top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

నన్ను కాపాడండి... ప్లీజ్!!



'Nannu Kapadandi Please' written by Mallavarapu Seetharam Kumar

రచన : మల్లవరపు సీతారాం కుమార్

ఆ కాంట్రాక్టర్ నన్ను ఒక నాయకుడి దగ్గరకు తీసుకొని వెడుతున్నాడు. ఇన్నాళ్లూ పదహారేళ్ళ పడుచులా చలాకీగా ఉన్న నేను ఇక ఆ నాయకుడి తాలూకు చీకటి గదిలో మగ్గి పోవడం ఖాయం.

నా ఆనందానికి ఇంత తొందరగా పుల్ స్టాప్ పడుతుందని కలలో కూడా అనుకోలేదు.

అయిపోయింది. ఇక నా జీవితంలో వెలుగును చూడగలనా?

నా లాంటి వారే మరికొందరు నాతో వస్తున్నారు.

కానీ అందరూ జీవచ్ఛవాల్లా ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు.

బహుశా వారంతా వయసులో కాస్త పెద్దవాళ్ళు కావడం వల్ల, ఇలాంటి ఎన్నో అనుభవాలు కలిగి, శక్తి ఉడిగి పోయి ఇలా నీరసించి పోయారేమో!

ఈ రోజు యవ్వనపు పొంగుతో పెళపెళ లాడుతున్న నేను కూడా ఆ నాయకుడి చేతిలో పడ్డాక వాళ్ళ లాగే అయిపోతానా?

ఉహించుకోడానికే భయంగా ఉంది.

ఈ రోజు ఉదయాన్నే ఈ కాంట్రాక్టర్ టి వి లో న్యూస్ ఛానల్ పెట్టినప్పుడు నేనూ ఆ ఛానల్ న్యూస్ చూసాను. ఓ పదహారేళ్ళ అమ్మాయిని కొంతమంది దుర్మార్గులు కిడ్నాప్ చేయబోతే స్థానికులు అడ్డుపడి ఆ అమ్మాయిని కాపాడారట. నన్ను కూడా అలా ఎవరైనా కాపాడితే బాగుంటుంది. నిజానికి నేను కూడా ఆ అమ్మాయిలాగే చూడటానికి చాలా చక్కగా ఉంటాను. ఇంకా చెప్పాలంటే అందరూ నన్ను తమ స్వంతం చేసుకోవాలనుకుంటారు.

కానీ ఎవరు కాపాడగలరు? నన్ను కాపాడే హీరో ఎవరు?

ట్రాఫిక్ సిగ్నల్ కోసం నన్ను తీసుకొని వెడుతున్న కాంట్రాక్టర్ కారు ఆగింది.

కారు పక్కనే ఆగిన బైకులో కూర్చుని ఉన్న వ్యక్తి అచ్చం హీరోలా ఉన్నాడు.

'ఇటు వైపు చూడవయ్యా మగడా! ఈ దుర్మార్గుడి బారినుండి నన్ను కాపాడు' మనసులోనే అతన్ని ప్రార్ధించాను.

“నన్ను కాపాడండి... ప్లీజ్!!” అంటూ గట్టిగా కేక పెట్టాను.

అతను మఫ్టీలో ఉన్న పెద్ద పోలీస్ ఆఫీసర్ అయివుండాలి.

ఈ కాంట్రాక్టర్ మీద అనుమానం వచ్చి కారు సోదా చెయ్యాలి. దాచి ఉంచిన నన్ను విడిపించాలి. నా ఊహలు ఇలా కొనసాగుతుండగానే ఆ హీరో ఇటువైపు చూసాడు. నా కేక అతడికి విన్పించినట్లుంది.

కాంట్రాక్టర్ వైపు తీక్షణంగా చూసాడు. అతని మొహంలో చిన్నపాటి నవ్వు. . పొట్టి కాళ్ళు, పొట్టి చేతులు, బాన పొట్టతో ఒక చిన్న సైజు పర్వతాన్ని తలపించే ఈ కాంట్రాక్టర్ను చూస్తే ఎవరికైనా నవ్వు వచ్చి తీరుతుంది.

అతను ఇటువైపు చూస్తూ కారు డోర్ సరిగ్గా పడలేదన్నట్లు సైగ చేసాడు. కాంట్రాక్టర్ డోర్ సరిగ్గా వేసి అతడికి థాంక్స్ చెప్పాడు.

నేను ఆ హీరో కంట్లో పడే అవకాశమే లేదు. నాలాంటి దాన్ని అందరూ చూసేలా ఉంచడానికి ఈ కాంట్రాక్టరేమీ అమాయకుడు కాదు.

