'Yavvana Kala Tharangalu' - New Telugu Story Written By Pandranki Subramani
Published In manatelugukathalu.com On 17/09/2024
'యవ్వన కాల తరంగాలు' తెలుగు కథ
రచన: పాండ్రంకి సుబ్రమణి
(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
వాసుదేవరావు పడకపైనుంచి లేచి అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలో తెలియని రీతిన కళ్ళను అరమోడ్చి మెల్లగా నడుస్తూ ఇంటి డాబా పైకి వచ్చాడు. అదేదో మొదటిసారి భౌతిక ప్రపంచం లోకి వచ్చిన గ్రహాంతర వాసిలా కళ్ళు విప్పార్చి చూడసాగాడు. ఉదయకాలపు చల్ల గాలులు దేవనర్తకి లయాన్విత పాదాల సవ్వడిలా అల్లనల్లన వీస్తున్నాయి. చెట్ల కొమ్మలపైన కొమ్మ కొమ్మన యెగురుతూన్న పిట్టల తోకలు కనిపిస్తున్నాయి. ఉడతలు అదేదో అత్యవసర కార్యానికి వెళ్తున్నట్టు వృక్ష శాఖలపై యెగిరెగిరి పరుగెత్తుతున్నాయి. ఒకటినొకటి ఢీ-కొట్టుకుంటున్నాయి.
దూరం నుంచి వసంత గానాన్ని గుర్తుకు తెచ్చేలా కోకిలమ్మ కమ్మగా లాలనగా కూస్తూంది. అంతటి కమ్మదనం యెవరిచ్చారో ఆ పికానికి! దాని గొంతున యెప్పుడో గగన మార్గాన పోతూన్న గంధర్వులెవరో అమృత భాండం గుమ్మరించి ఉంటారు. కళ్ళద్దాలు లాల్చీతో తుడుచుకుని తేరి చూసాడతను. వసంతాగమనానికి స్వాగతిస్తూ వనశోభలు వెల్లి విరుస్తున్నాయి. అక్కడేమో పక్షులు రాగాలు తీస్తూ పాడుతున్నాయి. ఇక్కడేమో తోటలోని మొక్కలు పల్లవిస్తూ పులకిస్తున్నాయి. సుమ బాలలేమో పరవశిస్తూ తలలూపు తున్నాయి.
అతడు చప్పున కళ్లు మూసుకున్నాడు. అంతర్లోకాలలోని అనామకుడికి అంతులేని చోటిస్తూ పరిసరాల వేపు కన్నెత్తి చూడకుండా తనెన్ని సుందర ఉదయాలను దూరం చేసుకున్నాడో! ఊరకేనా అన్నాడు ఓ కవీశ్వరుడు-‘ఉదయం నా హృదయం’ అని.
అతడలా ఆలోచిస్తూ మూసిన కళ్లు విప్పలేదు. వేడెక్కించే ఉద్రేకపు క్షణాలలో పుట్ట మునిగి మత్తెక్కించే ఉఛ్వాస నిశ్వాసాల రాసకేళీలో ఒరిగి తరిగి యెన్ని రాత్రులు ఒడ్డు తెలియని తీరాలకు కొట్టుకు పోయాడో! ఎట్టకేలకు కదలిక వచ్చిన రోబోలా నడచి వచ్చి ముఖ ప్రక్షాళనం గావించుకుని హాలులోకి వచ్చాడు వాసు. డైనింగ్ టేబుల్ పైన బ్రేక్ ఫాస్ట్ సిద్ధంగా ఉంది. తోడులేని ఒంటరి బ్రతుకు. ఒంటరిగానే తినాలి మరి; పలకరింపుల చిలకరింపులకు దూరంగా--బాహ్యంగా చూస్తే, అంతా అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది. జీవితం పుష్కలంగానే ఉంటుంది.
