'Yamabala - Part 2/4' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao
Published In manatelugukathalu.com On 12/06/2024
'యమబాల పార్ట్ 2/4' పెద్ద కథ
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
జరిగిన కథ:
విరాట్ శక్తి సామర్థ్యాలను తన స్వార్థానికి వాడుకుంటాడు నయాజిత్.
అతను తనను వంచించిన విషయం గ్రహిస్తాడు విరాట్.
నయాజిత్ ను, ఆటవికులు వేషాల్లో వచ్చిన అతని అనుచరులను సంహరిస్తాడు.
విరాట్ ని తప్పించుకునే ప్రయత్నంలో చురకేర్ చనిపోతాడు.
నయాజిత్ ప్రజలనుంచి దోచుకున్న ధనాన్ని తిరిగి వారికే ఇవ్వాలనుకుంటాడు విరాట్.
ఇక యమబాల పెద్దకథ రెండవ భాగం చదవండి..
అది పౌర్ణమి రోజు అవ్వడంతో పండు వెన్నెలలో ప్రపంచం కళకళలాడుతుంది. ఆకుపచ్చని మహారణ్యం నడుమ ఆకాశాన్ని తాకుందా అన్నట్లు ఉన్న ఎత్తయిన కొండ చివర చెట్టుకున్న ఉయ్యాలలో యమబాల ఉయ్యాలలూగుతుంది. ఆ ఉయ్యాల ప్రక్కనే యమ బాల ప్రాణ స్నేహితురాలు చిత్రబాల ఉంది.
యమబాల ఉయ్యాలలో ఉండి మహదానందంతో ప్రపంచం మొత్తాన్ని చూస్తుంది. యమబాల ఉయ్యాల ఊగుతూ కాళ్ళను బాగా ముందుకు చాపింది. ఆమె ఉయ్యాల ఊగేటప్పుడు ఆమె పాదాలు ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లు ఉంది.
చంద్రుడు, యమధర్మరాజు తనయ యమబాల ఆనందం చూసి చిన్నగా నవ్వుకున్నాడు. చంద్రునిలో ఉన్న కుందేలు పిల్ల యమబాల పాదాలకున్న పట్టీలను చూసింది. ఆకుపచ్చని వజ్రాలతో పొదగబడిన పసిడి పట్టీలు కుందేలు పిల్లకు అదేదో పచ్చికలా కనపడింది. ఆ పచ్చికను మేయడానకన్నట్లు కుందేలు పిల్ల చెంగు చెంగున ముందుకు దూకింది. అది చూసిన చంద్రుడు కుందేలు పిల్లను పట్టుకోవడానికి దాని వెనుకన పడ్డాడు. అది చంద్రునికి అందలేదు. అంత చంద్రునికి యమబాల మీద కించిత్ కోపం వచ్చింది. కొంచెం కళ్ళు పెద్దవి చేసి యమబాల వైపు చూసాడు.
:::::::::::::::::::::: ::::::::::::: :::::::::::::::::::
మూడు గడ్డి వాముల నడుమ మంచం మీద కూర్చున్న చిన్న గుండమ్మ మనీ లెక్క పెట్టి వ్యవసాయ కూలీలందరికి ఇచ్చింది. ఆపై వ్యవసాయ కూలీలందరికి పనులు పురమాయించింది. పండిన పంటగురించి వారితో మాట్లాడింది. పంటలు విషయంలో ముందు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి మాట్లాడింది. వ్యవసాయ కూలీల ఆర్థిక స్థితిగతుల గురించి తెలుసుకుంది.
వారందరిని తన బంగ్లాకు వెళ్ళి బువ్వలు తిని పనిలోకి వెళ్ళండి అని చెప్పింది.
పని మనుషులందరూ అలాగేనని గుండమ్మ బంగ్లా కి వచ్చారు. అక్కడ పెద్ద గుండమ్మ అందరికి వేడి వేడి ఉదయాన్నం వడ్డించింది. ముఖ్యంగా అన్నంలోకి ఆవకాయ పచ్చడిని, నెయ్యిని, గడ్డ పెరుగును తదితర కూరలను వడ్డించింది.. అందరూ కడుపు నిండా తినాలని వ్యవసాయ కూలీలను, తదితర పనిమనుషులను హెచ్చరించింది..
పని మనుషులు, " మీ మేనల్లుడు విరాట్ పట్టణం నుండి ఎప్పుడు వస్తున్నాడమ్మా? "అని పెద్ద గుండ మ్మ ను అడిగారు.
తన పుట్టిన రోజుకు వస్తున్నాడని పెద్ద గుండమ్మ పని మనుషులకు చెప్పి, " ఆ రోజు మీ యింట్లో వారందరికి ఇక్కడే భోజనాలు. గుర్తుంచుకోండి” అని చెప్పింది.
