top of page
Writer's pictureNeeraja Prabhala

మనసులోని మాట


'Manasuloni Mata' written by Neeraja Hari Prabhala

రచన : నీరజ హరి ప్రభల

రాధ, సుధీర్ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు. ఇద్దరి ఇళ్లు దగ్గర దగ్గర ఉండటం, ఇరుకుటుంబాల మధ్య సఖ్యత, సాన్నిహిత్యం ఇందుకు దోహదమైనది. ప్రాధమిక విద్య నుంచి డిగ్రీ వరకు ఇద్దరూ ఒకే స్కూల్, ఒకే కాలేజి. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి చెప్పలేనంత ఇష్టం, ప్రేమ. తెలిసిన వాళ్లు, స్నేహితులు వీళ్ళిద్దరికీ వివాహమైతే బాగుంటుంది, చూడ ముచ్చటైన జంట అనుకునేవారు. ఇద్దరూ ఉద్యోగప్రయత్నాలు మొదలెట్టారు. సుధీర్ కు మంచి కంపెనీలో వేరే ఊరిలో పోస్టింగ్ వచ్చింది. సుధీర్ కు ఉద్యోగం వచ్చిందన్న ఆనందం కన్నా అతను తనకు దూరమవుతున్నాడని బాధ పడింది రాధ. సుధీర్ ది కూడా అదే పరిస్థితి. సుధీర్ వేరే ఊరిలో ఉద్యోగంలో చేరాడు. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు జరుగుతున్నాయి. సుధీర్ కు అక్కడ హోటల్ తిండి, అక్కడి వాతావరణం సరిపడక ఇబ్బందిపడుతున్నాడని అతని తల్లితండ్రులు సామాన్లతో సహా ఆ ఊరు విడిచి కొడుకు వద్దకు వెళ్ళారు. రాధకు ఇంకా ఉద్యోగం దొరకలేదు. కొన్ని రోజులకు సుథీర్ కు తల్లి తండ్రులు వివాహ ప్రయత్నాలు మొదలెట్టారు. అతనికి రాధను భార్యగా చేసుకోవాలని ఉంది. చిన్నప్పటి నుంచి రాధ స్వభావం, మంచి మనస్సు, కలివిడితనము అతనికి చాలా ఇష్టం. ఇటు రాధకు కూడా అంతే ఇది. కానీ తను ఆడపిల్ల కనుక సుధీర్ తో చనువు ఉన్నా , సహజంగా ఉండే సిగ్గు వలన ఏనాడూ సుధీర్ కు తన మనసులోని మాట రాధ చెప్పలేదు. సుధీర్ కు రాధ మనసు తెలుసు కానీ ఆ విషయం తెలుసుకోవాలని, తన చేతే చెప్పించాలన్న ఉద్దేశ్యంతో రాధకు ఎప్పటిలాగానే ఫోన్ చేశాడు. "హాయ్ రాధా ! ఎలా ఉన్నావు? ఆంటీ, అంకుల్ ఎలా ఉన్నారు? నీ ఉద్యోగప్రయత్నాలు ఎంత వరకు వచ్చాయి? అని అడిగి తనకు అమ్మావాళ్ళు బంధువుల అమ్మాయితో వివాహ నిశ్చయ తాంబూలాలను నిర్ణయించారు అని తేదీ, సమయం చెప్పి నీవు తప్పకుండా రావాలి. కాసేపట్లో ఆఫీసులో మీటింగ్ ఉంది. ఉంటా " అని ఫోన్ పెట్టేశాడు. అది విన్న రాధకు నెత్తిమీద వేయి పిడుగులు పడినట్టు, గుండెల్లో గునపం గుచ్చుకున్నంతగా విలవిలలాడింది. తన కలల స్వప్నం, ఆశా సౌథం గాలిమేడలా కూలిపోయినట్టు, కళ్ళముందు అంతా చీకటిలాగా అనిపించింది. " సుధీరే తన భర్త. తన ప్రాణం" అన్న భావనతో ఇన్నేళ్ళుగా బ్రతుకుతోంది. ఇప్పుడిలా ఈ వార్త స్వయంగా అతని నోటి వెంటే విన్నది. ఒక్కసారిగా నిస్త్రాణం ఆవరించినా ధైర్యాన్ని కూడదీసుకుని సుధీర్ వాళ్ళ ఊరికి బయలుదేరింది రాధ.

బస్సు దిగి వాళ్ళింటికి వెళ్ళి కోపంతో కుతకుతా మరుగుతూ గుమ్మంలోకి అడుగుపెట్టేసరికి అక్కడ ఎదురుగా చిలిపిగా నవ్వుతూ అతను. తను ఇంత బాధ పడుతుంటే అతను నవ్వుతున్నాడని మరింత ఉక్రోషంతో ఊగిపోతూ " ఇదా ఇన్నేళ్ళుగా నీవు నన్ను , నా మనసును అర్థం చేసుకుంది? నీవే నా ప్రాణం, నీవే నా సర్వస్వం, నీతోనే నా జీవితం అనుకుని బ్రతుకుతున్నాను. నా మనసు తెలుసుకోక నీవు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా" ? అని పట్టరాని ఆవేశంతో గబగబా అడిగింది సుధీర్ ను. రాధ మనసులోని మాట, ఆమె మనసు స్యయంగా తనే తెలిపింది కనుక తన ఆలోచన ఫలించిందని సుధీర్ మనసు ఆనందంతో పొంగిపోయింది. పకపకా నవ్వుతూ " మొద్ధూ! ఇన్నేళ్ళల్లో ఇంతేనా నాగురించి నీకు అర్థమైంది? నామనసును ఎప్పుడో నీకిచ్చేశాను. నా పట్ల నీ మనసులోని ఉద్దేశ్యం నీ నోటి నుంచి స్వయంగా వింటే ఆ ఆనందమే వేరు. అందుకే నిశ్చితార్థ తాంబూలాలని అబధ్ధం చెప్పి నిన్ను ఇక్కడకు రప్పించాను. అంతే. నీవు నా ప్రా ణం. నా సర్వస్వం. ఈ జన్మకే కాదు ఏడు జన్మలకు కూడా నీవే నా భార్య వి " అని రాధని ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు సుధీర్. బుగ్గలు కెంపుగ మారగా సిగ్గుల మొగ్గయి ప్రేమగా అతని కౌగిలిలో గువ్వలాగా ఒదిగిపోయింది రాధ. తనని మరింతగా గుండెలకు హత్తుకున్నాడు సుధీర్.

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం : "మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏


3 views0 comments
bottom of page