తరచి చూస్తే--ఎవరో రిక్త హస్తం చాచి చూపిస్తున్నట్లుంటుం ది. అదేదో పేరు తెలియని శూన్య ప్రపంచంలో ఈదుతున్నట్లుంటుంది. ఎందుకో మరి--చాలా రోజుల తరవాత చిన్నప్పుడు తల్లి అనే మాటలు గుర్తుకి వచ్చాయి. తన వేగిరపాటుకి గసిరేది. “అదేంవిట్రా చిన్నోడా! ఆకలి నీకొక్కడికేనా—మీ అక్కయ్యా మీనాన్నా కూడా రావద్దూ! ఎన్ని సార్లు చెప్పాను అందరితో కలిసే తినాలని, అదే సంస్కారమని—”
అవన్నీ ఉలికిపాటుతో గుర్తుకి తెచ్చు కుంటూ డైనింగ్ టేబుల్ ముందు కుర్చీ తీసుకుని కూర్చుంటూ చిన్నగ నవ్వుకున్నాడతడు. ఇప్పుడు అక్కయ్య యూరప్ లోనో లాటిన్ అమెరికాలోనో యే మూలన సంసార జీవితం గడుపుతుందో! దానికి తనంటే చాలాప్రేమ. ఇక అమ్మానాన్నలయితే అదేదో తొందరపని ముగించడానికి వెళ్తున్నట్టు పైలోకాలకు ఒకరి తరవాత ఒకరుగా వెళ్లిపోయారు క్యూకట్టి. ఆశల ఆరాటంలో పడి, ఉద్వేగాల ఒరిపిడికి అలవాటు పడి పెళ్లీ పేరంటాలు వద్దంటూ “మెవారిక్” బిజినెస్ మాగ్నెట్ గా మారిన తమ ఒక్కగా నొక్క కొడుకు కోసం వాళ్ళెప్పుడైనా ఆలోచిస్తున్నారా!
శివలోకంలో ప్రమథుల మధ్య జప తపాలు చేస్తూ తెగ హడావిడి పడిపోతూ ఉంటారు;క్రింది లోకాలకు మరొకమారు ససేమిరా రాకుండా ఉండటానికి-- మరొకసారి మానవ జన్మ యెత్తకుండా ఉండటానికి-- అప్పుడు అతడి ఆలోచన చెదిరింది. పర్సనల్ అసిస్టెంటు వినాయకం వచ్చి ప్లేటులో పెట్టి ఏదో ఉత్తరాన్ని భవ్యంగా అందించాడు. అది చూసి విసుగ్గా ముఖం పెట్టాడు వాసుదేవరావు.
“నీకెన్ని సార్లు చెప్పాను వినాయకా! అర్జీలు ఇవ్వడానికీ తీసుకోవడానికీ సమయమూ సందర్భమూ ఉందని- వాటిని అందుకోవడానికి కంపెనీలో విడిగా పబ్లిక్ రిలేషన్ విభాగం ఉందని. నీకేది తోస్తే అది చేసేస్తావా! ఫేవరిటిజమ్- నీకు కావలసిన వాళ్ళ పట్ల పక్షపాతం, ఆదమరపున ఉన్న ప్పుడు, అప్పటికప్పుడు నాచేత పనులు ముగించుకోవాలన్న ఆరాటం. అంతే కదూ! ”
వినాయకం వెంటనే బదులివ్వ కుండా కాసేపు అక్కడే నిల్చుని నిదానంగా బాస్ వేపు చూస్తూ నోరు తెరిచాడు. “మేటర్ అది కాదు సార్. అతను వారంరోజులుగా మనింటి చుట్టూనే తిరుగుతున్నాడు సార్. మాటిమాటికీ తూళి పడిపోతుంటాడండి. అడిగితేనేమో మీకు బాగా తెలిసినవా డంటాడండి. అప్పటికీ మరీ హార్ష్ గా ఉండకూడదని నన్ను నేను సబాళించుకుంటూ నచ్చచెప్పానండి-- మీది నిమిష సమయమంటే లక్షలతో సమానమని. వింటే కదా! నీరసంగా ఉన్నాడు కదానని ఫలహారంతో బాటు పానీయాలు కూడా ఇచ్చి పంపించేవాడినండి.
