'Yasodhara' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao
Published In manatelugukathalu.com On 10/08/2024
'యశోధర' తెలుగు కథ
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ప్రస్థలను రాజధానిగా చేసుకుని త్రిగర్త రాజ్య భువనాధీశుడు యశోపిత త్రిగర్త రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అతని కుమార్తె యశోధర. యశోధర పేరుకు తగినట్లుగా రాజనీతి, కుటుంబనీతి, సమాజ నీతి, వేద పురాణేతిహాస నీతి, మనునీతి, మానవనీతుల మూలాలెరిగి మసులుకునే పరిపూర్ణ విజ్ఞానవంతురాలు. మహా యశస్సు కలిగిన ధైర్యవంతురాలు. సుపరిపాలన దక్షత కలిగిన సుశిక్షుతురాలు. యశోధర దుర్జనుల పాలిట సింహ స్వప్నం. సజ్జనుల పాలిట ఆపన్న హస్తం. పరోప కారుల పాలిట పరమామృత తేజం.
యశోధర పితృ దేవుని ఆదేశానుసారం ఎల్లవేళలా మూడు నదులు ప్రవహించే త్రిగర్తను సుసంపన్నం చేయసాగింది. అవకాశవాద ధర్మాన్ని అనుసరించేవారి మెడలు వంచేది. మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా మంచి మార్గాన కష్టపడేవారిని యిష్టంగా అభిమానించేది.
ఒకానొకప్పుడు విపాసా నది సమీపాన ఉన్న జన నిశ గ్రామం దేవతా సంచారానికి బహుదూరంగ ఉండేది. అక్కడివారు యజ్ఞయాగాదులు అంటే అసహ్యించు కునేవారు. విచ్చలవిడితనమంటే మహా యిష్టపడేవారు. పర సంపదను, పర స్త్రీలను అపహరించడమే ప్రధా న కర్తవ్యంగా భావించేవారు. దైవ ధూషణంటే అదే ధర్మ పథం అనేవారు.
త్రిగర్త రాజ్యాన్ని ఆనుకుని ఉన్న జననిశ గ్రామం వంక చూడటానికే దేవతలు సహితం భయపడుతున్నారు అని తెలుసుకున్న యశోధర సుసైన్యంతో జననిశ గ్రామం వెళ్ళింది. ఆమె సుసైన్యంలో మగవారితో పాటు ఆడవారు కూడా ఉన్నారు. అందు సంసప్తక బృందం కూడా ఉంది. చేసిన ప్రతిజ్ఞ నుండి ఏనాడూ వెను తిరగని సంసప్తక బృందం జననిశ గ్రామం లోని రాక్షస భావ జాలం కలవారినందరిని సూక్ష్మ వలయ సమరం లో మట్టి కరిపించింది. అప్పుడు యశోధర కత్తి పట్టనవసరం లేకపోయింది.
యశోధర జననిశ గ్రామ వాసులతో, "మహా జనులారా! యజ్ఞ యాగాదుల వలన ప్రకృతి సంరక్షింప బడుతుంది. ప్రకృతి పచ్చగా ఉంటే సకాలంలో వర్షాలు పడతాయి. పాడి పంటల తో గ్రామం పచ్చగా ఉంటుంది.
అప్పుడు గ్రామ దేవతల కరుణ పుష్కలంగా ఉంటుంది.
దేవతా సంచారం గల ప్రాంతంలో హింస తగ్గుతుంది. అలాంటి పవిత్ర ప్రాంతాల్లో మహోన్నత మానవ శక్తి మాధవ శక్తిగా ఎదుగుతుంది. మహోన్నత గమ్యం మన కళ్ళముందు తారాడుతుంది. కాబట్టి మీరు మారండి. రక్కస భావాలకు తిలోదకాలు వదలండి. మీకు నేను ఎల్లప్పుడూ దండిగా అండగా ఉంటాను. " అని ప్రజల మనసుకు నాటుకునేటట్లు చెప్పింది.
జననిశ గ్రామం నడుమ మత్స్యకూర్మవరాహవామనాది యజ్ఞ వేదికలను నిర్మింప చేసింది. ఆ వేదికల నడుమ పద్మ వేదికను నిర్మింప చేసింది. యజ్ఞ వేదికలకు తన యశస్సును కొంత ధార పోసి అక్కడ యజ్ఞయాగాదులు జరిగేటట్లు చేసింది.
