top of page
Writer's pictureSita Mandalika

తీరిన కోరిక

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





'Thirina Korika' written By Sita Mandalika

రచన : సీత మండలీక

కెరీర్ లో పైకి ఎదగాలనే తపన రమేష్ కి.అతనికి అన్ని విధాలా సహకరిస్తుంది భార్య రమ్య.పెళ్ళై నాలుగేళ్లు గడుస్తుంది.అతనితో, పిల్లలు కావాలన్న తన కోరిక చెబుతుంది. మరి అతను ఏమంటాడో ప్రముఖ రచయిత్రి సీత మండలిక గారు రచించిన తీరిన కోరిక చదివితే తెలుస్తుంది.


"శకుంతలా! రమణయ్య గారి ఇంట్లో ఏదేనా ఫంక్షన్ ఉందా? గుమ్మానికి పసుపు రాసి, బొట్లు పెట్టి, మామిడి తోరణాలు కడుతున్నారు?" అని లోపలికి వస్తూనే అడిగారు మాధవరావు గారు.

“చెప్పడం మరిచి పోయేను, నిన్ననే శ్రీదేవి కోడలు గీత, మనవడితో ఊరినించి వచ్చింది. మనవడికి బారసాల చేస్తున్నారు . శ్రీదేవి పేరంటానికి పిలిచించింది. చిన్న గా పేరంటం చేసుకుంటున్నారు. బాబు కి ఐదో నెల వచ్చేక అపార్ట్మెంట్ లో అందరినీ పిలిచి పార్టీ ఇస్తారట . నేనూ, రమ్యా పేరంటానికి వెళ్లి వస్తాము” అని శకుంతల గారు చెప్పేరు.

రమ్య, శకుంతల గారి కోడలు. రమేష్ కి రమ్యకి పెళ్లై నాలుగేళ్లు నిండుతున్నాయి. మాధవ రావుగారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్. రమేష్ , వాణి మాధవరావు, శకుంతల గారి సంతానం .

వాణి పెళ్ళై భర్తా పిల్లలతో బొంబాయి లో స్థిర పడిపోయింది. తనకి , శశిధర్, శశాంక్ ఇద్దరు కొడుకులు.

రమేష్ చామన ఛాయ రంగు తో ఆరడుగుల పొడుగు పైనుంటాడు. మంచి ఎక్సర్ సైజ్ చేసిన బాడీ. చురుకైన కళ్ళు, సూటైన ముక్కుతో చూడ గానే హ్యాండ్సమ్ గా ఉన్నాడనిపిస్తాడు. వీటన్నిటి తో పాటు చాలా తెలివైనవాడు ఇంజనీరింగ్ లో మంచి మార్కులతో పాస్ అయి ఒక పేరున్న సంస్థలో చేరేడు.. కష్ట పడి పని చేసి కేరీర్ లో పైకి రావాలని అతని గట్టి పట్టుదల.

అతనికి అన్ని విధాలా తగిన అమ్మాయి రమ్య. ఎంతో సింపుల్ గా చూడ చక్కగా ఉంటుంది. మాధవరావు గారి స్నేహితుడు రమణయ్య గారి కూతురు రమ్య. ఇరు వైపుల వాళ్లకి అన్నీనచ్చి, రమేష్ రమ్య ల పెళ్లి చేసేరు. రమ్య ఎం. ఏ. బీ. ఎడ్, చేసి ఒక నర్సరీ స్కూల్ లో టీచర్ గా పని చేస్తోంది. తనకి చిన్నప్పటినించీ చిన్న పిల్లలతో గడపడం అంటే చాలా సరదా.

శకుంతల, మాధవరావు గారికి ఏ చీకూ చింతా లేదు గానీ రమేష్, రమ్యలకి నాలుగేళ్లయినా పిల్లలు లేరన్న విషయమే చిన్న బాధ.

"రమ్యా! తొందరగా తెమిలి రామ్మా.. పేరంటానికి వెళ్లి వద్దాము” అని పిలిచారు శకుంతల గారు.

"ఇదుగో అత్తయ్యా! ఇప్పుడే వస్తున్నా"నంటూ పది నిమిషాల్లో తయారై వచ్చింది రమ్య. కొంచెం డార్క్ కలర్ గులాబీ రంగు మైసూర్ జార్జెట్ చీర, దానిపై సింపుల్ గా ఉన్నముత్యాల సెట్, ఒక చేతికి వాచీ, మరొక చేతికి నాలుగు బంగారు గాజులు. శకుంతల గారు ఒక్క నిమిషం కోడలిని చూస్తూ మనసులోనే మురిసిపోయేరు. సింపుల్ గా ఉన్నఆ చీరతో పాటు రమ్య కి అన్నీ ఎంతో నప్పేయి.

