top of page

యమనారద మొబైల్ కోర్ట్ పార్ట్ – 1

#యమనారదమొబైల్కోర్ట్, #YamaNaradaMobileCourt, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguStory, #తెలుగుకథ


'Yama Narada Mobile Court' - New Telugu Story Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 23/10/2024

'యమనారద మొబైల్ కోర్ట్' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


"నారదా!.... బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల వర్తమానమిది. తిలకింపుము"

యమధర్మరాజు నారదుల వారి చేతికి ఒక వర్తమాన లేఖను అందించాడు.

నారదుల వారు దాన్ని పూర్తిగా చదివారు.


అందులో వ్రాసియున్నది ఏమనగా!....

’యమధర్మరాజా!... భూలోకమునందు కలి ప్రభావము వలన అన్యాయాలు, అక్రమాలు పలు జరుగుచున్నవి. అమాయక ప్రజానీకం అనేక కష్టాల పాలు అగుచున్నారు. చాలామంది నాస్థికులుగా మారి ఆస్థికులను హింసిస్తున్నారు. కనుక నీవు నారదముని కలిసి భూలోకమునకు వెళ్ళి, నాస్తికుల నుండి అస్థికులకు రక్షణగా అన్ని ప్రాంతములను వీక్షించి, సత్యం ధర్మం న్యాయం, నీతి, నిజాయితీలను నాస్థికులకు తెలియునట్లు నేరస్థులను శిక్షించి న్యాయాన్ని, ధర్మాన్ని అందరికీ తెలియునట్లు, మనుష రూపమున, మానవ సమాజంలో సంస్కరణలను స్థాపించి, ఆస్థికతను పెంచి, నాస్థికతను నిర్మూలించి తిరిగి రావలయును. ఆ కార్యక్రమాన్ని నీవు, నారదుడు వెంటనే ప్రారంభించవలయును. ఇది మీకు మా ఆదేశము.’


"పెద్దల ఆజ్ఞ అర్థమైనది యమధర్మరాజా!... ఈ నాటక ప్రదర్శనకు మనము, యమ, నారద పేర్లలో భూలోకమునకు ఎప్పుడు బయలుదేరవలయును?" అడిగాడు నారదముని. 


"వారు ’వెంటనే అన్నారు కదా!"


"అవును..."


"కనుక మనము సత్వరము బయలుదేరవలయును కదా నారదా!..."


"ఆఁ... అవునవును..."


వారిరువురూ భూలోకానికి బయలుదేరారు, చేరారు.

*

"నారదా!... అటు చూడుము. అహస్కరోదయము. ఈ భువిపై ప్రభాత సమయము ఎంత మనోహరముగా యున్నది?"


"అవును. కడు రమ్యముగా యున్నది యమా!...."


"ఇది ఏ సముద్రము?"


"బంగాళాఖాతం!"


"ఇది ఏ పట్టణము?"


"విశాఖపట్టణము"


"సాగరమున స్నానము చేయుదుమా!"


"తప్పక!..."


నారదుడు సముద్రంలో దిగాడు. యమ వారిని అనుసరించాడు.

"అహా!.... నారదా!..."


"చెప్పండి యమా!"


"ఈ జలము ఎంత శీతలముగా వున్నది"


"ఈ సాగరమున పలు నదుల సంగమము జరుగుతున్నది. పరమ పవిత్ర జలము యమా!..."


ఉదయించు సూర్యభగవానునికి ఒక బ్రాహ్మణుడు అర్ఘ్వ ప్రధానము చేయడాన్ని యమ చూచాడు.

"నారదా!... అటు చూడుము. ఆ మానవుడు ఏమి చేయుచున్నాడు?" అడిగాడు.

"యమా!... వారు బ్రాహ్మణులు. ఆస్థికులు. దినకరునకు అర్ఘ్వ ప్రదానం చేయుచున్నారు."

"మనము వారిని పలకరించగలమా!" 


"తప్పక, రండి"


ఇరువురూ ఆ వ్యక్తిని సమీపించారు.

ఆ సమయమున వారు తూర్పు దిశగా నిలుచుని చేతులు జోడించి భాస్కరులను స్తుతిస్తున్నారు.