యశోధర త్యాగానికి సంతసించిన దేవతలు జననిశ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసారు. అక్కడి జనంలో సాత్వికత ఎదిగేటట్లు చేసారు. దానితో యశోధర కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగాయి.
యశోధర కీర్తి ప్రతిష్టలకు తగిన వరుని తీసుకువచ్చి, ఆమె వివాహం చేయాలని ఆమె తండ్రి యశోపిత దేశదేశాల నుండి యువ రాజుల చిత్ర పటాలను తెప్పించి, వాటిని ప్రత్యేక మందిరాన ఏర్పాటు చేసాడు. ప్రశాంత సమయంలో పెళ్ళి కొడుకుల చిత్ర పటాలున్న గదిని సందర్శించమని యశోపిత తన కుమార్తె యశోధరకు చెప్పాడు. యశోధర తండ్రి ఆనతిని శిరసా వహించింది. తన చెలికత్తెలతో చిత్ర పటాలను తిలకించి చిలిపి కవితలను అల్లింది.
చంద్రవంశ రాజు భరతుని వంశాన జన్మించిన సుహోత్రుడు తన కుమారుడు హస్తికి పట్టాభిషేక మహోత్సవాన్ని ఏర్పాటు చేసాడు.. ఆ పట్టాభిషేకానికి అంగ వంగ కళింగ కాంభోజ టేంకణ పుళింద బాహ్లీక విదర్భ విదేహ సాళ్వ సింధు మత్స్య గాంధార అంబష్ఠ మల్ల చేది వత్స త్రిగర్తాది అనేక రాజ్యాల రాజులు, సామంతులు హాజరయ్యారు.
ఆ పట్టాభిషేక మహోత్సవానికి త్రిగర్త రాజ్య రాజు యశోపిత, యువరాణి యశోధర ఆమె ముఖ్య అనుచర గణం, ప్రాణ స్నేహితురాళ్ళు సత్య ధర మొదలైనవారు, వారికి సంబంధించిన బంధుగణం కూడ హాజరయ్యింది.
యశోధర హస్తి మహారాజు పట్టాభిషేకం కు హాజరవ్వడమే కాకుండా సుహోత్రుని అభ్యర్థన మేరకు తమ నృత్య కళాకారిణులతో త్రిగర్త, విహంగ, అచల వ్యూహాల నృత్యాలను చేయించింది. అక్కడి వారందరినీ ఆనందింప చేసింది. యశోధరే ఆయా నృత్యాల రూప కల్పన చేసింది. అందుకు హస్తి మహారాజు యశోధర ను ప్రత్యేకంగా అభినందించి సన్మానించాడు. ఆ సన్మాన సభను చూచిన రాజులందరు యశోధరను పలు రీతుల్లో అభినందించారు.
పదనెక్కిన చురకత్తుల ప్రతాపజ్వాలల ప్రభ, మహోన్నత మానవీయ సహృదయ గౌరవ మర్యాదల ప్రభల నడుమ యశసిస్తున్న హస్తి మహారాజు ముఖాన్ని చూచిన యశోధర "హస్తి మహారాజు కారణ జన్ముడు. చరిత్ర.. కాదు కాదు.. యుగయుగాల చరిత్ర శాశ్వతంగా గుర్తు పెట్టుకునే పని ఏదో ఒకటి చెయ్యడానికే ఈ భారత దేశాన హస్తి మహారాజు జనించాడనిపిస్తుంది" అని మనసులో అనుకుంది.
పట్టాభిషేక మహోత్సవం కు వచ్చినవారందరికి సుహోత్రుడు ప్రత్యేక విడిది మందిరాలను ఏర్పాటు చేసాడు. హస్తి మహారాజు తల్లి సువర్ణాదేవి యశోధరకు ప్రత్యేక విడిది మందిరం ఏర్పాటు చేసింది. ఆ విడిది మందిరం దేవేంద్ర లోక మందిరాలను మించిన అందం తో కళకళలాడుతుంది. ఆ విడిది మందిరాన్ని చూచిన యశోధర ప్రాణ స్నేహిరాలు సత్యధర, "చెలి యశోధర, ఇలాంటి విడిది మందిరాలను మనం దేవేంద్ర లోకాదులలో చూడగలమేమో గానీ భూలోకంలో మాత్రం చూడలేం కదా?" అని యశోధరతో అంది.
