కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
'Sobhanam Mancham' Written By BVD Prasada Rao
రచన : బివిడి ప్రసాదరావు
***
వరుడి పేరు హరి...
వధువు పేరు ముఖి...
పెళ్ళికి ముందే మనసు విప్పి మాట్లాడుకున్నారు.
ఒకరి అభిప్రాయాలూ మరొకరు గౌరవించుకోవాలని నిశ్చయించుకున్నారు.
కానీ శోభనం రోజే వారి మధ్య కీచులాటలు మొదలయ్యాయి.
ఈ కథను ప్రముఖ రచయిత BVD ప్రసాద రావు గారు రచించారు.
***
"పిల్లల్ని మాట్లాడుకోనిద్దామా" చొరవ చూపాడు పెళ్లి పెద్ద.
ఆ పిల్లల తల్లిదండ్రులు ఒకరి మొహాలు ఒకరు
చూసుకుంటున్నారు.
"నాదో సూచన" అన్నాడు హరి అంతలోనే.
అక్కడి వారంతా ఒక్కమారుగా హరి వైపు చూపులు తిప్పారు.
"ఇలా ఎకాఎకీగా పైగా ఒక్క మారే సంభాషించుకోవడం కంటే ..."
అటు పై చెప్పడానికి తంటాలు పడుతున్నాడు హరి.
అది గమనించిన పెళ్లి పెద్ద కలగచేసుకున్నాడు.
"చెప్పాలనుకుంటుంది చెప్పేయ్ బాబూ." అన్నాడు.
హరి సర్దుకున్నాడు. "అదే, నా ఫోన్ నెంబర్ ఇస్తాను. అమ్మాయికి
ఇవ్వండి. మేమిద్దరం వీలు వెంబడి అవసరాల మేరకు అవసరమైన
మార్లు మాట్లాడుకుంటాం. తొలుత ఒకరికి ఒకరం తెలుసుకోగలుగుతాం.
పిదప మా అభిప్రాయాలు మీ పెద్దలకి తెలియచేస్తాం" చెప్పాడు హరి.
హరి ప్రతిపాదన నెగ్గింది.
ఆ పెళ్లి చూపులు కార్యక్రమం సవ్యంగా ముగిసింది.
***
"హలో ... ముఖిగారా" అడిగాడు హరి, తన సెల్ఫోన్ నుండి.
"అవును" అంది ముఖి, తన సెల్ఫోన్ గుండా.
"నేను హరిని"
"చెప్పండి"
ముఖి, హరి జాబ్ రీత్యా తమ తమ ఆఫీసుల్లో ఉన్నారు.
"బిజీయా" అడిగాడు హరి.
"కాస్తా. చెప్పండి" అంది ముఖి.
"మనం మాట్లాడుకుందాం. మీ వీలు చెప్పండి" అడిగాడు హరి.
ముఖి వెంటనే ఏమీ చెప్పలేదు.
"రాత్రి ... ఎనిమిది తర్వాత వీలవుతుందా" హరే అడిగాడు.
"ఉఁ." కొట్టేసింది ముఖి.
"సరే" అనేసాడు హరి.
***
ముఖి, హరిల మధ్య చాలా మార్లు ఫోన్లు ద్వారా సంభాషణలు చోటు
చేసుకున్నాయి.
వాటి మూలంగా ఇద్దరూ పెళ్లికి సుముఖులయ్యారు.
అందుకు కారణమైనవి -
పెళ్లి తర్వాత కూడా తన జాబ్ కొనసాగింపుకు హరి సమ్మతించడం
ముఖికి బాగా నచ్చడం.
తమ జీతంలో సగ భాగం తమ వ్యక్తిగతంకై, మిగతా సగ భాగం తమ
సంసారంకై వెచ్చించుటకు ఇద్దరూ సమ్మతించడం.
తమ వ్యక్తిగత ఖాతాల్లోని నిల్వలను అవసరం మేరకు ఇచ్చి
పుచ్చుకొనే పద్ధతిలో సర్దుబాట్లుకు ఇరువురు సమ్మతించడం.
ఇద్దరూ ఏకైక సంతానంకే మొగ్గడం. ఆ బిడ్డ భవిష్యత్తుకు మంచి
స్థాయిలో వనరులు సమకూర్చి పెట్టుకోవాలని ఇద్దరూ అనుకోవడం.
ఒకరి తల్లిదండ్రులను రెండోవారు తమ తల్లిదండ్రులుగా
చూసుకోవాలని ఇద్దరూ అనుకోవడం.
తాము చేయబోయే లేదా చేపట్టబోయే ప్రతిదీ ఒకరి కొకరు తప్పక
ముందుగా తెలిసి ఉండాలని ఇద్దరూ అనుకోవడం.
తమ మధ్య మాటలు సూటిగా, సరళంగా కొనసాగాలని ఇద్దరూ
అనుకోవడం.
తాము సమయానుకూలంగా రాజు, మంత్రి సంబంధాల్లా మెసులు
కోవాలని ఇద్దరూ అనుకోవడం.
***
ముఖి, హరిల వివాహం ఘనంగా నిర్వహింపబడింది.
వాళ్ల శోభనం ముఖి ఇంట కొనసాగుతుంది.
"మంచం కిర్రు కిర్రులు చిరాకు పరుస్తున్నాయి"
విసుక్కుంటున్నాడు హరి.
"ఈ మంచం మా పూర్వీకులది. మా నాన్న సెంటిమెంట్" చెప్పింది
ముఖి.
"అఘోరించు. నేను దీని మీద ఇక క్షణం కూడా ఉండలేను" ఆ
మంచం దిగేసాడు హరి.
"రండి. మూడు రాత్రులు ముగిస్తే దీని అవసరం మనకుండదు"
ముచ్చట పడుతుంది ముఖి.
హరి నేల మీద దిండేసుకొని దాని మీద తల పెట్టి నడుము
వాల్చేసాడు.
"అయ్యయ్యో. అదేమిటండీ. ఇలా రండీ" అలజడవుతుంది ముఖి.
"అక్కడికి రాను." చెప్పేసాడు హరి.
"అంతేనా" అనేసింది ముఖి.
హరి ఆమెకు వీపు చూపుతూ సర్రున అటు తిరిగి పోయాడు.
అంతే జోరున ముఖి కూడా అతడికి వీపు చూపుతూ ఆ మంచం మీద
నడుము వాల్చేసింది.
తెల్లవారడానికి ఆ రాత్రి ఇంకా మొదట్లోనే ఉంది.
***శుభం***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.