#యమనారదమొబైల్కోర్ట్, #YamaNaradaMobileCourt, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguStory, #తెలుగుకథ
Yama Narada Mobile Court Part - 2 - New Telugu Story Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 10/11/2024
యమనారద మొబైల్ కోర్ట్ పార్ట్ – 2 - తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
అన్ని దిన పత్రికలు, రేడియో స్టేషన్స్, వెబ్ పత్రికలు యమ నారద విశాఖపట్నం మొబైల్ కోర్టు విచారణను గురించి ఆశ్చర్యపూరిత సందేశాలను గురించి ఇరు తెలుగు రాష్ట్రాలలో ప్రచురణ జరిగింది.
యావత్ తెలుగు రెండు రాష్ట్ర ప్రజలకు, అన్ని ఇతర భారతావని రాష్ట్రాలకు యమనారద మొబైల్ కోర్టు విచారణ తెలిసిపోయింది. ఆస్థికులందరికీ ఆనందము. నాస్థికులు ఆశ్చర్య భయభ్రాంతులు కలిగాయి.
పేదలకు ఆనందము, కలవారికి కలవరం, భయం ఏర్పడ్డాయి. గగన వీధిన సంచరిస్తు విజయవాడ వైపు వస్తున్న యమ నారదులు కృష్ణానదిని సందర్శించారు.
"నారదా!...."
"యమా!..."
"ఆ నది పేరు!"
"కృష్ణానది యమా!"
"ఆహా నది జలము ఎంత మనోహరముగా యున్నది?... ఆ నదిలో స్నానమాచరించెదమా!"
అడిగాడు యమ.
"తప్పక యమా!... పదండి" చెప్పాడు నారద.
ఇరువురూ క్రిందికి అరుదెంచి కృష్ణానదిలో స్నానమాచరించినారు. పరవశించినారు.
ఇంద్రకీలాద్రి పర్వతముపై వెలసియున్న జగన్మాత దుర్గామాయిని దర్శించినారు. పరవశమున నమస్సులు సమర్పించినారు.
ఆర్చకులు వారి తేజస్సును చూచి ఆశ్చర్యపోయారు.
"స్వాములూ తమరు!..."
"యమనారదులము. ఆంధ్రావనిని సందర్శించ వచ్చినాము" నారదుల వారి సమాధానము.
"మీ నామధేయము?" యమ ప్రశ్న.
"హరిహర" అర్చకుల వారి సమాధానము.
క్షణం తర్వాత...
"స్వాములూ!... మీ విశాఖపట్నంపు పర్యటనను గురించి విన్నాము. నాకు మహదానందం కలిగినది" చిరునవ్వుతో చెప్పాడు హరిహర.
"ఇచ్చట మేము కొంత సమయము వుండతలచినాము. ప్రజలతో ధర్మాధర్మ విచారణం సలుప తలచినాము" చెప్పాడు యమ.
"స్వాములూ!.... అలాగే చేయండి. ఇది నవరాత్రుల సమయము. మాతకు రోజుకు ఒక అలంకరణ చేసి, భిన్నమైన పదార్థములను తల్లిని నివేదన చేసి భక్తులకు పంచెదము. ఈరోజు చక్కెర పొంగలి, పూలుసన్నము నివేదన చేసినాము. తమరు స్వీకరింతురా!..." ఎంతో వినయముగా హరిహర అర్చకులు అడిగారు.
"తప్పక... ఇవ్వండి" నారదుల జవాబు.
హరిహర అర్చకులు తామరాకు నందు చక్కెరపొంగలి, పులుసున్నమును వుంచి ఎంతో వినయంగా యమ నారదులకు అందించినారు.
మండపమునందు యమ నారదులు ఆశీనులై, హరిహర అర్చకులు అందించిన ప్రసాదములను సేవించి సంతుష్టులైనారు.
"హరిహరా!..."
"స్వాములూ!..."
"మీ ప్రసాదములు అద్భుతము. అమోఘము. మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందముగా వర్థిల్లుదురుగాక. తల్లి సేవలో మీ జన్మ ధన్యత నొందుగాక!" అన్నాడు యమ.
"మేము ఈ మండపము నందు కొంత తరుణము వుండెదము. తల్లిని దర్శించ వచ్చిన వారికి మమ్ములను కలవమని, వారిని మా వైపుకు పంపుడు" అన్నాడు నారద.