"నిజం చెప్పావు సత్యధర. హస్తి మహారాజు తండ్రి సుహోత్ర మహారాజు వంద రాజ సూయాగాలు పైగా చేసారు. అలాగే లెక్కకు మించిన అశ్వ యాగాదులను చేసారు. గజబలాన్ని, అశ్వ బలాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. తన రాజ్య ప్రజల గృహాలను పసిడిమయం చేసారు. రాజ్య పటిష్టత కోసం అనేక పథకాలను అమలు చేసారు. ఇలా ప్రజలను ప్రకృతిని సంరక్షిస్తూ దేవ గణాన్ని సంతృప్తి పరిచారు. సుహోత్రుడు ప్రజలకు పంచిన సంపదలు వారి వారి కుటుంబాలకు రెండు తరాలకు మించి సరిపోతాయి. అలాంటి సుసంపన్న రాజ్యాన్ని కొడుకు హస్తి మహారాజు కు అప్పగించారు.
హస్తి మహారాజు చూడ చూడ తండ్రికి మించిన తనయుడు లాగా కనపడుతున్నాడు. హస్తి మహారాజు ఉదారుడు. ఉన్నతుడు. ఉర్వీపతి. హస్తి మహారాజు చిన్నప్పుడే సాధు జంతువులతో ఆడుకున్నంత చనువుగా కౄర జంతువులతో కూడా ఆడుకునేవాడని ఇక్కడి వారంతా చెబుతున్నారు. పులుల మీద సింహాల మీద స్వారీ చేసిన హస్తి మహారాజు ఒకసారి జలచరమైన మొసలి మీద కూడా సంచరించాడట. ఇలాంటి మహోన్నతుల ఏలుబడిలో మందిరాలు ఇలా కాక మరెలా ఉంటాయి? అదిసరే, హస్తి మహారాజు నన్ను సన్మానిస్తున్నప్పుడు వారి సామంత రాజు నిశానుని ముఖమును గమనించావా?" సత్యధరని అడిగింది యశోధర.
"గమనించలేదు. ఏం?.. నీ సన్మానం ను చూచి నిశానుడు
కళ్ళతో నిప్పులు చిమ్మాడా ? తనలో తాను కుళ్ళుకు న్నాడా?" అని యశోధర ను అడిగింది సత్యధర.
"ఓర్వలేని తనాన్ని ప్రదర్శించడం, కుళ్ళుకోవడం వంటివి కొందరు రాజుల సహజ గుణం. వాటిని మనం అంత తీవ్రంగా తీసుకోరాదు. కానీ నేను నిశానుని ముఖం లోని వికారాలన్నీ గమనించాను. అతను హస్తి మహారాజు కు ఏదో ప్రమాదం తలపెట్టాలనే దుర్బుద్ధి తో ఇక్కడికి వచ్చినట్లు ఉన్నాడు. అతగాడు ఈ రాత్రి హస్తి మహా రాజు కు ఏదో అపాయం తలపెట్టేటట్లు ఉన్నాడని నా మనసు నాకు చెబుతుంది. " అని సత్యధరతో అంది యశో ధర.
"అయితే మనమిప్పుడు ఏం చేద్దాం?" రాణి యశోధరను ప్రశ్నించింది సత్యధర.
"హస్తి మహారాజు మాతృమూర్తి సువర్ణాదేవి మనకు అంతఃపురం లోని అన్ని మందిరాలను చూపించింది కదా ? మనం కొంత సమయం గడిచిన పిమ్మట హస్తి మహారాజు మందిరానికి వెళ్దాం" అంది యశోధర.
"అలాగే" అంది సత్యధర.
కొంత సమయం గడిచిన పిమ్మట యశోధర మారు వేషంలో సత్యసేన తో హస్తి మహా రాజు మందిరం దగ్గరకు వెళ్ళింది. ఆద మరిచి నిద్ర పోతున్న హస్తి మహారాజు ను చంపడానికి సిద్దమైన నిశానుని యశోధర చూసింది. నిశానుని గుండెల మీదకు పదునైన బాకును విసిరింది. ఆ బాకు వలయాకారంగా తిరుగుతూ వెళ్ళి, నిశానుని గుండెను చీల్చుతూ, అతని గుండెల్లో దిగబడింది. బాకుకున్న కాలసర్ప విషం నిశానుని శరీరంలో చొరబడింది. ఒక కన్ను ఎర్రబడగ, మరో కన్ను పచ్చబడగ నిశానుడు అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు.
