top of page
Writer's pictureSrinivasarao Jeedigunta

యాత్ర



'Yathra' - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao

Published In manatelugukathalu.com On 04/08/2024

'యాత్ర' తెలుగు కథ

రచన : జీడిగుంట శ్రీనివాసరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



శ్రీధర్, రచన యిద్దరూ భార్యభర్తలు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు అవడంతో పిల్లలని చిన్నప్పుటి నుంచి పిల్లలను చూసే స్కూల్ లో వుంచి సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చే టైములో తీసుకుని వచ్చే వాళ్ళు. ఆదివారం తప్ప పిల్లలు తల్లిదండ్రులతో గడపటానికి అవకాశం వుండేది కాదు. రచన మొగుడితో చాలా సారులు అనేది, వెధవ ఉద్యోగం మానేసి పిల్లలని చూసుకుంటాను, మీ జీతం తో మమ్మల్ని పోషించలేరా అనేది. 


అయితే తను కూడా ఉద్యోగం చేసి కొంత డబ్బు దాచుకుంటేనే పిల్లలకు మంచి భవిష్యత్ యివ్వటం కుదురుతుంది అని ఉద్యోగం మానలేక పోయింది. పిల్లలకు కొద్దిగా ఊహ వచ్చేసరికి తమ తల్లిదండ్రులు తమని ఎక్కడో వదిలి వెళ్లిపోతున్నారు అనే భావం మనసులో పడిపోయింది, అయితే వాళ్ళకోసమే తల్లిదండ్రులు యిప్పుడు కష్టపడుతున్నారు అనే విషయం గ్రహించలేని వయసు. 


పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు, కాలేజీ చదువులకు వచ్చేసారు. కొడుకు సుధాకర్, కూతురు సీత యిద్దరూ బాగా చదువుకునే వాళ్ళు. సుధాకర్ టెన్త్ క్లాస్ లోనే తల్లిదండ్రులని ఒప్పించి స్కూటర్ కొనిపించుకున్నాడు. కూతురు సీత తన చదువు తప్పా ఎక్కువ కోరికలు వుండేవి కావు. అందుచే సుధాకర్ కే అన్నీ సుఖాలు. అయితే చదువులో ఎక్కడా తేడా రాకుండా చదువుకునే వాళ్ళు. 


కాలనుకూలంగా శ్రీధర్, రచన ల జీతాలు పెరగడం తో, పిల్లలకి సెలవలు ఇవ్వగానే ఊటీ, మైసూర్, మొదలగు ప్లేసెస్ కి తీసుకుని వెళ్లి వారం రోజులు గడిపి వచ్చేవాళ్ళు. 


పిల్లల చదువులు అయిపోయాయి అనుకునే లోపే శ్రీధర్, రచన లు ఇద్దరూ రిటైర్ అయిపోయారు. 


“ఏమండీ! పిల్లలని పోస్ట్ గ్రాడ్యుయేట్ చెయ్యకుండా, మనం సర్వీస్ లో వుండగానే పెళ్లిళ్లు చేసి వుండి వుంటే బాగుండేది. వాళ్ళు చదుకుంటో వెళ్లిపోవడం, మనం చదివిస్తో చివరికి సర్వీస్ నుంచి రిటైర్ అయిపోవడం జరిగిపోయింది. ఇప్పుడైనా మంచి సంబంధం వెతికి సీత పెళ్లి చేస్తే, మన బాధ్యత నెరవేరినట్టే” అంది. 


“కంగారు పడకు, రిటైర్ అయితే ఏం, డబ్బులు వచ్చాయి, ఆ డబ్బుతో పిల్ల పెళ్లి చేసి, మిగిలిన డబ్బుతో ఒక సింగల్ బెడ్ రూమ్ యిల్లు కొనుకుందాం. పెన్షన్ నాకు ఎలాగో వస్తుంది, గుట్టు చప్పుడు కాకుండా మిగిలిన జీవితం లాగేయవచ్చు” అన్నాడు శ్రీధర్. 


