మనతెలుగుకథలు.కామ్ వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన విజయదశమి కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ
'O Amma Poratam' written by Ayyala Somayajula Subramanyam
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
మహాలక్ష్మి లాంటి అమ్మాయి పుట్టిందన్నఆనందం కొన్నిక్షణాలే ! ‘తను మాట్లాడలేదు, నడవలేదు' అని వైద్యులు చెబితే విని తట్టుకోలేకపోయింది. అలాగని అమ్మగా తన కర్తవ్యాన్నిమరిచిపోలేదు. కదలలేని, మాట్లాడలేని కూతురికి అండగా నిలిచి, చదువుల సరస్వతిగా నిలవడంలో సాయం అందించింది. వ్యాపారవేత్తగా ఎదగాలన్న తన కల నెరవేరేందుకు సహకరించింది. అగాధమైన కష్టాల కడలిని దాటి ఆనందాల తీరానికి కన్నబిడ్డను చేర్చిన ధరణి జీవితమిది.
***
ధరణి ఒళ్ళో తొమ్మిది నెలల వాసవి ఉంది. వాళ్ళెక్కిన రైలు విజయవాడ నుంచి చెన్నై వెళుతోంది. చెన్నై తనకు తెలియని ఊరు కాదు . ధరణి అక్కడ ఎమ్మెస్సీ చదువుకుంది. నగరంలో తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలియనిదల్లా తన కూతురు వాసవి భవిష్యత్తే. తొమ్మిది నెలల పసికందయినా వాసవిలో ఎదుగుదల లేదు. ఆకలేస్తే ఏడవడం మాత్రమే తెలుసు. కాలాన్ని కొలతలు వేసుకుని అన్ని అవసరాలు చూసుకోవాలి. అడుగులు వేస్తూ అందాలు చిందాల్సిన పసిపాప అమ్మ పొత్తిళ్ళలో కదలికలు లేకుండా ఉండిపోవడం ఎంత దారుణం! తొలి కాన్పులో ఇలాంటి బిడ్డకు తల్లి కావలసి వస్తుందని ధరణి కలలో నైనా ఊహించలేదు.
***
‘అమ్మవు కాబోతున్నందుకు కంగ్రాట్స్’ అని అందరూ అభినందిస్తూంటే ఆమెలోని ఆనందానికి హద్దులే లేవు. భర్త విజయవాడలో రైల్వే ఉన్నతోద్యోగి. ఆర్థికంగా ఉన్న
కుటుంబం. వాసవి తల్లి కాబోతోందని తెలుసుకుని ఇటు భర్తా, అటు తల్లిదండ్రులు ఎంతగా సంతోషించారో! ఎన్ని సంబరాలు చేసుకున్నారో! కాలు కింద పెట్టనివ్వలేదు.
పుట్టబోయే బిడ్డ గురించి ఎన్నెన్ని ఊహలో! పండంటి పసిపాప పకపకా నవ్వుతున్న క్యాలెండర్లతో ధరణి గది నిండిపోయింది.
తొమ్మిది నెలలు నిండాయి. విజయవాడలోని ఓ హాస్పటల్ లో ధరణిని చేర్పించారు. అదేపనిగా నొప్పులు వస్తున్నా, ప్రసవం మాత్రం కావడం లేదు. ధరణి భర్తా,
తల్లీ ఒకటే కంగారు పడుతున్నారు. డాక్టర్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ‘సమయం మించిపోతోంది. సిజేరియన్ చేయక తప్పదు' అన్నారు డాక్టర్లు.
“ఆమెకు ఏం కాదు కదా! '-ధరణి భర్త.
