top of page

వందన కల

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Video link

'Vandana Kala' written by N. Dhanalakshmi

రచన : N. ధనలక్ష్మి

తన కల పెద్దది!?? ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించాలి అని ఆశ పడింది!??? అనుకోని పరిస్థితులు ఎదురయ్యాయి... వాటిని అధిగమించి తన కలను సాధించిందా లేదా!?? అనేది ఈ కథ.. ఈ కథను ఈతరం రచయిత్రి N. ధనలక్ష్మి గారు రచించారు.


@@@@@@@@@@@@@@@@


సూర్యవంశం మూవీలో

"చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి

కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి

ప్రతి పూట పూల బాటగ సుమస్వాగతాలు పాడగ

స్వప్నసీమ చూద్దాం జత జైత్రయాత్ర చేద్దాం

చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి

కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి"

సాంగ్ వస్తే వింటూ ఉంది ఇంటర్ చదువుతున్న

వందన...


" బుజ్జీ! కాస్త నీళ్లు తీసుకు రారా” తన నాన్న సూర్య గారు అనడంతో తేరుకొని వెంటనే తెచ్చి ఇచ్చింది.


" నాన్నా! ఈ పాటలో మీనా నడిచి వస్తుంటే పోలీసులు అందరూ సెల్యూట్ చేస్తుంటే చూడడానికి చాలా బాగా ఉంది. నాకు కూడా అచ్చం తన లాగే కలెక్టర్ అవ్వాలని ఉంది. చేతిలో అధికారం ఉంటే ఎవరైనా సరే మన మాట వింటారు. ఎన్నో ఉపయోగకరమైన పనులు చేయచ్చు. మన ఊరి కోసం, ప్రజల కోసం ఏదోకటి చేయాలని ఉంది " అని తండ్రితో అంది వందన.


" తప్పుకుండా బుజ్జీ! నేను కూడా బాగా చదువుకుని టీచర్ అవ్వాలని అనుకున్నాను. కానీ మాకున్న ఆర్థిక పరిస్థితులవల్ల చదువుకోలేకపోయాను. నువ్వు ఎంత కావాలంటే అంత చదువుకో, ఏమి చేయాలంటే అది చేయి. నీ వెంట ఈ నాన్న ఉంటారు రా… బాగా చదువుకో.. మిగితా విషయాలన్నీ నీకు అనవసరం.. చదువు మీద మాత్రమే నీ దృష్టి ఉండాలి. అర్థం అయిందా?" అన్నారు ఆమె తండ్రి సూర్యం.


" హా నాన్నా! ఈ ఏడాది జరిగే ఇంటర్ పరీక్ష ఫలితాల్లో ఈ సూర్యం గారి కూతురే జిల్లా స్థాయిలో ర్యాంక్ తెచ్చుకుంటుంది. చూడు కావాలంటే" అంది వందన


" సరే రా బుజ్జీ! వెళ్ళి చక్కగా చదువుకో" అన్నారు సూర్యం.


" వందన ఎంతో కష్టపడి... కాదు ఇష్టపడి చదివి, పరీక్షలు రాసింది. ఫలితాల రోజు రానే వచ్చింది.. తన స్నేహితులతో కలిసి ఫలితాలను చూడడానికి కాలేజ్ దగ్గరకి వెళ్ళింది. వందన జిల్లా స్థాయిల్లో కాదు, స్టేట్ లెవెల్లో ఫస్ట్ వచ్చింది"


" స్కూల్ మొత్తం వందనని అభినందించారు..ఎంతో సంతోషంగా ఈ వార్తను తన నాన్నకి చెప్పాలని ఇంటికి వెళ్ళింది . కానీ ఇంటి దగ్గర జనాలు గుమికూడి ఉన్నారు.. కంగారు పడుతూ లోపలకి వెళ్ళింది.. అందరూ తన వైపు జాలిగా చూస్తూన్నారు.. తనకి అర్ధం కాక లోపలికి వెళ్ళింది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే తన నాన్న విగతజీవిగా పడి ఉన్నారు.. వాళ్ళమ్మ ఏడుస్తూ పక్కన ఉంది.