దినకరా, శుభకరా, దివ్యతేజా - 1

అహస్కరా, భాస్కరా, అరుణతేజా – 2

సురలోకవందితా, నిత్యా, సత్యా - 3

సర్వేశ్వరా, జగత్ రక్షకా, నమోన్నమహ - 4

తమోవశణం, తమోవశరణం, తమోవశరణం - 5


ప్రశాంత చిత్తంతో వారు పలికిన పై మాటలను యమ, నారదులు విన్నారు. 

ఆ వ్యక్తి కళ్ళు తెరిచి తన ప్రక్కగా నిలబడి యున్న ధృడకాయుడు యమని, అందులో సగం ఆకారం కల నారదుని చూచారు.


"స్వామీ! తమరు ఎవరు?" అడిగాడు ఆ బ్రాహ్మణుడు శివశర్మ.


"మేము బహు దూరము నుండి వచ్చాము స్వామీ!" నారద జవాబు.


"ఓహో అలాగా!... ఈ వూర మీవారెవరైనా వున్నారా!" శర్మగారి ప్రశ్న.


"అందరూ మావారే!... కానీ మేము ఎవరమన్నది వారికి తెలియదు" నవ్వాడు యమ.


"ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి?" శర్మగారి ప్రశ్న.


"మీరే చెప్పాలి!" నారద జవాబు.


"మా ఇంటికి దయచేసి మా ఆతిధ్యాన్ని స్వీకరించండి స్వాములు" చేతులు జోడించి ఎంతో వినయంగా చెప్పాడు శివశర్మ.


ముగ్గురూ సాగరజలాల నుండి బయటికి వచ్చారు.

"రండి స్వామీ!..." శివశర్మ ప్రతిపూర్వక ఆహ్వానం.


"పదండి!..." చిరునవ్వుతో యమ, నారద ఒకేసారి అన్నారు.


"దారనా!.. ఈ షినిమ, లాచా చింమ లానివా డున్నావు!" అన్నాడు యమ.


"మాయ!... నువుఅ" అన్నాడు నారద. 


"స్వామీ!..."


"ఏమి?" నారద ప్రశ్న.


"తమరు మాట్లాడిన భాష ఏ భాష" అడిగాడు శివశర్మ.


"దేవగాంధార భాష" యమ జవాబు.


"ఓహో!... అలాగా!... "


"అవును..." నారద జవాబు.


"తమరి ప్రాంతం?" అడిగాడు శర్మ.


"ఊర్థ్వ ప్రాంతం" యమ జవాబు.


వారిరువురినీ ఆశ్చర్యంగా చూచాడు శివశర్మ.


పావుగంటలో శివశర్మ, యమ, నారదులు శర్మ ఇంటిని సమీపించారు.

"స్వాములూ! దయచేయండి. ఇదే నా యిల్లు"


శివశర్మ పలుకులకు యమనారద ముఖాల్లో చిరునవ్వు.

"మీకు ఎంతమంది భార్యలు?" యమ ప్రశ్న.


శివశర్మ ఆశ్చర్యంతో యమ ముఖంలోకి చూచాడు.

"భార్యలు ఎంతమంది?" నారద ప్రశ్న.


శివశర్మ ఉలిక్కిపడ్డాడు.

"స్వామీ!... ఒక్కతే!..."


"పేరు?" యమ ప్రశ్న.


"గౌరి!..."


"పిల్లలు?"


"ఇరువురు. ఒక ఆడ, ఒక మగ. పేర్లు నారాయణ, పార్వతి" చిరునవ్వుతో చెప్పాడు శివశర్మ.


"ఏమి చేయుచున్నారు?" యమ ప్రశ్న.


"నారాయణ ప్లస్ టు, పార్వతి టెన్త్ చదువుతున్నారు"


"మీ అమ్మానాన్నలు!"


"స్వర్గస్తులైనారుస్వామీ!"


సింహద్వారాన్ని సమీపించారు.

గౌరి ద్వారం ప్రక్కన నిలబడి ఉంది. చిరునవ్వుతో వారిని చూచింది.

"గౌరీ!... యాత్రికులు... ఆతిథ్యం ఇస్తానని చెప్పి తీసుకొచ్చాను" భార్య ముఖంలోకి ప్రీతిగా చూస్తూ అన్నాడు శివశర్మ.