రమ్య తయారై వచ్చేక శకుంతల, రమ్య కలసి మూడో ఫ్లోర్ లో ఉన్న రమణయ్య గారింటికి పేరంటానికి బయల్దేరేరు. రమణయ్యగారింట్లో అప్పుడే కార్యక్రమం ఆరంభం అయ్యింది. గీతని చూడ గానే చిరునవ్వు నవ్వి పలకలరించింది రమ్య. గీత ముందు కన్నా కొంచెం ఒళ్ళు చేసింది. చక్కటి డబల్ కలర్ పెద్ద పట్టు చీర కట్టి, జుట్టు సిగలా చుట్టి, సిగ చుట్టూ పువ్వులు పెట్టి చాలా అందం గా తయారయ్యింది, వీటన్నిటినీ మించి గీత ఒడిలో ఉన్న బాబుని ఏడవకు బాబు అని లాలిస్తూ ఉంటే ఎంత బాగుంది! మొన్నటి వరకు గీత ఒక సామాన్యమైన అమ్మాయిలా ఉండేది. బాబు పుట్టి తల్లి అయ్యేక తనకి ఎంత బాధ్యత. కానీ అది అందరూ కోరుకుంటున్న అందమైన బాధ్యత . పెళ్ళై రెండేళ్లయింది. వెంటనే బాబు పుట్టేడు చాలా అదృష్ట వంతురాలు. ఆ బాబు ముద్దులు మూటగడుతూ ఎంత బాగున్నాడు . గులాబీ రంగు, తల మీద నిండా జుట్టు . నిద్ర పోకుండా చూస్తున్నాడు . మెరుస్తున్న కళ్ళు, చిన్న మూతి.. 'తన దిష్టే తగిలేటట్లుంది' అనుకుంది రమ్య.

తన జీవితం లో ఏ మార్పు లేదు . మనసులో ఏవో ఆలోచనలు. వాటి మధ్యలో 'రమ్యా' అన్న పిలుపు వినిపించింది ".

"తాంబూలం తీస్కో అమ్మా! ఇంక బయల్దేరుదాం"అన్నారు శకుంతల గారు. గీత దగ్గిరకి వెళ్లి పలకరించి, బాబు కి బహుమానం ఇచ్చిరమ్య, శకుంతల బయల్దేరేరు.

ఆ వేళ సండే అవడం రమేష్ కూడా ఇంట్లో ఉన్నాడు . భోజనాల తరవాత బయటికి వెళదామని ప్రోగ్రాం వేసేడు. "రమ్యా రెడీ ఐతే అలా మాల్ కి వెళ్లి షాపింగ్ చేద్దాం " అన్నాడు రమేష్ .

"ఈ వేళ బయటకు వెళ్లే మూడ్ లేద"ని బెడ్ రూమ్ కి వెళ్లి పడుకుంది రమ్య. నిద్ర రాలేదు గాని ఏవో ఆలోచలతో మనసంతా నిండిపోయింది. పెళ్లి అయిన వెంటనే తన భవిష్యత్తు ని గురించి చెప్తూ " రమ్యా, నీ సహకారం తోనే నేను ఒక్కొక్క మెట్టు పైకెక్కి గమ్యం చేరగలను. నేను చేస్తున్న ప్రాజెక్ట్ పూర్తి కావడానికి ఇంకా రెండేళ్లు పడుతుంది. చాలా కష్ట పడి పని చెయ్యాలని, మేనేజర్ 'రమేష్ ! నువ్వు పని చాలా బాగా చేస్తున్నావు. కీప్ ఇట్ అప్' అని ప్రత్యేకంగా చెప్పేడు. ఇవన్నీ అయితే గాని మనం ఫామిలీని గురించి ఆలోచించ వద్దు. అయినా మన మ్యారేజ్ అయి ఎన్నాళ్ళయిందని? కొన్నాళ్ళు మనం హాయిగా గడుపుదాం" అన్నాడు రమేష్ .

తను చిరు నవ్వుతో 'అలాగే రమేష్' అని జవాబిచ్చింది. తను కెరీర్ లో పైకి రావాలంటే చాలా కష్ట పడాలని ఒక నియమం పెట్టుకున్నాడు రమేష్. ఆ ప్రాజెక్ట్ లో రమేష్ కి చాలా మంచి పేరు వచ్చింది. వాళ్ళ మేనేజర్ రమేష్ ని టీం లీడర్ గా చేసేడు. రెండేళ్లలో అవ్వలిసిన పని పూర్తవడానికి మరో ఆరు నెలలు పట్టింది.