అయినా ఏదో ఆశ. నా పిచ్చిగానీ, నా లాంటి వాళ్ల ప్రార్ధనలు ఫలిస్తే ఇన్ని అరాచకాలూ, అన్యాయాలూ ఎందుకు జరుగుతాయి?

అద్భుతమేమీ జరగలేదు. గ్రీన్ సిగ్నల్ పడింది. హీరో తన దారిన తాను వెళ్ళాడు. ఇక నా జీవితానికి రెడ్ సిగ్నలే!

మరి కాస్త దూరం వెళ్ళాక పోలీసులు కార్ ను ఆపారు.

మళ్ళీ ఏదో ఆశ .

కారు ఆపిన పోలీస్ ఆఫీసర్ వంక చూసాను. చూడ్డానికి సిన్సియర్ ఆఫీసర్ లాగా కనిపిస్తున్నాడు.

కారు దగ్గరికి వచ్చి, " డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నాం. ప్లీజ్. . సహకరించండి" అన్నాడు.

తిరిగి నీరసం ఆవహించింది నన్ను.

ఎందుకంటే నన్ను ఆ నాయకుడికి అప్పగించాక కదా, వీళ్ళిద్దరూ కలిసి పార్టీ చేసుకునేది? ఇప్పుడు టెస్ట్ చేసినా ఏం లాభం?

ఆ ఆఫీసర్ బ్రీత్ అనలైజర్ ను ను ముందుకు జరిపి "గాలిని బలంగా వూదండి' అన్నాడు.

"అలాగే!" అంటూ ఆ డివైస్ లోకి గాలి బలంగా ఊదాడు కాంట్రాక్టర్.

నెగటివ్ వచ్చింది.

"మీరు వెళ్లొచ్చు" అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ ఆఫీసర్.

"రాత్రి మందు కొట్టక పోవడం మంచిదయింది" పైకే అంటూ కారు స్టార్ట్ చేసాడు కాంట్రాక్టర్.

మరో పది నిముషాల్లో నాయకుడి ఇంటి దగ్గరకు చేరింది కారు. సెక్యూరిటీ ఇతడిని గుర్తించి సెల్యూట్ చేసి గేట్ తీసాడు. లోపలి వెళ్ళగానే నాయకుడి అసిస్టెంట్, కారు డోర్ తీసి "రండి. మీ కోసమే దొరగారు ఎదురు చూస్తున్నారు" అంటూ ఆహ్వానించాడు.

'ఎందుకు ఎదురు చూడడూ? నా లాంటి వాళ్ళను కానుకగా సమర్పిస్తుంటే!' అనుకున్నాను.

ఇష్టం లేకున్నా కాంట్రాక్టర్ తో పాటే ఆ నాయకుడి గదిలోకి వెళ్లాల్సి వచ్చింది.

అంతసేపూ అతడితో పాటు గదిలో కూర్చొని మందు కొడుతున్న అతడి స్నేహితులు నన్ను ‘సమర్పించే’ కార్యక్రమానికి ఏకాంతం కల్పించడానికి బయటకు వెళ్లారు.

"రావోయ్! నీకోసమే ఫారిన్ బ్రాండ్ తెప్పించాను" అంటూ ఆహ్వానించాడు నాయకుడు.

"తమరితో కలిసి పార్టీ చేసుకోవాలని నిన్నంతా ఉపవాసం ఉన్నాను" అంటూ వంకర నవ్వు నవ్వాడు కాంట్రాక్టర్.

"ఇంతకీ నేను అడిగింది తెచ్చావా?" అడిగాడు నాయకుడు.

అంటే ఇక ‘సమర్పణ’ కార్యక్రమం మొదలవుతుందన్న మాట!

క్షణం సేపు నా గుండె కొట్టుకోవడం ఆగింది. ( అసలు నాకు గుండె అంటూ ఉందా?)

తన చేతిలోని బ్రీఫ్ కేసు ను నాయకుడికి అందించాడు కాంట్రాక్టర్.

అందులో వున్న మొత్తాన్ని లెక్క పెట్టుకొని కాంట్రాక్టర్ వంక ప్రశ్నార్థకంగా చూసాడు నాయకుడు.

"నా మీద దయ తలిచి, ఇంతటితో సరి పెట్టుకోండి" అభ్యర్థించాడు కాంట్రాక్టర్.

మళ్ళీ నాలో చిన్న ఆశ.

నా పిచ్చిగాని ఆ నాయకుడు ఆ డబ్బులతో సరి పెట్టుకుంటాడా!

ఖచ్చితంగా నేను అతని దగ్గరకు వెళ్ళాల్సిందేనా?

బ్రీఫ్ కేసును కాంట్రాక్టర్ వైపు జరిపాడు నాయకుడు.