"మంచిపనిచేశారు స్వాములూ!... నమస్కారం. దయచేయండి" చిరునవ్వుతో చెప్పింది గౌరి.

ముగ్గురూ గృహంలో ప్రవేశించారు.


హాలు మధ్యన ఊయపీట (చెక్కది)

దాన్ని చూపుతూ శివశర్మ....

"స్వాములూ!... ఆశీనులు కండి" అన్నాడు.


యమ, నారద ఆ ఊయల పీటపై కూర్చున్నారు.

గౌరి వంట గదిలోనికి వెళ్ళింది.

"కొన్ని క్షణాల్లో వస్తాను స్వామీ!" అన్నాడు శివశర్మ.


ఇరువురూ ఊయల ఊగుతూ చిరునవ్వుతో తలాడించారు. శివశర్మ వంట గదిలో ప్రవేశించాడు.

"ఏం చేశావు గౌరీ!...."


"పెసల దోశలు, అల్లం చట్నీ!"


"దోశలు ఎన్ని పోశావు?"


"నాలుగు. మన ఇద్దరికీ చెరు రెండు"


"పిండి వుందా!"


"ఆ వుందండి"


"మరో నాలుగు పొయ్యి. రెండు రెండు వారికి చాలవేమో!"


"ఆఁ... అలాగేనండి."


"ముందు రెండు, రెండు ఇవ్వండి. వారు అవి తినేలోపల పోసి వేడి వేడిగా ఇస్తాను."


"సరే అలాగే!..."


రెండు ప్లేట్లలో రెండేసి దోశలు వుంచి అల్లం పచ్చడి వేసి భర్తగారి చేతికి ప్లేట్లను అందించింది గౌరి. 

శర్మ ప్రీతిగా ఆ ప్లేట్లను వారిరువురికి అందించాడు.


గౌరి పొయ్యి మీద పెనం వుంచింది.

రెండు గ్లాసులతో మంచినీరును తీసుకొని గౌరి హాల్లోకి ప్రవేశించి గ్లాసులను నేల వుంచింది.

"మంచినీరు" చిరునవ్వుతో వారిని చూస్తూ చెప్పింది.


"దోశలు పోస్తున్నాను. వేడివేడిగా ఇస్తాను. మొహమాటం పడకుండా కడుపు నిండా తినండి స్వాములూ" అంది.


ఆమె ఆ ప్రీతి వచనాలకు యమ, నారద ఒకరి ముఖాలు ఒకరు చూచుకొని నవ్వుతూ తినడం ప్రారంభించారు.


రెండు దోశలు పోసి వాటిని తెచ్చి ఇరువురి ప్లేట్లలో వేసి వెళ్ళిపోయింది.

యమ నారదులు ఆనందంగా ఆరగించసాగారు.


శివశర్మ ఫ్యాన్ స్విచ్ నొక్కాడు. చల్లని గాలి యమనారదల శరీరాలకు సోకింది. వారు పరవశంతో పైన తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ని చూచారు. ఆనందించారు.

మరో నాలుగు దోశలను తెచ్చి గౌరి రెండు చొప్పున ఇరువురికీ వేసింది.

వారు మహదానందంగా తినసాగారు.

పిండి అయిపోయింది.


గౌరి మనస్సున కలవరం. భర్తను పిలిచింది. శివశర్మ వారి చేతులకు మంచినీరు గ్లాసులు అందించి వంట గదిలోనికి వచ్చాడు. 


"పిండి అయిపోయిందండి. వారేమో చాలని చెప్పకుండా తింటున్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలండీ!" ఆందోళనతో దీనంగా అడిగింది.


"శివశర్మ గారూ!" యమ పిలుపు.


పరుగున శివశర్మ వారిని సమీపించాడు.

"స్వామీ!..." ప్రశ్నార్థకంగా యమ ముఖంలోకి చూచాడు శివశర్మ.


"మీ ఆతిధ్యం అమోఘం. చాలా రుచిగా వున్నాయి. వాటిపేరు ఏమిటి?" అడిగాడు నారద.


"పెసల దోశలు"


"వాటిప్రక్కన వుంచిన దానిపేరు?" అడిగాడు యమ.


"అల్లం పచ్చడి" శర్మగారి జవాబు.