"ఈ ప్రాజెక్ట్ లో రాత్రి, పగలు పని చేసి అలిసి పోయేవు రమేష్ . ఒక నాలుగు రోజులు సెలవు పెట్టు. ఏదో ఒక మంచి ప్లేస్ కి వెళ్లి హాయిగా గడిపి వద్దాము" అని సలహా ఇచ్చింది రమ్య

"చాలా మంచి ఐడియా రమ్యా. ఈ వేళే సెలవు కి అప్లై చేస్తాను" అన్నాడు రమేష్. బెంగళూర్ కి టిక్కెట్లు కొని సాయంత్రం ఇంటికి వస్తూనే "రమ్యా, పొద్దున్నే ఫ్లయిట్ కి బెంగుళూరు వెళ్తున్నాము. తొందరగా రెడీ అయిపోవాలి"అని రమేష్ చాల ఉత్సాహం గా చెప్పేడు.

బెంగుళూరు చేరేక తను ముందు నుండీ బుక్ చేసిన స్టార్ హోటల్ కి తీసుకెళ్ళేడు రమ్యని. రమ్యమనసు ఆనందంతో నిండి పోయింది. లాల్ బాగ్, బొటానికల్ గార్డెన్స్ కి రమేష్ తో వెళ్లిన రమ్యకి ఆ ప్రకృతి సౌందర్యం, అక్కడ విరిసిన గులాబీలు చూసి మనసంతా ఒక రక మైన తృప్తి తో నిండి పోయింది. ఇంత ఆనంద సమయం లో తన మనసులో మాట రమేష్ కి చెప్పెయ్యాలి అని నిశ్చయించుకుంది.

ఆవేళ రమేష్ రమ్య ని దగ్గరగా తీసుకుంటూ "రమ్యా నేను ఆఫీస్ పని మీద చాల సార్లు బెంగుళూరు వచ్చాను. కానీ ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుందనుకోలేదు. ఆఫీస్ లో ప్రమోషన్ కూడా నీ సహకారం తోటే వచ్చింది. ఈ రెండున్నరేళ్లు నేను నీతో సరిగ్గా గడపలేదు అయినా నువ్వు ఎటువంటి అసంతృప్తి చూపించ లేదు. నువ్వు నా భార్య అవడం నా అదృష్టం"అని రమ్యని ప్రశంసలతో ముంచెత్తేడు.

ఇదే మంచి సమయమని రమ్య రమేష్ తో ఏదొ చెప్పబోయే సరికి తనకన్నా ముందే రమేష్ ‘రమ్యా..’ అంటూ మొదలు పెట్టేడు "ఈ కొత్త పొజిషన్ లో నేను అందరి చేత పని చేయించాలి. ఇదంతా నాకు అలవాటవ్వాలి. ఇదంతా ఒక ఆరు నెలలైనా పడుతుంది" .

రమ్య నోటిలో మాట దిగ మింగి ‘సరే రమేష్’ అని జవాబిచ్చింది .

రమ్యకి పిల్లలంటే చిన్నప్పటినించీ చాలా ఇష్టం ఆ ఇష్టం తోనే స్కూల్ లో చేరింది. పెళ్లి తరవాత కూడా ప్లే స్కూల్ లో పని చేస్తోంది. రమేష్ కి ఇప్పుడే ప్రమోషన్ అయింది కొత్త పొజిషన్ లో ఎడ్జస్ట్ అవడానికి కొంత టైం పడుతుందిఈ సమయం లో రమేష్ కి తన మాట చెప్ప కూడదు. ఆరు నెలల తరవాత ఫామిలీ ని గురించి ఆలోచిస్తాడు కదా. అని తన మనస్సుని సమాధాన పరుచుకుంది.

చూస్తూనే పెళ్ళై నాలుగేళ్లు గడిచేయి. ఆ వేళ రమేష్ చాలా ఉత్సాహం గా ఆఫీస్ నించి వచ్చేడు. వస్తూనే తన ఆఫీస్ , ఆఫీస్ లో తన ప్రత్యేకత గురించి రమ్య దగ్గర ఆరంభించేడు. ఇంట్లో అడుగు పెడుతూనే "రమ్యా" అని పిలుస్తూ లోపలికి వచ్చేడు.

