఎలక్ట్రిక్ పనిని నేర్చుకొన్నాడు. ఎనిమిదేళ్ళ తర్వాత తన ఇరవై ఏడవ ఏట సొంతంగా ఎలక్ట్రికల్ కాంట్రాక్టు పనులను చేయడం ప్రారంభించాడు. వారి విగ్రహం కనులకు ఇంపైనది.
మాళవిక తల్లి దండ్రులదీ అదేవూరు... రంగారావు కుటుంబం కన్నా వారు పేదవారు. ప్లస్టు వరకూ చదివి... ప్రైవేటుగా బి.ఎ. పాసై... బి.ఇ.డీ ట్రయినింగ్ ముగించి... స్కూల్లో టీచరుగా చేరింది మాళవిక.
అప్పటికి రంగారావు తన కాళ్ళ మీద తాను నిలబడ కలిగాడు. అతనికి సాయంగా ఆరుగురు మొగ పిల్లలను పనిలోకి తీసికొని కాంట్రాక్టర్ అనే హోదాను సంపాదించాడు.
ఆ రెండు కుటుంబాల మధ్యన దూరుపు చుట్టరికం వుంది. ఆ కారణంగా మాళవిక తల్లిదండ్రులు రంగారావు తల్లిదండ్రులను సంప్రదించి అతని తల్లిదండ్రుల సమ్మతంతో మాళవిక రంగారావుల వివాహాన్ని జరిపించారు. వారి వివాహం జరిగిన మూడు సంవత్సరాలకు వంశోధారకుడుగా బాబూరావు జన్మించాడు.
సాధారణంగా కొందరు తల్లిదండ్రులు మొగ బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకొంటారు. ఇక ఒక్కడే అయితే... అతను ఆడింది ఆట పాడింటి పాటగా తల్లిదండ్రుల గారాబంతో ఆ బాలుడి జీవితం మూడు పువ్వులు... ఆరుకాయలనే సామెతలా... పైలా పచ్చీస్ గా సాగుతుంది. బాబురావు విషయంలో... అదే జరిగింది.
పాతిక సంవత్సరాల నాగరీకతకు... ఈ నాటి నవనాగరీకతకు ఎంతో తేడా!... శాటిలైట్స్ పుణ్యమా అని... పేజర్ సెల్ఫోన్, ఐఫోన్, ల్యాప్టాప్, వాట్సప్, ఫేస్బుక్... ఒకదాని తర్వాత ఒకటి జనం చుట్టూ చేరాయి.
వాటిని అవసరాలకు సద్వినియోగం... చేసుకొనే వారు ఏ కొందరో అయితే... వినోదాలకు, గిట్టని వారిని... వారికి తెలియకుండా ఆట పట్టించడం... మరీ భేధాభిప్రాయం పెరిగితే... సాటి వారిని అనేక రకాలుగా వేధించడం... కొందరి దినచర్య అయింది.
పై వాటి పైన వున్న ఆసక్తి... చదువు మీద చూపితే... భావి జీవితం బాగుంటుందనే భావన కొందరి మనస్సులకు దూరం అయిపోయింది.
ఇరవై నాలుగేళ్ళ బాబూరావు తల్లితండ్రులు చేసిన గారాబం ఫలితంగా ఆ కోవకు చెందిన యువకుడుగా తయారైనాడు. అతనికి ఆ వయస్సుకు తెలిసింది... ఎలాగైనా బ్రతకాలి... బ్రతకవచ్చు... దీనికి వ్యతిరేకమైన మార్గం మరొకటుందని అతనికి తోచదు.
'అలాకాదురా!...’ అని తల్లి ఎప్పుడైనా మంచి మాటలు చెప్పబోతే.... 'నీవు పాతకాలపు మనిషివి... నీకేం తెలీదు...' అని అసహ్యించుకొనేవాడు.
'మొక్కలో వంగనిది మానై వంగుతుందా!... నా పిచ్చిగాని!...' నిట్టూర్చి ప్రక్కకు తప్పుకొనేది మాళవిక... అప్పటికి బాబురావు... క్రమంగా సెకండరీ ఎడ్యుకేషన్లో ప్రతి తరగతి... రెండేసి సంవత్సరాలు చదివి... బి.ఎ. మూడవసారి వ్రాసేదానికి చదువును సాగిస్తున్నాడు.