రిటైర్మెంట్ డబ్బులు అన్నీ వచ్చిన తరువాత కూతురికి మంచి అబ్బాయి ని చూసి ఆడంబరంగా పెళ్లి చేసి కాపురానికి పంపించాడు, యిహ మిగిలింది తను, భార్య, కొడుకు. కొడుకుకి ఉద్యోగం రాగానే వాడికి కూడా పెళ్లి చేస్తే, యిహ అమ్మయ్య అనుకోవచ్చు అన్నాడు భార్య రచన తో. 


కొడుకు ఉద్యోగం వచ్చి చెన్నై వెళ్ళిపోయాడు. యిహ మిగిలింది మొగుడు పెళ్ళాం. కొడుకు కూతురు వెళ్లిపోవడంతో ఇల్లంతా బోసిపోయింది. తినడం పడుకోవడం యిదే పని దంపతులిద్దరికి. “మగపిల్లాడి పెళ్ళికి మనకి ఖర్చులు ఎక్కువ వుండవు, కాబట్టి ఏదైనా సింగల్ బెడ్ రూమ్ ఫ్లాట్ కొనడం గురించి ఆలోచించండి, ఈ నాలుగు రూపాయలు అయిపోతే, ఉండటానికి యిల్లు కూడా వుండదు. ఏమిటో ఇద్దరు ఉద్యోగం చేసినా చివరికి మిగిలింది ఏమిటి” అంది రచన. 


శ్రీధర్, రచన యిద్దరు కొడుకు దగ్గరికి వెళ్లి కొన్నాళ్ళు వున్నారు. అప్పుడు సుధాకర్ తన తల్లితో చెప్పాడు, “మా ఆఫీస్ లో పనిచేస్తున్న మమత అనే అమ్మాయిని పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను, ఈ రోజు సాయంత్రం ఆ అమ్మాయి మన యింటికి వస్తుంది, నువ్వు, నాన్న జాగ్రత్తగా మాట్లాడి కాబోయే కొడలి దగ్గర మార్కులు కొట్టేయాలి” అన్నాడు. 


కొడుకు మాటలకి తెల్లబోయిన రచన, “అదేమిటిరా విచిత్రం? మేము ఆ అమ్మాయి ని మెప్పించటం ఏమిటి, అయినా నువ్వు ఈ ప్రేమించడం ఏమిటి, మేము మంచి సంబంధం చూసి చేసే వరకు ఆగకుండా” అంది. 


“రోజులు మారిపోయాయి అమ్మా, యిప్పుడు అంతా ప్రేమ పెళ్లెళ్ళు మాత్రమే, ఆ అమ్మాయికి మైసూర్ బజ్జిలు అంటే ఇష్టం, సాయంత్రం చేసి పెట్టు అమ్మ” అన్నాడు. 


హాలు లోనుండి అంతా విన్న శ్రీధర్ “యింతకీ అమ్మాయి వాళ్ళు మనవాళ్లేనా, అది అడుగు ముందు” అన్నాడు అరుస్తో. 


“ఆ, వెజిటీరియన్స్ వాళ్ళు కూడా” అన్నాడు సుధాకర్. 

“అంటే మనవాళ్ళా కాదా ముందు సరిగ్గా చెప్పు” అన్నాడు శ్రీధర్. 

“వాళ్ళు సంఘం లో పేరున్న కులం, రాజకీయం గా కూడా, పలుకుబడ్డ కులం. అమ్మాయి వాళ్ళ ఫాదర్, మదర్ మంచి ఉద్యోగం చేస్తున్నారు. మొదటి నుంచి వెజిటేరియన్, వాళ్ళకి నేను బాగా నచ్చాను, మీరు కూడా గొడవ పెట్టకుండా ఒప్పుకుని నన్ను ఒక యింటి వాడిని చేసేయండి” అన్నాడు తెగించి. 