హస్తి మహారాజు నిద్రలేచి జరిగిందంత తెలుసు కున్నాడు. నిశానుని కళేబరాన్ని, కన్నులను చూసాడు. మిక్కిలి సంతోషించాడు. యశోధరను తగిన రీతిలో సన్మానించాడు.
సువర్ణాదేవి, సుహోత్రుడు యశోధర తలిదండ్రులను కలిసారు. అనేకానేక విలువైన కానుకలను సమర్పించారు. యశోధరను తమ యింటి కోడలిని చేయమని ప్రార్థించారు.
యశోపిత వరుల చిత్ర పటాలున్న గదికి సవర్ణాదేవిని, సుహోత్రుని తీసుకువెళ్ళాడు. ఆ గదిలో అన్ని చిత్ర పటాల నడుమ ప్రత్యేక పూజలందు కుంటున్న హస్తి మహారాజు చిత్ర పటాన్ని సువర్ణాదేవి సుహోత్రుడు చూసారు. మిక్కిలి ఆనందపడ్డారు. యశోధర మనసులోని అభిప్రాయాన్ని గమనించారు.
యశోధర హస్తి మహారాజుల వివాహం అంగ రంగ వైభవంగా జరిగింది. యశోధర హస్తి మహారాజు ల వివాహం జరిగిన విధానం సమస్తం గమనించిన కొందరు వారిది, "బ్రాహ్మ" వివాహం అంటే మరికొందరు కాదు కాదు యశోధర తలిదండ్రులు యిచ్చిన గోవులతో గో పూజ చేయడం జరిగింది కావున వారిది "ఆర్ష" వివాహం అని అనేవారు.
ఇంకొందరు అదేం కాదు కాదు వారి వివాహం లో ప్రాజాపత్యం ఉంది. ఆసురం ఉంది. నిజం చెప్పాలంటే వారిది గాంధర్వ వివాహం అనేవారు. ఇలా ఎవరి ఇష్టం వచ్చిన రీతిలో వారు యశోధర హస్తి మహా రాజుల వివాహం గురించి చెప్పుకునేవారు.
యశోధర హస్తి మహారాజు కొంత కాలం హిమాలయాది పుణ్య ప్రదేశాలను సందర్శించారు. అక్కడి మహర్షుల, రాజర్షుల క్షేమసమాచారాలను అడిగి తెలుసుకున్నారు. అటు పిమ్మట తమ తమ సాటి రాజుల సామంత రాజుల రాజ్యాలలో ఉన్న రాజధానులను, దేవళాలను, వింత కట్టడాలను సందర్శించారు. ఆయా రాజుల అతిథి మర్యాదలను వినయంతో స్వీకరించారు. ఆయా రాజులు చేసిన యజ్ఞయాగాదులలో పాలు పంచుకున్నారు. కొందరు సామంత రాజులకున్న సమస్యలను తీర్చారు.
చివరకు యశోధర హస్తి మహారాజులు ప్రస్థలకు వచ్చారు. యశోధర త్రిగర్త రాజ్యములోని సంశప్తకుల గురించి హస్తి మహారాజు కు చెప్పింది. ఆపై హస్తి మహారాజు త్రిగర్త రాజధాని ప్రస్థల మొత్తాన్ని సందర్శించాడు. అక్కడి ప్రత్యేకతలన్నిటిని గమనించాడు. ఇంతకంటే అందమైన రాజధానిని తన రాజ్యంలో నిర్మించాలని అనుకున్నాడు. అదే విషయాన్ని తన ధర్మపత్ని యశోధర కు చెప్పాడు. అనంతరం హస్తి మహారాజు యశోధర తో తన రాజ్యానికి వచ్చాడు. తన మందిరంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. ఆసమావేశంలో యశోధర, సువర్ణాదేవి, సుహోత్రుడు, భరద్వాజుడు తదితరులు ఉన్నారు. అంత హస్తి మహా రాజు తన తండ్రి సుహోత్రునితో, " తండ్రి, మీరు అనేక దండ యాత్రలు చేసారు. నానా విధముల యజ్ఞయాగాదులు చేసారు. మన రాజ్య వాసులు రెండు తరములకు పైగా సుఖసంతోషాలతో ఉండేవిధంగా సంపదను కూడబెట్టారు. అది గమనించిన మన ప్రజలు మన కోసం వారి ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్దంగా ఉన్నారు. ఇది చాలా సంతోషించ వలసిన విషయం. అయితే నేను ప్రస్థలను చూచిన పిమ్మట మన రాజ్యానికి చక్కని రాజధాని లేదనిపిస్తుంది. ఇందుకు మీరేమంటారు?" అన్నాడు.