రమేష్ హడావిడి చూసి మళ్ళీ ఏదో ఆఫీస్ సందడి అనుకుంటూ రమ్య కిచెన్ లోంచి బయటికి వచ్చి చిరునవ్వు తో పలకరించింది.

"రమ్యా ఐ ఆమ్ ఇన్ ఏ గుడ్ మూడ్ టుడే" అంటూ బయట తిరిగి వద్దామని రమ్యని బైల్దేర తీసేడు రమేష్.

పార్క్ లో హాయి గా చల్లని వాతావరణం లో ఓ మూలగా సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు రమ్య, రమేష్.

"రమ్యా! నువ్వు నిజంగా నా జీవితంలో నా లక్" అంటూ ఆరంభించేడు.

"రమ్యా నీకు తెలుసా ఈ ప్రాజెక్ట్ లో నాకు చాలా మంచి పేరు వచ్చిందిచాలా హార్డ్ వర్క్ చేసి ప్రమోషన్ సంపాదించేను. టీమ్ లీడర్ అయ్యేక చాలా కష్టపడి పని చెయ్య వలసి వచ్చింది. మా బాస్ దృష్టి లో మంచి పేరు తెచ్చుకున్నాను. నేను ఆఫీస్ నించి లేటు గా వచ్చినా, రాత్రి ఆఫీస్ పని ఇంటి దగ్గరనించి చేసినా, నువ్వు కోపం, విసుగు నాపై చూపలేదు. నువ్వు చాలా మంచి అమ్మాయివి. నీ మంచితనం వల్లే నేను ఒక్కొక్క మెట్టు ఎక్క గల్గుతున్నాను. అసలు నీకు ఒక మంచి న్యూస్ చెప్పాలనే ఇక్కడికి రమ్మని పిలిచేను"

'ఏమిటి చెప్తాడో' అని ఆతురతగా చూడసాగింది రమ్య. 'పిల్లల కోసం ప్లాన్ చేద్దామని మంచి కబురు చెప్పడానికయితే పార్క్ వరకు ఎందుకు?'.. అన్న సంశయం. ఈ ఆలోచనలతో తల ఎత్తి రమేష్ కళ్ళలోకి చూడ సాగింది.

"రమ్యా, చాలా పెద్ద మల్టీ నేషనల్ కంపెనీ ప్రాజెక్ట్ వస్తుందనుకుంటున్నారు. దాని కోసం చాలా పోస్ట్ లు వస్తాయి. మా బాస్ కి ప్రమోషన్ వచ్చి నన్ను అతని ప్లేస్ లో మేనేజర్ గా చేయాలనుకుంటున్నారు. మా బాస్ కూడా అదే అన్నారు. ఐదేళ్ల సర్వీస్ లో ఈ పోస్ట్ వస్తే నేను చాలా సాధించినట్టే. ఇదొక అద్భుతమైన విషయం అవుతుంది"

ఒక్క సారి రమ్య మనసంతా వికలమైపోయింది. ఏమిటి ఈ మనిషి తత్వం? భార్యా భర్తలు ఇద్దరూ అన్ని విషయాలు చర్చించుకోవాలి. ఈ మనిషి ఐదేళ్లయినా తనకి అర్ధం అవలేదు. తను ఎంతో తెలివైనవాడు. పైగా చాలా కష్టపడి పని చేస్తాడు. తను కూడా రమేష్ కెరీర్ లో పైకి రావాలని కోరుకుంటుంది. రమేష్ ఎప్పుడూ తనకి ఏమిటి కావాలో ప్రతీ విషయం క్షుణ్ణం గా చెప్తాడు. . కానీ తన మనసులో మాట రమేష్ కి చెప్పడానికి ప్రయత్నించి విఫలమైంది. ఐదేళ్లు గడిచినా రమేష్ ఫామిలీ గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు కొత్తగా మేనేజర్ అంటున్నాడు. ఇంక తనమనసులో ఉన్న కోరిక బయట పెట్ట వలసిన సమయం వచ్చింది అని నిశ్చయించుకుంది రమ్య.

"రమేష్, ఇప్పటికే చాల ఆలస్యం అయిపొయింది. ఫామిలీ ని గురించి ఇంక ప్లాన్ చేద్దామా” అని ప్రారంభించింది రమ్య

“ఆలస్యం అయిపొయింది అంటావేంటి రమ్యా? మా స్నేహితులు ఎంత మందో ఐదేళ్లలోపు అసలు పిల్లల గురించి ఆలోచించరు. కెరీర్ ముఖ్యం అను కుంటారు” అని చాలా వాదించేడు రమేష్.

