top of page
Writer's pictureYasoda Pulugurtha

తీరం చేరిన కెరటం

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


'Thiram Cherina Keratam' written by Yasoda Pulugurtha

రచన : యశోద పులుగుర్త

“ఇంకో రెండురోజులుండి వెళ్లచ్చుకదా నీతా.. మీ లాయర్ అంకుల్ తో పనుండి వచ్చానని చెపుతూ వారం రోజులుగా అటూ ఇటూ తిరుగుతున్నావు.. అసలు మనం ముగ్గురం సరదాగా గడిపినదే లేదు” మంచం మీద కూర్చుని సూట్ కేస్ లో తన చీరలు సర్దుకుంటున్న వినీతతో అంటున్నాడు మాధవ్..

“లేదు మాధవ్, రేపు ఎర్లీమార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసేసుకున్నాను ముంబైకి.. మళ్లీ వచ్చినపుడు తప్పకుండా ఎక్కువరోజు లుంటాను .. ఇప్పటికే మీ దంపతులిరువురినీ చాలా ఇబ్బంది పెట్టేసాను” అంది వినీత.

“నీ ముఖం , ఇబ్బంది ఏమిటి నీతా ? స్నేహితురాలివి.. ఆ మాత్రం సాయం చేసుకోకపోతే స్నేహానికి విలువేమిటి?” అన్నాడు మాధవ్.. వీరికి కాస్త దూరంలో నిలబడి ఉన్న నీలిమ వీళ్లిద్దరి సంభాషణా వింటూనే ఉంది.. తనుకూడా వినీతను మరో రెండురోజులుండి వెళ్లమంది.. ‘లేదు, వెళ్లిపోతాను నీలిమా’ అంటూ చెప్పింది చెప్పింది వినీత..

వినీత మాధవ్ ఇద్దరూ ఇంజనీరింగ్ చదివేటప్పుడు మంచి ఫ్రండ్స్.. వినీత ముంబై లో ఉంటోంది.. మాధవ్ హైద్రాబాద్ లో మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తున్నాడు.. వినీత ఇంజనీరింగ్ అయిపోగానే ఐఐటి ముంబై లో ఎమ్ టెక్ చేసింది.. ఆ తరువాత డా.. అఖిల్ తో వివాహం జరిగిపోయింది.. డా..అఖిల్ ముంబాయి లో నానావతి హాస్పటల్ లో జనరల్ సర్జన్ గా పనిచేస్తున్నాడు..

వినీత లాయర్ దగ్గరకు ఎందుకొచ్చిందో తెలియదు.. ఎంత స్నేహితురాలైనా కొన్ని వ్యక్తిగత విషయాలను తరచి తరచి అడగకూడదన్న సంస్కారంగల వ్యక్తి మాధవ్ !

‘నేను హైద్రాబాద్ ఒక ముఖ్యమైన పనిమీద వస్తున్నాను మాధవ్, నాకు మంచి హొటల్లో ఒక రూమ్ బుక్ చేసిపెట్టవూ’ అని మెసేజ్ ఇచ్చింది వినీత.

‘హొటల్ లో ఉండడం ఏమిటి నీతా, మా ఇంట్లో ఉందువుగానీ” అంటూ ఏయిర్ పోర్టుకి వెళ్లి వినీతను రిసీవ్ చేసుకుని, తనింటికి తీసుకువచ్చాడు..

మాధవ్, నీలిమలు వినీతను చాలా ఆప్యాయంగా చూసుకున్నారు..

వీరింటినుండి వీడ్కోలు తీసుకుంటుంటే ఎంతో ఆనందంగా, తనలో కలిగిన ఊహించని మార్పుకి అచ్చెరువొందుతోంది వినీత..

అనుకున్నట్లుగా మరునాడు ఎర్లీ మార్నింగ్ వినీత మాధవ్ నీలిమల నుండి వీడ్కోలు తీసుకుంటూ బాంబేకి బయలదేరింది..

‘నీకేమి హెల్పె కావాలన్నా మొహమాటపడకు నీతా, నేను చేసిపెడతా’నంటూ పదే పదే చెపుతూ సాగనంపాడు మాధవ్..

మాధవ్ ఆఫీసుకని బయలదేరుతుంటుంటే నీలిమ హడావుడిగా వస్తూ, ‘మాధవ్ ఇవి చూడం’డంటూ చేతిలో రెండు అందమైన ఎర్రని రంగులోనున్న చిన్నచిన్న అట్టపెట్టెలతో పాటు ఒక కాగితం మాధవ్ చేతికి అందించింది..

‘ఏమిటిది నీలూ’ అనగానే, వినీత ఆ గదిలో టేబుల్ మీద పెట్టి వెళ్లిందనగానే, ఆ కాగితంలోని అక్షరాలవైపు తన దృష్టిని సారించాడు.. అందులో....