అతనికి వున్న గొప్ప ఆశ... తాను సబ్ ఇన్స్పెక్టర్ కావాలని... ఆ ఆశ తీరాలంటే... తాను డిగ్రీ పాస్ కావాలి... అందుకే బి.ఏ మీదకు మూడవ దండయాత్రను చేసి విజయాన్ని సాధించాలని ప్రయత్నిస్తున్నాడు.
బాబూరావు ప్రాణ మిత్రుడు... అతనిలాగే అవే క్వాలిఫికేషన్స్ వున్నవాడు దూరపు బంధువు బుల్లబ్బాయ్... తల్లి బలవంతంపైన... ఆ ఇద్దరు మిత్రులు... కొంతవరకూ కష్టపడి చదివి బి.ఏ. పరీక్షలు వ్రాశారు.
* * *
పనీ పాట లేకుండా అడ్డదిడ్డాలుగా తిరుగుతున్న బాబూరావును తండ్రి రంగారావు... ఓ ఆర్కిటెక్ట్ను సంప్రదించి పోలీస్ ట్రైనింగ్ చేరేవరకు... ఆఫీస్లో వుంచుకొని ఏదో పనిని నేర్పండని కోరాడు. వారు అంగీకరించారు. బాబూరావు అయిష్టంగానే ఆ ఆఫీస్లో కాలు పెట్టాడు.
అక్కడ అకౌంటెంట్ సుమలత... ఛానునఛాయ ఇరవైఏళ్ళ ప్రాయం బి.కామ్ ముగించి... యం.కాం ప్రైవేటుగా చదువుతూ కుటుంబ పరిస్థితుల రీత్యా ఉద్యోగం చేస్తూ వుంది. ఆఫీస్ యజనూని 'భరత్' బాబూరావును సుమలతకు పరిచయం చేసి... అకౌంట్స్ జాజ్ను నేర్పండి అని చెప్పాడు.
సుమలతను చూచి... పరిచయం... అయిన కారణంగా... బాబూరావు ప్రవర్తనలో మార్పు. తొమ్మిది గంటలకు ఆఫీస్ ప్రారంభం అయితే బాబూరావు ఎనిమిదిన్నర కల్లా ఆఫీస్కు చేరేవాడు.
సుమలత... ఎనిమిదీ ముక్కాలుకు వస్తుంది. తొమ్మిది గంటలకు క్యాడ్ డిజైనర్స్... ఇంజనీర్లు ఎనిమిది మంది వస్తారు.
సుమలత రావడంతోటే గుడ్ మార్నింగ్ చెప్పి.... “మేడం!... యీ రోజు ఏం చేయాలి!... ” ఎంతో వినయంగా అడిగేవాడు బాబూరావు.
సుమలత అతను చేయవలసిన పనిని వివరించి... దానికి సంబంధించిన పేపర్లను అతనికి అందించేది. తన స్థానంలో కూర్చుని సుమలత చెప్పిన పనిని దీక్షగా జాగ్రత్తగా చేసేవాడు బాబూరావు.
బాబూరావులోని సిన్సియారిటీ సుమలతకు బాగా నచ్చింది. ఆ కారణంగా... అప్పుడప్పుడూ అతని ప్రక్కకు వెళ్ళి “ఏమైనా సందేహమా!...” అడిగేది.
ఆమెతో మాట్లాడాలనే తాపత్రయంతో వుండే బాబూరావు తనకు విషయం తెలిసినా తెలియనట్లు నటించి సుమలతను ఒకటికి రెండు మూడుసార్లు తనతో మాట్లాడేలా చేసేవాడు.
సమయం... సాయంత్రం ఏడుగంటలు. ఆఫీస్ వదిలి సుమలత వెళ్ళిపోయింది. నూరు అడుగుల దూరంలో బస్ స్టాప్... సుమలత ఉదయం రావడం... సాయంత్రం పోవడం బస్సులోనే... పది నిముషాల పని వుందని చెప్పిన బాబూరావు... ఆ పని ముగించి తన స్కూటర్పై ఇంటికి బయలుదేరాడు.