"దీనికి సమాధానం మన భరద్వాజులవారే చెప్పాలి. " కుమారునితో అన్నాడు సుహోత్రుడు.
"తప్పకుండా చెబుతాను సుహోత్ర. తప్పకుండా చెబు తాను. మీ తాతగారు భరత మహారాజుగారు భరత వంశ కర్త. వారి పేరు మీద జంబూ ద్వీపానికి భారత దేశం అనే పేరు వచ్చింది. భారత దేశంలో నివసించే వారందరూ మేం భారతీయులం మాది భారత జాతి అని చెప్పుకోవడానికి నేడు సహితం మహా గర్వపడుతున్నారు..
ఈ జంబూ ద్వీపాన ఇంద్ర కసేరు తామ్ర వర్ణ గభస్తి నాగద్వీప సౌమ్య గంధర్వ వరుణ అని ఎన్ని భాగాల జాతులు ఉన్నా అందరూ మాది భారత జాతి అని చెప్పుకోవడానికే ఎక్కువగా ఇష్ట పడుతారు.. భరత మహారాజు గొప్ప పరిపాలనా దక్షుడు. తన అవక్రపరాక్రమాలతో మహేంద్ర మలయ సహ్య శుక్తిమాన్ వింధ్య పరియాత్ర వంటి ప్రధాన పర్వత శ్రేణుల నడుమన ఉన్న భూమినంత తన స్వంతం చేసుకున్నాడు. ఆయనకు కాశీరాజు కుమార్తె సునందతో పాటు మరో ఇద్దరు భార్యలు ఉన్నారు.
మొదటి ఇద్దరు భార్యల ద్వారా భరతునికి తొమ్మిది మంది సంతానం కలిగారు. వారు మహా కౄరులుగ పెరిగారు. వారి కౄరత్వం వారి తల్లులనే హింసించే స్థాయికి ఎదిగింది. అప్పుడు ఆ తల్లులు ఆ తొమ్మిది మంది వ్యర్థ సంతానాన్ని సంహరించేసారు. ఆ సంహారాన్ని చూచి దుర్గామాత కూడా భయపడి పోయింది.
దుర్మార్గులకు సింహాసన బాధ్యత అప్పగించకూడదని ఆ తల్లులు పుత్ర వధతో నిరూపించి చూపించారు. నేను అప్పుడు భరతుని ప్రార్థనను అనుసరించి శాంతి యాగం చేయించాను. ఆపై భరతుని మూడవ భార్య అయిన సుమమ, భరతుల చేత సంతాన యాగం చేయించాను. వారికి భూమన్యుడు జన్మించాడు. భూమన్యుడు రాజయ్యాడు..
భూమన్యుడు మొదలైన వారు రాజ్యాభి వృద్ధికి కృషిచేసినంతగా రాజధాని నిర్మాణం నిమిత్తం కృషి చెయ్యలేదు. ఇక రాజధాని నిర్మాణం మన హస్తి మహారాజే చేపట్టాలి" అన్నాడు భరద్వాజుడు.
"చిత్తం భరద్వాజ మునీంద్ర చిత్తం. మీ మా టలను తప్పని సరిగా పాటిస్తాను. " రెండు చేతులు జోడించి భరద్వాజునికి నమస్కరిస్తూ అన్నాడు హస్తి మహారాజు.
"హస్తి మహారాజ! రాజధాని నిర్మాణ విషయంలో నువ్వు నీ ధర్మ పత్ని యశోధర సలహాలను తీసుకోవడం సముచితంగా ఉంటుంది. యశోధర సామాన్య వనిత కాదు. ఆమె శిక్షణ లో తయారైన సంసప్తకులు శత్రు బలాలను, బలహీనతలను చక్కగా గమనిస్తారు. వారు శత్రువులు బలవంతులని గమనిస్తే వారికి వెన్ను చూపరు. వారి అంత్యక్రియలను వారే చేసుకుని సమర రంగం లో కొదమ సింగాల్లా చెలరేగిపోతారు. సంసప్తకులకు యశోధర అలా శిక్షణ ఇచ్చింది. కావున నీ ధర్మపత్ని యశోధర సలహాలు నీకు మహోన్నత మేలు చేస్తాయని మరువకు. " అని హస్తి మహారాజు తో అన్నాడు భరద్వాజుడు.