"వాహ్‍వా!.... అద్భుతం... అద్భుతం" నవ్వాడు యమ.


"ఆఁ... శివశర్మా!.... మీ దంపతులు, మీ పిల్లలు శత వర్షాలు చల్లగా ఆనందంగా మీ జీవన యాత్రను సాగింతురు గాక" కుడిచేతిని పైకెత్తి నవ్వుతూ ఆశీర్వదించాడు యమ.


"తధాస్తు!..." చిరునవ్వుతో పలికాడు నారద.


వంట ఇంటి ద్వారం దగ్గరవున్న గౌరి, వారి ముందున్న శివశర్మ భక్తితో ఆనందంగా తలలు వంచి చేతులు జోడించారు.

"శివశర్మా!...."


"స్వామీ!..."


"ఈ వాడలో వున్న వాసుల సమావేశ వేదిక ఎక్కడ?"


"ఇక్కడికి ఒక కిలోమీటర్ దూరంలో వుంది స్వామీ!"


"మాకు దారి చూపించండి. మీరు ఈవాడ వారిని ఆ వేదిక వద్దకు వచ్చేలా చేయండి. అల్పాహారాన్ని సేవించి ఇల్లాలితో కలిసి మీరు అక్కడికి రండి" చెప్పాడు యమ.


"చిత్తం స్వామీ!... రండి" శివశర్మ ముందు నడువగా, యమ నారదులు వారిని అనుసరించారు.


శివశర్మ వీధిలో ప్రవేశించి వారికి మార్గం చూపాడు. వారు ముందుకు నడిచారు. గౌరి పిండి గిన్నెను చూచింది. దాని నిండా పిండి ఉంది. ఆశ్చర్యపోయింది గౌరి. అందరికీ చెప్పి శర్మ ఇంటికి వచ్చాడు. గౌరి అందించిన దోశలను చూసి ఆశ్చర్యపోయాడు.

*

దేశ ఊర్థ్వ (పైభాగం అనగా ఉత్తరం) ప్రాంతం నుండి ఎవరో ఇరువురు స్వాములు వచ్చారన్న వార్త ఆ వాడ, పేట, నగరం అంతా కొన్నిగంటల్లో పాకిపోయింది. 

ఆ నడివీధి రచ్చ అరుగు చుట్టూ జనం గుమికూడారు. ఇంకా ఇంకా జనం వస్తూనే వున్నారు.

శివశర్మ, గౌరి అల్పాహారాన్ని సేవించి అక్కడికి చేరారు.


"మీరందరూ మీ మీ సమస్యలను వరుస క్రమంగా వేదికను ఎక్కి మాకు తెలియజేయండి" జనాలందరినీ కలయజూచి నారద తన మృదు మధుర స్వరంతో పలికాడు.


ముందుగా ఒక ఇరవై సంవత్సరాల బాలిక అరుగును సమీపించింది. ఎక్కింది.


"నా... తల్లి చనిపోయింది. మా నాన్న మరో పెండ్లి చేసుకొన్నాడు. ఆమెకు ఇరువురు పిల్లలు. ఆ పిల్లలు పెరిగేకొద్దీ నా పినతల్లి నన్ను నానా హింసలు పెడుతూ ఉంది. ప్రస్తుతం... తన తమ్ముడు త్రాగుబోతు. నన్ను వారికి ఇచ్చి పెండ్లి చేయాలని ముహూర్తం పెట్టించింది. నాకు ఆ పెండ్లి ఇష్టం లేదు స్వామీ!" కన్నీటితో చేతులు జోడించింది ఆ యువతి. 


యమ నారద ఆమె మాటలను విన్నారు. యమ తన కళ్ళు మూసుకొన్నాడు.

జనంలో వున్న ఆ పినతల్లికి పక్షవాతం వచ్చింది. అక్కడే నేలకూలింది. తమ్ముడు, భర్త ఆమెను ఇంటికి మోసుకొని వెళ్ళారు.


"నేటితో నీ సమస్య పరిష్కారం అయిపోయింది సుకన్య!... ఆ ఇంటివారంతా నీ మాట ప్రకారం ఇకపై నడుస్తారు. త్వరలో నీవు కోరుకున్న వాడితో నీ వివాహం జరుగుతుంది. నీవు నీ భర్త ఆనందంగా వుంటారు" చెప్పాడు యమ. 


