'Thondarapatu' written by Padmavathi Thalloju
రచన : పద్మావతి తల్లోజు
సూర్యుడు పడమటి దర్వాజ మూసి, సిల్కు పెట్టినట్టున్నాడు. సీకటి అయితుంది. పయి మీద సోయి లేకుండా కూసున్న ఆళ్ళిద్దరికి మటుకు సీకటి పడిన ఇషయం కూడా యాదికిలేదు. పూరి పాక ముంగల చారగిలబడి కూసున్న రాజమ్మ , మల్లన్న కేసి దిగులుగా ఓ సూపు చూసింది. పిల్లలు లేని పాకలోకి తొంగి సూద్దమన్నా.. గుబులు పుడ్తోంది. ఈ భూమ్మీద ఉన్న మాటే గాని, గాల్లోకి సూస్తున్నడు మల్లన్న. ఏమంటే రాజమ్మను సూటిగా చూసి తెగువ లేకపాయె. ఆ ఇద్దరి మనుసులు ఒక్కపారే యేనకటి దినాల్లోకి పోయినయి.
*** *** ***
పదేళ్ల ముంగళ రాజమ్మ తండ్రి ఆంజయ్య చెలకల, పక్క ఊరు నుండి వచ్చి కూలి పనికి జేరిండు మల్లన్న. పెద్ద పెద్ద కళ్ళు, ఉంగరాల జుట్టు, నల్లని కండలు తిరిగిన పైతో ఉన్న మల్లన్నను చూసినంత రాజమ్మ మనసాగక మాట గలిపింది. అవికాస్త పేమగా మారి , మల్లన్న తో పారిపోయి పెళ్లి చేసుకునేట్టు జేసింది. కానీ, ఆడ మల్లన్న కొంప జూసి రాజమ్మ పరేషాన్ ల బడింది. ఆడున్నది ఒకటే అర్ర. అందులో గూడా ఓ కందీలు, రెండు జంపు కాణాలు, సలాకి, ఈలపీట, రెండు గరిటెలు ,రెండు తప్కులు ,తల్లెలు, సిలుంబట్టిన లోటాలు, నీళ్లు పట్టుకోడానికి ఓ పటువ.., అదే మల్లన్న ఎనకేసిన ఆస్తి.
ఇట్లయితే బతికే దెట్టా.., అని రాజమ్మ సోంచాయించి నాలుగిళ్లల్ల పనికిపోబట్టింది . ఏన్నీళ్లకు సన్నీళ్లు తోడై వాళ్ల బతుకులు గాడినబడ్డాయి. ముద్దొచ్చే ముగ్గురు పోరగాండ్లతో ముంగిలి మురిసింది. ఎన్నడూ ఏదీ అడగని పెండ్లాం అడిగిందని పదివేలు బెట్టి ఓ బర్రెను కూడా కొనుక్కొచ్చిండు మల్లన్న. అదికూడా వాల్లింట్ల ఒక మనిషిలా మసల వట్టింది.
ఆ బర్రెకు పోరలు లచ్చిమి అని పేరుబెట్టి ముద్దుగ పిలిచేటోల్లు. దానికి సొప్ప, పచ్చిగడ్డి తినవెట్టి, కడుపునబెట్టి కాపాడుకున్నరు. అదిచ్చే పాలతోటి పాడికి పరేషాన్ లేకుండా పోయింది. అంతట్లనే , ఆళ్ళ కాపురానికి ఎవరి దిష్టి తగిలెనో ఏమో, మల్లన్న మందు కల్లుకు మరిగిండు. అన్ని దినాల నుండి చేసిన కాపురం కూడా బర్కత్ లేకుండా పోయింది . రాజమ్మను కొట్టవట్టిండు. ఇంగ తిట్లకయితే అంతేలేక పాయే. మస్తు కష్టాలకు ఓర్సుకుంది. గానీ, తూట్ల మాదిరి మాటలు మనసు మీదికి తీస్కుంది రాజమ్మ.
