top of page
Writer's pictureSathyanarayana Murthy M R V

వైట్ అండ్ వైట్

విజయదశమి 2023 కథల పోటీలో విశిష్ఠ బహుమతి పొందిన కథ

'White And White' - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy

'వైట్ అండ్ వైట్' తెలుగు కథ

రచన: M R V సత్యనారాయణ మూర్తి

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

శివపురం లో ‘వైట్ అండ్ వైట్’ డ్రెస్ మెయిన్ టెన్ చేసేవారి గురించి ఎప్పుడూ జనార్ధన స్వామి గుడి ముందు ఉన్న అరుగుల మీద చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడూ ఒకే రకమైన బట్టలు వేసుకోవడ మంటే ఎవరికైనా మొహం మొత్తుతుంది. అప్పుడప్పుడు రంగు రంగుల బట్టలు, డిజైన్ బట్టలు, బొమ్మల చొక్కాలు వేసుకోవాలని మగవారి మనసు ఉబలాటపడుతుంది. కానీ ఎప్పుడూ ఖద్దరు బట్టలే కట్టిన దేశ భక్తులలా, కొంత మంది ఎప్పుడూ తెల్ల బట్టలే వేసుకుని శివపురం చరిత్రలో నిలిచపోయారు.


ముందుగా ఒక మాస్టారు గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మనకు చదువు చెప్పి మనల్ని పైకి తీసుకు వచ్చిన గురువుల్ని మరచి పోకూడదు కదా! పుసులూరి సూర్యనారాయణ మాస్టారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్. కన్యకాపరమేశ్వరి గుడి వీధిలో ఉండే ఆయన పొద్దున్నే లేచి సైకిల్ తుడుచుకోవడం కాలవ కెళ్ళి స్నానాలు చేసేవారికి, మంచి నీళ్ళు తెచ్చుకునే వారికి బాగా తెలుసు. సైకిల్ శుభ్రంగా తుడిచి, ఆ తర్వాత స్నానానికి వెళ్ళేవారు మాస్టారు. శివపురం శివారు జీలంచేరువు ఎలిమెంటరీ స్కూల్ కి ఇటీవలే హెడ్ మాస్టర్ గా వచ్చారు. అంత క్రితం మార్టేరు దగ్గర ఉన్న ఆలమూరు లో టీచర్ గా చేసారు.


జీలంచేరువు వెళ్ళాలంటే విజ్జేశ్వరం – నర్సాపురం కాలువ మీద కాటన్ డోరా గారి టైం లో కట్టిన ఇనుప వంతెన మీదనుంచి వెళ్ళాలి. రెండు కిలో మీటర్ల దూరం. రోడ్డు గతుకులు గతుకులుగా ఉంటుంది. వర్షా కాలం వచ్చిందంటే గోతులలో ఎర్ర కంకర నీళ్ళు నిలిచి ఉంటాయి. సైకిల్ మీద వెళ్ళే వారు జాగ్రత్తగానే వెళ్తారు. కానీ మోటార్ సైకిళ్ళ మీద వెళ్ళే కుర్రకారు మాత్రం స్పీడ్ గా వెళ్ళడం వలన గోతులలోని ఎర్ర నీళ్ళు రోడ్డు మీద వెళ్ళే వారి మీద చిందడం, వారు నానా తిట్లు తిట్టడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది.


పాపం సూర్యనారాయణ మాస్టారికి కూడా చాలా సార్లు ఈ అనుభవం ఎదురయ్యింది. తెల్లని బట్టలమీద బురద నీళ్ళు పడడం, స్కూల్ కి వెళ్ళాకా పైప్ దగ్గర బట్టలు శుభ్రం చేసుకోవడం ఆయనకీ అలవాటు అయిపొయింది. మాస్టారి స్కూల్ లో చదివే పిల్లలు ఎక్కువ మంది శ్రామిక జనం పిల్లలే. అందుకే మాస్టారు ఎప్పుడూ రెండు పెట్టెల బలపాలు, నాలుగు పలకలు తన డబ్బులతో కొని స్కూల్ లో ఉంచుతారు పిల్లల కోసం.