"చిత్తం " అన్నాడు హస్తి మహారాజు. తదనంతరం
హస్తి మహారాజు రాజధాని నిర్మాణ నిమిత్తం తన ధర్మప త్ని యశోధర అభిప్రాయాలను అడిగాడు.
యశోధర మాటలను అనుసరించి హస్తి మహారాజు సామంత రాజులందరిని సతీ సమేతంగా సమావేశ పరిచాడు. తను రాజధాని నిర్మాణమునకు సంసిద్దమ య్యానని వారందరికి చెప్పాడు. సామంత రాజులందరూ మిక్కిలి సంతోషించారు. వారికి తెలిసిన సూచనలు ఇచ్చారు. హస్తి మహారాజు అందరి సూచనలను స్వీకరించాడు. ఆపై రాజధాని నిర్మాణ విషయంలో తన అభి ప్రాయాలను చెప్పమని ధర్మపత్ని యశోధరను అడిగాడు.
అప్పుడు యశోధర "అందరికీ ముందుగా వందనాలు. త్రిగర్త రాజధాని ప్రస్థల. అది మా పుట్టిల్లు. ఒకసారి మూడు నదుల అంతర్భాగం నుండి శత్రువులు ప్రస్థల మీదకు యుద్దానికి వచ్చారు. అప్పుడు నేను జలంధర విద్య ద్వారా సంసప్తకుల సహాయంతో శత్రువులను జలవలయంలో బంధించి చంపాను.. ఆ అనుభవా లన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రస్థలను మించిన రాజధానిని నిర్మించాలనే సంకల్పంతో ఉన్నాము.
కాల ధర్మ చక్రంలో ద్విపాద సంచార ధర్మం మనది. అందుకు తగ్గట్టుగానే మనం నడుచుకోవాలి. మన రాజధాని నిర్మాణం కూడా అందుకు తగ్గట్టుగానే ఉండాలి. రాజధాని లోని రాజ మందిరాలకు రకరకాల చలువరాళ్ళను సేకరించాలి. అలాగే రకరకాల ఉష్ణ రాళ్ళను, ఉష్ణశీతల రాళ్ళను సేకరించాలి. శ్రేష్టమైన మట్టిని, సున్నమును, జిగురును, రకరకాల చెట్లు నుండి వచ్చే చెక్కను సేకరించాలి. కొండ రాళ్ళను సేకరించాలి.
శ్రేష్టమైన ఇసుకను సేకరించాలి.
ఇక మన రాజధాని లో విస్తృతం గా గోసంపద ఉండాలి. మా మామగారి దయవలన మన రాజ్యం లో ధన కనక మణిమయాది విలువైన వస్తువులకు కొదవలేదు. మనకున్న ధనంలో పావు లో పావు శాతం ధనాన్ని వెచ్చిస్తే చాలు మనకు కావాల్సినంత గోసంపద వస్తుంది.
మత్స్య రాజ్యంలో గో సంపద పుష్కలంగా ఉంటుందని విన్నాము. " అంది యశోధర.
"ఆ గోసంపదను కొల్లగొడదాం మహారాణి " అని ఒక సామంత రాజు యశోధరతో అన్నాడు.
"అలాంటి పనులు మాత్రం ఇక మీదట చేయకండి. గో సంపదను విక్రయించడం ధర్మం అవుతుంది కానీ కొల్లగొట్టడం ధర్మం కాదు. రాజధాని నిర్మాణం పవిత్ర పథాన సాగాలి కానీ అపవిత్ర పథాన సాగరాదు.
గో సంపద తర్వాత అనేకానేక వ్యూహాలలో ఆరితేరిన సమరయోధులను తయారు చేద్దాం. నాకు జలంధర వంటి కొన్ని వ్యూహాలతో పాటు గరుడ వ్యూహం బాగా తెలుసు. దానిని సమయం చూసుకుని ఉత్సాహం ఉన్న స్త్రీ పురుషులందరికీ నేర్పుతాను.
