'Jnapakala Pandirilo' written by A. Annapurna
రచన : A. అన్నపూర్ణ
బాల్యంలో మా ఊరి ఏటిగట్టున ఇసుకలో కట్టుకున్న బొమ్మరిల్లు
చిట్టి చేతులతో మా ఇంటి పెరటిలో నాటిన పచ్చ గన్నేరు మొక్కలు
నాతోపాటు ఎదుగుతూ పందిరిపై అల్లుకున్న సన్నజాజి తీగలు
ఇంటిచుట్టూ విస్తరించిన వృక్షానికి నాకోసం నాన్నగారు వేలాడదీసిన ఊయల
మల్లెలు చామంతులతో బారెడు జడకు అమ్మ అల్లిన పూలజడ
పోటీలుపడి నేస్తాలతో ఆడుకున్న ఆటలు పాడుకున్న పాటలు
యవ్వనాల పరవళ్ళతో కలతనిదురలో కాంచిన సుందర స్వప్నాలు
ఊహతెలిశాక అండమైన జీవితానికి వేసుకున్న బాటలు
ఆబాటలో నాకోసం నడిచివచ్చే చెలికాని కోసం ఎదురుచూపులు
వివాహబంధంలో ఆస్వాదించిన వెన్నెల రాత్రుల అనుభవాలు
అమ్మగాఅనుభవించిన కమ్మని మాతృత్వపు మధురిమలు
ఆశయాలకు ఊపిరిపోసిన కొత్తబాటలో పయనాలు
జీవితానికి అద్దంపట్టిన జ్ఞాపకాల పందిరిలో ముసురుకున్న తీపి గురుతులు
మగువమనసులో ఎన్నటికీ మరువరాని తీపి తలపులు!
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ.
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.