top of page
Writer's pictureLakshmi Madan M

మా నాయనమ్మ పార్ట్ - 3 *పని రాక్షసి*


'Maa Nayanamma Part- 3 Pani rakshasi' written by Lakshmi Madan

రచన : లక్ష్మీ మదన్

ఆ రోజుల్లో చాలీచాలని సంపాదనలు కదా! మా నాన్న ఉద్యోగం చేసే వారు. వ్యవసాయ ఆధారిత కుటుంబం. టౌన్ కావడం వల్ల బంధువులు, సంచార బ్రాహ్మలు.. ఇలా వచ్చిపోయే వారితో ఇల్లు కళ కళ లాడేది. వంట నాయనమ్మ చేస్తుంటే, అన్నీ అందించడానికి అమ్మ సహాయ పడేది. మేము కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు చేసే వాళ్ళము.

చదువుకునే పిల్లలు పక్కనే ఉన్న చిన్న పల్లెటూళ్ళ నుండి వచ్చేవారు. వాళ్ళు మా ఇంట్లోనే ఉండే వాళ్ళు. అలా కలిసి ఉండే వాళ్ళము. ఎవరు వచ్చినా, ఎన్ని రోజులైనా అందరం కలిసి ఉండే వాళ్ళము.

మా నాన్న అంటే నాయనమ్మకు వల్లమాలిన ప్రేమ. అన్నీ దాచి పెట్టి మరీ వడ్డించేది. మా నాన్న ‘వద్దు..’ అని వారిస్తున్నా కంచంలో వేసేది. ఆ కోపం ఉండేది నాకు. పొద్దున స్కూల్ కి చద్ది అన్నమో, అప్పుడప్పుడు వేడి అన్నమో తిని వెళ్ళే వాళ్ళం. వచ్చేసరికి వంట చేసేది నాయనమ్మ. ముద్ద పప్పు మళ్లీ అడిగితే ' లేదు' అనేది. అప్పుడు గొడవ పడే దాన్ని. "నాన్నకి వద్దన్నా పెడతావు . మాకు అడిగినా పెట్టావా!" అని. ఉహూ.. ఏమీ జవాబు ఇచ్చేది కాదు. కానీ నాన్నంటే ఎంతో ప్రేమ అని తర్వాత తెలుసుకున్న!

చలి కాలంలో ముసల్ది కుంపటి పెట్టి చలి మంట వేసుకునేది. మేమంతా చుట్టూ మూగి తనని ఓ మూలకి జరిపే వాళ్ళము. ఆ కుంపట్లో మొక్క జొన్న గింజలు వేసుకొని అవి పేలాలుగా చేసుకొని తినే వాళ్ళము. కాగితాలు చుట్టి బీడీలు చేసి కుంపట్లో పెడితే ఇక అరిచేది. అలా కోపం రావాలని చేసే వాళ్ళము. ఆమె చలి ఎక్కడికో వెళ్ళేది. మేమే ఆక్రమించే వాళ్ళము కుంపటి చుట్టూ .

ఒకటి మాత్రం కోపం వచ్చేది. రాత్రి కాగానే తినాలి, పడుకోవాలి. గోల చేసేది. మా నాన్న ఇంట్లో ఉంటే నెమ్మదిగా ఉండేది. ఆయన బయటకి వెళ్ళారా మొదలు పెట్టేది దండకం. "నీకు భయమా నాయనమ్మా బాపు అంటే? " అని అడిగితే .. బెట్టు పోనియ్యకుండా “ఆ! మీ నాయినకి నాకు బయ్యమా ' అనేది.

ఒకటి బాధ అనిపిస్తోంది ఎప్పుడూ. నాయనమ్మకి పిప్పరమెంట్లు ఇష్టం. మా దగ్గర డబ్బులు ఉండేవి కావు. అయినా చిన్న పిల్లలం కదా! కొనాలని తెలిసేది కాదు. ఇప్పటికీ నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఎప్పుడో ఒకసారి తప్ప ఎక్కువ కొనియ్యలేదని. ఇప్పుడు ఎలా కొనియ్యాలే నాయనమ్మా! ఎక్కడున్నావో కానీ ఏడ్పిస్తూనే ఉన్నావ్ ! మళ్లీ నిన్ను చూడాలని ఉందే ముసలి.. నీతో కొట్లాడాలని ఉంది. కలలో అయినా కనిపించవే! 😭..

మరికొన్ని ముచ్చట్లు తర్వాత ..

*********************************


0 views0 comments
bottom of page