డియర్ మాధవ్, నేను హైద్రాబాద్ వస్తున్నపుడు నా మనసునిండా ఆవేదనే.. కానీ మీ దంపతులనుండి వీడ్కోలు తీసుకుంటూ ఎంతో ఆనందాన్ని, విచిత్రంగా నా మనసులో నాకు తెలియకుండా వచ్చిన మార్పుకి ఎంతో సంతోషాన్ని మూటకట్టుకుని వెడ్తున్నాను.. ఇది అక్షరాలా నిజం మాధవ్.. నేను అఖిల్ తో కలసి ఉండడం లేదు.. ఆరునెలల నుండి అతనికి దూరంగా వచ్చేసి వర్కింగ్ ఉమన్ హాస్టల్ లో ఉంటూ ఇక్కడ ఎల్ అండ్ టీ కంపెనీలో పనిచేస్తున్నాను.. అంటే, అఖిల్ నుండి ఇంకా డివోర్స్ తీసుకోలేదు.. అఖిల్ పక్కా ప్రొఫెషనల్.. ఎప్పుడూ హాస్పటల్, పేషంట్స్ అదే అతని ప్రపంచం.. వాటి తరువాతే నేను.. ఎప్పుడైనా కాస్తంత ఏకాంతం దొరికి ఇద్దరం మాట్లాడుకునే సందర్భాలు అసలు లేవనే చెప్పాలి.. అతనితో నా జీవితం ఎంతో ఆనందంగా, రంగుల హరివిల్లులా ఉంటుందని ఏవేవో కలలు కన్నాను.. చీకూ చింతాలేని బాల్యం, కాలేజ్ , సినిమాలు, స్నేహితులు, అఖిల్ తో పెళ్లి , ముంబైలాంటి మహానగరంలో కాపురం, ఓహ్ ! జీవితం అంటే ఇదే అనుకున్నాను.. అందమైన సాయంత్రాలు సంధ్యాసమయంలో బీచ్ ఒడ్డున అతనితో కలసి చేతిలో చేయివేసుకుని ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ నడవాలని, ఖరీదైన హొటళ్లల్లో అతనితో కలసి డిన్నర్ చేయాలన్న నా కలలన్నీ ఎండమావులే అయినాయి.. అఖిల్ కు నా భావోద్వేగాలు ఏమీ అర్ధమయ్యేవికావు.. ఫలితం అతను రోజూ హాస్పటల్ నుండి రాగానే అతనితో గొడవలు పెట్టుకునేదాన్ని.. అలిగేదాన్ని, అఖిల్ నన్ను బుజ్జగిస్తూ , బ్రతిమాలుతుంటే ఆ అనుభూతి ఎలా ఉంటుందో ఆస్వాదించాలనుకున్నాను.. ఊహు......నా కోరిక తీరేదికాదు.. మా మధ్య దూరం పెరిగిపోయింది.. సర్దుకుపోవాలన్నాడు, డాక్టర్ వృత్తి అంటే ఇలాగే ఉంటుదన్నాడు.. బోర్ గా ఉంటే జాబ్ చేసుకోమన్నాడు, ఏవైనా వ్యాపకాలు పెట్టుకోమనేవాడు.. అతనిమాటలు నా అహాన్ని మరింత పెంచాయి.. అతని నుండి డివోర్స్ తీసుకుని అమెరికా వెళ్లిపోవాలనుకుని హైద్రాబాద్ లోని మా లాయర్ అంకుల్ ని కలవాలని వచ్చాను..

కానీ, నేను ప్రత్యక్షంగా చూసిన కొన్ని సంఘటనలు నా జీవిత నిర్ణయాన్ని పూర్తిగా మార్చివేసాయి.. నీవెంత అదృష్షవంతుడివి మాధవ్.. నీ ఇష్టాలనే తన ఇష్టాలుగా మార్చేసుకుంటూ, నీవే తన సర్వస్వం అని భావించే నీలిమ లాంటి భార్యను పొందినందుకు.. నీవూ లేట్ నైట్స్ వస్తూ ఉంటావని, ఒకోసారి యూఎస్ క్లైంట్ తో కాన్ఫరన్స్ జరిగేటప్పుడు రాత్రుళ్లు ఆఫీసులోనే ఉండిపోతావని చెప్పింది నీలిమ.