ఏమైందో యేమో-- ఇప్పుడేమో అతడు కనిపించడం లేదండి. మీకు అతడి గురించి రెండు మూడు సార్లు చెప్పడానికి ప్రయత్నించానండి. శేషయ్య కూడా వచ్చి చెప్పా డండి. మీరు బిజీగా చేయి విదిలిస్తూ ‘తరవాత! ’ అంటూ వెళ్లిపోయారండి”
తన ఊసు సంభాషణలోకి వచ్చేటప్పటికి శేషయ్య చప్పున చేతులు కట్టుకుని ముందుకి వచ్చి నిల్చున్నాడు తలూపుతూ--. శేషయ్య ఆ ఇంటికి తనకీ నమ్మిన బంటు. వాసు మరేమీ అనకుండా టిఫిన్ చేయడం ముగించి సిల్వర్ కప్పులో టీ తాగడం పూర్తి చేసి ప్రక్కన ప్లేటులో పడున్న ఉత్తరాన్ని అందుకున్నాడు. ఉత్తరం మడత విప్పిన వెంటనే అందులో నుంచి యేదో ఫొటో వచ్చి పడింది. ఉత్తరం మాత్రం చాలా చిన్నది.
“వాసూ! నేను సోమురాజుని. ఒక విధంగా నిన్ను చూస్తుంటే చెప్పలేనంత గర్వంగా ఉంది అంత యెత్తుకి యెదిగి పోయినందుకు. మరొక విధంగా తలచు కుంటే చాలా బాధగా ఉంది, ప్రాత స్నేహితులందర్నీ మూట గట్టి మూలన పడేసినందుకు. ఒకటి బాగా గుర్తుపెట్టుకో.. నువ్వెంత యెత్తుకు యెదిగిపోయినా, అందరూ స్వలాభం కోసం ప్రాకులాడరు. నీ సహాయం కోసం వెంపర్లాడుతూ రారు.. ఎందుకంటే— అందరికీ అటువంటి గత్యంతరం ఉండకపోవచ్చు.
ఇక నా విషయానికి వస్తాను. నేను నిన్ను కడసారి ఓసారి చూసి వెళ్లిపోవడానిక వచ్చాను కొండలూ కోనలూ దాటి..
ఈ ప్రయాణంలో మన బాల్యనేస్తాలు నలుగురైదుగురిని చూడగలిగాను- నిన్ను తప్పిం చి-- నాకు క్యాన్యర్. మూడవ స్టేజి దాటిపోయింది. ఈ ఉత్తరం చదివి విషయం తెలుసుకుని గాభరా పడుతూ ఊరికి రాకు. ఎందుకంటే ఆ లోపల నేను కళ్లు మూస్తాను. మన బడి రోజుల్లో మనం తీసుకున్న ఫొటో నకలుని ఇందులో ఉంచాను. మన సున్నితమైన గతాన్ని చింపేసినట్టు దీనిని చింపేయకు- జ్ఞాపకం తెచ్చుకునేందుకు ప్రయత్నించు. అదృష్ట వశాత్తు గుర్తుకి వస్తానేమో! ఇట్లు నీ గతకాలపు మిత్రుడు”
చదివిన ఉత్తరాన్ని మడత పెట్టి క్రింద పడున్న ఫొటోని తీసుకుని చూసాడు వాసు. అందులోని సోమరాజుని గుర్తుపట్టాడు. గుండె కదలినట్లయింది. కొన్ని క్షణాలు పొలబారుతూ ఊపిరి అందుకోవడానికి యిబ్బంది పడ్డాడు.. ఒక రోజు తను కాలుజారి బోరు బావిలో పడిపోతే కొందరబ్బాయిలు భయపడిపోయి యెవరికి వారు గుడ్డా గోచీ విడిచి పారిపోయారు. సోమరాజు ఒక్కడూ తాడు చుట్టను తన వేపు విసిరి తనను పైకి లాగాడు. తన ప్రాణాలు కాపాడాడు. సోమరాజు గాని సమయ స్ఫూర్తి చూపించి నిబ్బరంతో తాడు చుట్టను విసిరుండకపోతే— తన గతి యేమై ఉండునో-- ఇక ఆలోచించలేక పోయాడు వాసు. లేచి కుడి చేతిని చాచాడు. వినాయకం దగ్గరకు వచ్చి అడిగాడు, యేం కావాలని.
తనకి క్యాష్ కావాలంటూ అడిగి వినాయకం అందించిన క్యాష్ అందుకుని-“నేనలా వెళ్లి వస్తాను. నా కోసం సెల్ ఫోన్ మ్రోగించకు”అంటూ కదిలాడు.