సన్నగా తూర ప్రారంభమై కొద్ది సెకండ్లలో జోరు వర్షంగా మారిపోయింది.
బాబూరావు బస్టాప్లో నిలబడి వున్న సుమలతను చూచాడు. వాన కారణంగా స్కూటర్ను ఆపి... తనూ బసల్టర్లో ప్రవేశించాడు. సుమలతను చూచి నవ్వాడు.
ఆమె కూడా చిరునవ్వుతో బదులు పలికింది.
“వాన వేగం జాస్తి అవుతూ వుంది మేడమ్!...”
ఆకాశం వైపు చూచి సుమలత... "అవునండీ!...”
బస్సు వచ్చింది... కానీ అది స్టాప్లో ఆగకుండా సర్మని నేరుగా వెళ్ళిపోయింది.
"అయ్యో బస్ ఆగకుండా వెళ్ళిపోయింది... మరో అరగంట వరకూ బస్సు రాదు...” విచారంగా అంది సుమలత.
"మీ ఇల్లు ఎక్కడ?”
“హౌసింగ్ బోర్డు...”
“మా యిల్లూ ఆ ప్రాంతంలోనే... కొంచెం వర్షం తగ్గిందంటే నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. బస్సు రాదని బాధ పడకండి...” అనునయంగా చెప్పాడు బాబూరావు.
పావుగంట తర్వాత... వర్షం తగ్గింది... తూర పడుతూ వుంది.
"మేడం!... వాన తగ్గింది. బయలుదేరుదామా!...”
“నా కారణంగా మీకు శ్రమ!...” నసిగింది సుమలత.
“మేడం!...నాకేం శ్రమ లేదు. వర్షం పూర్తిగా ఆగేటట్లు లేదు. గంట ఏడు ముక్కాలు రండి. బయలుదేరుదాం!...” సుమలత పూర్తి చేయక ముందే తాను చెప్పదలచుకొన్నది... తను మనస్సున కోరుకొంటున్న విషయాన్ని చెప్పేశాడు బాబూరావు. తన స్కూటర్ను సమీపించి కర్చీఫ్ తో తుడిచి...
“రండి...” మరో మారు ఆహ్వానించాడు.
వాతావరణ దృష్ట్యా ఇంటికి చేరేదానికి వేరే మార్గం లేదనే నిర్ణయానికి వచ్చిన సుమలత కదిలి... అతని స్కూటర్ను సమీపించింది.
బాబూరావు స్కూటర్ను స్టార్ట్ చేశాడు. సుమలత వెనక కూర్చుంది. స్కూటర్ను కదిలించాడు బాబూరావు.
వాన... స్థాయి పెరిగింది. ఇరువురూ తడిసిపోయారు.
“ఆపమంటారా!...” అడిగాడు బాబూరావు.
“తడిసిపోయాం. వాన ఆగేటట్టుగా లేదు. జాగ్రర్తగా పోనీయ్యండి” అంది సుమలత.
వానకు తోడు గాలి కూడా అధికమయింది. క్రింద పడిపోతాననే భయంతో సుమలత... తన చేతులను వంగి బాబూరావు నడుముకు చుట్టేసింది.
వాన వలన... తన మనోవాంఛ నెరవేరినందుకు బాబూరావు సంబరపడిపోయాడు.
చలికి వణుకుతూ... వానకు తడుస్తూ సములత బాధపడింది..
ఇరవై నిముషాల తర్వాత బాబూరావు కాలనీని సమీపించాడు. ఎటు వెళ్ళాలనే విషయాన్ని సుమలతను అడిగి తెలుసుకొని... స్కూటర్ను వారి ఇంటి ముందు ఆపాడు.
వణుకుతూ సుమలత స్కూటర్ను దిగి... "థ్యాంక్యూ!...” చెప్పి లోనికి పరుగెత్తింది.
'ఈ రోజు వాన, గాలి నా పక్షం...' నవ్వుకొంటూ బాబూరావు తన ఇంటి వైపుకు బయలుదేరాడు.