వారికి నమస్కరించి అరుగు దిగింది ఆ బాలిక సుకన్య. 

ఎనభై సంవత్సరాల వృద్ధ దంపతులు వేదికను సమీపించారు.


"మాకు కొడుకు ఒక్కడే. వాడు భార్య మాటలను విని మమ్మల్ని నీచాతినీచంగా చూస్తూ... మీరు చస్తే నేను నా భార్య ఆనందంగా వుంటాం అని ప్రతిరోజూ మమ్మల్ని వేధిస్తున్నాడు సామీ!... మేము ఏం చేయాలి!... ఈ వయస్సున ఏడకి పోవాలి సామీ!..." దీనంగా కన్నీటితో అడిగారు ఆ దంపతులు.

యమ కళ్ళు మూసుకొన్నాడు. 


ఒక వ్యక్తి పరుగెత్తుకొంటూ వచ్చి వారిని సమీపించి....

"ఎద్దు పొడిచి మీ కోడలు చచ్చిపోయింది" అన్నాడు.

వారిరువురూ వారి చెవులను వారు నమ్మలేకపోయారు.

"మీ సమస్య తీరిపోయింది" అన్నాడు యమ.


ఆ ఇరువురూ వారి ఇంటివైపుకు నడిచారు విచారంగా. 

కొడుకు సోము పరుగెత్తుకొని వచ్చి వారిని సమీపించాడు.


"అమ్మా! నాన్నా! నన్ను మన్నించండి. నా భార్య మిమ్మల్ని వేధించినందుకు దానికి తగిన శాస్తి జరిగింది. ఎద్దు పొడిచి, అది చచ్చిపోయింది. నా, మీ సమస్య తీరిపోయింది. ఇకపై నేను మిమ్మల్ని నా ప్రాణ సమానంగా చూచుకొంటాను. అమ్మా, నాన్నా!.... రండి రండి..." వారిరువురు చేతులను తన చేతిలోనికి తీసుకొన్నాడు సోము.


"నారదా!... "


"యమా!..."


"ఈ జనాన్ని రెండు వర్గములుగా చేయుము. ఆస్థికులు, ధర్మవర్తనాలు ఒకవైపు, దుర్మార్గులు, ద్రోహులు మరోవైపు, నారదుల వారు చేతులు జోడించి శివనామస్మరణం చేశారు. కొన్ని క్షణాలు... చేతులను కళ్ళను తెరిచారు. దోసిటిలోని విభూతిని జనంవైపు విసిరారు.


ఐదు నిమిషాల్లో జనం మంత్రముగ్దులై రెండు వర్గాలుగా నిలబడ్డారు.

"దూక లునుజ్జస పువైడికు!" అడిగాడు యమ (కుడివైపు సజ్జనులు కదూ)

"మాయ నువుఅ... (అవును యమ)" నవ్వాడు నారద. 


క్షణం తరువాత.... 

"మాయ, ముపుందిసాప్ర నితిద్గసకులనుజ్జస... (సజ్జనులకు సద్గతి ప్రసాదింపుము)" చెప్పాడు నారద.


"గేలాఅ.... (అలాగే)" యమ జవాబు.


"కులష్టుదునునే నుక్షశి నుస్తాధివి" నారద పలుకు.


"మ్మునికా!..." యమ జవాబు (కానిమ్ము)


ఇరువురూ కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొన్నారు. తర్వాత కళ్ళు తెరిచారు.

యమ సజ్జనుల వైపు, నారద దుష్టుల వైపు చూచారు.


సజ్జనులకున్న శారీరక బాధలు తొలగిపోయాయి. వారి మనస్సున దైవం పట్ల, ఆస్థికత పట్ల సద్భావన కలిగింది. ఆ వర్గం వారంతా... ’హరిఓం హరిఓం... శివ ఓం శివఓం..... ఓం నమః శివాయ ఓంనమో నారాయణాయ...’ జపిస్తూ నాట్యం చేయసాగారు. వారిని చూచిన దుష్టవర్గం పకపకా నవ్వసాగారు.

వారి శరీరాలలో జిల, మంట, శరీరాలను గీరుకొంటూ, మంటకు కల్లు తాగిన కోతుల వలె ఎగరసాగారు. కొందరు నేలకూలి దొర్లసాగారు. ’అమ్మా.... అమ్మా... అబ్బా... అబ్బా....’ అంటూ.