“అలాగే సార్. ఏ కారు కావాలంటారు? బి యెమ్ డబల్ యూ- లేదా మొన్న జర్మనీ నుంచి రప్పించిన—“
“ఆగు! అంత వేగంగా మాట్లాడకు. వినే ఓపిక లేదు. ఐ ఫీల్ లిటిల్ మూడీ. నేనుగా అలా వెళ్ళి వస్తాను. మరి కాసేపట్లో కామిని నాకోసం రావచ్చు. లేదా వేణి రావచ్చు. ఏదో చెప్పి పంపించేయి యిద్దర్నీ. నా జాడ మాత్రం చెప్పకు. ఇదిగో నా సెల్ ఫోను. నీవద్దుంచుకో” అంటూ, అతడు తోటలోని సిమెంటు దారివేపు మలుపు తిరుగుతూ వెనక్కి చూసి-థేంక్స్-అన్నాడు.
వినాయకం బిత్తరపోయి-“నాకెందుకు సార్ థేంక్స్ ? అవి మీ డబ్బులు సార్. మీవి మీకే ఇచ్చాను సార్!” అని నీళ్ళు నమిలాడు.
“థేంక్స్ చెప్పేది నువ్విచ్చిన డబ్బులు కోసం కాదు. నా స్కూల్ ఫ్రెండు సోమరాజుని మన్ననతో ఆదరించినందుకు--” అంటూ వీధిలోకి వెళ్లిపోయాడు వాసుదేవరావు.
అంతర్లోకాలలోని అంతర్ముఖుడు అప్పుడప్పడు అర్థానికందని రీతిన అనూహ్యంగా మారిపోతాడంటారు, ఇందుకేనేమో! అతడలా అన్యమనస్కంగా నడుస్తూ వీధి మలుపు తిరుగుతున్నప్పుడు జోరీగలా జోరుగా వెళ్లబోతూ ఒక అమ్మాయి మట్టిరోడ్డున పడిపోయింది. లేవడానికి ప్రయత్నిస్తూ మెలికలు తిరుగూతుంది. వాసు పరుగున వెళ్లి ఆ పిల్లను అందుకుని నిలబెట్టి మోకాళ్లకూ స్కర్టుకీ అంటుకున్నమట్టిని దులిపాడు.
“ధన్యవాదాలు అంకుల్” అంటూ అతడి రెండు పాదాలనూ తాకడానికి వంగబోయిందా అమ్మాయి. పాదాలు వెనక్కి తీసుకుంటూ వారించాడతను - “ఇంత దానికి ఇంతటి పెద్ద నమస్కారమా! ” అని విస్తుపోయినట్లు చూసాడు.
ఆ అమ్మాయి విడిచి పెట్టేటట్లు లేదు. “అలా అనకండి అంకుల్. సమయానికి ఆదుకున్నవారు దేవుడితో సమానమని అమ్మ చెప్తుంటుంది అంకుల్” అని అతడి రెండు పాదాలనూ తాకి ముందుకు కదలింది. అప్పుడతడు ఆ అమ్మాయిని ఆపి అడిగాడు యెక్కడికా వేగిరిపాటని.
“గుడికి అంకుల్. అమ్మా అత్తా యెదురు చూస్తుంటారు”
అప్పడతడికి తెలియకుండానే అనేసాడు- “ఈ వీధిలో గుడి ఉందా!”
దానికాపిల్ల విస్తుపోయినట్టు చూసింది. “మనూరి గుడి మీకు తెలియదా అంకుల్! ”
వాసుదేవరావు యేమీ అనకుండా తలూపుతూ మలుపు తిరగబోయా డు, అతడు ఉదయకాలాన బాల్కానీలో గుడి గంటలు మ్రోగడం వింటుంటాడేగాని గుడి దర్శనం చేయాలన్న తలంపు పుట్టలే దు— తన చూపులో టైమ్ ఈజ్ మనీ కదూ--
ఈసారి ఆ అమ్మాయి అతడి దగ్గరకు వచ్చి ఆపింది, “అటు కాదు ఇటు-” అంటూ అతడి చేతిని పట్టుకుంది. ఎక్కడికన్నట్టు తలవిదిలించి చూసాడతడు.
“మీకు అంబను చూపిస్తాను”
ఆమాటకతడు ఉలిక్కిపడ్డట్ట యాడు. ఇదే మాట రామకృ ష్ణుడు తన ప్రియశిష్యుడు వివేకానందుడితో అనలేదూ- ‘దేవుణ్ణి నేను చూడటం కాదు. నీకూ చూపిస్తాను! ’ అని.