‘ఇవన్నీ ప్రస్తుత కాలంలో మామూలే కదా వినీతా! సర్దుకుపోవాలి’ అంటూ ఎంతో కూల్ గా మాట్లాడిన నీలూని చూస్తూ, నేను చాలా గిల్టీగా ఫీలయ్యాను. మీ ఇద్దరికీ ‘ఒకరిపట్ల మరొకరికి ఎంత అవగాహన’ అనిపించింది. మిమ్మల్ని చూసాక దాంపత్య విలువలు, ప్రేమాభిమానాలను ఒకరికొకరు ఎలా పంచుకోవచ్చో అర్ధం అయింది.. నేను అఖిల్ విషయంలో ఒక భార్యగా ప్రవర్తించలేకపోయానని అర్ధమైంది.. మొన్నొకరోజు నీవు అర్ధరాత్రి ఎపుడో వచ్చావు. నీకోసమే ఎదురుచూస్తున్న నీలిమ గబ గబా లేచి వచ్చింది. మైక్రోవేవ్ ఓవెన్ లో పదార్ధాలన్నీ వేడిచేసి ప్లేట్ లో కలపి కొసరి కొసరి నీకు తినిపించడం చూసాను.. నీకు పొలమారితే నెత్తిమీద మృదువుగా తడుతూ, నీచేత నీళ్లు తాగించడం చూసాను.. నీ కార్ హారన్ శబ్దం వినగానే నీలిమ ముఖంలోని ఉద్విగ్నతను చూసాను.. అప్పుడనిపించింది నాకు, అఖిల్ అలా ఎన్నోసార్లు వస్తే నేను లేచేదాన్ని కాదు.. తను తిన్నాడో లేదోనన్న ఆలోచనే ఉండేదికాదు.. నా పొరపాట్లన్నీ ఇక్కడ మీతో ఉన్న కొన్నిరోజులలోనే అర్ధమై నేనేమి పొగొట్టుకున్నానో గ్రహించుకున్నాక, ఒక్క క్షణం ఉండాలనిపించలేదు..

ఒంటరి పక్షిలా ఒక గమ్యం లేకుండా ఎగురుకుంటూ వచ్చి అందమైన మీ పొదరింటి ముంగిట వాలాను.. అన్యోన్యమైన మీ జంటను చూసి, నాకూ నా జతకాడు కావాలనిపించింది.. అందుకనే నా జంట పక్షికోసం ఆర్తిగా ఎగురుకుంటూ అతని పరిష్వంగంలో సేదతీరాలని నా తీరానికి వెళ్లిపోతున్నాను..

ఈ ప్రయాణం నాకు జీవితంలో ఎంతో విలువైనదిగా , నాజీవిత దిశనే మార్చేసిందని చెపుతాను.. నా ఈ ప్రయాణానికి గుర్తుగా మీ కిరువురికీ ఒక చిన్న కానుక, డైమండ్ రింగ్స్ కొని టేబుల్ పై పెట్టాను.. మీకిద్దరికీ మీ వేలికున్న ఆ ఉంగరాలను చూసినప్పుడల్లా ఈ పిచ్చి నీతూ గుర్తుకు రావాలి.. ఏమంటావ్ మాధవ్ ?

అఖిల్ కు ఫోన్ చేసి చెప్పాను. ముంబై ఏయిర్ పోర్ట్ లో నా కోసం క్షణమొక యుగంగా నిరీక్షిస్తానన్నాడు !

ఉంటాను.. మా డాక్టర్ గారికి వీలుకలిగినప్పుడు మేమిద్దరం కలసి మీ ఇంటికి వచ్చి మా నీలూ చేత బొబ్బట్లు చేయించుకుని మరీ తింటాం.. మీరూ ముంబై రండి మాధవ్, మా ఇంటికి..

బై ఫ్రండ్స్ ........

ఎప్పటకీ మీ నీతూ........”

ఉత్తరం చదివిన మాధవ్ , నీలిమలు వినీత తీసుకున్న నిర్ణయానికి ఎంతో సంతోషించారు..

***శుభం***

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనల కొరకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : నా పేరు యశోద పులుగుర్త, మా వారి పేరు శ్రీ కైలాసపతిరావు ! నేను ఒక ప్రభుత్వరంగ సంస్తలో మార్కెటింగ్ విభాగంలో సీనియర్ మేనేజర్ గా 35 సంవత్సరములు పనిచేసి రిటైర్ అయ్యాను.. నా విద్యార్హతలు M.A (Pub. Admn.) & M.B.A (Marketing ). రిటైర్ అయ్యాక పూర్తిగా తెలుగు సాహిత్యం పట్ల , రచనల పట్ల ఆసక్తి కలిగింది.. చిన్నతనంనుండి మంచి మంచి రచయితలు, రచయిత్రుల కధలు, సీరియల్స్ చదువుతూ పెరిగినదాన్ని! నాకు చిన్నతనంనుండి మంచి మంచి కధలు వ్రాయడానికి ప్రయత్నించేదాన్ని.. కాని చదువు, ఉద్యోగం, పిల్లల పెంపకం బాధ్యతలలో నా కోరిక తీరలేదు.. ప్రస్తుతం మా అబ్బాయిలిద్దరూ వాళ్లు కుటుంబాలతో అమెరికాలో స్తిరపడ్డారు.. నేను ప్రస్తుతం రచనా వ్యాపకంలో ఉంటూ కధలూ, వ్యాసాలూ వివిధ పత్రికలకు పంపుతూ ఇలా అప్పుడప్పుడు పోటీలలో పాల్గొంటున్నాను.. నేను వ్రాసిన రెండుకధలు పుస్తక రూపంలో ప్రచురితమైనాయి.. ప్రస్తుతం హైదరాబాద్ లో నేనూ, మా శ్రీవారూ విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్నాం.



1 view0 comments
bottom of page