మన రాజ్యాలలో రాజ్యం కోసం ప్రాణాలిచ్చే సమర యోధులు అనేకమంది ఉన్నారు. వారిని సంసప్తకాలు గా విభజించుదాం. అనేకమంది అతిరథ మహారథులను తయారు చేద్దాం. ఇక ధర్మం తెలిసిన వ్యాపారస్తులను, నూతన వస్తు రూపకల్పన చేయగల విజ్ఞానవేత్తలను, మేథావులను ప్రోత్సహించుదాం. ఇలా కొత్త రాజధాని లో సమస్తం ఉండేటట్లు రాజధాని నిర్మాణం చేద్దాం " అంది యశోధర.
యశోధర మాటలను అందరూ సమ్మతించారు.
యశోధర గో విక్రయం నిమిత్తం గోపాలకులతో, కొంత సైన్యంతో కలిసి మత్స్య రాజ్యం పయనమయ్యింది.
హస్తి మహారాజు రాజధాని నిర్మాణం కు కావలసిన పెద్ద పెద్ద కొండ రాళ్ళ నిమిత్తం గజ సంపదను తీసుకుని అచలాచలం వెళ్ళాడు. దారి మధ్యలో యశోధర సైన్యం ను చేడి, బొడ్డు రాజ్యాల సైన్యం ముట్టడించింది.
యశోధర శత్రు సైన్యం తో సమరానికి సిద్దపడింది. వివిధ రకాల నాగాస్త్రములను శత్రువుల మీదకు వదిలింది. శత్రువుల కాళ్ళనుండి బొడ్డు వరకు విష నాగులు చుట్టుకున్నాయి. వారిని కదలకుండా చేసాయి. అప్పుడు ఆమె సైన్యం లో ఉన్న సంసప్తకులు వారిని చీల్చి చెండాడారు. సమరము ముందే సంసప్తకులు శత్రువులను చంపుతాము లేదా మేం చనిపోతాము అని ప్రతిజ్ఞ చేసారు. ఆపై శత్రు సైన్యం ను ఊచకోత కోసారు.
శత్రువులు యశోధరతో సమరం చేస్తున్నారన్న విషయం తెలిసి మత్స్యరాజు యశోధర కు సహాయంగా వెళ్ళా డు. శత్రువులు యశోధరను, మత్స్య రాజును చూసి కాలికి బుద్ది చెప్పారు.
మత్స్య రాజు యశోధర కు స్వాగతం పలికాడు. పెద్ద ఎత్తున సన్మానం చేసాడు. తమ ఆడ బిడ్డలు తయారు చేసిన బొమ్మ పొత్తికలను చూపించాడు. "ఆ బొమ్మ పొత్తికల తయారీకి ఉపయోగించిన వస్త్రాలు మచ్ఛిల్లిక, పారదక వంటి రాజ్యాల రాజుల కిరీట అలంకరణకు సంబంధించినవి "అని చెప్పాడు. అనంతరం మీకు కావల్సినంత గోసంపదను ఉచితంగా తీసుకు వెళ్ళమన్నాడు.
అందుకు యశోధర సమ్మతించలేదు. మత్స్య రాజుకు తగిన విత్తం చెల్లించి గోసంపదను వశం చేసుకుంది. అందరితో కలిసి గోపూజ చేసింది.
హస్తి మహారాజు కొండల్లో ఉన్న చోరులతో పోరాటానికి సిద్ద పడ్డాడు. అచల వ్యూహం పన్ని శత్రువులను చెల్లాచెదురు చేసాడు. తన దగ్గర ఉన్న సంసప్తకులతో సమర నియమాలు పాటించని చోరులతో తగు రీతిలో ప్రవర్తించి సమరం చేయమన్నాడు. సంసప్తకులు అలాగే అని పిల్లిగంతుల వ్యూహాన్ని పన్నారు. అప్పుడు చోరులతో ఉన్న మాయావి అసుర అశ్వాలను సృష్టించి సంసప్తకుల మీదకు వదిలారు.
సంసప్తకులు అసుర అశ్వాలను మట్టుబెట్టారు. రక్త నాలికలతో అసుర శక్తిని భయ పెట్టి అవతలకు తరిమేశారు. మాయావి మరణించాడు. చోరులు మరణించారు. హస్తి మహారాజు పెద్ద పెద్ద కొండ రాళ్ళ తో రాజధాని నిర్మాణ ప్రాంతానికి వచ్చా డు.
