'Inthati Duhkhanni Tirchedevaru' written by Neeraja Hari Prabhala
రచన : నీరజ హరి ప్రభల
ఇద్దరు ఆడపిల్లల పెంపకము, చదువులు, వాళ్ల ఉద్యోగాలు, పెళ్లిళ్లు అయ్యాక స్వంత ఇంటిలో భర్తతో ఉంటోంది దివ్య . పిల్లలు వాళ్ల భర్త, పిల్లలతో విదేశాల్లో స్థిరపడ్డారు. ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసి రిటైరైనాక విశ్రాంతిగా ఇంట్లోనే ఉంటాడు భర్త ప్రసాద్. రోజూ లాగానే ఇంటి పని, వంటపని ముగించాక కాస్త విశ్రాంతిగా కూర్చుని తన పరిస్థితిని గురించి పునశ్చరణ చేసుకుంది దివ్య. ఉదయం కాన్ఫరెన్స్ కాల్ లో పిల్లలు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
పిల్లలు పెళ్ళిళ్ళు అయి వెళ్లాక మానసికంగా ఒంటరై పోయింది తను. దానికి కారణం తనతో ఎప్పుడూ ముభావంగా ఉంటూ, ఏదో ఒకటి సాధిస్తూ మానసికంగా, శారీరకంగా హింస పెట్టే భర్త ప్రవర్తన. దానికి కారణం ‘తను ఇష్టపడిన అమ్మాయితో కాక, వేరే అమ్మాయి అయిన తనతో పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇది’ అని కాపురానికి వచ్చిన మొదట్లోనే భర్త నోటి వెంట విని హతాసురాలైంది తను.
కోటి ఆశలతో అత్తవారింట్లో ఉమ్మడి కుటుంబంలోకి అడుగు పెట్టిన తనకు అత్తగారి కోరంటికం, కట్టుబాట్లు, ఆంక్షలు, భర్త నిరాదరణ , తోటి కోడళ్ళ నుంచి అడుగడునా ఎన్నో అవమానాలు…
దానికి కారణం భర్త అండ లేకపోవడం.
"భర్తకు లోకువైతే ఊరంతటికీ లోకువే " అన్న సామెత యదార్ధము. అయినా 'ఇదే జీవితం ' అని ఎంతో ఓర్పు, సహనముతో గడుపుతోందే కానీ పెదవి విప్పి తన బాధలను ఏనాడూ ఎవరికీ చెప్పుకోలేదు. చెప్పితే అందరికీ చులకన అవుతానని.
పెద్దలంతా గతించినా తన బాధలు తీరలేదు సరికదా గుంభనంగా ఉండే తన ప్రవర్తనను అలుసుగా తీసుకుని బాధ పెట్టి సంతోషించటం మరీ ఎక్కువైంది భర్తకు. అలా బాధ పెడితే అన్నా తనను వదిలి వెళతాను అని ఆయన ధీమా. ఆమాటే నిత్యం తారకమంత్రంలా ఆయన నోటి వెంట వింటోంది. పోనీ తన బాధలను ఆత్మీయురాలైన స్నేహితురాలితో పంచుకుని మనసు తేలిక చేసుకుందామనుకున్నా ఎవ్వరినీ దరిచేరనివ్వలేదు భర్త.
35 సం.. వైవాహిక జీవితంలో 'ఆయన ప్రవర్తన అంతే' అని తన మనసుకు సర్ది చెప్పుకున్నా ఈ నడివయస్సులో ఆ బాధ బాగా తెలుస్తోంది. మనసును క్రుంగదీసి ప్రశాంతత లేకుండా చేస్తోంది. ఇన్నేళ్ళూ పిల్లలే ప్రపంచంగా ఉంటూ గడిపింది. ఇప్పుడు వాళ్లు విదేశాలలో స్థిరపడటం వలన ఆ బాధ ఇంకా ఎక్కువైంది. రెక్కలొచ్చి పిల్లలు వెళ్ళాక 'ఈ వయస్సులోనే కదా భార్యాభర్తలు ఒకరికొకరు తోడు- నీడగా చివరివరకు ఉండాలి ' అనేది తను విశ్వసిస్తుంది. కానీ ఇన్నేళ్లూ భర్త ప్రవర్తనను మార్చ ఎంతగానో ప్రయత్నించి విఫలురాలై పిల్లలకోసం, వాళ్ల ఉజ్వల భవిష్యత్తు కోసం రాజీ బ్రతుకును కొనసాగిస్తోంది.