ఏ రోజూ స్కూల్ కి ఆలస్యంగా వెళ్లి ఎరగరు. సమయ పాలన కి ఆయన పెట్టింది పేరు. ఏభై మంది పిల్లలకి ఇద్దరు మాస్టార్లు. మాస్టారి అసిస్టెంట్ పేరు కృష్ణ. ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది. పిల్లలకి చదువు చెప్పడంలో ఇద్దరూ పోటీ పడేవారు. కృష్ణ మాత్రం వైట్ డ్రెస్ వేసుకునే వాడు కాదు. తనకి నచ్చిన డ్రెస్ వేసుకునేవాడు. సూర్యనారాయణ గారు కూడా డ్రెస్ విషయం లో ఏనాడూ కృష్ణ ని ఇబ్బంది పెట్టలేదు.


పిల్లలకు చదువు చెప్పడమే కాదు పాటలు, పద్యాలు కూడా నేర్పేవారు మాస్టారు. పది సంవత్సరాలు జీలంచేరువు స్కూల్ లో హెడ్ మాస్టర్ గా పనిచేసారు మాస్టారు. ఆ తర్వాత శివపురం సెట్టిబలిజ పేట ఎలిమెంటరీ స్కూల్ కి బదిలీ అయ్యారు. మాస్టారు బదిలీ అయి వెళ్ళేటప్పుడు పిల్లల తల్లితండ్రులు అందరూ జీలంచేరువు నుండి నడుచుకుంటూ వచ్చి మాస్టార్ని ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్ళారు. అంత అభిమానం వాళ్లకి మాస్టారు అంటే.


మాస్టారి మంచితనం, బోధన తెలుసుకున్న సెట్టిబలిజ పేట వాసులు కూడా సూర్యనారాయణ గారిని చాలా గౌరవంగా చూసేవారు. ఇక్కడ పిల్లల హాజరు శాతం బాగుంది. అన్ని సామాజిక వర్గాల పిల్లలు క్రమం తప్పకుండా బడికి వస్తారు. ఈ స్కూల్ లో అయిదు తరగతులకు ఐదుగురు మాస్టర్లు ఉన్నారు. పిల్లలు నూట యాభై మంది వరకూ ఉన్నారు. మాస్టారికి వస్తున్నఆదరణ చూసి బజారులోని ఎలిమెంటరీ స్కూల్ ప్రదానోపాద్యాయుడు సుందర రావు కి కడుపుమంట గా ఉండేది. స్కూల్ తనిఖీ అధికారులకు సూర్యనారాయణ గారి మీద లేని పోనీ చాడీలు చెప్పేవాడు.


ఒకసారి తనిఖీ అధికారి సెట్టిబలిజపేట స్కూల్ కి అకస్మాత్తుగా వచ్చారు. స్కూల్ రికార్డు చక్కగా ఉంది. పిల్లల హాజరు శాతం కరెక్ట్ గా ఉంది. అన్ని తరగతి పాఠ్యాంశాలు ఆరోజు వరకూ బోధింపబడి ఉన్నాయి. పిల్లలని ఏ ప్రశ్న వేసినా సరిఅయిన సమాధానం చెప్పారు. సూర్యనారాయణ మాస్టారిని మెచ్చుకున్నారు ఆయన. ‘చాలా చక్కని పాటశాల, బోధన బాగుంది, పిల్లలు సక్రమంగా స్కూల్ కి వస్తున్నారు. హెడ్ మాస్టర్ కి, ఇతర మాస్టర్లకు అభినందనలు’ అని రిపోర్ట్ రాసి వెళ్ళారు తనిఖీ అధికారి.