ఆ రాత్రంతా కుంభవర్షం. ఉదయం ఆరుగంటలకు వర్షం, గాలి ఆగిపోయాయి. బాబూరావు త్వరగా రడీ అయ్యి సుమలత ఇంటికి ఎనిమిది గంటలకే వచ్చేశాడు.
వాకిట్లో కూర్చొని వున్న సుమలత తండ్రి రామారావు రిటైర్డ్... స్కూలు టీచర్... బాబూరావును చూచాడు.
"బాబూ! రాత్రి మా అమ్మాయిని ఇంటికి చేర్చింది మీరే కదూ!... కిటికీలో నుంచి చూశాను..” అన్నాడు.
“అవును సార్!... బస్సు మిస్ అయింది మేడంగారికి మా యిల్లు ఇక్కడికి దగ్గిరే. బస్సు వచ్చేదాకా ఆగివెళతానన్నారు మేడం... వాతావరణం సరిగాలేనందున... వారిని ఒప్పించి తీసుకొని వచ్చి దింపాను సార్!...” ఎంతో వినయంగా చెప్పాడు బాబూరావు.
"రా బాబూ! కూర్చో. వుదయాన్నే వచ్చావు ఏమిటి విషయం?...”
“రాత్రి మేడం వర్షంలో తడిసిపోయారు కదండీ... ఎలా వున్నారో ఆఫీస్కు వస్తారో రారో కనుక్కోవాలని వచ్చాను. సార్!... నేను మేడం అసిస్టెంట్ను. నా పేరు బాబూరావు” చిరునవ్వుతో చెప్పాడు.
"అమ్మాయి రడీ అవుతుంది బాబు!...”
“నేను వచ్చానని వారికి చెబుతారా!...”
“ఆఁ...” లేచి, రామారావు ఇంట్లోకి వెళ్ళాడు.
సుమలతకు విషయాన్ని చెప్పాడు. ఆఫీస్కు తయారయిన సుమలత వాకిట్లోకి వచ్చింది.
“గుడ్ మార్నింగ్ మేడం!... ఎలా వుంది మీ ఆరోగ్యం!...” అడిగాడు బాబూరావు.
“నో ప్రాబ్లం... బాగుంది...”
“నేను ఆఫీసు బయలుదేరాను... మీరు...”
“వాకిటికి వచ్చాడు ఆ అబ్బాయి. నీవూ ఆఫీస్కు వెళ్ళాలిగా, అతనితో కలిసి వెళ్ళు. మంచి కుర్రాడిలా వున్నాడు...” నవ్వుతూ చెప్పాడు రామారావు.
“టు మినిట్స్...” చెప్పి లోనికి వెళ్లి... క్షణాల్లో హ్యాండ్బ్యాగ్తో తిరిగి వచ్చింది. రామారావు సుమలత ఆఫీసు బయలుదేరారు.
ఆ తర్వాత... సుమలత తన ఇంటికి దగ్గరగా వున్న బస్టాప్కు వచ్చేది. బాబూరావు అక్కడికి వచ్చి ఆమెను తన స్కూటర్ పై ఎక్కించుకొని ఆఫీస్కు వెళ్ళేవాడు.
ఆ రోజు... స్కూటర్ బస్ స్టాప్ ముందు ఆపి...
“రండి మేడం!...” నవ్వుతూ అన్నాడు బాబూరావు.
సుమలత స్కూటర్ ఎక్కింది. బాబూరావు ముందుకు నడుపుతున్నాడు.
“మేడం!...”
“రావుగారూ!...”
“ఏం మేడం!...”
“మీరు నన్ను సుమ అని పిలిస్తే బాగుంటుంది. బస్స్టాప్ బజార్లో ఆఫీసులో మేడం... మేడం... అని మీరు పిలుస్తుంటే నాకు నచ్చడం లేదు. నేను మీకంటే చిన్నదాన్ని...” అంది సుమలత.
“వయసులో చిన్నవారు కావచ్చు. పదవిలో నాకంటే గొప్పస్థానం మీది... మీకు నేను ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వడం నా ధర్మం...”