అందరూ అలాగేనమ్మ అన్నారు.. పనుల్లోకి వెళ్ళారు. అంకిత భావంతో పొలం పనులు చేస్తున్న వ్యవసాయ కూలీలను పొలం గట్టు మీదన ఉండి చూసిన చిన్న గుండమ్మ ఆనంద వదనంతో సంతృప్తి గా నిట్టూర్పు విడిచింది.
దక్షిణ దిక్కు చివర మూడు కన్నులు విశాలంగా మెరుస్తున్నాయి. ఆ మెరుపుల్లో కాంతిని చూడటం మా నవ నేత్రాలకు సాధ్యమయ్యే విధంగా లేదు. అవి తమ నేత్రాలు. ఆ మూడు కన్నుల కింద నాలుగు చేతులు ఉన్నాయి. అందులో ఒక చేతిలో కాలదండం, రెండవ చేతిలో యమపాశం ఉంది.. మిగతా రెండు అభయ హస్తాలు పవిత్రంగా ఉన్నాయి. ఆ హస్తాల నుండి యమబాల, చిత్రబాలలు ఉద్భవించారు.
యమబాల, చిత్రబాల ధర్మపురి లోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పక్కనే ఉన్న యమ ధర్మరాజు ఆలం దగ్గరకు వచ్చారు.. అక్కడ కొందరు గండ దీపంలో నూనె పోసి యమధర్మరాజును పూజి స్తున్నారు.
"చెలీ శ్యామల దుహిత.. మనంకూడా గండ దీపంలో నూనె పోద్దామా?" అని చిత్రబాల యమబాలను అడిగింది.
"పోద్దాం.. పోద్దాం. మా జనకుడు ప్రతి యమ ద్వితీయ రోజున మా మేనత్త యమునాదేవి ఇంటికి భోజనానికి వెళ్ళివస్తారు. ఆ రోజు భగినీహస్త భోజనం చేసినవారికి నరకబాధలు ఉండవు. అంతేకాదు అలా భగినీహస్త భోజనం చేసి, యమధర్మరాజు పూజలు చేసిన వారికి, వారి సంతానానికి అకాల మృత్యువు సంభవించదు. " అని చిత్రబాలతో అంది యమబాల.
" నువ్వెప్పుడన్నా నీ మేనత్త యమునాదేవి యింటికి వెళ్ళావా?" యమబాలను అడిగింది చిత్రబాల.
"ఎందుకు వెళ్ళలేదు? చాలాసార్లు వెళ్ళాను. వెళ్ళిపప్పుడల్లా ‘గలగలల కళకళల జలమాత మాకు మేనత్త’ అత్తను ఆటపట్టిస్తాను " చిత్రబాలతో అంది యమబాల.
ఆ సాయంత్రం పెద్ద గుండమ్మ, చిన్న గుండమ్మ శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం కు వెళ్ళారు. విరాట్ పేర అర్చన చేయమన్నారు. అక్కడ వారికి యమబాల, చిత్రబాలలు కనపడ్డారు.
పెద్ద గుండమ్మ, చిన్న గుండమ్మ కు యమబాల తలపై కిరీటాన్ని, భుజం పై గదను ధరించి సూర్య లోకం నుండి భూలోకానికి మేఘాల మెట్లపై దిగివస్తున్న దేవ కాంతలా కనపడింది. యమబాల వారి ఆంతర్యాన్ని గ్రహించింది.
అంత " అమ్మలారా ! నా పేరు యమబాల. ఈమె నా స్నేహితురాలు చిత్రబాల. పల్లెటూరి అందా లను, పల్లెటూరి స్థితిగతులను, పల్లెటూరిలో మీ లాంటి అమ్మల ఆదరాభిమానాల మీద పరిశోధన చేయడానికి ఈ ఊరు వచ్చాము.
సురకళలు ఉన్నవారికి నేను దేవకాంతలా కనపడతానని నన్ను చూచిన కొందరు నాతో అంటారు. ఆ విషయం అలా ఉంచితే ఈ ఊర్లో మాకెవరూ తెలి యదు. మీరే మాకు సహాయపడాలి. " అని ఇద్దరు గుండమ్మలతో అంది.
"ఓ.. దానిదేముందమ్మా.. ఈరోజు నుండి మీరు మా బంగ్లాలోనే ఉండవచ్చు. " అంది పెద్ధ గుండమ్మ.