తర్వాత సుందర రావు ని కబురు చేసి ‘నువ్వు చాడీలు చెప్పడం మానెయ్, నీ స్కూల్ అభివృద్ధికి పాటుపడడం అలవాటు చేసుకో. ఊర్లో పెద్దాయన అండ ఉందని నీ డ్యూటీ నిర్లక్ష్యం చెయ్యకు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టాల్లో పడతావు జాగ్రత్త’ అని వార్నింగ్ ఇచ్చారు తనిఖీ అధికారి.


మారు మాటాడకుండా తలవంచుకుని వెళ్ళిపోయాడు సుందర రావు. సూర్యనారాయణ మాస్టారి దగ్గర చదువుకున్న వారు చాలా మంది వృద్ధి లోకి వచ్చారు.


మాస్టారి రిటైర్ మెంట్ రోజున, మండల అభివృద్ధి అధికారి, మండల విద్య అధికారి మరియు గ్రామ పెద్దలు చాలా మంది వచ్చారు. అందరూ ఆయన్ని అభినందించాకా, మండల విద్య శాఖాధికారి అడిగారు ‘మాస్టారూ, మీరు ఎప్పుడూ వైట్ డ్రెస్ ఎందుకు వేసుకుంటారు?’ అని.


“పెద్దలు మీకు తెలియనిది ఏముంది. తెలుపు ప్రశాంతతకు చిహ్నం. మనల్ని చూసేవారికి మన మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అది నిలబెట్టుకోవడం మన ధర్మం. మన బట్ట మీద ‘మరక’ పడకుండా మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో, మన నడవడిక మీద కూడా ఏ మచ్చ రాకుండా జాగ్రత్తగా ఉండాలి.


మనది పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి. అందరూ మనల్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. అందుకే మన వేషం, మన మాట, మన నడవడిక అన్నీ సక్రమంగా, ఆదర్శంగా ఉండాలి. నేను వీటిని నమ్ముకున్నాను. మీ అందరి అభిమానం పొందాను. నా జీవితానికి ఇది చాలు’ అన్నారు వినయంగా సూర్యనారాయణ మాస్టారు. అందరూ చప్పట్లతో ఆయన్ని అభినందించారు.


ప్రస్తుతం సూర్యనారాయణ మాస్టారి వయసు ఎనభై సంవత్సరాలు. రోజూ సాయంకాలం శివపురం కన్యకా పరమేస్వరి దేవాలయం కి వెళ్ళి స్వామి వారిని, అమ్మవారిని దర్శించుకుని దేవాలయం ఆవరణలో ఉన్న సిమెంట్ బెంచీ మీద కూర్చుంటారు వైట్ అండ్ వైట్ డ్రెస్ తో.


****


శివపురం లో పెద్ద డాక్టర్లు ఉన్నా ఆర్. ఎం. పి. లు చాలా మంది ఉన్నారు. సైకిల్ మీద తిరుగుతూ ప్రజలకు వైద్య సేవలు అందించడం లో ముందుంటారు. వారిలో ‘వైట్ అండ్ వైట్’ డ్రెస్ తో కనిపించే వ్యక్తి ముంగి నాగేశ్వర రావు. డాక్టర్ కలిదిండి సూర్యనారాయణ రాజు గారి ఎల్లాప్రగడ నర్సింగ్ హోం లో ఇరవై సంవత్సరాలు పనిచేసాకా ఆ అనుభవంతో బయటకు వచ్చి ఆర్. ఎం. పి. గా వైద్య సేవలు అందించడం ప్రారంభించారు నాగేశ్వర రావు.