అతడిక యేమీ అనకుండా యేదో వశీకరణకు లోనైనట్టు ఆపిల్ల వెనుక నడవసాగాడు. ఆపిల్ల నడుస్తూనే చెప్పింది తన పేరు మంగళ అని, నాల్గవ తరగతని.
ఇద్దరూ కాసేపటకి అంబ గుడికి చేరుకున్నారు. అక్కడ ఇద్దరు స్త్రీలు మంగళ కోసం యెదురు చూస్తూ నిల్చున్నారు. కూతుర్ని చూసిన వెంటనే “అదేమిటే అంత ఆలస్యం—” అనబోతూ వాసుదేవరావుని చూసి ఆగిపోయిందామె ప్రశ్నార్థకంగా చూస్తూ--
అప్పుడు మంగళ వివరించింది. “అంకుల్-- మనూరి అంకుల్. నేను పరుగెత్తుకుంటూ వచ్చి మట్టిలో పడిపోతే నన్ను లేవ నెత్తి నిల్చోబెట్టారు. పేరు తెలియదు. నేనే అంబను చూపిస్తానని తీసుకు వచ్చాను”
అతడు ఔనన్నట్టు తల ఊపాడు. ఆమె చేతులెత్తి నమస్కరిస్తూ తమను పరిచయం చేసింది. “నా పేరు వత్సల. బృహస్పతి కాలేజీలో సీనియర్ లెక్చరర్ గా ఉంటు న్నాను. ఈమె మా ఆడపడుచు. వసుంధర. యు యెస్ ఏ లోని జార్జియా నుండి వచ్చింది. మా అత్తామామలతో వెళ్లి అక్కడే ఉండిపోయింది. మా అత్తామామలు పోయిన తరవాత ఇక అక్కడుండనని మూటా ముల్లె సర్దుకుని ఇక్కడకు వచ్చేసింది. తెలుగు సంప్రదాయాలంటే ప్రాణం. పద్యాలంటే మరీను. అక్కడున్నప్పుడు వ్రాసిన రెండు తెలుగు మాన్యుస్కిప్టులను ఇక్కడ ప్రచురించాలని పూనుకుంది. మరి మీరు—” అంటూ చూసిందతడి వేపు.
అతడు వెంటనే బదులివ్వలేదు. తన స్థాయి గురించి చెప్తే స్త్రీలిద్దరూ తొలగిపోతారేమో! ఆ తరవాత మాటలకందని ఈ ఆప్యాయత నీరుగారిపోతుందేమో! కాని చెప్పక తప్పదుగా! అందువల్ల చెప్పాడు- “పేరు వాసుదేవరావు. నిర్మల్ గార్మెంట్స్ గురించి వినేఉంటారు”
ఆ మాటతో వత్సల ఆశ్చర్యంగా చూసింది. “మీరా! మిమ్మల్ని ముఖాముఖి చూడలేదు గాని మీ గురించి విన్నాను. మరి మీరిక్కడేం చేస్తున్నారు సార్ ? ఈ చిట్టిదానితో గుడికి నడిచే వస్తున్నట్టున్నారు. సారీ! మరి మీ ఆవిడ—"
“ప్లీజ్! ఇబ్బంది పడకండి. నన్ను మీ అమ్మాయి పేదరాశి పెద్దమ్మలా నడిపించుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక నా గురించంటారా- నాకు పెళ్ళికాలేదు. ఎందుకూ అని అడక్కండి. అదంతే— బిజినెస్ లైఫ్. ఆక్రోశ పూర్వకమైన లైఫ్ లైన్. మా అమ్మా నాన్నలు బ్రతికుంటే యెప్పుడో ఐపోను. అక్కయ్య ఉంది. ఆమె యూరప్ లో యెప్పుడెక్కడుంటుందో చెప్పడం కష్టం. మైనింగ్ వ్యాపారవేత్త ఐన భర్తతో తెగ బిజీగా ఉంటుంది. నేనుగా ఫోను చేసినా లైనులోకి రాదు. ఇక నేను వెళ్తాను” అని వెనుతిరగ బోయాడు.
