కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
'Athagaru Avakaya' Written By Sita Mandalika
రచన : సీత మండలీక
ఆవకాయ సీజన్ వచ్చిందంటే అత్తగారు రమణమ్మ గారి హడావిడి ఇంతా అంతా కాదు.
ఇక కోడలు పద్మకు కలిగే టెన్షన్ కు అంతే ఉండదు.
చక్కటి ఈ హాస్య కథను సీత మండలీక గారు రచించారు.
“బాబూ రఘు , రేపు శనివారం నీకు సెలవే కదా?” అని అడిగారు రమణమ్మ గారు.
“ఏమేనా పనుందా అమ్మా” అన్నాడు రఘు.
“అదేరా బాబూ, ఆవకాయ రోజులు వచ్చేయి కదా! కాయలు తెచ్చుకోవాలి. నువ్వూ, నాన్న
ఇంట్లో ఉంటే, నేను, పద్మ వెళ్తాం” అన్నారు రమణమ్మ గారు
ఆ మాట చెవిలో పడే సరికి రఘు భార్య పద్మకి గుండెల్లో రాయి పడింది.
తన పెళ్లయి, నాలుగేళ్లయింది. అప్పట్నుంచి, ఆవకాయ రోజులు వచ్చేయంటే ఆఫీస్ కి
వారం రోజులు సెలవు పెట్టాల్సి వచ్చేది. అత్తగారి వెంట వెళ్లి, ప్రతీ మామిడి కాయల షాపు దగ్గిర
ఆగడం, కాయ పుల్లగా ఉందొ లేదో అని చూడడం, తన వంతయింది. ఆ చూడడం కూడా షాపు
వాడిచ్చిన కాయ కాకుండా ఆవిడ ఎంచిన కాయ రుచి చూడాలి. ‘ఆలా తీయకూడదమ్మా’ అని
వాడన్నా, ఒకటా, రెండా, వంద కాయలు కొంటామని దబాయించి మరీ కాయ కట్ చేయించి
కొరకమనేది.
“నా నోరు పుల్లగా అయిపొయింది అత్తయ్యా! రుచి చూడ లేక పోతున్నా”నంటే
“పద్మా! నేను కొరికేనంటే నా కట్టుడు పళ్ళు విరగనేనా విరుగుతాయి లేక కిందేనా పడతాయి.
విరిగితే 25000 రూపాయలు ఖర్చు అని ఆలోచిస్తున్నాను” అన్నారు రమణమ్మ గారు.
‘వద్దు లెండి, దాని బదులు నేనే చూస్తా’నని పద్మ మాటిచ్చింది.
“మాగాయికి బాగా పుల్లగా ఉంటే బాగుంటుంది పద్మా . ఏడాదికొక్క సారి కష్టపడమ్మా”
అంటూ ఓదార్చేవారు రమణమ్మ గారు. .
క్రిందటేడాది ఈ మామిడి రుచులతో పద్మకి నోరు,పెదాలు అన్నీ ఇన్ఫెక్ట్ అయి డాక్టర్
కి మందులకు 1000 రూపాయలయ్యింది. 15 రోజులు భోజనం చెయ్యడం కూడా కష్టమైంది
క్రిందటి వారంలో చిన్నవి, పెద్దవి ఊరగాయ జాడీలు, ఊరగాయ కలిపే అయిదారు
రకాల టబ్బులు, తోమడం.. తుడవడం, ఎండలో పెట్టడం జరిగింది. అందువల్ల అత్తగారికి, తనకి కూడా నడుం నెప్పి, ఒళ్ళు నెప్పులు వచ్చి ఏ కరోనా వచ్చిందో అని భయపడి ఒక రోజంతా వేరే గదులలో కూర్చున్నారు. మర్నాడు నెప్పులు తగ్గడంతో 'అమ్మయ్య! బతికేం' అనుకున్నారు.
ఆ తరవాత వచ్చింది ఆవకాయ కాయల ఎంపిక. ఊరగాయ చూడడానికి ఎర్ర గా ఇంపుగా ఉండాలి ఆలా అని మరీ కారంగా ఉండకూడదు . కమ్మగా ఉండాలి. మంచి కారాలు వీరయ్య షాపులో దొరికేయని ఆవిడ స్నేహితురాలు దుర్గ చెప్పేరుట. ఆవిడ కూడా అత్తయ్యలా ఊరగాయలు పెట్టడడంలో దిట్ట
ఈ ఎండ లో ఈవిడకి ఈ సరదా ఏమిటో, కొంచెం కూడా బాధ పడక వెన్నెలలో
విహారంలా. ఆ కారాలు బాగుంటాయని దుర్గ చెప్పింది కదా ఇక మన ఆవకాయకి తిరుగు
ఉండదు అని ఒక నాలుగైదు సార్లు వల్లించేరు.