యమనారదులు కళ్ళు మూసుకొని మండపము నందు సుఖాశీనులైనారు.
జగన్మాతను దర్శించిన వారికి హరిహర పూజారి ’మండపమునందు కూర్చొని యున్న స్వాములను దర్శించండి’ అని చెప్పి జనులను మండపం వైపుకు పంపినారు.
అరగంటలో చాలామంది స్త్రీ, పురుష, బాలబాలికలు మండపం చెంతకు చేరినారు.
నారద కళ్ళు తెరిచి జనాన్ని వీక్షించారు. చిరునవ్వుతో.....
"మీలో ఎవరికి ఏ సమస్య వున్నా మాకు తెలియజేయండి. సమస్యను పరిష్కరించెదము" అన్నారు నారద.
గుమికూడియున్న జనం ముఖంలో ఆనందం.....
"ఇచ్చట గుమికూడిన మీ అందరికీ ఒక సత్య సందేశము. అందరూ అప్రమత్తతో ఆలకించండి. సత్ చింతనతో సత్యాన్ని తెలుసుకోండి. మీలోని స్వార్థపూరిత అజ్ఞానాన్ని వదలండి. జగత్ నిర్మాత, ప్రపంచ సృష్టికర్త ఒక్కరే. మతం అన్నది మనిషి మనుగడను నిబద్ధతతో సాగించేటందుకు. పేరుకు మతాలు ఆచార వ్యవహారములు, వేషము, భాషా, ప్రాంతం వేరు కావచ్చు. కానీ... మనుషులందరూ ఒక్కటే. దైవచింతన విషయ ఆవిర్భతం ప్రప్రధమంగా సనాతన అద్వైత ఆర్యా ఋషి పరంనుండి ఈ మహోన్నత భువిపై వెలువడినది.
ఆదిమతం హైందవత్వం. హైందవతత్వం, తెలుపునది. భిన్నత్వంలో ఏకత్వం. ప్రతి స్త్రీ గౌరవప్రదం. ఒక స్త్రీ మూర్తి తన జీవితకాలంలో బాలికగా ఫౌఢగా, ఒకరికి ఇల్లాలుగా, కొందరి తల్లిగా (అమ్మ) కాలగతిలో అత్తగా, అమ్మమ్మ, నాయనమ్మగా పలుపేర్లతో పిలువబడి, సభ్య సమాజాన్ని, వారి సంతతిని ముందుకు నడిపించే మహాశక్తి స్త్రీమూర్తి. ఈ పవిత్ర భారతావనిలో స్త్రీమూర్తికి ఎంతో గౌరవం, అభిమానం తన చర్యల వలన పొందగలుగుతుంది.
ధైర్య సాహసాలతో, విద్యారంగంలో వారు అన్ని విధములా పురుష సమానులు. అంతటి మహోన్నతమైనది స్త్రీ స్వరూపం. ఏ ఇంట స్త్రీ గౌరవాన్ని తమ గౌరవంగా భావించి ఆ మూర్తిని అభిమానించి, ఆదరించి గౌరవిస్తారో, ఆ ఇంట సర్వసౌభాగ్యాలు కలిగి గృహస్తులందరూ ఎంతో ఆరోగ్యంగా, ఆనందగా వర్ధిల్లుతారు. ఏ ఇంట స్త్రీ మూర్తిని అగౌరవంగా బానిసలా చూచి అవమానిస్తారో, ఆ ఇంట వారు, వారు వూహించని సమస్యలలో చిక్కుకొని, తమ జీవితాంతం, మనశ్శాంతి లేకుండా అష్టకష్టాలు అనుభవిస్తూ ఇంటా బయటా అగౌరవం పాలై, మనోక్లేశంతోనే జీవితాంతం బ్రతికి, చివరికి ఒకనాడు అవతార పరిసమాప్తిని ఆశాంతితో నరనయాతనలతో ముగించవలసి వస్తుంది.
శాంతియుత జీవిత గమనానికి స్త్రీ మూర్తిని గౌరవించడం ప్రధమ కర్తవ్యం. స్త్రీని గౌరవించువారు ఉత్తమ మానవులు ఆ స్త్రీని నిర్లక్ష్యం చేయువారు అధమ మానవులు. మీరందరూ.... మీరు ఏ తెగకు చెందినవారో, ఆలోచించి మీరే నిర్ణయించుకోండి. మరియు పశ్చాత్తాపం అన్నది పాపపరిహారం. దైవ కృపకు పాత్రం...” తన సుధీర్ఘ ఉపన్యాసాన్ని యమ ముగించి, అందరినీ కలయచూచారు.