“మీరు చెప్పిన ధర్మ సూత్రం మంచిదే!... కానీ!.... ఆ సూత్రాన్ని ఇకపై నా మీద ప్రయోగించకండి. ‘సుమ’ అని పిలిస్తే సంతోషిస్తాను. అర్థం అయిందా!..."
“ఎంతో విపులంగా మీరు చెప్పారుగా!.... బాగా అర్థం అయింది...” నవ్వాడు బాబూరావు.
'ఒరేయ్!... బాబూ... చిలక నీ దారికి వచ్చిందిరా... సద్వినియోగం చేసుకో!...’ అనుకొన్నాడు.
"దేన్ని గురించో ఆలోచిస్తున్నట్లున్నారు!...” అడిగింది సుమలత.
“మిమ్మల్ని గురించే!...”
“నన్ను గురించా!...”
“అవును...”
"ఏమనుకొంటున్నారు?...”
"మీరు ఎంతో మంచివారని...”
“పొగడ్తలు నాకు గిట్టవు బాబూరావుగారూ!...”
“నేను చెప్పింది యదార్థం సుమా!...” మెల్లగా చెప్పాడు బాబూరావు.
క్షణం తర్వాత... “మరో మాట!...”
“చెప్పండి...”
“నన్ను మీరు బాబు అని పిలిస్తే ఆనందిస్తాను... ఇకపై రావు... గారు... వాటిని ఓమిట్ చేయగలరా!...”
“నా మాటను మీరు గౌరవించారు... నేనూ మీ మాటను ఆదరించాలిగా!...”
“చాలా సంతోషం సుమా!...”
స్కూటర్ గతుకులో పడింది... సుమ ఛాతీ బాబు వీపుకు గుద్దుకుంది.
ఇరువురి తనువులలో పులకింత.
“సారీ!... సుమా!... బండి పల్లంలో పడింది...”
“ముందు చూచి... జాగ్రర్తగా నడపండి బాబూ!...”
“అలాగే!...”
పది నిముషాలల్లో ఆఫీసు చేరారు... చిరునవ్వులతో లోన ప్రవేశించారు.
వారి ఆ పరిచయం... కలయికలు... కొద్దిరోజుల్లోనే వారిరువురిని ఎంతో సన్నిహితులను చేశాయి. కలసి హోటళ్ళకు... పార్కులకు సినిమాలకు వెళ్ళేవారు. రాత్రి సమయంలో సెల్ఫోన్లో ఛాటింగ్ చేసేవారు... దాని ఫలితం... స్నేహం... వయస్సు రీత్యా ప్రేమగా మారింది.
బాబూరావు రెండు మూడు పర్యాయాలు... సుమలతను ట్రాప్ చేయాలని ప్రయత్నించాడు. తెలివిగల సుమలత అవకాశాన్ని ఇవ్వలేదు...
“మనం పెండ్లి చేసుకొన్న తర్వాత... నా మీద నీకు సర్వహక్కులూ సిద్ధిస్తాయి. అంతవరకూ హద్దులు దాటే దానికి ప్రయత్నించి నాకు కోపాన్ని.... నీ మీద ద్వేషాన్ని తెప్పించకు. మీ అమ్మానాన్నలకు మన విషయం... నీ అభిప్రాయం చెప్పి వారిని ఒప్పించి నాకు చెప్పు... మా అమ్మ నాన్నలు మీ ఇంటికి వచ్చి మన వివాహ విషయాన్ని మీ వారితో మాట్లాడేలా నేను చేస్తాను” అనునయంగా చెప్పింది సుమలత. బాబూరావు నిస్పృహతో నిట్టూర్చాడు.
మూడవ దండయాత్రలో బాబూరావు... బి.ఏ పాసైనాడు. రంగారావుకు డి.ఐ.డి శాలివాహన నిర్మించుకొన్న భవంతి ఎలక్ట్రికల్ పని వచ్చింది. ప్రారంభించాడు.
ఆ రోజు ఆదివారం... భార్య భారతీ సమేతంగా శాలివాహన తన ఇంటిని చూచేదానికి వచ్చాడు. రంగారావు మనుషులు పని చేస్తున్నారు. యజమాని వస్తాడని విన్న రంగారావు వారికంటే ముందు వచ్చి... తన పనివారికి సలహాలు ఇస్తున్నాడు. శాలివాహన రాకను చూచి వారికి సవినయంగా నమస్కరించాడు.