సన్మార్గులు భక్తి భావనలో లీనం అయిపోయారు. దుర్మార్గులు శారీరక వేదనతో లబోదిబో అని కేకలు పెట్టసాగారు.


యమనారదలు చిరునవ్వుతో రెండు వర్గాలవారిని తిలకించసాగారు. జనంలో జరుగుతున్న చోద్యాన్ని ఒక ప్రక్కగా నిలబడి చూస్తున్న శివశర్మ, గౌరీలు ఆశ్చర్యపోయారు. ’వీరిరువురూ సామాన్యులు కాదు’ అనుకొన్నారు. చేతులు జోడించి సజ్జనులు యమ నారదులకు నమస్కరించారు.

దుర్మార్గులు బాధలతో బాధపడుతూ.....

"సాములూ!... సాములూ!... మమ్మల్ని కాపాడండి... కాపాడండి" కన్నీళ్ళతో దేహబాధలతో దీనాతి దీనంగా వేడుకొన్నారు.


అరగంట తరువాత యమనారదులు ప్రసన్నులైనారు. వారి బాధలు తీరాయి. 


"చూడండి...! ఈ మీ మానవ జన్మ సృష్టిలోని అన్ని జీవరాశుల కన్నా ఉత్తమమైన జన్మ. మీ జన్మ గొప్పతనాన్ని తెలిసికొని ఆ వర్గం వారివలే ఆస్థికులుగా మారి, అందరితో కుల మత బేధ భావాలు లేకుండా కలిసిమెలసి, మనుషులంతా ఒక్కటే అనే సద్భావనతో సాటివారిని గౌరవించి అభిమానించండి. మీ జీవితాలు బాధరహితంగా మారుతాయి. నాస్థికతను వదలండి. ఆస్థికులుగా మారండి. చివరిమాట, మీ మీ సంకల్పాలను అనుసరించి మీమీ జీవిత విధానాలుంటాయి. ఇది జీవిత సత్యం. నమ్మండి పాటించండి. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించండి. మీకు తెలిసిన ఈ జీవిత సత్యాలను మీ పిల్లలకు నేర్పండి. మాతృభాషను అభిమానించండి, ప్రేమించండి, ఆదరించండి. ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఆ పరభాష బ్రతుకు తెరువుకు మార్గం కాగలదు కానీ.... అది మంచిని మానవత్వాన్ని నేర్పలేదు. ఆ లక్షణాలను నేర్పగల శక్తి ఒక్క మాతృభాషకే వుంది. ఎవడి దేశం, ఎవడి భాష వారికి గొప్ప. అందరినీ ఆదరాభిమానాలతో చూడ్డం, మంచి మానవత్వం. మనుషులుగా పుట్టినందుకు మనుషులుగా బ్రతకండి. దానవుల్లా కాదు" సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని యమ ముగించాడు.


వెంటనే నారద....

"ఏనాడు మారినా మీరు మరలా నాస్థికతను, అమానుషత్వానికి ప్రయత్నిస్తే, మీ పరిస్థితి మారి క్రిందటి గంటలో మీరు పడ్డ పాట్లు జీవితాంతం అనుభవించవలసి వస్తుంది. జాగ్రత్త" అన్నాడు నారద.


"ఆ తప్పు చేయము సామీ!... ఆ తప్పును మరలా చేయము" అందరూ చెంపలు వాయించుకొన్నారు.


"నారద!... ఈ నగరమున మన కార్యము పూర్తి అయినట్లేగా!..." అడిగాడు యమ.


"అవును యమా!..." నారద జవాబు.


"సరే పద విజయవాడ!" నవ్వాడు యమ.


అందరూ వారినే చూస్తుండసాగారు.


ఇరువురూ చిరునవ్వుతో అరుగు దిగారు. కొంతదూరం నడిచారు.

జనమంతా ఆశ్చర్యంతో వారినే చూస్తున్నారు. వారిరువురూ అంతర్థానమైనారు.

ఇది ’యమనారద మొబైల్ కోర్టు’.

జనానికి తెలియని విషయం..


సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


21 views0 comments

Comentários


bottom of page