అప్పుడు వత్సల ఆపింది “ఎక్కడకి? అంబకు మహా నైవేద్యం ఇవ్వబోతున్నారు. ఇంతకు ముందే రుద్రయాగం జరిపారు. స్వర్ణ పుష్పార్చన చేసారు. మాతో రండి దైవ దర్శనం చేసుకుని వెళుదురు గాని-- మా పాప మిమ్మల్ని అందుకేగా ఇక్కడకు తీసుకువచ్చింది-”
అతడేమీ అనకుండా చెప్పుల్ని దూరంగా పెట్టి వచ్చి కుళాయి వద్ద కాళ్లూ చేతులా కడుక్కుని కాసిన్ని నీళ్ళను తలపైన చల్లుకుని వాళ్లను అనుసరించాడు ఆలయప్రాంగణంలోకి.
పూజా పునస్కారాలు మంగళ మంత్రోఛ్చరణలు పూర్తయిన తరవాత “మరి నేను వెళ్లోస్తాను వత్సలగారూ! నేను నడిచి రావడం వల్లనే కదా మీ స్నేహభాగ్యం- మీ పాప ప్రేమ భాగ్యం లభించింది” అన్నాడు వాసు కదలబోతూ--
“మీ ఆలోచన బాగానే ఉంది వాసుగారూ! ఈ రోజు మాత్రం మా కారులో మా ఇంటికి వచ్చి వెళ్లండి. రేపట్నించి మీరు యెంత దూరం నడిచి వెళ్ళాలనుకుంటున్నారో అంత దూరం నడవండి”
వాసుదేవరావు నవ్వుతూ తలూపి గుడిబైటకు వచ్చాడు. అక్కడ అతడి కోసం డ్రైవర్ తో యెదురు చూస్తూ కనిపించాడు వినాయకం. అంటే, వద్దన్న తరవాత కూడా తననే అనుసరిస్తూ వస్తున్నారన్న మాట, తన కంపెనీ బంట్లు. ఇదంతా ఆ వినాయకం ముందస్తుగా పన్నుతూన్న స్ట్రాటజీ. నిల్చున్నవాడు నిల్చున్నట్టుగానే యెవరూ గమనించకుండా డ్రైవర్ కి సంజ్ఞ చేసాడు తను తరవాత వస్తున్నాడని. ఇక అతడు వెళ్లిపోవచ్చని.
--------
ఆ నాటి మధ్యాహ్న భోజనం వత్సల వాళ్ళ ఇంట్లోనే చేసి భార్యా భర్తలిద్దరికీ పుష్కలంగా ధన్యవాదాలు చెప్పి ఇక తనకు కారు అవసరం లేదంటూ బైటకు నడిచాడు వాసు. అప్పుడు వత్సల భర్త ప్రొఫెసర్ మేఘనాథ్ అతడితో బాటు నడుస్తూ- “ఒక క్షణం ఆగుతారా మిస్టర్ వాసూ! ”
అతడాగాడు ఆప్యాయంగా మేఘనాథ్ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ-“చెప్పండి మేఘనాథ్! ” అంటూ—
మేఘనాథ్ కొనసాగించాడు-
“మనం కలసి భోజనాలు చేస్తున్నప్పుడు రెండు మాటలు చెప్పారు- మీకు తెలియకుండానే-- ”
“మీ పాప కబుర్ల సందడిలో పడి చాలానే చెప్పుంటాను. వాటిలో రెండు మాటలు మాత్రం యెలా గుర్తుంటాయి? చెప్పండి”
“నేను గుర్తు చేస్తాను మీ కోసం మీకు ఆక్షేఫణ గాని లేకపోతే-“
“ఎంతమాట! చెప్పండి. ప్లీజ్! ”
“మొదటి మాట- మా ఇంట్లో భోజనం చేస్తుంటే గుడి ప్రసాదం స్వీకరించినట్లు ఉందన్నారు”
తలూపాడు వాసుదేవరావు ఔనన్నట్టు.