“నాకూతురికి ఏ ముప్పూ రాదు కదా?” - ధరణి తల్లి. వాళ్ళిద్దరూ అడుగుతూనే ఉన్నారు. కాసేపటికి ‘ఆడపిల్ల! మహాలక్ష్మిలా ఉందే! అచ్చు గుద్దినట్లు నీ పోలికే' తల్లి గొంతు విన్న ధరణికి అంత నీరసంలోనూ ఎంతో శక్తి వచ్చినట్లు అనిపించింది. మరికొన్ని క్షణాలకే డాక్టర్ పసికందును
ధరణి చేతిలో ఉంచుతూ “క్షమించండి. ప్రసవం సమయం లో పాప నుదుటి నరాలు బాగా నొక్కుకు పోయాయి' అని చెప్పారు. మూడురోజుల తరువాత ' పాప శారీరక
వైకల్యానికి గురిచేసే ' సెరిబ్రల్ పాల్సీ' బారిన పడే అవకాశం ఉంది” అని మిగతా వైద్యులు చెప్పడంతో ధరణి మాట్లాడలేకపోయింది .
ఏమిటిది..ఎందుకిలా జరిగింది..ఇలా ఎన్నో ప్రశ్నలు! దేనికీ సమాధానం లేదు. మానసిక ఒత్తిడితో తీరని దిగులుతో కుంగిపోయింది.
'అయ్యో చిట్టితల్లీ!’ అంటూ చిన్నారిని హృదయానికి హత్తుకుంది. ఆ స్పర్శలో ఏదో ఉపశమనం. ఎక్కణ్ణించో ధైర్యం. అందులోంచి వెలువడ్డ సమాధానం ‘ఇది నా నెత్తుటి బొట్టు. నా ఊపిరి. దీనితోనే నా జీవితం' ..ఆ భావనతోనే ధరణి మళ్ళీ మామూలు ప్రపంచంలోకి వచ్చింది.
' వాసవి' అని అమ్మాయికి పేరు పెట్టింది.
చికిత్స కోసం వేరే ఊరు పయనం..
పాపకి ఎనిమిది నెలలు నిండాయి. సరియైన చికిత్స చేస్తే వాసవి పరిస్థితి మెరుగవుతుంది. చెన్నైలో అలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి అని తెలుసు
కుంది ధరణి. ఆ సమయానికి ఆమె భర్తకు విజయవాడ నుంచి కోల్‌కత్తా కి బదిలీ అయింది.
' మీరు అక్కడికి వెళ్ళండి..నేను చెన్నై వెళతాను. వాసవికి చికిత్స చేయిస్తాను'....భర్తతో చెప్పింది. వాసవిని తీసుకుని చెన్నై బయలుదేరింది. చెన్నైలో ఆసుపత్రికి దగ్గరగా చిన్న ఇల్లు తీసుకుంది. వాసవిని ఆసుపత్రికి తీసుకెళ్లడం..వ్యాయామాలు చేయించడం..ధరణికి మరో ప్రపంచం లేదు. మరో ఆలోచనా లేదు. ఇల్లు, ఆసుపత్రి..ఈ రెండింటి మధ్యే పరుగులు..ఫలితం కోసం ఎదురుచూపులు..అలా రెండేళ్ళు గడిచాయి. ఒకవైపు వైద్య చికిత్సలు, మరో వైపు ఫిజియోథెరపీలో భాగంగా వ్యాయామాలు. కొద్దికొద్దిగా సానుకూల దృక్పథం. ఫలితాలు కనిపించసాగాయి. అయినా పాప నడవలేదు. మాట్లాడలేదు. తన పనులు తాను చేసుకోలేదు. కానీ ‘చూపూ, వినికిడీ వీటికి ఏ లోటూ లేదు. తెలివితేటల్లో ఎవరికీ తీసిపోదు’ అన్నారు డాక్టర్లు. లోపాలను తలచుకుంటూ దిగులు పడలేదు
ధరణి. తన బిడ్డ తెలివైంది అని తెలుసుకుని కొండంత ధైర్యాన్ని తెచ్చుకుంది. కాలం గడిచింది. ధరణికి రెండో సారి ప్రసవం. ఏ ఇబ్బంది లేకుండా మరో ఆడపిల్ల పుట్టింది.