“అంటే మన కులం కాదు అన్నమాట, ఎంతకు తెగించావురా, , యిహ వాడితో వుండే కంటే మనం మన యింట్లో ఉండి మీ పెన్షన్ తో కాలం గడుపుదాం” అంది రచన. 


“యిప్పుడు మనం కాదన్నా వాడు ఆ అమ్మాయిని చేసుకోక మానడు. పైపెచ్చు పుట్టుకతో మాంసాహారం తినే వాళ్ళు, యిప్పుడు వీడికోసం వెజిటేరియన్స్ గా మారిపోయారు అని చెప్పాడు అంటే యిహ మన చేతుల్లో ఏమిలేదు, ఆ నాలుగు అక్షింతలు వేసి మన బ్రతుకు మనం బ్రతకాలి, సాయంత్రం ఆ అమ్మాయి తో మాట్లాడి, రేపు హైదరాబాద్ వెళ్ళిపోదాం” అన్నాడు శ్రీధర్ భార్యతో. 


రోజులు గడుస్తున్నాయి, ఆడపిల్ల తండ్రి నుంచి పలకరింపు కూడా లేదు, అవునులే మనవాడిని కుక్కపిల్ల ని చేసి తిప్పుకుంటున్నారు, యిహ మనతో ఏం పని అంది రచన భర్తతో. 


“ముందు ఆ ఫ్లాట్ కొనటానికి పనులు మొదలు పెట్టండి. లేకపోతే యిల్లు కూడా ఉండదు ఉంటానికి మనకంటు” అంది. 


తమకి అందుబాటులో వున్న ఒక సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ చూసి కొడుకు సుధాకర్ కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. 

“నాన్నా! డబ్బులు యిప్పుడు యింటి మీద పెట్టద్దు. మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ వారం ఆడపెళ్లి వాళ్ళు మీతో మాట్లాడటానికి వస్తారు. వాళ్ళకి కట్నం యివ్వడం కాని, తీసుకోవడం కాని ఇష్టం లేదు. ఎవ్వరి ఖర్చులు వాళ్లే పెట్టుకోవాలి. అందుకే మీరు వాళ్ళతో కట్నం, ఖర్చులు అంటూ ఏమి మాట్లాడకండి” అన్నాడు సుధాకర్. 


“మరి పెళ్లి చెన్నై లో అయితే హైదరాబాద్ నుంచి మనతో అరవై మంది చుట్టాలు వస్తారు, ట్రైన్ టికెట్స్, బట్టలు పెట్టడం, లాంటివి ఎంతైనా పది లక్షలు, పెళ్ళి కూతురు కి నగలకి పది లక్షలు అవుతాయి, మరి నువ్వు అంత డబ్బులు నీ దగ్గర వున్నాయా?” అని ఆడిగాడు కొడుకుని. 


“నేను ఉద్యోగంలో చేరింది ఎంతో కాలం కాలేదు, నా దగ్గర డబ్బులు ఎక్కడివి నాన్న, అందుకే మిమ్మల్ని అడిగేది.. యిప్పుడు యిల్లు కొందాం అని అనుకోక, మనం వాళ్లకు ఎక్కడా తగ్గకుండా మీ దగ్గర వున్న డబ్బులు ఖర్చు పెట్టి మర్యాద దక్కించుకోవాలి” అన్నాడు. 


“అయినా మీకు యిల్లు ఎందుకు, నాతోనే వుంటారు గా” అన్నాడు సుధాకర్. 


కొడుకు మాటలకి నీరసపడిపోయాడు. ఏమంటున్నాడు అంటూ అడిగిన భార్య కి వున్న విషయం చెప్పాడు. 