" పొలంలో పని చేసుకుని వస్తుంటే పాము కాటు వేసిందమ్మా! అందరం చూసి దవాఖానకు తీసుకొని వెళ్ళాలి అనుకునే లోపు ప్రాణం పోయింది” అని ఏడుస్తూ చెప్పాడు సూర్యం మిత్రుడు కనకయ్య.


వందన చూస్తుండగానే తన నాన్నగారికి తీసుకొని వెళ్ళిపోయారు...

తన నుండి దూరం అవుతున్న నాన్న వైపు చూస్తూ మనసులో 'నీ కూతురు విజయం చెప్పి నువ్వు గర్వపడుతుంటే చూసి మురిసిపోవాలని వచ్చిన నాకు శాశ్వతంగా దూరం అయ్యావు కదా నాన్నా!' అని అనుకుంటూ అక్కడి నుండి తన రూం కి వెళ్ళి గట్టిగా ఏడిచింది.


అలా కొద్ది రోజులు గడిచాయి...


" చూడు చెల్లెమ్మ! చావు జరిగిన ఇంట్లో శుభకార్యం జరగాలి అంటారు..మన వందన కు మంచి సంబంధం వచ్చింది.. అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగి , సొంతిల్లు కూడా ఉంది. అమ్మాయి సుఖ పడుతుంది. పెళ్ళి చేద్దాము..ఏమి అంటావు" అన్నాడు కనకయ్య.


" మీ ఇష్టం అన్నయ్య! మీరు ఎలా ఆంటే అలాగే చేద్దాం".అంది వందన తల్లి..


" సరే అమ్మా ! రేపు మంచి రోజూ అని వాళ్ళు అమ్మాయిని చూసుకోవడానికి వస్తారు రెఢీ చేసి సిద్దంగా ఉండు అమ్మ! ఇంకా నేను వస్తాను” అని వెళ్ళిపోయాడు కనకయ్య.


" అమ్మా! ఇప్పుడే నాకు పెళ్ళి వద్దు. నాకు ఇంకా చదువుకోవాలని ఉంది. నీకు ఏ కష్టం ఉండదు. నాకు వచ్చిన మార్క్ లకి ఫ్రీ సీట్ వస్తుంది. సాయంకాల వేళ ట్యూషన్ చెపుతాను. ఆ డబ్బుతో చదువుకుంటాను" అంది వందన.


" వందన! మగ దిక్కు లేని సంసారం అంటే అందరికీ చులకన భావన ఉంటుంది. నీ భర్తను అడిగి కావాలంటే పై చదువులు చదువుకో. అదీ కూడా తను ఒప్పుకుంటే..కానీ ఇప్పుడు పెళ్ళి మాత్రం చేసుకో. ఈ తల్లి పై నీకు ఏ మాత్రం గౌరవం, ప్రేమ ఉంటే రేపు జరిగే పెళ్ళి చూపుల్లో నవ్వుతుండాలి"


వందనకి ఇష్టం లేకపోయినా, తల్లి మాటను కాదనలేక .. తనని బాధ పెట్టడం ఇష్టం లేక రెడీ అయింది...


అబ్బాయి తరుపున వారు వచ్చారు..

శేఖరం, వందన లను మాట్లాడుకొమ్మని పంపించారు .


వందన మొహమాటపడుతూనే ....

“నాకు బాగా చదువుకొని కలెక్టర్ అవ్వాలని కోరిక.. పెళ్ళి అయ్యాక నేను చదువుకోవచ్చా?” అని అడిగింది.

శేఖరం కూడా నవ్వి " హా తప్పుకుండా! నా భార్య కలెక్టర్ అంటే నాకూడా గర్వంగా ఉంటుంది కదా! మన పెళ్ళి అయ్యాక తప్పక చదువుకో” అని మాట ఇచ్చాడు.