ఆ ప్రసంగం విన్న కొందరి సన్మార్గుల వదనాల్లో ఆనందం. కొందరి దుర్మార్గుల వదనాల్లో ఆవేదన....
సన్మార్గులు నగుమోముతో ఒకరిని ఒకరు చూచుకొంటూ ఒకవైపు చేరారు. దుర్మార్గులంతా చిత్తరువులా కదలక నిలబడిపోయారు.
నారద.... వారినందరినీ పరీక్షగా చూచాడు.
"ఇప్పుడు మీరు, మీమీ సమస్యలను మా ముందుకు వచ్చి తెలియజేయవచ్చు" చిరునవ్వుతో చెప్పాడు నారద.
ఒక పాతిక సంవత్సరాల యువతి వారి ముందుకు వచ్చి నమస్కరించింది.
"అమ్మా!.... నీ పేరు?" అడిగాడు యమ.
"నా పేరు సుమతి స్వామి....."
"నీ సమస్య ఏమిటి తల్లీ!" అడిగాడు నారద.
"నాకు వివాహం అయ్యి ఆరుమాసాలు అయ్యింది స్వామీ!... నా భర్త తండ్రి మా నాన్నగారి వద్దనుండి ఐదు లక్షలు కట్నాన్ని కోరారు. నాన్న మూడులక్షలు చెల్లించాడు. రెండు లక్షలను నోటు వ్రాయించుకొని మా మామగారు చలపతి మా వివాహాన్ని జరిపించారు. వివాహానంతరం నన్ను వారు వారి ఇంటికి తీసుకొని వెళ్ళలేదు. నా భర్త తండ్రి మాటకు లోబడి తండ్రితో వెళ్ళిపోయాడు. మాకు ఐదు ఎకరాల భూమి వుంది. నాకు మరో ముగ్గురు సోదరీలు వున్నారు. వారు చదువుకొంటున్నారు.
ఆ ఐదు ఎకరాల భూమి నుండి ప్రతి సంవత్సరం వచ్చే ధాన్యమే మా జీవనాధారం. మిగతా రెండు లక్షలకు ఒక ఎకరాన్ని అమ్మాలని మా నాన్న ధర్మయ్య ఎంత ప్రయత్నించినా ఎవరూ కొనడం లేదు. కారణం మా భూమికి ఇరువైపుల వున్న రైతులు, వారు కొనకుండా వేరేవారిని కొననీకుండా, రెండు లక్షలకు ఆ ఐదు ఎకరాలు కావాలని అడుగుతున్నారు. ఎకరం ఐదురారు లక్షలకు పైగా చేస్తుంది. రెండు లక్షలకు ఐదు ఎకరాలను వారికి ఇస్తే నా సమస్య తీరవచ్చు. కానీ... మా అమ్మ ఆదెమ్మ, మా నాన్న ధర్మయ్య, నా చెల్లెళ్ళు శాంతి, శారద, శాలిని ఎలా బ్రతుకుతారు స్వామీ!...
నన్ను చూచిన వారు ఆడ, మగ పెండ్లి అయ్యి అత్తారింటికి ఎల్లకుండా పుట్టింట్లోనే ఉండిపోయింది సుమతి అని నన్ను హేళన చేస్తున్నారు. నా ఈ సమస్యను తమరు పరిష్కరించాలి స్వామీ!...." కన్నీటితో దీనంగా చెప్పింది సుమతి.
దుర్మార్గుల వైపు నిలబడి వున్న చలపతి, అతని కుమారుడు నరహరి, చలపతి భార్య మంగమ్మలు ఆశ్చర్యంతో సుమతి ముఖంలోకి చూచారు. పళ్ళు నూరారు.
"చలపతీ!..." యమకేక.
చలపతి హడలిపోయాడు. శరీరం చెమటమయం... నిలబడలేకపోయాడు.
"స్త్రీ విత్తని ఆశించడం మహాపాపం అని నీకు తెలియదా!..." యమ రామబాణం లాంటి ప్రశ్న.