"రేపు మా మేనల్లుడు విరాట్ పుట్టిన రోజు కూడ. మీరు ఈ రోజే మా బంగ్లాలో దిగిపోండి. " అంది చిన్న గుండమ్మ
చిన్న గుండమ్మ నోట విరాట్ పుట్టిన రోజు అనే మాట వినపడగానే యమబాల ఆకాశం వైపుకు చూ సింది. అక్కడ హంసవాహనం పై యమభటులు విరాట్ ను తీసుకువెళ్ళే దృశ్యం ఆమెకు కనపడింది.
"కాల మహిమ ఎలా ఉంటే అలా జరుగుతుంది. కాలం చెప్పిన రీతిన మన ధర్మం మనం నిర్వహించుదాం. " అని యమబాల అనుకుంది.
విరాట్ కారు వాయువుతో పోటీ పడుతుంది.
కారులో విరాట్ పక్కనే ఉన్న వికట "గాలితో పోటీ పడకురా నాయన. నా ప్రాణాలు పైకి పోయేటట్లు ఉన్నాయి. నువ్వేది చేసినా పెద్ద ఎండ్వంచర్ గానే ఉంటుంది. నీలో ఉన్న దైవాంశ నిన్ను కాపాడుతుంటే, నాలో ఉన్న మానవాంశ నన్ను భయపెడుతుంది. అది సరే, అంత ధనం నీ దగ్గరకు ప్లాన్ ప్రకారం చేర్చే బాధ్యత నాకు అప్పగించావు. నా మీద నీకంత నమ్మకం ఏమిటిరా ?" విరాట్ ను అడిగాడు వికట.
"నువ్వు వేరు నేను వేరు కాదు కాబట్టి. నువ్వు నా ప్రాణ స్నేహితుడువి అనే మాట పక్కన పెడితే నువ్వు ఏం చెయ్యాలన్నా నా సజెషన్నే తీసుకుంటావు. నా సజెషన్ నీకు నచ్చుతుంది.
ఒకవేళ నీ పుర్రె లో దుర్బుద్ధి పుట్టి ఆ ధనాన్నంతా నువ్వపహరించినా, అదేం చేసుకోవాలో తెలియక మంచి సజెషన్ కోసం చివరకు నువ్వు నా దగ్గరకే వస్తావు. అందుకే నిన్ను నమ్మాను. " వికటతో అన్నాడు విరాట్.
"అదీ నిజమే.. అవును. అయినా ఎవరైన అంత ధనం ఏం చేసుకుంటారు రా.. ? ఆ నయాజిత్, అనుచరులందరినీ మోసం చేస్తూ చురకేర్ దగ్గర కొంత ధనాన్ని, కొన్ని గుట్టులను దాచిపెట్టాడు. తన దగ్గర కొంత ధనం దాచుకున్నాడు.. చివరికి ఇద్దరూ నీ చేతిలో చచ్చారు.
తింటానికి, ఉంటానికి మన శరీరానికి తగ్గట్లు ఆరోగ్యకర రీతుల్లో ఎంజాయ్ చేయడాని కావల్సినంత ధనం కావాలి. కాదనను. పోనీ మరో నాలుగు తరాలకు సరి పడా సంపాదించవచ్చు. దానిని తప్పు పట్టవలసిన అవసరం లేదు. మరీ ఇంతా! ఎంతంటే రమారమి వంద గ్రామాలవారు నాలుగు తరాల పాటు కూర్చుని తింటే సరిపడినంత. " అన్నాడు వికట.
"అది అంతకంటే ఎక్కువే ఉంది" అన్నాడు విరాట్.
" నువ్వేదైనా సూపర్ గా ఆలోచిస్తావురా బాబు. నీ చిన్న తనంలోనే అనాథాశ్రమానికి వచ్చి, ఈ అనాథను చేరదీసావు. నీతో సమానంగా ఎదగమన్నావు. మనిషి నైతే ఎదిగాను కానీ నా బుద్ది మాత్రం... నీ బుద్దిలో ఒక శాతం కూడ ఉండదు.
అందుకే కొందరు నన్ను చూసి, ‘నీకు వయసైతే వచ్చింది కానీ వయసుకు తగినంతగ... నీ బాడీలో ఏదీ ఎదగలేదు’ అంటారు. వారే నిన్ను చూసి, వీడికి అన్నీ ఎక్కువే. వయసు మాత్రం తక్కువ అని అంటారు. " చిరునవ్వుతో అన్నాడు వికట.
విరాట్, వికట ఇంటికి వచ్చారు. పెద్ద గుండ మ్మ చిన్న గుండమ్మ విరాట్ కు వికటకు దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు. విరాట్ వికట యమబాల, చిత్రబాల లను చూసారు. చిన్న గుండమ్మ యమబాల, చిత్రబాల గురించి విరాట్, వికటలకు చెప్పింది.