“రెండవ మాట. మా ఆవిణ్ణి చూస్తూ- యూరప్ లో ఉంటూన్న మీ అక్కయ్య గుర్తుకొస్తుందన్నారు. రూపంలోనూ మాట తీరులోనూ అచ్చు మీ అక్కయ్యలాగే వత్సల ఉందని చెప్పారు”
“కచ్చితంగా— మళ్ళీ అదే మాట ముప్పై సార్లంటాను. యామ్ ఐ క్లియర్! ఇకపోతే మరొక మాట కూడా అంటాను. ఇప్పుడు మీ ముందు నిక్కచ్చిగా అంటాను, మీ ఇంటితో నాకేదో పూర్వబంధం ఉన్నట్లనిపిస్తూందని”
“గుడ్! అదే చొరవతో అంటున్నాను. సావధానంగా వినాలి. మరింత ఆలస్యం చేయకుండా మీరు ఓ ఇంటివాడవాలి”
ఆ మాట విన్నంతనే ఆశ్చర్యంగా చూసాడు వాసు. “ఇంత అకస్తాత్తుగా పెళ్ళి చేసుకోమంటే నేనేమి చెప్పేది చెప్పండి! బిజినెస్ ప్రపంచంలో నా జీవితం కట్టుబాట్ల గట్టు దాటి చాలా దూరం వెళ్లిపోయింది. ఇంకా వెళ్లిపోతూనే ఉంది. నేను చెడ్డవాణ్ణి కాకపోవచ్చు. నా వల్ల యెవరి కొంపా విధ్వంసానికి లోను కాకపోవచ్చు. కాని నాది సరళమైన జీవన ప్రయాణం మాత్రం కాదు. అడ్డ దిడ్డంగానే సాగుతూ వచ్చింది.
మా అక్కయ్య గాని నాతో ఉంటే నా జీవితం మరోలా ఉండేదేమో! ఆకులో ఆకునై- అన్నట్టు మాబావగారితో చేరి ఆమె యూరప్ లో వ్యాపార ప్రపంచంలో భాగమై కనుమరుగయి పోయిందిగా! ఇక ఆఖరి మాట. కచ్చితమైన మాట. వ్యాపారినై కపట ధారినై యెవరిని నమ్మాలో యెంత వరకు నమ్మాలో తెలియకుండా ఉంది. నాకు తెలిసినంత వరకూ నా వ్యక్తిగత జీవితంలో ట్రస్ట్ ఈజ్ మై బిగ్గస్ట్ లయాబి లిటీ.
నేనుంటూన్న సోఫిస్టికేటడ్ వలయంలో గార్ల్ ఫ్రెండ్సు ఉంటారు. కాని జీవితం పంచుకోవడానికి నిలకడ మనసు గల జీవన సహచరి కనిపించదు. ఇక దీనితో ఆ ఊసు మరచిపొండి మేఘనాథ్”
అప్పుడు వత్సల అక్కడకు వచ్చింది- “అదెలా మరచిపోతాం వాసూదేవరావూ! నన్నేమో అక్కయ్యలాగుందన్నారు. మా పాప ముఖాన్నేమో మీ అమ్మలా ఉందన్నారు. అలాంటప్పుడు మీ గురించి ఆలోచించాల్సిన బాధ్యత మాకుంటుందంటారా లేదా! ”
అప్పుడతడు నవ్వి ఆమె కుడి చేతిని తన చేతుల్లోకి తీసుకుని అడిగాడు- “ఉఁ చెప్పండి. నన్నేమి చేయమంటారు? సెలవివ్వండి”
“వెంటనే పెళ్లి చేసుకుని ఇక ఒంటరి బ్రతుక్కి టాటా చెప్పి ఓ ఇంటివాడవమంటాను”
“భలేవారే! వెంటనే పెళ్లి పీటలపైన కూర్చోమంటే నా ప్రక్కన కూర్చోవడానికి నా మూడ్ కి సరిపడే అమ్మాయి దొరక వద్దూ! ”
“అది మాకు విడిచి పెట్టేయి. పెళ్లి జరిగిపోయినట్టే— ఇదిగో! ఆ గోడనున్న ఫొటో ఫ్రేము చూడు”
అతడు తలెత్తి గోడ వేపు చూసి ఆశ్చర్యంతో కనురెప్పలల్లార్చాడు. వసుంధర! ఆరోజు ఉదయమే అంబ ఆలయ ప్రాంగణంలో చూసాడు. ఆమె తెలుగు సంప్రదాయ శత పత్ర సుందరి. కవయిత్రి. అమెరికా నివాసం విడిచి తెలుగు గడ్డ వెతుక్కుంటూ వచ్చేసిన సొజన్య వంతురాలు. ఆమె తనతో జీవితం పంచుకోవడానికి ఇష్ట పడుతుందా! కలిగిన తత్తరపాటుని కళ్ళమ్మట కప్పేయడానికి ప్రయత్నిస్తూ చలన రహితు డై నిల్చున్నాడు వాసు.