*** *** ***
మొగుడు ఇంట్లో లేనప్పుడు జూసి దూలానికి ఉరేసుకుని సద్దాం అనుకుంది రాజమ్మ. పొల్లలు అగుడవుతారని లోపల పానం అల్లాడింది .మల్లన్న వెంటబడి తల్లిగార్ని ఇడ్సైతే వచ్చింది గాని, రెంటికి చెడ్డ రేవడి అయింది బతుకు. ఆంజయ్య బిడ్డ మీద కోపం గొంతు వరకు నింపుకొని కూసున్నడు .ఇక సుట్టాలయితే సెప్పనే కూడదు. చివరాఖరికి మనసు చంపుకొని ,ఆ ఇలాకల పేరున్న మడిగెకుపోయి నల్ల మందు కొనుక్కొని వచ్చింది. పోరలకు ఇష్టం అని ఋంగలు పట్టుకొచ్చింది. ఊరవతల బాయ్ కాడికి పిల్లలను తోల్కపోయింది. నల్ల మందు తినవెట్టి పండవెట్టింది. దేనికంటే, తన కళ్ళ ముందే పిల్లలు గిజ గిజలాడుతూ చావడం చూడలేక.అంతట్లనే, మోరెత్తి తన యేనకే ఉర్కొస్తున్న లచ్చిమిని జూసి పానం విలవిల్లాడే! మూగజీవానికి తన మీదున్న పేమ తన మొగునికి లేకపాయే... అని లోపల కమిలిపోయింది. ఆ బాయ్ సుట్టూ ఉన్న పచ్చగడ్డి కాడికి దాన్ని తోల్కపోయి ఇడ్సి వచ్చింది. ఆ బర్రెకు ముందే ఏమైనా తెల్సిందో, ఏదైనా జరగరానిది జరుగుతుందని తెల్సుకున్నదో మరి గడ్డి తినుట బంద్ చేసి రాజమ్మను ఓ కంట నిగరాన్ చేయవట్టింది.
* * * * * * చాన సేపు ఏడుస్తనే కూసుంది రాజమ్మ. ఎంత సోంచాయించినా ఇగ బతకనింకే ఆశ కనబడక పిల్లల తీస్కొని బాయి కాడికి పోయింది.ఇంకో జన్ముంటే ఈ ఆడ పుట్టుక మటుకు ఇయ్యాకయ్యా, బొందితో పై కన్నా తీస్కపో అని ,ఆ దేవుని ఏడుకొని ,ముగ్గురు పిల్లలను బాయిలోకి ఇసిరి, తాను దుంకింది. ఆమెనే సూస్కుంట తిరుగుతున్న లచ్చిమీ "అంబా"అని అరుస్తూ ఉర్కొచ్చింది.ఒకటే అరుసుకుంట ఆ బాయి సుట్టూ తిర్గవట్టింది.వాని ఆవు పెయ్యను దేవులాడుకుంటూ అటోచ్చిన పసుల గాసే పోరడు బాయిల "దబ్బున"ఏదో పడ్డ సప్పుడు ,ఆ యెనకే అర్చూకుంటూ లచ్చిని బాయి శుట్టూ తిరుగుడు సూసి అందరిని పిలిచే లోపు జరగాల్సిన ఘోరం జరిగిపోయే. నాలుగు ప్రాణాలు గాల్లో కలిసిపాయే. లబోదిబోమంటూ సడక్ ఎంట, జల్ది జల్ది ఉరికి వచ్చిన మల్లన్న గుండెలవిసేలా ఏడ్సిండు. బండి గట్టి సర్కారు దవాఖానకి ఏస్కపోయి,డాక్టర్ల కాళ్లు మొక్కి పెళ్ళాంపిల్లల ను బతికించమని ఏడుకున్నడు.