ఆ పలుకులు వినగానే చలపతి నేలకూలాడు. స్పృహ కోల్పోయాడు.
తనయుడు నరహరి, భార్య మంగమ్మ చలపతి ప్రక్కన కూలబడ్డారు కన్నీటితో.
"నాన్నా!... నాన్నా!..." నరహరి పిలుపు.
"ఏమండీ.... ఏమండీ...." మంగమ్మ రోదన.
అందరూ వారిని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డారు.
యమనారద ఒకరినొకరు చూచుకొని నవ్వుకొన్నారు.
"నరహరీ!..." యమ పిలుపు.
బెదిరిపోయి నరహరి లేచి నిలబడి యమ నారదులను చూచాడు.
"నీకు కట్నం ఇంకా రెండు లక్షలు కావాలా!" నారద ప్రశ్న.
"నాకు కాదు స్వామీ మా నాన్నకు" దీనంగా కన్నీటితో చెప్పాడు.
"మంగమ్మ!" యమ గర్జన.
మంగమ్మ బిత్తరపోయి యమ ముఖంలోకి ఏడుస్తూ చూచింది.
"నీకు కట్నం కావాలా, నీకు అన్నివిధాలా సాయంగా, అండగా నిలబడి, నీ జీవితాంతం వరకు నిన్ను చక్కగా చూచుకొనే కూతురు లాంటి కోడలు కావాలా!" అడిగాడు నారద.
మంగమ్మ తబ్బిబ్బైపోయింది. నోటిమాట రాలేదు. క్రింద స్పృహ లేకుండా పడివున్న భర్తను చూచి భోరున ఏడ్చింది.
"ఏడవకు. మా ప్రశ్నకు జవాబు చెప్పు.!" యమ వారి గద్దింపు.
మంగమ్మ మెల్లగా లేచింది. పవిటతో కన్నీరు తుడుచుకొంది.
"సామీ!..." అంది మెల్లగా.
"నీ నిర్ణయం చెప్పు!" నారద ప్రశ్న.
"సామీ!... నాకు కోడలే కావాలి. డబ్బు వద్దు" గద్గద స్వరంతో చెప్పింది మంగమ్మ.
"భర్త కావాలా వద్దా!..." యమ వాక్కు.
"అయ్యా!.... సామీ!... నాకు నా భర్త కావాలి. ఆయన్ని కాపాడండి సామీ!" దీనంగా చేతులు జోడించింది మంగమ్మ.
యమనారదులకు, తమ అత్తామామ భార్యకు మధ్యన జరిగిన సంభాషణనంతా సుమతి విన్నది. ఆమె ముఖంలో ఆనందం. స్వాములను సమీపించి, వారికి నమస్కరించి సుమతి ఆనందంగా కొండ దిగింది.
అక్కడ జరిగిన సన్నివేశాలను, సంభాషణలను చూచిన విని... సన్మార్గులు హృదయపూర్వకంగా చేతులు జోడించి యమ, నారదులకు నమస్కరించారు.
దుర్మార్గుల హృదయాలలో అలజడి... భయం....
యమనారద దృష్టి దుర్మార్గుల వైపు మరలింది. వారి తీవ్ర దృష్టికి దుర్మార్గులందరూ తలలు దించుకొన్నారు. తాము చేయు అన్యాయాలను అక్రమాలను గురించి యమ నారదులు ఎక్కడ ప్రస్తావిస్తారో అని వారి హృదయాల్లో రైళ్ళు పరుగెత్తాయి.
"కోదండరామా!" యముల వారి పిలుపు.
కోదండరామయ్య పేరుకు కోదండరామయ్య. యదార్థానికి తమ్ముడు సవతి తల్లి కొడుకు విభీషణయ్యను, చంపి... అతని తల్లి గౌతమిని ఇంటనుంచి బయటికి గెంటివేశాడు. యావత్ ఆస్థిని తాను తన భార్య సంజీవి, కొడుకు రఘు, కూతురు సత్యవతి అనుభవిస్తున్నారు.
గౌతమి... నాలుగు ఇండ్లలో పనిమనిషిగా చాకిరీ చేస్తూ కన్నీటితో జీవితాన్ని మహాభారంగా సాగిస్తూ ఉంది.
యమ పిలుపు విని... కోదండరామయ్య ఉలిక్కిపడ్డాడు.