“మన డబ్బు వాడి పెళ్ళికి ఖర్చు పెట్టడం కుదరదు, వాడి దగ్గర డబ్బులు వుంటే పెళ్ళి చేసుకుమనండి లేదంటే మానేయమనండి అంతే, పిల్లని వాడే వెతుకుంటాడు, పెళ్లి మాటలు ఏమి మాట్లాడాలో వాడే చెపుతాడు, ఆ మాటలు ఏవో కాబోయే మామగారికి చెప్పుకోమనండి. ఆడపిల్ల పెళ్లి కి ఖర్చు పెట్టలేని వాళ్ళు వీడికి ఎలా దొరికారండీ” అంది రచన. 


“వుండు, మనకి కావాలిసిన వస్తువుని అమ్మేవాడు ఎంత చెప్పినా కొనాలిసిందే అన్నట్టుగా వీడు ప్రేమించిన అమ్మాయి కి వాళ్ళు ఎన్ని కండిషన్స్ పెట్టినా ఒప్పుకోక తప్పదు. మనం యింకా ఎన్నాళ్ళు బ్రతుకు తామో తెలియదు. నాన్న చూడు తన డబ్బులు అంటూ కూర్చున్నాడు అని పాచి మాట మనకెందుకు, ఎంతో కొంత ఖర్చు పెట్టి వాడి పెళ్లి చేసి, మనం యిప్పుడున్నట్టే అద్దె యింట్లో ఉందాం. పెన్షన్ మనం యిద్దరం తినడానికి సరిపోతుంది. ఆడాంబరాలు కి పోకుండా ఉందాం, కంగారు పడకు” అన్నాడు. 


“బాగుంది వరస, ఏదో యిల్లు కొనుక్కుని, మిగిలిన డబ్బుతో వచ్చే వడ్డీ తో తీర్ధయాత్రాలు చేద్దాం అనుకుంటే మొదటికే మోసం వచ్చింది, నాకు మాత్రం కొడుకు మీద ప్రేమ లేక కాదు, కాని రోజులు ఎలా వున్నాయో చూస్తువుంటే భయం గా వుంది” అంది. 


డబ్బులు మూడుంతులు ఖర్చు చేసి కొడుకు పెళ్లి చేసాడు. డబ్బు దగ్గర తప్పా ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా మర్యాదలు బాగానే చేసారు. మూడు నిద్రలకు కోడలిని ఇంటికి తీసుకుని వచ్చి వ్రతం చేయించాడు శ్రీధర్. 


కోడలు మమత కూడా మొదటి రోజు బిడియం గా వున్నా రెండో రోజు అత్తగారికి సహాయం చేద్దామని వంట గదిలోకి వచ్చింది. 


“నువ్వు యిప్పుడే కష్టం పడటం ఎందుకమ్మా, రేపు చెన్నై వెళ్లిన తరువాత వంట పని నీకు ఎలాగో తప్పదు” అంది రచన, మనసులో ఏముందో తెలియదు గాని. 


కొడుకు కోడలు, కూతురు అల్లుడు ఎవ్వరి దారిన వాళ్ళు వెళ్లిపోయారు. ముసలాళ్ళు యిద్దరు మిగిలిపోయారు. ఒక వారం రోజులలో ఒక చిన్న యింట్లోకి అద్దెకు వెళ్లిపోయారు రచనా, శ్రీధర్. 


కాలం గడుస్తోంది బరువు గా, వచ్చే పెన్షన్, మిగిలిన డబ్బు మీద వచ్చే వడ్డీ తో యిల్లు గడుపుతున్నాడు. కొడుకు రెండు మూడు సారులు ‘చెన్నై వచ్చేసి మా దగ్గర వుండండి’ అన్నా, ‘యిప్పుడే ఎందుకు రా? కొన్నాళ్ళు మీరు హాయిగా వుండండి, ఈ లోపల కోడలికి వంకాయ మెంతికారం కూర, బెండకాయ కాయ పలంగా 

వండే కూర లాంటివి నేర్పు’ అన్నాడు నవ్వుతు శ్రీధర్. 