వందనకు మనసులో ఉన్న కాస్త ఆ బాధ కూడా మటుమాయం అయింది...సంతోషంగా పెళ్ళికి ఒప్పుకుంది.

అబ్బాయి తరుపున వారికి వందన నచ్చడం తో పెళ్ళి ఖాయం చేశారు.


పెళ్ళి అయిన రెండు నెలలకి వందన కాలేజ్ కి వెళ్తానని అడిగింది ఓ రోజు శేఖరాన్ని...


" చూడ వందన! నాకు ఆఫీస్ లో ఈ మధ్య కొంచం వర్క్ ఎక్కువ అయింది.. నేను ఇంటికి రాగానే నువ్వు అని సిద్ధం చేసి ఉండాలి.. కాలేజ్ కి వెళ్తుంటే ఇంట్లో పనులు, నాకు అవసరమైన వాటిని ఎవరు సమకూరుస్తారు .. ఇంకా కొన్ని రోజులు పోని నాకు పని భారం తగ్గుతుంది. అప్పుడు వెళ్ళ వచ్చులే…” అని మాట దాటేసాడు శేఖరం.


కొన్ని నెలల తరువాత కాలేజ్ కి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు..కానీ వందన నెల తప్పింది..

కడుపుతో ఉన్నావు కదా జాగ్రత్త చాలా అవసరం అంటూ ఆపేశాడు.. పిల్లలు పుట్టాక ,వారి పెంపకం అంటు ఏవో కారణాలతో తన చదువు మళ్ళీ అటకెక్కింది.


వందనకు అమ్మాయి, అబ్బాయీ ఇద్దరు కవలలు పుట్టారు.. విబా, వినయ్ అని పేర్లు పెట్టుకున్నారు.

ఇంకా పిల్లల పెంపకం తన బాధ్యత కావున ఇంకా చదువుకోవాలనే తన ఆశయాన్ని మనసులోనే దాచుకొని ఉండి పోయింది.


పిల్లలిద్దరూ ఇంటర్ కి వచ్చారు.

ఒక ఆదివారం రోజు విబా, వినయ్ కి పరీక్షలు ఉంటే ప్రిపేర్ అవుతున్నారు.. ఒక ప్రాబ్లెమ్ కి సొల్యూషన్ ఎంత ప్రయత్నించినా వాళ్ళకి సమాధానము రాలేదు..అంతలో అక్కడికి వచ్చిన శేఖరం గారిని అడిగారు.. ఆయన చాలా రకాలుగా ప్రయత్నించి విఫలం అయ్యారు. అప్పటి సిలబస్ వేరు ఈ సిలబస్ వేరు , తనకు రాదు అని చెప్పి వెళ్ళిపోయాడు..


భోజనానికి పిలవాలని అక్కడికి వచ్చిన వందన ఇద్దంతా చూసి తను సాల్వ్ చేస్తాను అంది. అందుకు వాళ్లిద్దరూ " అమ్మా! ఎం.బి.ఏ చదివిన నాన్నగారే వీటిని మాకు చెప్పలేక వెళ్ళిపోయారు, ఇంటర్ వరకే చదివిన నువ్వు ఎలా చెప్పగలవు! మేము మా సర్ ని అడిగి తెలుసుకుంటాములే…” అన్నారు.


" విబా ,వినయ్! నేను ప్రయత్నించడంలో తప్పేమీ లేదుగా!” అంటూ వందన నోట్స్ తీసుకొని కేవలం ఐదు నిమిషాల్లో సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసింది.


ఆశ్చర్యపోవడం ఆ పిల్లలిద్దరి వంతయింది


" అమ్మా! ఇది ఎలా తెలుసు, పైగా అప్పటి సిలబస్ ఇప్పటి సిలబస్ వేరు అని నాన్న చెప్పి వెళ్ళారు.. మరి నీకెలా వచ్చింది?" ఆశ్చర్యంగా అడిగారు పిల్లలు


" కన్న! అమ్మకు వంట చేయడం ఒక్కటే కాదు ఇలాంటివి ఎన్నో చేయడం వచ్చు రా..ఖాళీ సమయాల్లో మీ పుస్తకాలను చూసి చదువుతుంటాను.. సిలబస్ మారినా, చేసే ఫార్ములా, పద్దతి ఒక్కటే కదా..సర్లే ! రండి. భోజనం చేద్దాము" అంది వందన.