“నీ మనసు ఎప్పుడూ కెరీర్ లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నత శిఖరాలని చేరుకోవాలనే ఒక అబ్సెషన్ గా తయారైంది . నా గురించి ఆలోచించేవా? అమ్మ అనే పదం ఎంత తీయగా ఉంటుందో తెలుసా?” ఎప్పుడూ ఏమీ మాట్లాడని రమ్య ఆరోజు మనసులో ఉన్నదంతా ఒక లావాలా బయట పడింది .

అంతా విని రమేష్ నిస్చేష్టుడయ్యేడు. మెల్లిగా రమేష్ అన్నాడు" రమ్యా పిల్లలు అంటే ఎదో సరదాగా ఆడుకునే వస్తువు అనుకుంటున్నావా? పిల్లలు ఒక బాధ్యత, ఒక పూచీ తెలుసా”

“రమేష్, ఏమిటి మాట్లాడుతున్నావు? పిల్లలు పూచీ అని జాగర్త పడుతూ ఉండడం ఎన్నాళ్ళు? పెళ్లయిన వెంటనే నా కెరీర్ అనగానే నీ మాటని గౌరవించి పిల్లలొద్దు అంటే, ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను . కానీ ఇది ఎన్నాళ్ళు? పిల్లలు పూచీ అంటున్నావు గానీ వాళ్ళు వచ్చేక మనకి వాళ్ళే జీవితం అవుతారు తెలుసా? రమేష్ ప్లీజ్ ఆలోచించు. జాబు మానేసి నేను బేబీ ని చూసుకుంటాను. నా జీవితంలో మార్పు కావాలి. బోరు కొడుతోంది . పిల్లలు కావాలని నా మనసులోని కోరిక. నీ మాట గౌరవించి ఇంత వరకు నేనెప్పుడూ ఈ మాట నీతో చెప్పలేదు”

రమ్య మాటలకి రమేష్ మనసు కదిలిపోయింది. అవును తను ఎప్పుడూ రమ్య గురించి ఆలోచించలేదు. తమ భావి జీవితం గురించి ఇద్దరూ మాట్లాడుకోవాలి గాని తనేం చేసాడు? తన జాబ్ లో ఎంత కష్ట పడాలో దానికి రమ్య సహకారం ఎంత అవసరమో ఇవే మాట్లాడేవాడు తప్ప రమ్య భావాలు తెలుసుకొనలేక పోయేడు. తన కెరీరే తన జీవితం అనుకున్నాడు.. నిజమే, పాపం రమ్య అంతా తన మనసులోనే పెట్టుకుంది . తను చాలా తప్పుగా ప్రవర్తించేడు.

రమ్య లాంటి మంచి అమ్మాయి ని చాలా బాధ పెట్టేను. ఇంక భవిష్యత్తు లో తనకి ఏ కొరత రాకుండా చూసుకోవాలాని నిర్ణయించుకున్నాక హాయిగా నిద్రపోయేడు రమేష్.

కాల చక్రం లో ఒక ఏడాది యిట్టే తిరిగి వచ్చింది. ఋతువులు మారేయి. కొత్త చిగుళ్లతో, కొత్త శోభతో వసంతకాలం కళ కళ లాడే వేళలో రమ్య రమేష్ జీవితాల్లో కూడా కొత్త మార్పు వచ్చింది. నర్సింగ్ హోమ్ లో కొన్ని గంటల క్రింద పుట్టిన చిన్న బాబుని చేతుల్లో తీసుకుని ఆ చక్కటి అనుభూతిని అనుభవిస్తూ రమ్య కళ్ళల్లోకి ప్రేమగా చూసేడు రమేష్.

"రమేష్, బాబు జాగ్రత్త" అంటూ అమ్మ జాగ్రత్తలు తీసుకుంటున్న రమ్య కళ్ళల్లో ఆనందం చూసి తృప్తిపడ్డాడు రమేష్.

***శుభం***

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : సీత మండలీక


నేను హౌస్ మేకర్ ని. కొడుకులిద్దరూ అమెరికాలో పెళ్ళిళ్ళై స్థిరపడిపోయాక, భర్త ఎయిర్ ఇండియా లో రిటైర్ అయ్యేక ఇప్పుడు నాకు కొంచెం సమయం దొరికింది

కధలు చదవడం అలవాటున్నా రాయాలన్న కోరిక ఈ మధ్యనే తీరుతోంది




1 view0 comments
bottom of page