' రెండు కోట్ల విలువైన కాంట్రాక్టు. ఎంత లేదనుకున్నా యాభై లక్షలు మిగులుతుంది నీకు. నేనడిగింది కేవలం పది లక్షలే! బ్రీఫ్ కేసులో ఎనిమిదే ఉంది. నా దగ్గర బేరాలు ఉండవు. నువ్వు కాదంటే వేరే పార్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఆలోచించుకో" కోపం నటిస్తూ అన్నాడు నాయకుడు.

"అన్నా! అంత మాట అనొద్దు. మీకు ఎదురు చెబుతానా. " అంటూ తన లాల్చీ జేబులో ఉన్న మరో రెండు వేల రూపాయల కట్టను కూడా టేబుల్ పైన ఉంచాడు కాంట్రాక్టర్.

నేనూ ఆ కట్టలోనే ఉన్నాను.

ఇంతకీ నేనెవరో మీకు చెప్పలేదు కదూ!

నేనొక కొత్త రెండు వేల రూపాయల నోటును.

ఇన్నాళ్లూ స్వేచ్ఛగా ప్రపంచమంతా తిరుగుతున్న నేను ఇప్పుడు ఈ నాయకుడి ఇంట్లో బీరువాలోనో, నేల మాళిగలోనో బందీ కావాలి.

"నన్ను కాపాడండి... ప్లీజ్!! " శక్తినంతా కూడతీసుకొని గట్టిగా అరిచాను.

ఉలిక్కి పడ్డారిద్దరూ!

"మనం ఎన్ని రౌండ్లు కొట్టాం అన్నా!" నాయకుడిని అడిగాడు కాంట్రాక్టర్.

“లెక్క పెట్టుకోలేదోయ్. అంటే నీకు కూడా ఆ మాటలు వినిపించాయా?”

"అవునన్నా! అడుగుతున్నందుకు ఏమి అనుకోకన్నా. బాత్ రూమ్ లోగానీ ఎవర్నైనా దాచావా?"

"అవునోయ్. ఇప్పుడు నీ దగ్గర దండుకున్న డబ్బంతా దానికి సమర్పిస్తాను" అన్నాడు నాయకుడు నవ్వుతూ.

" మరి నన్ను పాడు చేయొద్దంటూ ఎవరో అమ్మాయి అరిచినట్లు వినిపించింది కదా అన్నా!"

"రెండు రౌండ్లకే చెవులు దొబ్బాయా? ఇక్కడేదో రేప్ జరుగుతున్నట్లు, అమ్మాయి కేకలు పెడుతున్నట్లు ఊహించుకోవద్దు. 'నన్ను కాపాడండి... ' అని మాత్రమే వినిపించింది నాకు " అన్నాడు నాయకుడు.

" అవును. నేనే మిమ్మల్ని అలా అడిగింది " అన్నాను గొంతు పెగుల్చుకొని.

మత్తులో వున్న వాళ్లకు ఆ మాటలు ఎక్కడినుంచి వస్తున్నాయో అర్థం కాలేదు.

"నేను ఒక రెండు వేల రూపాయల నోటును. మీ టేబుల్ పైనున్న కట్టలోంచి మాట్లాడుతున్నాను".

ఇద్దరూ ఒక్కసారిగా టేబుల్ వైపు చూసారు. అక్కడ వున్న రెండువేల నోట్ల కట్టలో కొత్తగా పెళపెళలాడుతున్న నన్ను సులభంగానే గుర్తు పట్టాడు నాయకుడు.

కట్టలోంచి నన్ను విడదీసి "అబ్బా! ఎంత ముద్దుగా ఉన్నావే.." అంటూ నన్ను ముద్దు పెట్టుకోబోయాడు.

" కరెన్సీ నోటంటే లక్ష్మీదేవి స్వరూపం. జాగ్రత్త" సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాను.

వెంటనే నన్ను కళ్ళకద్దుకొని తిరిగి కట్టలో ఉంచాడు.

"నేను డబ్బును పూజిస్తాను. అందుకే నా దగ్గర డబ్బు ఎక్కువగా చేరుతుంది. ఎందుకు నా దగ్గరనుండి వెళ్లిపోవాలనుకుంటున్నావు?" అని నన్ను ప్రశ్నించాడు నాయకుడు.

"నేను స్వేచ్చాజీవిని. అన్ని ఊర్లూ తిరుగుతూ వుంటాను. ఎన్నో చేతులు మారుతుంటాను. ఇలా ఒక చోటే బందీగా ఉండటం నాకు ఇష్టం లేదు. " చెప్పాను నేను.

ఆశ్చర్యంగా చూశాడు నాయకుడు.

"నా దగ్గర వుంటే నువ్వు భద్రంగా ఉంటావు. నిన్ను నలక్కుండా చూసుకుంటాను. ఏళ్ళు గడిచినా యిలాగే అందంగా ఉంటావు" అన్నాడు.