మంచి నిండయిన విగ్రహం, తెల్లగా ఉండే ఆయన్ని చూస్తె అందరికీ మంచి అభిప్రాయం కలుగుతుంది. కంచి కామాక్షి గుడి వెనక పెద్ద పెంకుటింట్లో ఉంటారు ఆయన. పొద్దున్నే స్నానం చేసి ఒక గంట దైవారాదాన చేసి అప్పుడు వచ్చి పేషెంట్ లను చూస్తారు. పెద్ద వరండా. అందులో పేషెంట్లు కూర్చోడానికి ఆరు కుర్చీలు, రెండు పొడవాటి బల్లలు ఉంటాయి. తూర్పు దిక్కుగా ఒక కుర్చీ, టేబుల్ ఉంటాయి. దాని మీద స్టెతస్కోప్, బి. పి. చూసే మెషిన్, పేషెంట్ ల వివరాలు రాసుకునే ఒక డైరీ ఉంటాయి. పక్కనే ఉన్న మరో వరండాలో పెద్ద పొడవాటి బల్ల ఉంటుంది. టెస్ట్ చేయించుకునే వాళ్ళు, ఇంజక్షన్ చేయించుకునే వాళ్ళు అక్కడ ఉంటారు.


వేడి నీళ్ళలో శుభ్రం చేసిన సిరంజిలు, సూదులు ఒక గిన్నెలో ఉంటాయి. రోజూ కనీసం ఇరవై మంది వస్తారు ఆయన దగ్గర చూపించుకోవడానికి. వారిని చూసి, పది గంటలు దాటాకా సైకిల్ ఎక్కి వూళ్ళో పేషెంట్ లను చూడటానికి వెళ్తారు ఆయన. మధ్యలోనే ఆయన్ని ఆపి తమ ఇబ్బందులు చెప్పి మందులు రాయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎవర్నీ విసుక్కోకుండా వారికి కావాల్సిన మందులు రాసి ఇస్తారు నాగేశ్వర రావు.


వైట్ ఫాంట్, రెండు జేబులు ఉన్న వైట్ హాఫ్ హ్యాండ్ షర్టు, కాళ్ళకి ఎప్పుడూ బ్లాకు హాఫ్ బూటు వేసుకుంటారు ఆయన. ఎవరి ఇంటికైనా వెళ్లి ఇంజక్షన్ చేసారో, వెంటనే సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవడం ఆయన అలవాటు. అది ముందుగానే గ్రహించిన ఇంటి యజమాని, చెంబుతో నీళ్ళు, సబ్బు, టవల్ రెడీ చేసి ఉంచుతారు. ఒకోసారి ఏడు, ఎనిమిది సార్లు కూడా సబ్బుతో చేతులు రుద్దుకున్న సందర్భాలు ఉంటాయి. శుభ్రత విషయం లో ఆయన ఎప్పుడూ నిర్లక్ష్యం గా ఉండరు. మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా గ్రామ సంచారానికి వెళ్తారు.


ఒకోసారి అర్ధరాత్రి వచ్చి ఆయన్ని నిద్రలేపి ఇంటికి తీసుకువెళ్ళి వైద్యం చేయించుకున్నవారు చాలామంది ఉన్నారు. అవసరమైతే నర్సాపురం పెద్ద డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళి రోగికి వైద్యం చేయించి ఎందరినో ప్రాణాపాయం నుంచి రక్షించారు. అంత మంచి మనిషి నాగేశ్వర రావు. ఏరోజూ రోగిని డబ్బు కోసం ఇబ్బంది పెట్టేవారు కాదు.


సంవత్సరానికి ఒకసారి సత్యనారాయణ వ్రతం చేసుకునే వారు. అప్పుడు ఆయన దగ్గర వైద్యం చేయించుకున్నవారు వచ్చి, తమ శక్తి మేరకు డబ్బు ఇచ్చి వెళ్ళేవారు. డబ్బు ఎక్కువ ఇచ్చిన వారి పట్ల ఎంత గౌరవంగా ఉంటారో, డబ్బు తక్కువ ఇచ్చిన వారి పట్ల కూడా అంతే ఆదరంగా ఉండేవారు కానీ, వారిని చిన్న చూపు చూసే వారు కాదు. సంస్కారం ఉన్న మనిషి నాగేశ్వర రావు.