పని ఎప్పటికి ముగుస్తుందనే విషయాన్ని కనుక్కొని శాలివాహన రంగారావు కుటుంబ వివరాలను అడిగాడు.
బి.ఏ పాసైన కొడుకున్నాడని అతనికి ఇన్స్పెక్టర్ కావాలనే ఆశ అని... మీరు సాయం చేయాలని... వినయంగా కోరాడు రంగారావు. తప్పకుండా సాయం చేస్తానని... నీ కొడుకును రేపు మా ఆఫీస్కు వచ్చి నన్ను కలవమని శాలివాహన చెప్పి వెళ్ళిపోయాడు.
తండ్రి మాట ప్రకారం బాబూరావు డి.ఐ.జి ఆఫీస్లో శాలివాహనగారిని కలిశాడు.
పర్సనాలిటీలో ఏ లోపమూ లేని బాబూరావు.. చలాకీగా అతను చెప్పిన జవాబులు శాలివాహనకు నచ్చాయి. అతని చేత పోలీస్ ట్రైనింగ్కు అప్లికేషన్ ఫిలప్ చేయించి తీసుకొన్నాడు.
“బాబూరావ్!... నీవు తప్పకుండా సెలక్ట్ అవుతావు. త్వరలో నీకు ఇంటిమేషన్ వస్తుంది. వెళ్ళిరా!...” భుజం తట్టి చెప్పాడు శాలివాహన.
బాబూరావు తన కోర్కె నెరవేరబోతున్నందుకు పరమానందంగా ఇంటికి బయలుదేరాడు.
* * *
ఎలాగైనా సరే... సుమలతను ముగ్గులోనికి దించాలనే నిర్ణయంతో వున్న బాబూరావు వాట్సప్ మూలంగా సుమలతకు తన మీద వల్లమాలిన ప్రేమ పెరిగేలా చాటింగ్ ప్రతిరాత్రి సాగించేవాడు.
అతని భావాన్ని అర్థం చేసుకొన్న సుమలత... “అంతా పెళ్ళి అయ్యాకనే...” అనే సమాధానంతో చాటింగ్ ముగించేది.
యదార్థంగా... బాబూరావు ఆమె పొందును కోరి కపట ప్రేమను ప్రదర్శిస్తూ వుంటే... దాన్ని అర్థం చేసుకోలేక...సుమలత అతన్ని అతిగా ప్రేమించింది.
నెల రోజుల తర్వాత... పోలీస్ ట్రైనింగ్ సెలక్షన్ లెటర్ బాబూరావుకు... చేరింది. చేస్తున్న ఉద్యోగాన్ని సుమలతకు చెప్పకుండా ఆఫీస్ యజమాని భరత్ను కలిసి... తాను పోలీస్ ట్రైనింగ్కు సెలక్టయ్యానని చెప్పి ఉద్యోగాన్ని మానేసి... పోలీస్ ట్రైనింగ్ చేరిపోయాడు.
ఆఫీస్ లోని మిగతావారు... బాబూరావు ఎవరికీ చెప్పకుండా ఉద్యోగాన్ని మానడం ఆశ్చర్యమయింది. కొంత కాలంగా సుమలత... బాబూరావుల స్నేహాన్ని... చనువును గమనించిన కొందరు...
“సుమలతా!... బాబురావు ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా!... నీతో చెప్పే వెళ్ళి వుంటాడులే... మాతో మాత్రం చెప్పలేదు...” హేళనగా అనేవారు.
యదార్థం ఏమిటో తెలియని సుమలత... వారి మాటలను వినడం తప్ప... తిరగి బదులు చెప్పలేకపోయింది. కారణం... తన మాట ప్రకారం... సుమలత నడుచుకోనందుకు... బాబూరావు ఆమెతో తాను పోలీస్ ట్రైనింగ్కు సెలెక్ట్ అయినానన్న విషయం చెప్పకపోవడమే!... అతను తనకు ఒక్కమాట కూడా చెప్పనందుకు సుమలత ఎంతగానో బాధపడింది... ఏడ్చింది...