అప్పుడు వత్సల అడిగింది- “ఇంకేమైనా చెప్పాలా! ”
అతడు మరి కాసేపు నిశ్సబ్దంగా ఉండిపోయి అడి గాడు-“మరి వసుంధర గారు అంగీకరించవద్దూ! నా జీవిత నేపధ్యం గురించి తెలుసుకోవద్దూ! ”
“అదంతా మీకెందుకయ్యా! మాకు విడిచి పెట్టేయి. షి ఈజ్ ఎ ఉమెన్ ఆఫ్ ప్రోగ్రెస్సివ్ మైండ్-- ఇక నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదూ!”
అతడు తలూపుతూ యిలా అన్నాడు- “ఐతే మరో మూడు నెలల పాటు నేను పెళ్లి పీటలపైన కూర్చోలేను అక్కాయ్”
“ఎందుకూ! బిజినెస్ టూర్ పైన ఫారిన్ వెళ్తున్నావా! ”
మేఘనాథ్ కలుగచేసుకుని అడిగాడు. “కాదు. నేను ఇన్నాళ్లుగా జారవిడు చుకున్న ప్రాత జ్ఞాపకాల కపోతాలను వెత్తుక్కుంటూ వెళ్తున్నాను. నేను పుట్టి పెరిగిన ఊళ్లోనే కాదు. చుట్టు ప్రక్కలున్న ఊళ్లన్నిటిలోనూ చెదరి ఉన్న నా చిన్ననాటి నేస్తాలను కలుసుకుని గతకాల జ్ఞాపకాలను కలబోసుకుని రావాలి. వాళ్లలో కొందరు ఉన్నారో లేదో తెలియదు. కొందరు చితికి పోయుంటారు. ఇంకా కొందరు పొరుగూళ్ళకు వలస వెళ్లిపోయుంటారు. వాళ్లనూ వాళ్ళ కుటుంబాలనూ ఓపారి పరామర్శిం చి వస్తేగాని నేను మామూలు మనిషిగా మారలేను. నాలోకి నైను నిలకడగా చూసుకోలేను. నేను గాని ఈ పని ఇప్పటికిప్పుడు చేయకపోతే నాకు నేను మిగలను. ”
“సరే-- అలాగే చేయి. కాని ముందు నేను చెప్పినట్టు చేయి. ఇద్దరూ గుడిలో పెళ్లి చేసుకోండి. తరవాత నిదానంగా సమయాన్ని బట్టి రిసెప్షన్ గట్రా యేర్పాటు చేసుకుందాం. మ్యారేజీ రిజష్టర్ చేద్దాం ఈ లోపల వసుంధరను కూడా మీ బంధుమిత్రులకీ ఊళ్లోవాళ్లందరికీ చూపించినట్లవుతుంది. పనిలో పనిగా మీ ఊరి గుడిలో మీ ఊరి పెద్దల సమక్షాన అర్చనలూ నైవేద్యాలూ కూడా అర్పించినట్లవుతుంది. ఇరు వైపులా శుభదాయకం”
ఆ మాటతో అతడి మోము విప్పా రింది. మొదటి సారి అతడికి స్వంత ఇంట్లో నాలుగు మండువాల లోగిలిలో ఉన్నట్టొక సుఖ భావం కలిగింది, స్వంతం ఉన్న వాళ్ల మధ్య ఉన్నట్టు ఒక మృదు భావన మనసు ఓరన పారాడింది. ఇకపైన జీవన సజీవ క్షణాలను వృథాపో నివ్వకూడదు! ఒంటరితనమంటే అన్నీ ఉన్నా యేమీ లేనట్లే కదా! స్వంతమూ దగ్గరితనమూ లేని జీవితమంటే ఎడారిలో రాలి యింకిపోయే వర్షపు బిందువేగా! అతడలా అంతర్మథనానికి లోనవుతూ చెమ్మగిల్లిన కళ్ళతో చప్పున వంగి భార్యాభర్తలిద్దరి కాళ్ళకూ నమస్కరించాడు.
***
పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
1) పేరు-పాండ్రంకి సుబ్రమణి
2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య
3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ
4)స్వస్థలం-విజయనగరం
5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు
6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.
Comments