"నీవు మహాపాపం చేశావు కోదండా!... నీ తండ్రి నీ తల్లి ఆనంది మరణానంతరం గౌతమిని వివాహం చేసుకొన్నాడు. తన పాపాలకు ప్రతిఫలాన్ని అనుభవిస్తూ, నీ తండ్రి కరోనా కాలంలో ఆ మహమ్మారికి బలైపోయాడు. విష ప్రయోగంతో ఆస్థి కోసం పదహారు సంవత్సరాల నీ తమ్ముడు విబీషణయ్యను చంపావు. ఫలితాన్ని అనుభవించు" అన్నాడు యమ.
దుర్మార్గుల వైపున వున్న ఆ కోదండరామయ్యకు కళ్ళు కనబడకుండా పోయాయి.
"నా కళ్ళకు ఏమీ కనపడటం లేదు. ఏమీ కనబడటం లేదు" అని అరిచాడు కోదండరామయ్య.
అతని భార్య సంజీవి, కొడుకు రఘు, కూతురు సత్యవతి భయాందోళనలతో... ’ఏమండీ... ఏమండీ... నాన్నా... నాన్నా’ అని అరిచారు.
కోదండరామయ్య చేతులతో తన వారిని తడుముకొంటు "నాకు ఏమీ కనిపించడం లేదు." అని భోరున ఏడ్చాడు.
"కోదండరామయ్యా!... నీవు చేసిన పాపాన్ని నీ నోటితోనే అందరికీ తెలియజేయి!" అది నారద ఆజ్ఞ.
కోదండరామయ్య వెక్కిళ్ళు పెడుతూ ఏడవసాగాడు.
"చేసిన మహా పాపానికి నీవు ఈ శిక్షను అనుభవించక తప్పదు" అన్నాడు యమ.
"స్వామీ!.... నా తప్పును క్షమించండి. నాకు దృష్టిని ప్రసాదించండి" దీనంగా అర్థించాడు కోదండరామయ్య.
"నీవు చేసిన పాపాన్ని గురించి పెద్దగా చెప్పు!" నారద ఆజ్ఞ.
కోదండరామయ్య విషాన్ని ఇచ్చి తమ తమ్ముడు విభీషణయ్యను చంపిన విషయాన్ని, పినతల్లి గౌతమిని ఇంటినుండి గెంటివేసిన విషయాన్ని అందరూ వినేలా చెప్పాడు.
అంతవరకూ గౌతమిని గురించి తప్పుగా అనుకున్న వారు యదార్థాన్ని గ్రహించారు. ఆమెకు జరిగిన అన్యాయానికి బాధపడుతూ ఆమెను అభిమానపూర్వకంగా చూచారు.
’మీరు మా ఇంట్లోనే వుండి పొండి మాకు పెద్ద దిక్కుగా’ అని ఆమె చేతులు పట్టుకొని బ్రతిమిలాడారు కొందరు.
"అందరూ జాగ్రత్తగా వినండి. ఇతరులను మోసం చేయడం, చంపడం ఘోర పాతకం. ఆ పాతక ఫలితాన్ని కోదండరామయ్య ఇప్పుడు అనుభవిస్తున్నాడు. చేసిన పాపం పగబట్టి నాగుపాములా ఒకనాడు కాటువేసి చంపి తీరుతుంది.
కనుక అందరూ దైవ చింతనతో సన్మార్గవర్తనులై, పరస్పర ఆదరాభిమానాలతో, ప్రేమానురాగాలతో కలిసి సఖ్యతతో సమాజంలో జీవించండి. ఈ మీ మనుష జన్మ మహోన్నతమైనదని గ్రహించండి. పరస్పర ప్రేమ సౌభ్రాతృతం దానం, ధర్మం హైందవ ధర్మాలని తెలుసుకొనండి. చివరిమాట... చేసిన తప్పుకు, నేరానికి శిక్ష ఎవరికైనా తప్పదు" తన గంభీర కంఠంతో చెప్పారు యమ.
అందరూ ఆశ్చర్యంతో ఆ ఇరువురినీ చూచారు. చేతులు జోడించారు.
యమ నారద మండపం బయటికి నడిచారు. నాలుగు అడుగులు మెట్లవైపుకు సాగారు. అంతర్థానం అయినారు. వారిని చూస్తున్న అందరూ శిలా ప్రతిమల్లా నిలబడిపోయారు.
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
留言