నెల రోజుల తర్వాత... రాత్రి పదకొండున్నరకు బాబురావు సుమలతను పలకరించాడు. తాను ఐ.పి.యస్ ట్రైనింగ్లో వున్నట్లు చెప్పాడు. అది మొదలు ప్రతిరాత్రి ఎంతో ప్రేమను ఒలకబోస్తూ బాబూరావు సుమలతతో చాటింగ్ చేసేవాడు.
అతనిపై ప్రేమను పెంచుకొన్న సుమలత... ఒకటి రెండు రోజులు కాస్త బెట్టుగా నటించినా... తర్వాత రాత్రి ఎంత పొద్దు పోయిందనే విషయాన్ని మరచి వాట్సప్ వలపును బాబూరావుకు పంచేది. 'ఒక సందర్భంలో... ట్రైనింగ్ పూర్తి అయ్యి డ్యూటీలో జాయిన్ కాగానే... మా అమ్మా నాన్నలు... మీ అమ్మా నాన్నలు ఒప్పుకున్నా... కాదన్నా మనం పెండ్లి చేసుకొందాం సుమా!... డియ్యర్ ఐలవు...' అన్న బాబూరావు మెసేజ్ని సుమలత ఎంతగానో నమ్మింది. ఆ సుదినం కోసం ఎదురు చూస్తూ.. ప్రతి రాత్రి వాట్సప్ చాటింగ్ చేస్తూ వుండేది.
* * *
బాబూరావు ట్రైనింగ్ ముగిసింది. ఇన్స్పెక్టర్ పోస్టింగ్ వచ్చింది. బాబూ ఉద్యోగంలో చేరాడు.
రంగారావు బావమరది వీరయ్య కర్నూలు నుంచి బాబూరావుకు ఒక సంబంధాన్ని తెచ్చాడు.
“ఒకే పిల్ల... పాతిక ఎకరాల మాగాణి... తండ్రి నూనె వ్యాపారం. ఫ్యాక్టరీ వుంది... రెండు కార్లు... ఇంట్లో నలుగురు పనిమనుషులు అమ్మాయి అపరంజి బొమ్మ...” ఇంతకంటే మంచి సంబంధం నీవు తేగలవా.... బావా...” రంగారావును అడిగాడు వీరయ్య.
రంగారావు... మాళవికలు నోరు తెరిచారు ఆశ్చర్యంతో.
మామ... వీరయ్య మాటలను విన్న బాబూరావు... "మామా!... నిశ్చితార్థం జరిపించు... ముహూర్తాలు పెట్టించు... నేను పిల్లలను కూడా చూడాల్సిన అవసరం లేదు. అంతా నీ ఇష్టప్రకారమే జరిపించు...” ఆనందంగా అన్నాడు బాబూరావు.
అతని తల్లిదండ్రులూ వంత పాడారు.
సుమలత మెసేజ్ను చూచి డిలీట్ చేసేవాడు బాబూరావు... జవాబు రాని కారణంగా రెండు వారాల తర్వాత... నేరుగా బాబూరావును కలవడానికి వారి ఇంటికి వచ్చింది సుమలత. పెండ్లి అలంకరణలతో ఇల్లు దేదీప్యమానంగా వుండడాన్ని చూచి... వాకిట్లోనే ఆగిపోయింది.
ఇంట్లో నుంచి బయటికి వచ్చిన బాబూరావు వీధిగేటు ముందు నిలబడి వున్న సుమలతను చూచాడు. నవ్వుతూ దగ్గరికి వచ్చాడు.
"నీ అవసరాలకు నన్ను వాడుకొన్నావ్!... నా కోర్కెను తీర్చలేకపోయావ్... నీ సరదాకు నాతో 'వాట్సప్ వలపును ప్రదర్శించావ్. నన్ను పిచ్చోడనుకున్నావా!... పై సోమవారం నా పెళ్ళి... వచ్చి చూడు నా భార్యను!...” వికారంగా అహంకారంతో నవ్వాడు బాబూరావు.
మారు మాట్లాడలేక కన్నీటితో వెను తిరిగింది సుమలత.
* * *
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.
అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.
మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.
Comments