మొగుడి మాటలు విన్న రచన, “ఏమిటీ.. అయితే కొడుకు కోడలు దగ్గర సెటిల్ అవ్వుదామని అనుకుంటున్నారా. ఆ మసాలా కూరలు తిందామనే” అంది. 

***


“ఏమిటీ ఆలా గోడ పట్టుకుని నడుస్తున్నారు, రోజూ గంటల తరబడి నడవద్దు అంటే వినరు, ఏమైంది” అంది మొగుడిని పట్టుకుని కుర్చీలో కూర్చో పెట్టి. 


“ఏమి లేదు ఎందుకో రెండు రోజులకొకసారి కళ్ళు తిరిగి పడిపోతాను అనిపిస్తోంది. కొంత సేపైన తరువాత తగ్గుతుంది లే, కంగారు పడకు, వయసు ప్రభావం” అన్నాడు శ్రీధర్. 

“ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి” అంది రచన, 


“యిప్పటికే చాలా మందులు వాడుతున్నాను, మళ్ళీ ఏదో మందు యిస్తే అదికూడా కొని వాడాలి. మందులకే అయిదు వేలు అవుతోంది నెలకు మనిద్దరికీ తెలుసా” అన్నాడు శ్రీధర్. 


“అలా అనుకుంటే ఎలా, అంతగా అయితే పాలు ఒక ప్యాకెట్ తీసుకుందాం, ముందు డాక్టర్ కి చూపించుకోండి” అంది. 


కొడుకుకి విషయం చెప్పింది. 


“అవును, నాన్న పెళ్ళిలో కూడా రెండు సారులు అలాగే వున్నారు, షుగర్ తగ్గిందేమో అనుకున్నా, అయితే యింకా తగ్గలేదా, మంచి డాక్టర్ కి చూపించుకోమని చెప్పు అమ్మ. ఆలా వదిలేస్తే మంచిది కాదు, వచ్చే నెల నేను వస్తాను” అన్నాడు. 


అయితే శ్రీధర్ తమ్ముడు ఏవో ఆకుల కషాయం చేసుకుని తాగితే తగ్గుతుంది అనడం తో అలాగే చేసాడు. విచిత్రం కొంత తగ్గినట్టుగానే వుంది. కొద్దిగా హుషారుగా కూడా వున్నారు అని కొడుకు కి చెప్పింది. అన్నట్టుగానే సుధాకర్ ఒక్కడే హైదరాబాద్ వచ్చి తల్లిదండ్రులతో గడిపి వెళ్ళిపోయాడు. 



ఒకరోజు భోజనం చేసి, టీవీ చూస్తున్న మొగుడితో, “ఏమండి! మన పక్కింటి సీతమ్మ గారు, వాళ్ల ఆయన కాశీ వెళ్తున్నారుట, యాత్రా బస్సులో, అక్కడ తొమ్మిది రోజులు వుంటే మళ్ళీ జన్మ వుండదుట, మనం కూడా వెళ్దాం అండి, నేను రోజూ ఏదో ఒక పూజ చేసుకుని పుణ్యం సంపాదించుకుంటున్నా, మీరే ఆ ఫోన్ పట్టుకుని కాలం గడిపేస్తున్నారు” అంది రచన. 


“ఎంత అవుతుందిట?” అన్నాడు శ్రీధర్, “ఇద్దరికి కలిపి అరవై వేలు అవుతుంది, పైన ఒక యిరవై వేలు పెట్టుకుంటే పదిరోజులు అందరితో సరదాగా గడిపి రావచ్చు” అంది. 


చిన్నగా నవ్విన శ్రీధర్, “నా దగ్గర అంత డబ్బు వుందని అనుకుంటున్నావా, పోనీ అబ్బాయిని ఒక యాభై వేలు పంపమంటాను, నువ్వు ఒక్కదానివి వాళ్ళతో వెళ్ళు” అన్నాడు. 