యమబాలను విరాట్ చూసాడు. "ఆమె శ్యామల వర్ణాన సంచరిస్తూ కిరీటమును, గదను ధరించి సింహాసనం ఎక్కుతున్న దేవకాంతలా కనపడింది. యమ బాల విరాట్ ముఖకవళికలను గమనించింది.
"మీ ముఖకవళికలను చూస్తుంటే, మీరు నన్ను దేవకాంతలా ఊహించుకుంటున్నారనిపిస్తుంది. ప్రస్తు తానికి నేనూ మానవకాంతనే.. ముందు ముందు నా గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది. " అని యమ బాల విరాట్ తో అంది.
బంగ్లా లోని పని వారందరూ విరాట్ పుట్టిన రోజు ఏర్పాట్లను సరదా సరదాగ వేగంగా చేయసాగారు. వారి పనుల్లో వారు ఉండే విరాట్ ను పలకరించసాగారు. విరాట్ అందరిని మర్యాద పూర్వకంగా పలకరించాడు.
పనివారి నడుమ విరాట్ పుట్టిన రోజు వేడు కలు అంగరంగ వైభవంగా జరిగాయి. అందరూ భోజ నాలు చేసారు. విరాట్ అందరికీ కొత్త వస్త్రాలను బహుక రించాడు. అనంతరం పనిమనుషులందరికీ ప్రత్యేక కాలనీ కట్టించడానికి నాటి నుండే పనులు ప్రారంభిస్తు న్నట్లు పనివారికి చెప్పాడు. అలాగే బడి గుడి వైద్యశాల కూడా కట్టిస్తున్నట్లు అందరికి చెప్పాడు. అందరూ మహదానంద పడ్డారు. కడుపునిండా పిండివంటలు తినసాగారు.
చిన్న గుండమ్మ విరాట్ ను గది లోకి పిలిచి" శక్తికి మించిన దానాలు మంచిదికాదు. అతి సర్వత్ర వర్జయేత్ అని అన్నారు". అని అంది.
మేనత్త చిన్న గుండమ్మ మాటలను విన్న విరాట్ "ఇదంతా మన పెద్దలు మనకిచ్చిన ఆస్తితో చెయ్యడం లేదు. అవసరం వచ్చినప్పుడు మాత్రం మన పెద్దల ఆస్తిని కొంత ఉపయోగిస్తాను.. భగవంతుడు నాకు ప్రసాదించిన సంపాదనతోనే ఇదంతా చేస్తున్నాను" అన్నాడు.
" అలాగ. సరే కానివ్వు. నీకేదన్నా సహాయం కావాలంటే నన్ను అడుగు. " అని మేనల్లుడు విరాట్ తో అంది చిన్న గుండమ్మ.
పెద్ద గుండమ్మ, పాకశాల పదనిస, సరిగమలతో కలిసి విరాట్ కు రకరకాల కూరలు తయారు చేసి, వాటి తో భోజనం పెట్టింది. వికట లొట్టలేసుకుంటూ అన్ని రకాల వంటకాల రుచి చూసాడు. యమబాల, చిత్ర బాల ఆ వంటకాల రుచిచూసి, ఏ లోకంలోనూ ఇంత రుచికరమైన వంటలు ఉండవు అనుకున్నారు.
మరుసటి రోజు పనిమనుషులకు కట్టించ వలసిన ఇళ్ళ కు సంబంధించిన స్థలాలను విరాట్, వికట పరిశీలించ సాగారు. ఇంజనీర్ విశ్వనాథ్ ఆప్రదేశాల గురించి విరాట్ కు చెప్పసాగాడు. చిన్న గుండమ్మ కూడా అక్కడే ఉంది. ఆ స్థలాల యజమానులగురించి చిన్న గుండ మ్మ విరాట్ కు చెప్పింది.. అప్పుడే అక్కడ కు యమబాల చిత్రబాలలు వచ్చారు. యమబాల స్వర్గం మెట్లు దిగి వస్తున్నట్లు, మహిషం మీద వస్తున్నట్లు రకరకాలుగా విరాట్ కు కనపడింది.
"ప్రజల కోసమే బతుకుతున్నవానికి పరలోక ప్రాప్తి అతి త్వరలో ప్రాప్తించబోతుంది. " అని విరాట్ ను చూసి యమబాల కొంచెం బాధ పడింది.
" వికట, మనీ కొంత తీసుకురా.. ఎంత తీసుకురావాలో, ఎలా తీసుకురావాలో చెప్పాను. గుర్తుంది కదా?" విరాట్ వికట తో నెమ్మదిగా అన్నాడు.
" గుర్తుంది " అని వికట అన్నాడు.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
Comments