top of page
Writer's pictureIndumathi Palegaru

యే బారిష్!



'Ye Barish' - New Telugu Story Written By Indumathi Palegaru

Published In manatelugukathalu.com On 24/09/2024

'యే బారిష్!' తెలుగు కథ

రచన : ఇందుమతి పాలేగారు


ఆఫీసు గాజు గోడల మీద వర్షపు నీరు ధారలుగా జారిపోతూ ఉంది. కాఫీ కప్పుతో కిటికీ దగ్గరకి నిలబడి కిటికీలోంచి వర్షాన్ని చూస్తూ ఉంటే సన్నటి చినుకుల్లా రాలుతూ, దూరంగా ఉన్న కొండని పొగమంచు కప్పేసినట్టు ఉంది. చుట్టుపక్కలున్న చెట్లనీ వర్షానికి తడిచి వణుకుతున్నట్టుగా ఉన్నాయి. 


వర్షాన్ని వర్ణిస్తూ భాషతో సంబంధం లేకుండా వచ్చిన సినిమా పాటలెన్నో ఉన్నాయి. వర్షం అంటేనే రకమైన ఆహ్లాదం, అనుభూతి. వర్షం ముందు గాల్లో కలిసొచ్చే కమ్మటి మట్టివాసన, చిరు చలిని పుట్టించే చల్లదనం ఇలా ఎన్నో ఉన్నాయి. అవి కాకుండా వర్షంతో ముడిపడినవి చాలానే ఉన్నాయనిపించింది. 


కొద్ది వానకి ఇక్కడి వాతావరణం పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు పొగలు కక్కిన సూర్యుడు అలిగి చటుక్కున లోపలికెళ్లి తలుపేసుకున్నాడేమో.. వాతావరణం ఒక్క సారిగా చల్లగా మారిపోయింది. 


వాహనాలతో రద్దీగా ఉన్న రోడ్లు నాలుగు చినుకులు రాలగానే ఖాళీ అయిపోయాయి. రోడ్ల పక్కనున్న చిరు వ్యాపారులంతా సామాన్లని సర్దేసుకుంటుంటే, కొందరేమో వర్షాన్ని తప్పించుకుని తలదాచుకోడానికి చోటు వెతుక్కుంటూ పరిగెడుతున్నారు. 

కప్పులో కాఫీ అయిపోయింది. 


కాస్త చినుకులు పలచబడ్డాయి. ముందు జాగ్రత్తగా బ్యాగ్ సర్దుకుని కిందకొచ్చేసాను. ముందస్తుగా వచ్చిన మాటే కాని ట్రాఫిక్ దాటుకుని ఇల్లు చేరడానికి రెండు గంటల సమయం పట్టింది. 


 *****


ఇంటికి వెళ్లగానే బాల్కనీలో పెట్టిన ఇండోర్ మొక్కల్ని లోపలికి మార్చేసాను. టెర్రస్ మీదున్న బట్టలు గుర్తొచ్చి పైకి వెళ్లాను. అప్పటికే వర్షం పడి ఆగిపోయి ఉండటం వల్ల తడిచిన బట్టలు నీరసంగా దండెం మీద వేలాడుతుంటే ఇక వాటిని మోయడం నా వల్ల కాదు మహా ప్రభో అన్నట్టు దండెం నా వైపు దీనంగా చూస్తూ ఉంది. 


బట్టలన్నిటిని మళ్లీ జాడించి ఆరేయడానికి బాల్కనీ వైపు వెళ్లాను. మా అపార్ట్మెంట్ కి మరో వైపు కంస్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. అక్కడ గుంతలు తవ్విన మట్టి దిబ్బలు పోసి ఉన్నాయి. వర్షానికి తడిచిన మట్టి వాసన కమ్మగా గాల్లో కలిసొచ్చింది. ఎదురు అపార్మెంట్ లో పాతికేళ్ల కుర్రాడు వర్షానికి మారిన ఆకాశపు రూపు రేకల్ని ఫోన్ లో బంధించేస్తూ ఉన్నాడు. 


ఎటు నుండో నూనెలో కాలుతున్న వేడీ బజ్జీల వాసన ముక్కుపుటాలను చేరింది. కింద రోడ్డు మీద మొక్కజొన్న బండి దగ్గర ఓ జంట కాల్చిన మొక్కజొన్న పొత్తుల్ని ఒకరికి ఒకరు తినిపించుకుంటున్నారు. ఇంకో వైపు కంస్ట్రక్షన్ పనులకి వచ్చిన వాళ్లు గుడారాలని సరిచేసుకుంటున్నారు. ఇంకో వైపు సిగ్గీ, జొమోటా బ్యాగులతో బైకుల మీద డెలివరి చెయ్యడానికి కుర్రాలు బండ్ల మీద దూసుకెళ్తున్నారు. 


ఈ వర్షానికి అందరూ సమానమే కాని వర్షం అందరికీ సమానం కాదనిపించింది. సమానంగా ఉండటానికి అందరి జీవితాలు ఒకేలా లేవు. మనుషుల జీవితాల్లో ఆర్థిక అసమానతలు మామూలే కదా. 


నల్లమబ్బులు కాస్త చిక్కబడి చీకటైంది. చుక్కలన్నీ ఎవరో తుడేచినట్టు మాయమైపోయాయి. కిటికీలు, తలుపులు తెరచి ఉండటం వల్ల అన్ని వైపులా చల్లగాలి వీస్తూ ఉంది. 