ఎం. ఎల్. ఏ. గారి ఇంటికి వెళ్లి ఎంత జాగ్రత్తగా వైద్యం చేస్తారో, పూరి పాకలో ఉండే గంగన్న ఇంటికి వెళ్లి అంత శ్రద్ధగా వైద్యం చేసే సహ్రుదయులు ఆయన. డబ్బుకు కాకుండా మనిషి ప్రాణానికి విలువ ఇచ్చే వ్యక్తి.


అందుకే ఆయన హైదరాదు లో కొడుకు దగ్గర ఉన్నా, శివపురం లోని ప్రజలు ఆయన్ని తలుచుకుంటూనే ఉంటారు.

****

ఇంక శివపురం లోని మూడో ‘వైట్ అండ్ వైట్’ వ్యక్తి ‘రాం పండు’ గారు ’. అసలు పేరు గ్రంధి వెంకట రామా రావు. మెయిన్ బజార్ లోని పెద్ద బట్టల కొట్టు రాం పండు గారిది. కంచి పట్టుల చీరలు. వెంకట గిరి, ధర్మవరం, మంగళగిరి కాటన్ చీరలు, క్రేపు, పాలిస్టర్ చీరలు మంచి నాణ్యత కలిగినవి ఆయన అమ్ముతారు.


మగవారికి కావాల్సిన పంచలు, పట్టు పంచలు, విమల్, గ్వాలియర్ వంటి ఖరీదైన ఫాంటులు, షర్టులు కూడా ఆయన దగ్గర దొరుకుతాయి.


బట్టలు బజారులో చాలా మంది అమ్ముతారు. కానీ కస్టమర్లను నవ్వుతూ పలకరించి, ఆదరంగా

మాట్లాడటం రాంపండు గారి సహజ లక్షణం. పైగా అరువు సౌకర్యం ఉంది. బట్టలు కొనేటప్పుడు ఎంతో కొంత ఇచ్చి, తర్వాత డబ్బులు ఇచ్చినా ఆయన ఏమీ అనరు. ముఖ్యంగా ‘పెళ్లి బట్టలు’ కొనే వారు రాం పండు గారి కొట్టునే ముందుగా ఎంపిక చేసుకుంటారు. ఆయన ‘హస్తి వాసి’ మంచిదని. శివపురం చుట్టుపక్కల గ్రామాలైన కొఠాలపర్రు, దేవ, కాకిలేరు, కంతేరు, అయితంపూడి, పేకేరు, ఏలేటిపాడు జనం రాం పండు గారి దగ్గరే బట్టలు కొంటారు. అందుకే అంటారు. డబ్బు చెయ్యలేని పని, మంచి మాటతో చెయ్యవచ్చని.


రాం పండు గారు బంగారు రంగులో ఉంటారు. తెల్లటి లూజు పైజమా, తెల్లటి ఫుల్ హ్యాండ్ షర్టు వేసుకుంటారు. ఎడమ చేతికి గోల్డ్ చైన్ వున్న వాచీ. ఆయన రూపానికి మరింత ఆకర్షణగా ఉంటుంది. వారి కొట్టులోకి అడుగు పెట్టగానే ఒక ప్రశాంత మైన వాతావరణం లోకి అడుగు పెట్టిన అనుభూతి కలుగుతుంది. దేవుడి పటాల దగ్గర వెలిగించిన మంచి గంధం అగర బత్తీల సువాసన కస్టమర్ లను బాగా ఆకట్టుకుంటుంది. పైగా ‘రండి అన్నయ్య గారూ, రండి వదిన గారూ అనో, రండి బావ గారూ, రండి అక్కయ్య గారూ అనో పలకరిస్తారు.