అయినా ఊరగాయ బాగుండాలంటే కాయ కూడా ప్రశస్తం గా ఉండాలని మర్చి
పోయేరా? ఆమ్మో అది కలలో కూడా మరువరు. ప్రస్తుతం గుండలు మంచివి కుదురుతాయన్న
సంతోషం తో బయల్దేరి కారాల వీరయ్య షాప్ వెతికి పట్టుకుని కారాలు కొండం మొదలు పెట్టేరు
మళ్ళా ఈ ఏడాది కూడా అదే పద్దతి.
అత్తగారికి ఇష్టమైన సువర్ణరేఖ కాయలు దొరకడం తో ఆవిడ చాలా ఆనంద
పడిపోయారు.
“ఈవేళే కాయలు కోసేము అమ్మగారు! కాయలు ముట్టుకోడానికి వీల్లేదు. నేనే అన్నీ
మంచివి ఏరి ఇస్తాను. కాయ 20 రూపాయలకి తగ్గను. మీ ఇష్టం” అన్నాడు కాయలమ్మే అతను.
“అయ్యో బాబూ! అలా ఎలాగ ? కాయ 5 రూపాయలు ఎక్కువ తీసుకో. గట్టి కాయ నేనే
ఏరుకుంటాను. ఒకటా రెండా నూరు కాయలు కావాలి” అన్నారు రమణమ్మ గారు.
5 రూపాయలు ఎక్కువ అనగానే “సరే లెండి!” అని, ఆ వేళే కోసిన కాయలు పెట్టిన గోనె
రమణమ్మ గారి ముందుంచేడు
మామిడి కాయలకి 2500 రూపాయలు అయిందని పద్మ లోలోన బాధ పడినా, పైకి
మాత్రం నవ్వుతూ 'ఈ ఏడాది ఆవకాయ చాలా రుచిగా ఉంటుంది అత్తయ్యా' అంటూ తన
ఉద్దేశ్యం చెప్పింది.
రమణమ్మ గారు పొంగిపోతూ “పద్మా, ఎప్పుడేనా కాయ బాగుండాలి. డబ్బు కి చూస్తే
లాభం లేదు. ఏడాదంతా ఉండవలిసింది” అని ఆవకాయ గురించి మాట్లాడుతూ, “పద్మా నూరు
కాయలు పైన గోనెలో 25 కాయలు ఎక్కువున్నాయి. కాయలన్నీ చాలా బాగున్నాయి. వదిలేస్తే
మళ్ళా దొరకవు. రఘు కి పులిహార ఆవకాయ ఇష్టం. అమ్మలు కి తురుము పచ్చడి ఇష్టం. పాపం
అమెరికా లో ఉండడం కాదు గాని, దాని నాలిక రుచి పోయింది. అందుకే ఈ 25 కూడా
తీసుకుంటున్నాను. మరో 625 అవుతున్నాయి కదా” అని షాపువాడికి మొత్తం డబ్బులు ఇప్పించి
మామిడి కాయల గొనె, కార్ డిక్కీ లో పెట్టించింది.
పద్మకి ఈ వ్యవహారంతో అత్తమీద చాలా కోపం వచ్చింది . తన చేత ఆఫీస్ సెలవు
పెట్టించి తనని వెంట తిప్పుకుంటోంది. వచ్చే ఏడాది తను అస్సలు సెలవు పెట్టకూడదు
అనుకుంది. కాని నాలుగేళ్లయి, ఇదే అవుతోంది. ముందు వాళ్ళమ్మాయి లలితని వెంట
తిప్పుకునేవారని రఘు చెప్పేడు.
అత్తయ్యకి ఆవకాయ పెట్టడం ఒక హాబీ అనుకుంటాను డబ్బు, శ్రమ వెచ్చించిన
హాబీ. పద్మ ఎన్నో విషయాలు ఆలోచన చేస్తూ డ్రైవ్ చేస్తుండగా “పద్మా“అని పిలుపు
వినిపించింది.
“అత్తయ్యా! పిలిచారా?” అంది పద్మ.
“ఏమిటి పద్మా అలా పరధ్యాన్నంగా గా ఉన్నావు” అని అడిగారు అన్నారు రమణమ్మ గారు.