ఇంగ లచ్చిమైతే మనుషుల కన్నా ఎక్కువ కన్నీరు గార్చ వట్టింది. కానీ," పిల్లల ప్రాణం పోయి చాలాసేపు అయింది" అని చావు కబురు సల్లగా చెప్పి డాక్టర్లు కొనప్రాణంతో కొట్టుకుంటున్న రాజమ్మను మాత్రం బతికించి మల్లన్నకు అప్పగించిన్రు. జరిగిన ఘోరం తెలుసుకొని ఆంజయ్య,తన సుట్టాలనుఎంటబెట్టుకొచ్చి మల్లన్నను చావదెబ్బలు కొట్టిండు. రాజమ్మకు గండం గడిచింది అని తెలిసి ,అప్పటికి ఇడిచిపెట్టి పోయిన్రు. అంతైనా కూడా అంజయ్య బిడ్డ ముఖం మళ్ళి గూడా సూడకపాయే. *** *** ***
చానా పరేషాన్ లు బడి, నెల దినాలు అయినంక దవాఖాన నుంచి గుడిసె కొచ్చిన రాజమ్మ, మల్లన్నకు పిల్లలు లేని ఇల్లు బోసివోయి కనిపించే. తొందరపడి పిల్లలను సంపుకుంటిమని మొగుడు పెళ్ళాలు ఒకరినొకరు వట్టుకొని బోరున ఏడ్చిన్రు. దవాఖాన కర్సుల కింద ఉన్నవన్ని పోన్గా మిగిలింది అదే ఆస్తి! మల్లన్నకు పెళ్లికాక ముందు ఉన్నది. ఏడ నుండి మొదలు పెడితిమో ఆడికే వచ్చి చేర్తిమి అని తలకు చేతులు పెట్టుకొని తల్లడిల్లిన్రు. అంతట్ల రాజమ్మ నెత్తినెవరో మెల్లగ నిమిరినట్లయి ఎనకకు మళ్ళి జూసింది. లచ్చిమి! తిండి సక్కగ లేక బొక్కలు దేలి గుర్తువట్ట రాకుండయ్యింది. దాన్నట్ల జూసి రాజమ్మ మనసు చివుక్కుమంది. లేని ఓపిక దెచ్చుకొని దాన్నెంట వెట్టుకొని, దానికి గడ్డివట్టుక రానింకే అడవిబాట వట్టింది. లచ్చిమిలో తన పిల్లల్ని జూసుకొని, దాన్ని సాక్కుంట... జర పోరల యాద్ మర్సు తుందని అనుకొని మల్లన్న నిమ్మళంగా గాలి వీల్సుకొని, చేతులెత్తి దేవుడికి అయినంక లచ్చిమికి దండం పెట్టుకొనె.
***శుభం***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం :
నా పేరు తల్లోజు పద్మావతి. చింతపట్ల పద్మా రమేష్ అనే పేరుతో రచనలు చేస్తుంటాను.ఇప్పటి వరకు పది కవితలు , ఐదు కథలు అచ్చయ్యాయి.వందకు పైగా కవితలు,ఇరవైకి పైగా కథలు వ్రాయడం జరిగింది. పుట్టింది కల్వకుర్తి(మహబూబ్నగర్ జిల్లా,తెలంగాణ). తల్లిదండ్రులు సుమిత్రమ్మ, రామేశ్వరయ్య గార్లు. భర్త పేరు రమేష్ బాబు, గవర్నమెంట్ టీచర్. నాకిద్దరు అబ్బాయిలు పెద్దవాడు సూర్య(ఇంజనీరింగ్ ఫైనల్),చిన్నోడు పృథ్వి (డిగ్రీ ఫస్ట్ యియర్). రచనలతో పాటు, చిత్రలేఖనం , పాటలు పాడటం, కొత్త వంటలు చేయడం, కుట్లు, అల్లికలు నా హాబీలు.