వాసవికి ఊహ తెలుస్తున్న కొద్దీ తనకూ, మిగిలిన పిల్లలకూ తేడా తెలిసిరావడం మొదలైంది. లోపాలు తెలుస్తున్న కొద్దీ దిగులు కమ్ముకునేది. తన బాధను కంటి సైగల ద్వారా తల్లికి వ్యక్తం చేసేది . తెగ ఏడిచేది . కొన్నిసార్లు ఏం చేయాలో తెలియక అసహనం వ్యక్తం చేసేది. అప్పడు ధరణి చిట్టితల్లి బాధను అర్థం చేసుకుని ఓదార్చేది. తను మిగిలిన పిల్లల్లాగా ఎందుకు లేదో ..అలా లేకపోయినా తెలివి తేటల్లో ఆమె ఎవరికీ ఏ విధంగా తీసిపోదో ..బడికి వెళ్ళి చదువుకుంటే మిగిలిన వారితో ఎలా పోటీ పడగలదో అర్థమయ్యేటట్లు చెప్పేది. దగ్గరలో ఉన్న విద్యా వారధి వికలాంగుల పాఠశాలలో వాసవిని చేర్పించింది. ఇక టీచర్లే తన బాధ్యత చూసుకుంటారులే అని ఊర్కోలేదు. తనూ స్కూల్‌లో వలంటీరుగా చేరింది. వినికిడి లేని, మాటలాడ లేని వాళ్ళకు స్కూల్ లో 'ఆర్గ్యుమెంట్ అండ్ అల్టర్‌నేటివ్ కమ్యూని
కేషన్ ' నేర్పిస్తారు. దానిలో చేతులు కదుపుతూ సైగలు చేయాల్సి ఉంటుంది. వాసవి చేతులు కూడా కదపలేక ఇబ్బంది పడుతుంటే ధరణి కదిలిపోయింది. బిడ్డ కోసం ఆ శిక్షణలో తానూ తర్ఫీదు పొందింది. కంటి సైగల భాషలో వాసవి నిష్ణాతురాలయ్యేలా తీర్చిదిద్దింది. అక్కడి నుంచి వాసవి జీవన గమనమే మారిపోయింది. అలా ఏడో తరగతి వరకు చదువుకుని , ప్రతిభావంతురాలిగా పేరు తెచ్చుకుంది.
ప్రభుత్వ సహకారం..
ఒకరోజు ‘పదవ తరగతి పరీక్షలు రాస్తానమ్మా!’ అని సైగ చేసింది వాసవి. ' బంగారంలా చూసుకుంటాం! నీ కెందుకమ్మా అంత కష్టం?' అందామనుకుని ఆగిపోయింది.
కూతురిలో ఎలాగైనా చదవాలన్న పట్టుదలను గమనించింది .మరి ఎలా! ఆంగ్ల అక్షరాల్ని బోర్డ్ మీద పెద్దగా రాసి ఉంటే వాటిని కంటి సైగతో చూపిస్తూ తన భావాలను
వ్యక్తం చేయడం గుర్తొచ్చింది. అదే పద్ధతిలో పరీక్ష రాయించాలనుకుంది. కానీ అందుకు అనుమతి తప్పనిసరి. స్థానిక విద్యాశాఖకు ఉత్తరాలు రాసింది. వాసవి పరిస్థితీ, తెలివితేటల గురించి ప్రభుత్వానికి తెలియజేసి అవకాశం కలిపించమని కోరింది. ఎట్టకేలకు మూడేళ్ళు గడిచాక ప్రభుత్వం స్పందించింది.