“ఏం లేదత్తయ్యా! ఎండకదా కొంచెం తల నెప్పి గా ఉంది” అంది పద్మ
“ డోంట్ వర్రీ. ఇంటికెళ్ళగానే ఒక క్రోసిన్ మాత్ర తో స్ట్రాంగ్ కాఫీ చేసి ఇస్తాను తగ్గి
పోతుంది” అని అన్నారు అత్తయ్య
“థాంక్యూ అత్తయ్యా”అని తన డ్రైవింగ్ లో మనసు పెట్టింది పద్మ
“పద్మా, ఇంటికి వెళ్ళగానే ఒక పాత చీర తడిపి కాయలన్నీ గట్టిగా తుడిచి ఒక పాత
పొడి చీర తో తుడిచి ఒక గంట ఫేన్ కింద పెట్టి ఆరేద్దాం. రెండు గంటలకల్లా వెంకట్ వస్తాడు
వాడు ముక్కలు కొట్టేస్తే ఆవకాయలన్నీ సాయంత్రం పెట్టేస్తాను” అని సులువుగా నోటితో ఒక
అయిదు నిమిషాల్లో ఆవకాయ పెట్టేసారు అత్తయ్య
వెంకట్ ప్రతీ ఏడూ రావడం పద్మకి కళ్ళముందు కదిలింది. ప్రతీ ఏడూ వాడి కోసం
చవక రకం రైన్ కోటు కొని కాళ్ళకి ప్లాస్టిక్ బ్యాగులు కట్టుకోమని చాల హడావిడి చేసేవారు. ఇదికాక
వాడి చేతులకి గ్లోవ్స్ వేయించి వారు. ఇవన్నీ వేసుకుని నేను పని చెయ్యలేకపోతునమ్మా అంటే
వాడికి కాయకి అదనం గా ఒక రూపాయ ఆశ పెట్టి వాడి చేత పని చేయించేవారు. కాయలు
కొట్టినప్పుడు అవి ఎగిరి వాడి ఒంటి మీద పడకూడదు. అందుకే ఈ ప్రయత్నం అంతా
వెంకట్ రావడం తో వాడితో చెయ్యి పట్టుకున్నంత పని చేసి సమానమైన సైజుల్లో
ముక్కలు కొట్టించేరు. దానికి వాడే కత్తి ఇంట్లోఉన్నదే దానిని కడిగి తుడిచి ఎండ బెట్టి తయారు
చేసేవారు.
రాత్రి 8 గంటలయ్యేక ఇంకా ఎవరూ రారని తేల్చుకుని అప్పుడు ఊరగాయలు
కలపడం ఆరంభించేరుఅత్తయ్య
‘ఏమిటి రమణా నా రూమ్ లో ఆరంభించేవు ఈ ఆవకాయ పని. అదా ఏ సామాను
గదిలో కనిపించకుండా దాచేసేవు” అంటూ మామ గారు అనడం వినిపించింది. ఇక్కడ
పడుకుంటే నాకు దగ్గు ఆయాసం రావడ తధ్యం అని నవ్వుతూ అన్నారు.
“మీరు ఓ పని చెయ్యండి బాల్కనీ లో ఈ ఒక్కరోజూ పడుకోండి. అక్కడ మంచం
వేస్తాను. రేపు మీ బెడ్ రూమ్ ఖాళీ అయిపోతుంది” అని ఒక సులువు చెప్పేసేరు.
“నువ్వు చాలా సులువు గా చెప్పేవు గానీ అక్కడ నన్ను దోమలు ఒళ్ళంతా కుట్టేసి చంపేస్తాయి” అన్నారు మామగారు.
అంతా వింటున్న రఘు, “నాన్నా! మీరు నా కంప్యూటర్ రూమ్ లో హాయిగా ఏ సి వేసుకుని
పడుకోండి” అన్నాడు.
అది విన్నాక విశ్వనాధం గారు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు
“అత్తయ్యా, ఈవేళ ఊరగాయ కలిపి మీరు పడుకోండి. రేపు ఇద్దరం కలిసి తొక్కు పచ్చడి, మాగాయి పులిహార, ఆవకాయ పెడదాం” అని చెప్పి పద్మ పడుకుంది
రాత్రి 12 గంటల వరకు చాదస్తం గా కారాలు, ఉప్పు కొలుస్తూ ఊరగాయ కలిపేసరికి రాత్రి ఒంటి
గంట దాటింది .
‘ఏమిటో పద్మ '100 కాయలా అత్తగారూ' అంది గాని, లలితకి అమెరికాకి పంపడానికి 5 కిలోలు, దాని స్నేహితులు ఊరగాయ బాగుందన్నారుట.. ఓ నలుగురికి మరో 4 కిలో లు ... ఇక్కడ నా వాళ్ళు, ఆయన వాళ్ళు .. అందరికీ రుచికి కొంచెం ఇవ్వగా ఇంకా ఎంత మిగులుతుంది. ఓ 5 కిలోలు తప్ప.
అమెరికాకి అన్నీ ప్యాక్ చేసి పంపాలి. డబ్బు అవుతుంది మరి. ఏడాదికొకసారి తప్పదు ఈ డబ్బు
ఖర్చు.’... ఇలా ఆలోచిస్తూ నిద్ర లోకి జారారు రమణమ్మ గారు. ఇలా ముగిసింది ఈ ఏడు అత్తగారి ఆవకాయోపాఖ్యానం.
***శుభం***
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : సీత మండలీక
నేను హౌస్ మేకర్ ని. కొడుకులిద్దరూ అమెరికాలో పెళ్ళిళ్ళై స్థిరపడిపోయాక, భర్త ఎయిర్ ఇండియా లో రిటైర్ అయ్యేక ఇప్పుడు నాకు కొంచెం సమయం దొరికింది
కధలు చదవడం అలవాటున్నా రాయాలన్న కోరిక ఈ మధ్యనే తీరుతోంది