ఆ గాలితో పాటు కుయ్ కుయ్ మని కుక్క పిల్లల అరుపులు వినిపించాయి. శబ్దాన్ని బట్టి అది కంస్ట్రక్షన్ జరుగుతున్న వైపే అని అర్థమయ్యింది. మళ్లీ సన్నటి చినుకులు మొదలయ్యాయి. తలుపులు కిటికీలన్నీ మూసేసి పడుకున్నాను. పడుకున్నానన్న మాటే కాని నిద్ర పట్టలేదు. ఏవేవో ఆలోచనలు.. 


నా చిన్నప్పటి వర్షపు రాత్రులు గుర్తొచ్చాయి. 


 *****


ఊరి చివరన సగం కూలిన మా ఇల్లు, ఇంకో వానకి పూర్తిగా కూలిపోడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉండేది. వర్షం పడితే చాలు ఇంటి లోపల మడుగులా నీళ్లు నిండుకునేవి. ఇంట్లో సామాన్లన్నీ ఆ నీళ్లలో పడవల్లా తేలేవి. ఆ వర్షం లో కూడా అమ్మ స్కూల్ బ్యాగుల్ని ప్లాస్టిక్ సంచుల్లో చుట్టేసి అలమారల్లో జాగ్రత్తగా దాచేది. 


ఆగకుండా వర్షం పడుతూనే ఉంటే ఆ పూట పస్తులుండాల్సి వచ్చేది. వర్షం ఎప్పుడు తగ్గుతుందా? అని చూరు కేసి చూస్తూ ఉంటే కొన్ని సార్లు తెల్లారిపోతూ ఉండేది. వర్షం మొదలయ్యిందంటే నిద్ర కూడా మాయమైపోయేది ఏ గాలికి చూరు కూలిపోతుందో అని. వర్షం తో తీపి ఙాపకాలేవి లేవు. చెప్పాలంటే నా చిన్నప్పుడు వర్షమే పెద్ద శత్రువు. 


ఎంతో మంది రైతులు ఆకాశం వైపు చూసి నీటి చుక్క కోసం మొక్కితే ఇంకో వైపు మాలాంటి వాళ్లు వర్షాలు పడకూడని వేడుకుంటూ ఉండేవాళ్లు. అమ్మ అలమారల్లో దాచిన పుస్తకాలే ఒక విధంగా మా జీవితాల్ని మార్చేసాయి. ఇప్పుడు ఎంత వాన కురిసిన చూరు కూలిపోదు అనే సంతృప్తి మిగిలింది. 


ఇంతలో కుయ్ కుయ్ మని అరిచిన కుక్కపిల్లలు గుర్తొచ్చాయి. కిటికీ తీసి చూస్తే వర్షం కూడా ఎక్కువౌతున్నట్టుగా ఉంది. మనుషులకే ఇన్ని తిప్పలంటే ఇక మూగ ప్రాణుల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు అనిపించింది. 


ఈ మధ్యన వీధికుక్కలు ఎక్కువైపోయాయి అనిపించింది. కొందరు అయితే ఏదో సమాజ సేవలాగ మిగిలిన అన్నాన్ని, తిండి పదార్థాలని వీధికుక్కలకి పెట్టి వాటి సంతతిని పెంచేస్తూ ఉంటారు. అవి ఉండటానికి సరైన చోటు లేక వానలకి, ఎండలకి అలమటిస్తాయని ఆలోచించరు. కొన్నైతే మరీ క్రూరంగా తయారై ముసలివాళ్లని పిల్లల్ని వెంబడిస్తూ ఉండటం గురించి కూడా వింటూ ఉంటాం. 


ఇప్పుడు సమస్య అది కాదు అనిపించి నా ఆలోచనలకి చెక్ పెడుతూ కిందకి వెళ్లాను. అప్పటికే తల్లి కుక్క పిల్లల్ని నోటితో కరుచుకుని వర్షంలో ఉండటానికి చోటు వెతుక్కుంటూ ఉంది. చివరగా మూసేసిన షాప్ దగ్గర ఆగింది. పిల్లలన్నిటికి అక్కడి చేర్చి నిలబడుకుంది.


 పిల్లలన్నీ నీటి తుంపరలకి ముడుక్కుని మూలుగు తున్నాయి. మిగిలిన అన్నాన్ని తీసుకొచ్చి పెట్టి పైకి వచ్చేసాను. వర్షం తగ్గుతూ ఉండగా నిద్రలోకి జారుకున్నాను. 

 

 *****


నల్లమబ్బులు వీడి తెరలు తెరలుగా తెల్లవారుతూ ఉంది. కింద ఉన్న కుక్కపిల్లలు వాళ్ల అమ్మ చుట్టూ ఆడుకుంటూ గెంతుతూ ఉన్నాయి. 


ఫోన్ తీసి బ్లూ క్రాస్ వాళ్ల నంబర్ కి డయల్ చేసా..... 

***

ఇందుమతి పాలేగారు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

పేరు  ఇందుమతి పాలేగారు , స్వస్థలం చిత్తూరు జిల్లా. బి టెక్ పూర్తి చేసుకుని ఐటీ లో ఉద్యోగం చేస్తున్నాను. కథలు , కవితలు చదవడం అంటే ఇష్టం. ఆ ఇష్టం తో సరదాగా రాయటానికి ప్రయత్నిస్తున్నాను.

76 views0 comments

Comments


bottom of page