"నలక్కుండా ఉంటే నా జీవితానికి అర్థం లేదు. ఎన్ని చేతులు మారితే నా విలువ అంత మారుతుంది" వాళ్లకు అర్థం కాదని తెలిసినా చెప్పడానికి ప్రయతించాను.

"అదేమిటి?" అన్నారిద్దరూ ఒకేసారి.

నాయకుడు నా వైపు చూస్తూ "నా బీరువాలో వుంటే నిన్ను రోజూ పూజిస్తుంటాను. ధూపం వేస్తుంటాను. అలా కాకుండా బయటకు వెడితే నాలుగు చేతులు మారాలి. నీ ఆకారం మారుతుంది. ముడతలు పడి నీ అందం పోతుంది. నల్లబడుతావు. నలిగి, చినిగి పోతావు. అయినా ఎందుకు వెళ్లాలనుకుంటున్నావు?" అని ప్రశ్నించాడు.

"నా జీవితానికి అప్పుడే సార్థకత" అన్నాను నేను.

అర్థం కానట్లు చూశారిద్దరూ.

"నేను పుట్టి నెల రోజులే అయింది. పుట్టిన కొద్ది రోజులకే ఒక బ్యాంకు కు చేరుకున్నాను. అక్కడినుంచి ఒక రైతు దగ్గరకు వెళ్లాను. అక్కడినించి ఎరువుల అంగడికి వెళ్లాను. అతను నన్ను బ్యాంకు లో జమ చేసి డి డి తీసుకున్నాడు. ఒక ఉద్యోగి తన జీతం డబ్బుల్లో నన్ను డ్రా చేసాడు. అతను నన్ను ఒక ప్రొవిజన్ స్టోర్ లో ఇచ్చాడు. అతను తన గుమాస్తా జీతంలో నన్ను ఇచ్చాడు. ఆ గుమాస్తా తన కూతురు స్కూల్ ఫీజు గా నన్ను జమచేశాడు. స్కూల్ వాళ్ళు తిరిగి నన్ను బ్యాంకు లో జమ చేసారు. ఇలా ఈ నెల రోజుల్లో దాదాపు పది చేతులు మారాను. ప్రతి ఒక్కరికీ రెండువేల రూపాయల పని చేశాను. అంటే ఇప్పటివరకు నేను చేసిన పని విలువ ఇరవై వేలు. ఇలాగే రొటేషన్ జరిగితే ఒక సంవత్సరంలో నేను దాదాపు రెండు లక్షలకు పైగా పని చేస్తాను . ఒక్క నోటే ఇంత పని చేస్తే మన దేశంలో ఉండే మొత్తం కరెన్సీ సక్రమంగా రొటేట్ అయితే ఎంత ఉపయోగమో ఆలోచించండి.

దేశం కోసం త్యాగాలు చెయ్యలేని వాళ్ళు తమ డబ్బును ఇంట్లో దాచి పెట్టకుండా బ్యాంకుల్లో దాచుకుంటే చాలు. ఆ డబ్బు ఎంతో మందికి ఉపయోగ పడుతుంది. కానీ మీ లాంటి వాళ్ళు బ్లాక్ మనీని బ్యాంకుల్లో దాచుకోలేరు. నేను బ్లాక్ మనీగా మారితే నా జీవితం నిరర్థకమే. మీ లాంటి వారి వల్ల దేశానికి ఎంతో నష్టం కలుగుతుంది. మీరు నీతిమంతులుగా మారిపోతారనే దురాశ నాకు లేదు. కానీ కనీసం మీ డబ్బును ఖర్చు పెట్టండి. విలాసాలు అనుభవించండి. ఆస్తులు కొనుక్కోండి. అలాగైనా మనీ సర్కులేషన్ జరుగుతుంది. మీ పాపం కొంతైనా తగ్గుతుంది. " చెప్పడం ఆపి వారి వంక చూసాను.

ఇద్దరూ టేబుల్ మీద తలలు వాల్చి మత్తులో జోగుతున్నారు.

నాయకుడి అనుచరుడొకడు ఆ గదిలోకి వచ్చాడు.

మత్తులో ఉన్న ఆ ఇద్దరి వంకా, టేబుల్ మీద ఉన్న నోట్ల వంకా మార్చి మార్చి చూసాడు.

నా వంక ఆశగా చూస్తున్నాడు.

అతను నన్ను తీసుకొని వెడితే బాగుణ్ణు. బ్లాక్ మనీ దారుడి కంటే దొంగే మేలు కదా!

"నన్ను కాపాడండి... ప్లీజ్!!" శక్తిని కూడదీసుకుని అరిచాను.

విన్నాడో. . లేదో. . మరి

***శుభం***

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 15 కథలు కౌముది, గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).



8 views0 comments
bottom of page