" సో సారీ మమ్మ!” పిల్లలిద్దరు వందనను హగ్ చేసుకున్నారు..

“ఇంత నాలెడ్జి పెట్టుకుని ఎందుకు చదువుకోలేదు?” అని పిల్లలిద్దరు అడగగా తన గతం గురించి చెప్పింది..


" అయితే ఇప్పుడు చదువుకో అమ్మా! కలెక్టర్ కాలేక పోవచ్చు డిగ్రీ పట్టాను నువ్వు తెచ్చుకోవచ్చు కదా అమ్మ! నీ నాలెడ్జ్ తో ట్యూషన్ కూడా చెప్పచ్చు.."


" నేనా ! డిగ్రీ చదవాలా! ఇప్పుడు ఎలా సాధ్యం..అయిన మీ నాన్నగారు ఒప్పుకోరు లే..

నా అవసరం మీకు ఉంటుంది. ఇంట్లోను కష్టం అవుతుంది"


" అమ్మా! నాన్న ను ఒక్కసారి అడిగి చూడు..

అయిన మేమిద్దరం ఇప్పుడు పెద్దవాళ్ళము అయ్యాము కదా..మేము కొన్ని చూసుకుంటాము.."


వందన శేఖరం గారి దగ్గరకి వెళ్ళి ‘చదువుకుంటాను’ అంది..


" వందన ! చదువు.. అది కూడా ఈ వయసులో అవసరమా నీకు!


కొన్ని ఏళ్ళకు పిల్లలకి పెళ్ళి చేసి మనవరాలు, మనవడు ను ఎత్తుకునే వయసు .అయిన నువ్వు ఇప్పుడు చదివి ఎవరిని ఉద్ధరించాలి చెప్పు? అయినా ఎప్పుడు చూడు చదువు చదువు అంటూ ఉంటావు.

మొగుడుకి వండి పెట్టడం వరకే నీకు రావాల్సింది. మిగతావే అనవసరం, భర్తని సంతోషంగా చూసుకోవాలి.. “ అని తిడుతుంటారు..


" ఇది విన్న వినయ్

“అక్క! ఇదేంటి? చదువుకోవడం అనేది ప్రతి ఒకరికి ఉండే ప్రాథమిక హక్కు .ఇలా తెలివిగల అమ్మ లాంటి వారిని ఆపేస్తే ఎట్టా! రా మనం వెళ్ళి అడుగుదాము..." అన్నాడు.


" రేయ్ వద్దు రా! మనం ఇలా చెప్పితే ఎవరు వినరు..సైలెంట్ గా వెళ్ళి ఫోన్ తీసుకొని రా" అంది విబా.


" అక్క! మనం ఎగ్జామ్ అప్పుడు ఫోన్స్ వాడము కదా! డిస్టర్బ్ అవుతుంది అని"


" రేయ్! వెళ్ళి తీసుకొని రా ఫస్ట్.."


" ఏంటో నువ్వు అర్థం కావు..."


" శేఖరం మాటలకి బాధ పడి యధావిధిగా...తన పనులు చేసుకోసాగింది వందన.."


కాసేపు అయ్యాక శేఖరం హల్ లోకి వచ్చి చూస్తే విబా ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంది


"విబా! రేపు పరీక్షలు పెట్టుకుని ఇలా గేమ్స్ ఆడితే ఎలాగ! నిన్ను ఇంజనీర్ గా చూడాలనే నా కల ఎలా నేరువెరుతుంది..."