ఒక స్క్రైబ్ ని ఎంపుక చేసుకుని, అతడికి ఐ టెక్నాలజీ లాంగ్వేజిలో శిక్ఛణ ఇచ్చింది. వాసవి అందరి సమక్షంలో కంటి సైగతో అక్షరాలు చూపిస్తే, ఆ వేగాన్ని అనుసరించి రాయడంతో ప్రభుత్వం పరీక్షలు రాయడానికి అనుమతిచ్చింది. ధరణి శ్రమ ఫలించింది. వాసవి ప్రతిభ కు గుర్తింపు లభించింది. మొదట ఎనిమిదో తరగతి పూర్తి చేసి , ఆ అర్హతతో పదో తరగతి పరీక్షల్లో 80 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ప్రశంసలు పొందింది. చదువుల యాత్ర అక్కడితో ఆగలేదు. కాలేజీలు తెరిచే సమయంలో ' అమ్మా! ఇంటర్‌మీడియెట్ చదువుతా. భవిష్యత్తులో ఎంటర్‌ప్రెన్యూర్ ని అయితే లెక్కలు చూసుకోవద్దూ? సిఈసీ తీసుకుంటా!' అంది.
ధరణి షాక్ తింది. ప్లస్‌టూ చదవడం..వ్యాపారం చేయడం ..వాసవికెలా సాధ్యం? అనుకుంది. అలాగని వద్దనలేదు. ప్లస్ టూలో చేర్పించి రోజూ క్లాసులకు తీసుకెళ్ళేది.
క్లాసులో స్నేహితులు రన్నింగు నోట్స్ రాసుకునేటప్పుడు కార్బన్ పేపర్ పెట్టి రాసి, అడుగు కాపీ వాసవికి ఇచ్చేవారు. ఇంటికొచ్చేశాక ధరణి దానిని నోట్సుగా రాసి చదివించేది. వాసవికి మెమరీ పవర్ ఎక్కువ. ఒక్కసారి విని గుర్తుపెట్టుకునేది. అమ్మ సాయంతో చదువుకున్న వాసవి ఇంటర్ లో 82శాతం తెచ్చుకుంది. తరువాత 75 శాతం మార్కులతో బీకామ్ పాసయ్యింది. ప్రత్యేక డివైజ్ ఉపయోగించి కాలితో కంప్యూటర్ అపరేట్ చేయడం నేర్చుకుంది. తరువాత ‘సొంతంగా వ్యాపారం చేస్తాను’ అంటూ వాసవి తన భవిష్యత్తు ఆలోచన చెప్పింది.
టర్నోవర్ యాభై లక్షలు..
వాసవి, కంప్యూటర్ లో వెతికి సేంద్రీయ పత్తితో తయారుచేసిన దుస్తులు అమ్మాలనుకుంది. దానికి సంబంధించిన వివరాలను సేకరించింది. స్థలం ఎంపిక, బ్యాంకు రుణం వంటి పనులూ చేసుకుంది. కన్నబిడ్డ ఎంత ఆత్మవిశ్వాసం కనబరిచినా కంటికి రెప్పలా చూసుకోవాల్సిన బాధ్యత తనకుంది అనుకుని.. వాసవి షాపు పెట్టాలనుకున్న చోటుకి మకాం మార్చేసింది. అక్కడే ' సహజ' పేరుతో బొతిక్ ని ప్రారంభించింది వాసవి. ఓ అమ్మాయి సాయంతో ఆర్డర్లు తీసుకోవడం , దుస్తులు అమ్ముతూ మొదటి ఏడాదే యాభై లక్షలు టర్నోవర్ సాధించింది.
‘పాతికేళ్ళ నా శ్రమ ఇప్పుడు ఫలించింది. తన కాళ్ళ మీద తను నిలబడటం అనే భావనను మా వాసవి రుజువు చేసింది. నా జీవితానికి ఇది చాలు. ఇంతకు మించిన ఆనందం లేదు’ అంటున్న ధరణి ఒకప్పుడు వాసవి చదువుకున్న స్కూలుకి ప్రిన్సిపల్ గా పని చేస్తోంది. కన్నబిడ్డ భవిష్యత్తు కోసం అనేక కఠిన పరిస్థితులని, పరీక్షలనీ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని విజయం సాధించిన మాతృమూర్తిగా అభినందనలు అందుకుంటోంది.
***శుభం***
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.