“భలే వారే, అసలే చెన్నై లో ఖర్చులు ఎక్కువ, వాడు డబ్బు చాలక ఏం యిబ్బంది పడుతున్నాడో, వద్దులెండి, యిప్పుడు కాశీ వెళ్లకపోతే పరవాలేదు, మన ఇంటిదగ్గర శివాలయం కి వెళ్తే చాలు, నాకు తెలియకుండా పిల్లాడిని డబ్బులు మాత్రం పంపమని అడగకండి” అంది. 


“యిద్దరు ఉద్యోగం చేసుకుంటూవుంటే వాళ్ళకి డబ్బు చాలదు అని తల్లీ హృదయం బాధ పడుతోంది, మరి ఒక్క నా పెన్షన్ తో మనం యిద్దరం ఎలా బతుకుతున్నామో అని అనిపించిందా నీకు” అన్నాడు శ్రీధర్. 


“చూడండి! తప్పంతా మీదే, పిల్లలని కూర్చోపెట్టి, మన సంపాదన ఎంత, ఖర్చులు ఎంత, బ్యాంకులో ఏమైనా నిలవ్వ చేసుకున్నామా లేదా అని చెప్పి వుంటే, యిప్పుడు యిలా బాధ పడే అవసరం వుండేది కాదు. పిల్లలు మిమ్మల్ని ఎటిఎం అనుకుంటున్నారు, వాడికి తెలిస్తే ప్రతీ నెలా ఎంతో కొంత డబ్బు పంపేవాడు. ఇన్నాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా వున్నాము, యిప్పుడు వాళ్ళకి మన యిబ్బందులు చెప్పి బాధ పెట్టక్కర్లేదు. అనవసరంగా యాత్ర అని మొదలుపెట్టాను” అంది రచన. 


“సరే, అలా పార్కులో కొద్దిగా తిరిగి వస్తాను” అంటూ బయటకు నడిచాడు. మనసులో యాత్ర కి వెళ్ళాలి అనే కోరిక వుంచుకుని కూడా పాపం డబ్బు లేక కోరిక చంపుకుంది, యిలా జీవితం లో ఎన్నో కోరికలు చంపుకుని పిల్లలు ని పైకి తీసుకుని వచ్చింది, ఈ కోరిక ఎలగైనా తీర్చాలి అనుకుని కొడుకు కి ఫోన్ చేసాడు. 


“అబ్బాయి, మేము పక్క యింటి వాళ్ళతో కాశీ కి వెళ్లి తొమ్మిది రోజులు వుండి రావాలి అని అనుకుంటున్నాము, అయితే లక్ష రూపాయలు అవుతుంది, నా దగ్గర కొంత వుంది, నువ్వు ఒక అరవై వేలు పంపగలవా” అని అడిగాడు శ్రీధర్. 


“పంపగలను కాని పంపను, అనారోగ్యం తోను కళ్ళు తిరుగుతో మీరు పది రోజులు వేరే ఊళ్ళో వుండటానికి నేను ఒప్పుకోను, నేను వద్దాము అనుకుంటే నాకు సెలవు లేదు. మీకు ఓపిక వుంటే నా దగ్గరికి రండి, విశ్రాంతి తీసుకుందురు గాని” అన్నాడు. 


“నువ్వు చెప్పేది నిజమే, అంత ప్రయాణం చేసే ఓపిక లేదు, అయినా అమ్మకి వెళ్ళాలి అని కోరిక. ఈసారి నీకు సెలవు దొరికినప్పుడు తీసుకుని వెల్దువుగాని” అని ఫోన్ ఆపేసాడు శ్రీధర్. 


ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కుని, భార్య పెట్టిన రెండు ఇడ్లీ తినేసి పడుకున్నాడు. 

“పక్కింటి ఆవిడకి చెప్పాను లేండి, మాకు కాశీ రావడం కుదరదు, మా అబ్బాయి తరువాత తీసుకుని వెళ్తాను అన్నాడని” అంది రచన. 