విబా ఫోన్ లో గేమ్స్ ఆడుతూనే "నాన్నా! ఏమి చదవాలి,ఎందుకు చదవాలి ! ఎంత చదివినా రేపొద్దున నా భవిష్యత్తులో మొగుడుకి వండి పెట్టి, తనిని చూసుకుంటూ ఇంటికి పరిమితం అవ్వాల్సిందే కదా… అలాంటప్పుడు నేను ఎందుకు చదవాలి చెప్పు....” అంది


శేఖరం కు లాగిపెట్టి కొట్టినట్టు అనిపిస్తుంది...

తన భార్య విషయంలో తప్పు గుర్తుకొచ్చి తలదించుకుంటారు....


వందనను పిలిచి "క్షమించు! మిడి మిడి జ్ఞానంతో ,అర్థం పర్థం లేని ఆలోచనలతో నిన్ను ఇబ్బంది పెట్టాను. ఇప్పుడు చదువుకో” అని చెప్పాడు.


పిల్లలిద్దరూ “వావ్! నాన్న గ్రేట్” అంటూ హగ్ చేసుకొని థాంక్స్ చెప్పారు...


" థాంక్స్ రా కన్న! నీ వల్లే నా తప్పు తెలుసుకుని మారాను.." అన్నాడు సూర్యం

వందన కూడా ఆనందంతో విబాను హగ్ చేసుకుంది...


" వందన డిగ్రీ కాలేజ్ లో చేరింది .మొదట ఇబ్బంది పడ్డా మెల్ల మెల్లగా అలవాటు పడింది..తన మంచితనంతో అటు మిత్రులను, తెలివితనంతో ఇటు లెక్చరర్స్ ని కూడా త్వరగా ఆకట్టుకుంది..


ఇంట్లో పనుల్లో శేఖరం చేదోడు, వాదోడు గా వందనకు అండగా ఉన్నాడు...


వందన డిగ్రీ లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది.. గోల్డ్ మెడల్ అందుకుంది. డిగ్రీ పట్టా చేతిలోకి తీసుకున్నప్పుడు తన కళ్ళలో తెలియకుండానే కన్నీరు వచ్చింది..


" అమ్మా! ఎందుకు బాధ పడుతున్నావు” అని విబా కంగారుగా అడిగింది...


" అక్క! ఇవి ఆనందబాష్పాలు కదా అమ్మా!” అంటు హగ్ చేసుకున్నాడు వినయ్.

" అవును రా కన్న!" అంది వందన.

“ఇది హ్యాపీగా ఉండవలసిన క్షణం ..దా అమ్మా! సేల్ఫీ తీసుకుందాం.. ‘అన్నారు పిల్లలు .

అలా ఫ్యామిలీ మొత్తం సెల్ఫీ తీసుకున్నారు

వందన ఇంటి దగ్గర పిల్లలకి , అనాధాశ్రమంలో వారానికి ఒకసారి వెళ్ళి పాఠాలు ఉచితంగా చెప్ప సాగింది... అతి తక్కువ కాలం లోని ప్రతి ఒక్కరి దగ్గర మంచి టీచర్ గా పేరు తెచ్చుకుంది


కలెక్టర్ కాకపోయినా టీచర్ అవ్వాలి అనుకున్న తన నాన్న కలను ఇలా అయిన తను నెరవేరుస్తున్నందుకు ఆనంద పడసాగింది వందన...


"అర్థం చేసుకునే వారు , తోడుగా నిలబడే బంధం ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు"

***శుభం***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.


లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత్రి పరిచయం :

నమస్తే. నా పేరు ధనలక్ష్మి. వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్లో గణితం బోధిస్తాను. మాది మదనపల్లి, చిత్తూర్ జిల్లా. కథలు , కవితలు రాయడం నాకు ఇష్టమైన వ్యాపకం. ఆనందం వేసినా, బాధ వేసినా, కోపం వచ్చినా నేను పంచుకునే నా నేస్తం అక్షరం. నాలో మెదిలే భావాలను, నేను చూసిన సంఘటనలను రాయడం నాకు అలవాటు.



 
 
 
bottom of page