మహర్షుల యజ్ఞయాగాదులను నిర్వహించారు. గోపూజ అనంతరం రాజధాని నిర్మాణం ప్రారంభమైంది. రాజధాని నిర్మాణం నకు ప్రజల ఆర్థిక సహాకారం తీసుకుంటే బాగుంటుందని కొందరు సామంత రాజులు యశోధర హస్తి మహారాజు లతో అన్నారు. అందుకు యశోధర సమ్మతించలేదు.
"రాజధాని నిర్మాణం నకు రాజకీయంగా అధిక ప్రయోజనం పొందేవారు సహాయం చేస్తే సరిపోతుంది. మన రాజధాని లో ఉన్న ఒక్కొక్క సచివుడు ఒ క్కొక్క మందిరాన్ని నిర్మిస్తే చాలు. రాజధాని నిర్మాణం పరిపూర్ణంగా సంపూర్ణం అవుతుంది. రాజధాని నిర్మా ణం పేరుతో ప్రజల శ్రమను దోచుకునేవారు రాజులు సచివులు కారు. దోపిడీ దారులు అవుతారు. అధికార అహంతో నిరుపేదలను యిష్టం వచ్చినట్లు దోచుకున్న రాజులు అధికం అవ్వడంతోనే ఒకనాడు పరశురాముడు 21 పర్యాయాలు భూమిని చుట్టుముట్టి దుర్మార్గ రాజులందరిని హతమార్చాడు. మనం అలాంటి దుర్మార్గ మార్గాన సంచరించవద్దు. సన్మార్గ పథాన సంచరించే రాజధాని నిర్మాణం చేద్దాం. సామంత రాజులు కూడా మీ రాజ్యంలోని నిరుపేద ప్రజలను హింసించి ధనం తీసుకురాకండి. మీరు సహాయం చేయగలిగినంత మాత్రమే సహాయం చెయ్యండి. " అని యశోధర సామంత రాజులతో అంది.
"యశోధర చెప్పినట్లుగా సంచరించుదాం. మనం పరశురాముని కోపానికి బలవ్వవద్దు. " చిరునవ్వుతో సామంత రాజుల తో అన్నాడు హస్తి మహారాజు.
రాజధాని నిర్మాణం అనుకున్నదానికంటే ముందుగానే ముగిసింది. భరద్వాజుడు వంటి మహర్షులు అనేకమంది కలిసి చర్చలు చేసి ఆ రాజధానికి "హస్తినాపురం" అని నామకరణం చేసారు. అనంతరం అనేకానేక యాగాలు చేసారు. రాజధాని లోని ప్రజలందరిని తగిన రీతిలో సన్మానించారు.
హస్తినాపురం దినదిన ప్రవర్ధమానమవ్వ సాగింది. హస్తి మహారాజు గజ బలాన్ని, అశ్వ బలాన్ని విరివిగా అభివృద్ధి చేసాడు. యశోధర అనేకానేక సమర వ్యూహాలను సైనికులకు నేర్పించింది. క్రమం తప్పకుండా గో పూజలను, యజ్ఞ యాగాలను చేయించింది.
యశోధర నెల తప్పింది. అది తెలిసిన హస్తి మహారాజు మిక్కిలి సంతోషించాడు. హస్తినాపురం లో, రాజ్యం లో రకరకాల రీతులలో విందు వినోదాలు ఏర్పా టు చేసాడు.
యశోధర ఓ పుణ్య ముహూర్తాన పండంటి శిశువుకు జన్మనిచ్చింది. భరద్వాజాది మహర్షులు శిశువు జాతకాదులను పరిశీలించి "వికంఠునుడు" అని శిశువుకు నామకరణం చేసారు. ఇలా హస్తి మహారాజు పేరు మీద హస్తినాపురం ఏర్పడింది. ఈ హస్తినాపురం ను కొందరు గజపురం అనీ, మరికొందరు నాగపురం అనీ, బ్రహ్మ స్థలం అని కూడా పిలిచేవారు.
అయితే హస్తి మహారాజు పేరున నిర్మించబడిన హస్తినాపురమనే పేరే యుగయుగాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. యశోధర హస్తి మహారాజుల ముద్దుల తనయుడు గా వికంఠునుడు దినదిన ప్రవర్ధమాన మవ్వసాగాడు.
సర్వే జనాః సుఖినోభవంతు
వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
Comments