“సరే! యింకాదాని గురించి ఆలోచించక నీ పూజలు నువ్వు చేసుకో” అన్నాడు శ్రీధర్. 


తలుపులు చప్పుడు విని, రచన లేచి భర్త శ్రీధర్ తో “చూడండి ఎవ్వరో తలుపులు కొడుతున్నారు, యింకా చీకటిగానే వుంది, ఎవ్వరు వచ్చారో” అంది. 


శ్రీధర్ గోడపట్టుకుని హాల్ లోకి వెళ్లి లైట్ వేసి తలుపు తీసి ఆశ్చర్య పోయాడు. ఎదురుగా కోడలు మమత సూటకేస్ తో నుంచుని వుంది. 


“రా అమ్మ, వాడేడి” అన్నాడు. 


“నేను ఒక్కదాన్నే వచ్చాను మామయ్య గారు” అంటూ లోపలికి వచ్చింది. 


మాటలు విని రచన కూడా లేచి వచ్చి, కోడలిని చూసి, “బాగున్నావా, మీ ఆయన ఏడి” అంటూ వీధి వైపు చూసింది. 


“వాడు రాలేదు, ముందు కాఫీ పెట్టి అమ్మాయి కివ్వు, తరువాత వివరాలు అడుగుదువు” అన్నాడు. 


“యిప్పుడే కాఫీ వద్దు అత్తయ్య, మీరు కూడా యిటు వచ్చి కూర్చోండి” అని, “మామయ్యగారూ! మీరు నిన్న మీ అబ్బాయి తో మాట్లాడిన మాటలు విన్నాను స్పీకర్ ఆన్ చేసి వుండటంతో. 

తనకు సెలవు దొరికినప్పుడు యాత్ర అంటే ఎలా, మీరు చిన్న పిల్లలు కాదుగా, అందుకే ఆయన కి చెప్పాను, ‘మామయ్యగారిని, అత్తయ్య గారిని నేను కాశీ తీసుకుని వెళ్తాను, నాకు చాలా సెలవలు వున్నాయి’ అని చెప్పి బయలుదేరి వచ్చేసాను. రేపు ఉదయం ఫ్లైట్ కి మనం వారణాసి ప్రయాణం. యిహ నుంచి మీరు ఏ యాత్ర కి వెళ్ళాలి అన్నా తోడుగా నేను వుండి తీసుకుని వెళ్తాను” అంది మమత. 


కోడలు మాటలకి ఆనందం తో, “నీ గురించి అబ్బాయి మొదట చెప్పినప్పుడు, వాళ్ళు మనవాళ్లేనా అని అడిగాను. 

మనవాడు అయిన నా కొడుకు యాత్రా లేదు ఏమి లేదు అన్నాడు, కాని నువ్వు మా వయసు ని, కోరికని గుర్తించి, మమ్మల్ని కాశీ తీసుకుని వెళ్ళటానికి వచ్చావు, చాలా సంతోషం” అన్నాడు శ్రీధర్. 


“మీ అబ్బాయి భయం అంతా తను లేకుండా మిమ్మల్ని పంపితే పొరపాటున మీకు ఏమైనా అయితే ఎలా అని అంతే తప్పా మిమ్మల్ని తలుచుకొని రోజు వుండదు ఆయనకి. యిప్పుడు కూడానేను తీసుకొని వెళ్తాను అంటే తెగ సంతోషపడి నన్ను పంపించారు” అంది. 


పూర్తిగా తెల్లారిన తరువాత కొడుక్కి ఫోన్ చేసి “అబ్బాయ్, మేము కాశీ యాత్ర పూర్తి చేసుకుని తరువాత కోడలితో చెన్నై వస్తాము .కొన్నాళ్ళు వుంటాము లే నీ దగ్గర” అన్నాడు సంతోషం తో. 


                                    ... శుభం.....


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.













69 views0 comments

Comments


bottom of page