ఒక్క చీర కొనేవారు కూడా, ఆయన మొహమాటం వలన రెండు మూడు చీరలు కొనడం చాలా సార్లు జరుగుతుంది. మల్లెపూవుల్లాంటి తెల్లని ఆయన బట్టలు చూసి జమీన్డారు గారి హై స్కూల్ లో పనిచేసే తాతా రెడ్డి కూడా ‘మీ లాగా వైట్ డ్రెస్ మెయిన్ టైన్ చేయడం మాకు కుదరటం లేదండి. మధ్య మధ్యలో, రంగుల బట్టలు కడుతున్నాం. మరి మీకు ఎప్పుడూ వేరే రంగుల బట్టలు వేసుకోవాలని ఎప్పుడూ అనిపించిదా?’ అని అంటే, చిరునవ్వు నవ్వేవారు రామ్ పండు గారు. ‘మన మనసుని మనం కంట్రోల్ చేసుకుంటే ఏదైనా సాదించ వచ్చు. మీరు మాస్టర్లు. మీకు ఈ విషయం బాగా తెలుసు’ అని వినయంగా చెప్పేవారు.


ప్రతీ బుధవారం శివపురం లో సంత జరుగుతుంది. చుట్టుపక్కల పది గ్రామాలకు శివపురం సెంటర్ కావడం వలన ఆ రోజు బజార్కి చాలా మంది వస్తారు. కాయ గూరలు, పప్పు దినుసులు తో పాటు వారికి కావాల్సిన బట్టలు కూడా ఆ రోజే కొనుక్కుంటారు చుట్టుపక్కల నుండి వచ్చిన జనం. తన కంటే వయసులో పెద్ద వారు కొట్టులోకి వస్తే రెండుచేతులూ జోడించి నమస్కరించి ‘రండి.. లోపలకు దయచేయండి’ అని ఎంతో వినయంగా అంటారు రాం పండు గారు.

రోజూ ఉదయం కన్యకా పరమేశ్వరి గుడికి సైకిల్ మీద వెళ్లి దణ్ణం పెట్టుకుని వస్తారు ఆయన. అప్పుడు కూడా తన తెల్ల బట్టలు నలగ కుండా, ఏ విధమైన మరకలు పడకుండా జాగ్రత్తగా సైకిల్ తోక్కుకుని వెళ్తారు.


గుడిలోని అమ్మవారికి నమస్కరించి, ఆ తర్వాత గురు భాస్కరాచార్యులు అయిన కృష్ణ మూర్తి గారికి కూడా నమస్కరించి వస్తారు ఆయన. చాలా భక్తి పరులు. రాం పండు గారి ఇంటి ముందు చాలా పెద్ద నుయ్యి ఉంది. ఒకేసారి పది మంది చుట్టూ చేరి అందులోంచి నీళ్ళు తోడుకోవచ్చు.

ధనుర్మాసం లో కన్యకా పరమేశ్వరి గుడి పూజారులు, జనార్ధన స్వామి గుడి పూజారులు ఆ నూతి నుండే నీళ్ళు తీసుకుని వెళ్లి దేవుళ్ళకు పూజలకు వాడతారు. ఆ సమయంలో రాం పండు గారు స్నానాదికాలు పూర్తీ చేసుకుని పూజారులకు స్వాగతం పలికి నుయ్యి చుట్టూ ఎవరూ లేకుండా జాగ్రత్తగా చూస్తారు. జీవితాంతం అమ్మవారినే నమ్ముకున్న మంచి మనిషి. తనకున్న దాంట్లో నలుగురికీ దాన ధర్మాలు చేసినా, ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదు ఆయన.


వృద్ధాప్యం వచ్చాక కొడుకులకు వ్యాపారం అప్ప చెప్పి దైవ నామ స్మరణ తోనే గడిపిన ధన్య జీవి రాం పండు గారు.


*******

M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.




132 views1 comment

1 Comment


@manjulathag4298 • 2 hours ago

గ్రంథి రాం పండు గారి గుఱించి వివరించి నందుకు ధన్యవాదాలు

Like
bottom of page