పిల్లలకు తెలుసు తల్లి పడిన, పడుతున్న బాధలు. ఎన్నోమార్లు తండ్రికి నచ్చచెప్ప ప్రయత్నించి విఫలం అయ్యారు. అత్తారింటికి వెళ్లిన ఆడపిల్లలు... అంతకన్నా వాళ్లేం చేయగలరు ? ఎన్నోమార్లు తనను వాళ్ల వద్దకు వచ్చి ఉండమన్నారు. కానీ భర్తను వదిలేసిన స్త్రీ కి ఈ సమాజంలో ఎంత విలువుంటుందో తను లోకంలో చూస్తూనే ఉంది.
రానురాను తన పరిస్థితి మరీ దారుణంగా మారడంతో ఇప్పుడింక తనగురించి బాగా తెలిసిన తన కన్న పిల్లలకు చెపుదామనుకుని కాన్ఫరెన్స్ కాల్ చేసి తన ప్రస్తుత పరిస్థితిని వివరించింది. విడిగా కానీ, ఏ ఆశ్రమంలో కానీ ఉండి అనాధలకు సేవ చేయాలనే తన నిర్ణయాన్ని చెప్పి దానికి వాళ్ళ మద్దత్తు, సహాయ సహకారాన్ని కోరింది.
అందుకు వాళ్లు "అమ్మా! నీవు మావద్దకు వచ్చి ఉండమంటే ఉండవు. మీ పెళ్లి మేం చేయలేదు. చూస్తూనే ఉన్నావుగా.. నాన్న మారరు. నిన్ను బాధ పెట్టటమే ఆయన ధ్యేయంగా, సంతోషంగా ఫీలవుతున్నారు. కనుక ఇది నీ సమస్య. నీవే సాల్వ్ చేసుకోవాలి. కానీ ఒక్క షరతు. నీవు విడిగా ఉంటే మేము నిన్ను చూడటానికి కూడా రాము. మీరిద్దరూ ఒకచోట ఉంటేనే మాకూ మాఅత్తవారింట్లో గౌరవం, మర్యాద. మేం కావాలా? లేక నీవు విడిగా ఉంటూ నీ సంతోషం కావాలో తేల్చుకో " అన్న వాళ్ల మాటలను విని హతాశురాలైంది. మనసంతా బాధతో నిండిపోయింది.
ఇంతటి దుఃఖాన్ని తీర్చేదెవరు?
తల్లిదండ్రులు గొడవలు వచ్చి విడిపోతే ఆ ప్రభావం పిల్లల భవిష్యత్తుపై పడి వాళ్ల బంగారు జీవితాలు దెబ్బ తింటాయని, వాళ్లకు మంచి సంబంధాలు వచ్చి వాళ్ల కాపురాలు బాగుండాలనే కదా ఇన్నేళ్లూ ఇన్ని కష్టాలను తట్టుకుంది తను.
పిల్లలే ప్రాణంగా బ్రతికే తను ఇప్పుడింక ఆ పిల్లలను దూరం చేసుకుని బ్రతకలేదు. పైగా నడివయస్సులో అందరూ ఎదుర్కొనే మెనోపాజ్ , మోకాళ్ల సమస్యలు కూడా ఉన్నాయి.
'తన బాధలు ఎవరితో చెప్పేదీ కాదు - చెపితే తీరేదీ కాదు. సగం జీవితం గడిచే పోయింది. తన బాధలు, కష్టాలు ఇంతే ' అని మనసుకు సర్దిచెప్పుకుని భర్తకు భోజనం వడ్డించడానికి లేచి వంటగది లోనికి వెళ్ళింది దివ్య.
***శుభం***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
మనసులోని మాట
రచయిత్రి పరిచయం : "మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